పరేఖ్‌ (మాజీ కోల్‌ సెక్రటరీ)రాయని డైరీ

5 Feb, 2017 07:03 IST|Sakshi
పరేఖ్‌ (మాజీ కోల్‌ సెక్రటరీ)రాయని డైరీ

పరేఖ్‌ (మాజీ కోల్‌ సెక్రటరీ)రాయని డైరీ
టూత్‌పేస్ట్‌ అయిపోయింది. హోల్డర్‌లో కొత్త టూత్‌పేస్ట్‌ కూడా ఉంది. కానీ నాకివాళ ఎందుకో బొగ్గు పొడితో పళ్లు తోముకోవాలని పిస్తోంది! రాత్రి ఎఫెక్ట్‌ కావచ్చు! పొద్దు పోయేదాకా నా బయోగ్రఫీ రాస్తూ కూర్చున్నాను. బొగ్గు బయోగ్రఫీ!

పుస్తకం పూర్తి కావచ్చింది. పబ్లిషర్సే.. ఒక్కరూ ఓపెన్‌ కావడం లేదు. ఓ పెద్ద పబ్లిషర్‌ సలహా కూడా ఇచ్చాడు. ‘కాసేపు నేను పబ్లిషర్‌ని కాదనుకోండి. మీ వెల్‌విషర్‌ని అనుకోండి. రెండో పుస్తకం అవసరమా చెప్పండి’ అన్నారు! నా మొదటి పుస్తకం ఎఫెక్ట్‌ ఇంకా ఆయనలో కనిపిస్తోంది. ‘క్రుసేడర్‌ ఆర్‌ కాన్‌స్పిరేటర్‌ : కోల్‌గేట్‌ అండ్‌ అదర్‌ ట్రూత్స్‌’!

‘ఇంక ఆపేయండి గురువుగారూ.. ఆ గొడవలూ అవీ. హాయిగా ప్రశాంతంగా ఉండండి’ అని చెబుతున్నాడు నా వెల్‌విషర్‌.

కొత్త పుస్తకానికి నాకంతా వెల్‌విషర్‌లే దొరుకుతున్నారు. పబ్లిషర్‌లు దొరకడం లేదు. దొరికిన పబ్లిషర్‌ కూడా.. పుస్తకం టైటిల్‌ చెప్పగానే సడెన్‌గా వెల్‌విషర్‌ అయిపోతున్నాడు!

‘ది కోల్‌ కనన్‌డ్రమ్‌ అండ్‌ జుడెషల్‌ యారోగెన్సీ’. న్యాయం బొగ్గయిందని రాస్తే, ఎవరు మాత్రం బుక్కవడానికి వస్తారు? నా బుక్‌ నేనే వేసుకోవాలి. వేసుకుంటాను.

ఈ కోర్టులు, చార్జిషీట్‌లు అన్నీ.. బుక్‌ చేసేవాళ్ల కోసం మాత్రమే. బుక్‌ అయిన వాళ్లకోసం కాదు. అందుకని మన వాదన  మనమే వినిపించుకోవాలి. కోర్టు మన వాదన విననప్పుడు ఇంటికొచ్చి బుక్‌ వేసుకోవాలి.

నిందితుడు తను నిర్దోషినని నిజం చెబితే న్యాయమూర్తి నమ్మేసి, కేసు పెట్టిన వాళ్ల చెవుల్ని.. అక్కడికక్కడే పీఠం పైకి రప్పించి.. మెలిపెట్టేయడు. లాయర్‌ ఏం చెబుతాడో అది వింటాడు. లాయర్‌ ఎంత గట్టిగా చెబితే అంత గట్టిగా వింటాడు. అంతకంటే గట్టిగా మనం బుక్‌ వేసుకోవాలి.

కోర్టులో అంతా నిజమే చెప్పాలి. బుక్‌ అయిన వాడు అంతా నిజమే చెప్పాలి. బుక్‌ చేసినవాడూ అంతా నిజమే చెప్పాలి. బుక్‌ చేసినవాడు, బుక్‌ అయినవాడూ ఇద్దరూ అంతా నిజమే చెబుతుంటే.. జడ్జి అంతా నిజమే ఎలా వింటాడు? అందుకే మనం బుక్‌ వేసుకోవాలి.
‘కొత్త పుస్తకంలో కొత్తగా ఏం రాస్తున్నారు?’ అని అడిగారు నిన్న పిచ్చాపాటిగా ఇంటికొచ్చి కూర్చున్న ఓ పెద్ద  వెల్‌విషర్‌. 

‘బడ్జెట్‌ సూట్‌కేస్‌లో వస్తుంది. చార్జిషీట్‌లు ట్రంకుపెట్టెల్లో వస్తాయి. బొగ్గును బోగీల్లో తెచ్చినట్టుగా సీబీఐ.. కోల్‌స్కామ్‌ పత్రాలు మోసుకొచ్చింది! బరువు చాల్లేదనుకుందో ఏమో నా మీదా ఓ ఆరోపణ పత్రం వేసుకొచ్చింది! ఇదంతా రాస్తున్నాను’ అని  చెప్పాను.
కాస్త టోన్‌ డౌన్‌ చేస్తే పుస్తకం వేస్తానన్నాడు. నవ్వాను. ‘నిజాలను టోన్‌ డౌన్‌ చెయ్యడం అంటే పళ్లు సరిగ్గా తోముకోకపోవడమే’ అన్నాను. అర్థం కాలేదన్నాడు. అర్థం కాలేనన్నాను.

- మాధవ్‌ శింగరాజు

>
మరిన్ని వార్తలు