పనితీరు నచ్చకపోతే దాడి చేయడమేనా?

16 Apr, 2017 02:24 IST|Sakshi
పనితీరు నచ్చకపోతే దాడి చేయడమేనా?

సందర్భం
ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ దిన పత్రిక (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా)లో మే 18, 2014 రోజున ప్రచురితమైన ఓ రిపోర్టు ప్రకారం పార్లమెంట్‌ సభ్యుల్లో మూడవ వంతు మందికి నేర చరిత్ర ఉంది. ఎంపీలలో నేర చరిత్ర ఇంత శాతం ఉండటం గతంలో ఎప్పుడూ లేదు. మంచి వాళ్ళు ఎన్నికల్లో పనికిరారు అన్న అభిప్రాయం ప్రజల్లో  ఏర్పడింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ రాచరికపు పోకడలు స్పష్టంగా కన్పిస్తూ ఉన్నాయి. శాసనకర్తలు కూడా పబ్లిక్‌ సర్వెంట్లే (ప్రజాసేవకులే). కానీ తాము పరిపాలకులమని వారు అనుకుంటున్నారు.

తమ నియోజక వర్గంలో ఏ పని కూడా తమ ఆమోదం లేకుండా జరగకూడదని శాసనకర్తలు భావిస్తున్నట్టు అన్పిస్తుంది. ఈ పరిస్థితికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. శాసనకర్తలు, పార్లమెంట్‌ సభ్యులు తమని తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా భావి స్తున్నారు. వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉండవచ్చు. కానీ వాళ్ళు చట్టానికి అతీతులు కాదు. ఈ దేశంలో ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. శాసనాలని తయారు చేసే వ్యక్తులు, శాసనాలని అమలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ప్రజాస్వామ్య దేశాల్లో ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ పర్యవేక్షణ ఉంటుంది. ఏ వ్యవస్థ కూడా మిగతా వ్యవస్థల కన్నా శక్తివంతమైనవి కావు. నిరోధ సమతౌల్యాలు (చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) అన్ని వ్యవస్థలకి వున్నాయి. కానీ కొన్ని సంఘటనలు చూసిన ప్పుడు రాజకీయ వ్యవస్థ మిగతా వ్యవస్థలకన్నా అతీతంగా ఉన్నట్టూ, శక్తివంతంగా ఉన్నట్టూ అన్పిస్తుంది. మామూలు ప్రజల కన్నా తాము అధికులమన్నట్టుగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటారు.

ఎయిర్‌ ఇండియా ఉద్యోగిపై దాడి చేసినట్టు శివసేన ఎం.పి రవీంద్ర గైక్వాడ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని ఆయన ధ్రువీకరించినట్టు కూడా వీడియో పుటేజీ బలపరుస్తోంది. ఆయన మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 308, సెక్షన్‌ 355ల ప్రకారం పోలీసులు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేశారు. కొంతకాలం తరువాత ప్రజలు ఆ విషయాన్ని మరిచి పోతారు. ఆ తరువాత ఆ కేసు ఏమవుతుందో ఎవరికీ తెలియదు.

తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వెంట్స్‌ మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దాడి చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా శాసనకర్తలే. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న ఆనవాళ్ళు కన్పించడం లేదు. సీనియర్‌ ఐ.పి.ఎస్‌ అధికారులను కూడా శాసనకర్తలు బెదిరిస్తున్నారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి పరిస్థితే ఇంత అధ్వానంగా ఉంటే మామూలు అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉన్నతాధికారులు దండంపెట్టి వేడుకున్నా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వైర విహారం చేస్తున్నారు. వారి అనుచిత ప్రవర్తన చాలా మందికి విస్మయం కలుగచేస్తోంది. ఆ తరువాత పైవాళ్ల నుంచి ఆదేశాల ఫలితంగా క్షమాపణలు చెబుతున్నారు. మనోభావాలకి గాయం తగిలితే క్షమించాలని చెబుతున్నారు. ఆ విధంగా చెప్పడం క్షమాపణలు  చెప్పినట్టుగా అన్పించడం లేదు. ఆ చెప్పడంలో ఎక్కడా పశ్చాత్తాపం కన్పించడం లేదు. వాళ్ళ శరీరభాష కూడా అదే విధంగా వుంది.

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ  ఉద్యోగిౖపై దాడి చేస్తే అది ఐపీసీ లోని సె.353 ప్రకారం నేరమవుతుంది. ఇది కాగ్నిజబుల్‌ నేరం. అంటే మేజిస్ట్రేట్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా పోలీ సులు ముద్దాయిలను అరెస్టు చేయవచ్చు. ఈ నేరాలకు పోలీసులు ఎవరో ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ నేర సమాచారం తెలిసిన పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేయవచ్చు. పోలీసు అధికారులపైన దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసే పరిస్థితి లేనప్పుడు పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేస్తారని ఆశించలేం.

దేశంలో రాజకీయ వ్యవస్థనే చాలా బలంగా ఉంది. ఐ.íపీ.ఎస్‌.లు, ఐ.ఏ.ఎస్‌లు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నా రకరకాల కారణాల వల్ల వాళ్లు స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో అధికారులు తమకి తాము ఆలోచించుకొని తమపై తామే ఒత్తిడి తెచ్చుకొని ఓ సరైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అప్పటిదాకా అధికారంలో ఉన్న రాజకీయ వ్యవస్థే అన్ని వ్యవస్థల మీద అధికారం చలాయిస్తూ ఉంటుంది.

ఒక వ్యవస్థపై మరో వ్యవస్థకు నిరోధ సమతౌల్యాలు ఉన్నాయని అనుకుంటున్న భావనకి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులు కాదన్న ప్రజల అభిప్రాయం బలపడటానికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు రాజకీయ నాయకులకు నచ్చనప్పుడు వారిపై దాడి చేయడం సమంజసం అయితే రాజకీయ నాయకులు చేసే పనులు నచ్చని ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది?


- మంగారి రాజేందర్‌

వ్యాసకర్త మాజీ డైరెక్టర్, జ్యుడీషియల్‌ అకాడెమీ
మొబైల్‌ : 94404 83001

మరిన్ని వార్తలు