గతి తప్పిన నగరాభివృద్ధి

9 May, 2017 01:31 IST|Sakshi
గతి తప్పిన నగరాభివృద్ధి

విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దాదాపు సగం పట్టణీకరణ చెందాయి. అయినా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడో వంతు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నగరాలు మరింత వృద్ధి చెందుతున్నాయి, చిన్న పట్ట ణాలు నగరాలుగా మారుతున్నాయి. అయినా మనకు నగరాల నిర్మాణంపై సుస్పష్టమైన అవగాహన లేదు. స్వాతంత్య్రానంతరం చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, కాండ్లా నగరాలను నిర్మించారు, ప్రపం చంలోనే అతి పెద్ద కొత్త నగరం నవీ ముంబై నిర్మా ణంలో ఉంది. ఇక అమరావతి నగర నిర్మాణం కొత్త ప్రాజెక్టు. అయినా దేశవ్యాప్తంగా పట్టణాల నిర్వహణ అధ్వానంగానే ఉంది. ‘ప్రణాళిక’ అని పిలిచేది ఉన్నా, మనం మాత్రం ‘అభివృద్ధి’ వైపే కొట్టుకుపోతున్న ట్టుంది.

ముంబైలో దాదాపు ఒక ఏడాదిగా కొత్త కట్టడాల నిర్మాణాన్ని హైకోర్టు నిషేధించింది. నిర్మాణ క్రమంలో పోగుబడే రాళ్లూరప్పలు తదితరాలను తరలించే మార్గ మేదీ ఆ నగరానికి లేదు మరి. ముంబైకి ఆనుకుని ఉన్న థానేలో కూడా అలాంటి ఆంక్షే ఉంది. ఆ నగరం నీటి సరఫరా సమస్యను పరిష్కరించలేకపోవడం అందుకు కారణం. ఆ నగర పాలక వ్యవస్థ నీటి సరఫరాపైగాక ఇతర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది, అదీ నగర కేంద్రితమైనదే. ఢిల్లీలోని చాలా విస్తృత ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం లేదు. కాబట్టి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడానికి ఆ నగరానికి జల్‌ బోర్డ్‌ ఉంది.

హైదరాబాద్‌ పరిస్థితీ అదే. బిల్డర్‌–డెవలపర్లు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. కానీ, పౌర పరిపాలనా సంస్థలు మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తాయి. నీటి సరఫరా, నిర్మాణ పనుల వల్ల పోగుబడే చెత్తను తరలించడం వంటివి తాము పట్టించుకోవాల్సినవేనని వారు భావిస్తున్నట్టు కన బడదు. తప్పనిసరిగా చెత్తను సేకరించుకు వెళ్లడం సహా ఇలాంటి విషయాలలోని లోటుపాట్లు ఒక నగరం లేదా పట్టణంలో ఉండేవారికి ఎవరికైనా చిర్రెత్తించేవే. కొన్ని పట్టణాలు, నగరాలలోపల నామమాత్రపు బస్సు సర్వీసులు సైతం లేవు. దీంతో ప్రైవేటు వాహ నాలతో రోడ్లు కిక్కిరిసివుంటాయి. అన్ని విధాలా తగి నంతగా సంతృప్తికరంగా ఉన్న ఒక్క నగరమైనా కనబడటం కష్టమే.

అయినా ప్రజలు గుంపులు గుంపు లుగా బతుకు తెరువుల కోసం  నగరాలకు, పట్టణా లకు ఎగబడతారే తప్ప, జీవించడానికి అవి సము చితమైనవని మాత్రం కాదు. వారు పట్టణ ప్రాంతా లను విస్తరింపచేయడమే కాదు, అధ్వానంగా మారు స్తారు. ఇక యూరోపియన్‌ పట్టణాలు, నగరాలతో సరితూగే వాటి గురించి మాట్లాడనవసరమే లేదు. ఈ నేపథ్యం నుంచి చూస్తే, ‘స్మార్ట్‌ సిటీ’ అనే భావన ఓ చిన్న బ్యాండ్‌ ఎయిడ్‌ పట్టీ లాంటిదే. ఎంతో కొంత ఉపయోగకరమే కాబట్టి వాటిని ఆహ్వానించా ల్సిందే గానీ, అది సరిపోదు. ఏ అంశానికి సంబం ధించి నగరాలు, పట్టణాలు డిమాండు కంటే వెనుకబడి ఉండరాదు. పేరుకుపోయిన పాత పనులు దిగ్భ్రాంతి కరమైనంత భారీ ప్రమాణంలోనివి. పెద్ద నగర ప్రాజెక్టులో భాగమైన నవీ ముంబైలో మూడో వంతు మురికివాడలే.

ఆ నగరం విషయంలో ఏదీ సజావుగా సాగు తున్నట్టు అనిపించదు. ఏం చేసినా గానీ అది డిమాం డు–సప్లయి రేఖ కంటే వెనుకబడే ఉంటుంది. చాలా వరకు నగరాలు, పట్టణాలలో సేకరించని చెత్త, పాద చారుల హక్కులకు తిలోదకాలిచ్చేస్తూ ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, వీధులను ముంచెత్తే ట్రాఫిక్‌ నత్తనడక సాగుతుండటం, రోడ్ల మీద గుంతలు, మురికి వాడలే గాక గూడు కరువు కావడం, అందుబాటులో లేని వసతి సదుపాయాలు కనీసంగా ఉండే ప్రతికూలాం శాలు. అయినా మనది వేగంగా పట్టణీకరణ సాగుతున్న దేశం.

ఈ లోటుపాట్లన్నీ అసలు నగరాలకు స్వాభావిక మైనవే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మన ప్రణాళికా రచన, విధానాల అమలు ఎంత అధ్వానంగా ఉంటాయో ఇది వేలెత్తి చూపుతుంది. ఆర్థికపరమైన ప్రతిబంధకాల వంటి కారణాలు కూడా ఉండవచ్చు గానీ... అవినీతి, అధ్వానమైన అమలు అనే రంధ్రా లను పూడ్చుకోగలిగితే ఆ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. చివరకు ఇదంతా కలసి ప్రజా జీవితంలో కానరాకుండా పోయిన నిజాయితీ వద్దకు చేరుస్తాయి. విపత్కరమైన ఈ క్షీణత కొనసాగడాన్ని అను మతించడానికి పౌరులు సుముఖంగా ఉండటం మరిం తగా ఆందోళనకలిగించే అంశం. అయినా పట్టణాలు, నగరాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. గతానుభ వంపై ఆధారపడి పౌరులలో నెలకొన్న నిరాశావాదం, సుపరిపాలన కొరవడటం కొనసాగుతూ ఉండటం, పౌరులకు ఇంతకంటే మెరుగైనదానికి దేనికీ అర్హత లేదని, ఇప్పటికే వారికి చాలా చేసేశామని పాలక వర్గా లలో ఉన్న విశ్వాసాల పర్యవసానమిది. కాబట్టి ఇక మార్పు దేనికి?

వ్యాసకర్త: మహేష్‌ విజాపృకర్‌
సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ :mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు