మూడు తలాక్‌లకు సుప్రీం చెక్‌

25 Aug, 2017 02:18 IST|Sakshi
మూడు తలాక్‌లకు సుప్రీం చెక్‌

మూడు తలాక్‌ల పద్ధతి చెల్లదంటూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ముస్లిం మహిళలకు ఊరట కలిగించేది. కానీ అందుకు అనుగుణంగా పార్లమెంటు ఓ చట్టం చేయడం అవసరం. లేకపోతే బాధిత ముస్లిం మహిళల దుర్గతి మారదు.

ముస్లిం పురుషులు మూడు తలాక్‌లతో భార్యకు తక్ష
ణమే విడాకులిచ్చే తంతును సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులూ సూత్రప్రాయంగా వ్యతిరేకిం చారు. తద్వారా వారు సమానతకు సముచిత గౌరవం ఇచ్చారు. ఏ మతాచారమైనాగానీ, 1,400 ఏళ్ల నుంచి ఉన్నది కనుకనే న్యాయం అయిపోదు. మగవాడు మూడు సార్లు తలాక్‌ చెప్పి, ఏకపక్షంగా వివాహ బంధాన్ని తెంచుకోవడం ధర్మమూ కాదు.

ముస్లిం ఆడవారు కూడా మూడుసార్లు తలాక్‌ చెప్పి క్రూరుడైన భర్తను వదిలేసే అవకాశం లేకపోవడమే అసలైన అసమానత. మూడుసార్లు తలాక్‌ అని వదుల్చుకున్న భార్యను, ఆ భర్తే పశ్చాత్తాపపడి మళ్లీ వివాహబంధంలోకి ఆహ్వానించడం సులువేం కాదు. ఆమె మరొకరిని పెళ్లాడాలి. ఆ కొత్త భర్త ఆమెకు మూడు తలాక్‌లు చెప్పి విడాకులివ్వాలి. ఆ తర్వాతనే పశ్చాత్తప్తుడైన ఆ భర్త, తను తొందరపడి వదిలేసిన భార్యను తిరిగి పెళ్లి చేసుకోవాలి. ఇది ఆచారం కాదు, దారుణం.

22 ముస్లిం మెజారిటీ దేశాలలో రద్దయిన ఈ దురాచారాన్ని ఐదుగురు న్యాయమూర్తులూ వ్యతిరేకిం చడం చాలా గొప్ప పరిణామం. అయితే వారిలో ముగ్గురు లలిత్, నారిమన్, జోసెఫ్‌ ఈ దురాచారం వెంటనే వదిలిపోవాల్సిందే అన్నారు. కాగా, మరో ఇద్దరు ఖేహర్, నజీర్‌ ఈ ఆచారాన్ని ఆర్నెల్లు నిలిపివేసి, పార్లమెంటు చట్టం చేయడం ద్వారానే సమస్య పరి ష్కారం అవుతుందన్నారు. మూడు తలాక్‌ల పద్ధతికి 1937 షరియా చట్టం ద్వారా చట్టబద్ధత లభించింది కాబట్టి ఆ చట్టాన్ని మార్చుతూ కొత్త చట్టం చేయాల్సి ఉందని వారిద్దరూ అన్నారు. ఈ తక్షణ విడాకుల సౌకర్యం, మగవారికే పరిమితమని, చపల చిత్తంతో మాట తూలి, తర్వాత అది పొరబాటని తేలినా సరిదిద్దుకోలేని కాఠిన్యంతో కూడినదని, రాజ్యాంగ వ్యతిరేకమైనదని ముగ్గురు న్యాయమూర్తులు గుర్తించడం సమంజసం.

మైనారిటీ మతస్తుల విభిన్నతను, గుర్తింపును రక్షించేందుకు ఏర్పాటైన ఆర్టికల్‌ 25 ప్రా«థమిక హక్కే. కానీ అది పబ్లిక్‌ ఆర్డర్‌ (ప్రజా జీవితంలోని క్రమబద్ధత)కు లోబడి ఉండాలన్న మాటతో ప్రారంభమైంది. మూడు తలాక్‌లతో భార్యలను వదిలేస్తుంటే పబ్లిక్‌ ఆర్డర్‌ ఎక్కడి నుంచి వస్తుంది? సిక్కులు కృపాణం ధరించడం మతాచారమే. కానీ, దానితో ఎవరినైనా పొడిచి చంపితే హత్యకేసు తప్పదు. రాజ్యాంగం రాక ముందు నుంచి ఉన్నా, రాజ్యాంగ వ్యతిరేకమైన షరి యత్‌ చట్ట నియమాలు చెల్లవని ముగ్గురు న్యాయమూర్తులు భేషైన తీర్పు చెప్పారు. ఈ పద్ధతి రాజ్యాంగానికే కాదు, ఖురాన్‌ స్ఫూర్తికి కూడా విరుద్ధం.

ముస్లిం మతస్తులలో అమల్లో ఉన్న ఈ మూడు తలాక్‌ల పద్ధతి సమానతకు, మహిళల ఆత్మగౌరవానికి, సహజ న్యాయసూత్రాలకు, రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. అయితే, ఈ తీర్పును అమలు చేయడం కష్టమని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్య గమనార్హమైనది. ఈ తీర్పు తర్వాత కూడా ముస్లిం పురుషుడు తన భార్యకు మూడు సార్లు తలాక్‌ చెప్పి వదిలేస్తే ఏం చేస్తారు? ఆ భర్తతో బలవంతంగా కాపురం చేయిస్తారా? లేక నేరమని జైల్లోకి తోస్తారా? సుప్రీం తీర్పు చెప్పింది చట్టమే. కానీ చట్టంలో ఉండే వివరణ, కచ్చితత్వం, శిక్షల నిర్ధారణ అందులో ఉండవు. కనుక ఒక చట్టం ఉండాలన్న ఖేహర్, నజీర్‌ల సూచన చాలా సమం జసమైనది.

హిందూ మతంలో మొదట్లో విడాకులే లేవు. భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య అతనితోనే ఉండాలనే ఉపదేశాలను ఇంకా వింటున్నాం. కొన్ని బలీయమైన కారణాల రీత్యా హిందువులకు విడాకుల అవకాశం కల్పిం చడం, ఆ తర్వాత కొన్నేళ్లకు పరస్పర అంగీకారంతో విడాకులకు సైతం వీలు కల్పించడం గొప్ప సంస్కరణ. అయినా, హిందూ విడాకుల విధానంలోని సంక్లిష్టతను, కాఠిన్యాన్ని ఇంకా తగ్గించవలసి ఉంది. విడాకుల విషయంలో కోర్టుల అర్థరహిత నిబంధనలు, వాయిదాలు, ప్రక్రియ లోపాలు, విపరీత జాప్యాలు, అప్పీళ్ల కష్టాలు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. అదేవిధంగా మగాడి బుర్రకు తోచినప్పుడు టప్పున తెంచుకునే బంధంగా ఉన్న ముస్లిం విడాకుల తంతులో కొంత గాంభీర్యాన్ని, కష్టాన్ని ప్రవేశపెట్టవలసి ఉంది. హిందూ ముస్లిం మతాల్లో బహుభార్యత్వాన్ని చట్టపరంగా చాలావరకు తగ్గించారు. అయినా నలుగురిని వివాహం చేసుకునే వీలు ముస్లిం మతంలో కల్పించి, హిందూ తదితర మతాలకు ఏకపత్నీ నియమాన్ని ఏర్పరచడం తీవ్రమైన అసమానతే.

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అసమానతలకు బలవుతున్న ముస్లిం మహిళలకు ఊరట కలిగించే తీర్పు ఇది. కానీ పార్లమెంటు ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించకపోతే ఆచారాల పేర సాగే అత్యాచారాలు ఆగవు. విడాకులకు గురైన మహిళలకు పరిష్కారాలు దొరకవు. ఈ తీర్పు, రాజ్యాంగం ఆశించిన సమానతను, ఆదేశించిన ఉమ్మడి పౌరçస్మృతిని సాధించే దిశగా ముందడుగు. కాని అందుకు అనుగుణంగా పార్లమెంటు ఓ చట్టం చేసి మలి అడుగు వేయాలి. లేకపోతే బాధిత ముస్లిం మహిళల దుర్గతి మారదు. ముస్లిం మహిళలకు సాధికారత చేకూరదు.

మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు