చరిత్ర పుటలో చెరగని సంతకం

18 Jan, 2017 23:43 IST|Sakshi
చరిత్ర పుటలో చెరగని సంతకం

కొత్త కోణం
1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో సామాజిక మార్పులకు కారణమైంది. ఒక తరంపైన నిండైన ముద్రవేసిన ఆయన జీవితం, ఉద్యమం సమాజ గమనానికి దిక్సూచిగా నిలిచాయి. 1984 నవంబర్‌ 9న అజ్ఞాతవాసంలోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం.

సమాజ గమనంలో తనదైన ముద్ర వేసి  కాల చక్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యమాలను, విప్లవాగ్నులను రగులుస్తూ ముందుకు సాగుతుంది. సమాజ పురోగమనానికి ఒక్కో సమయంలో కొందరు వ్యక్తులు తోడ్పడుతుంటారు. ఆ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సమానత్వ సాధనకు, ప్రజలకు అర్పిస్తుంటారు. సమానత్వ సాధన దిశగా తెలుగునాట సమాజాన్ని ముందుకు నడిపించిన వ్యక్తుల ముద్రలు చాలానే ఉన్నాయి. ఒక తరంపై బలమైన ముద్రవేసిన చండ్ర పుల్లారెడ్డి వారిలో ఒకరు. 1960ల చివరిలో ప్రారంభమైన నక్సలైట్‌ ఉద్యమ నాయ కులలో ఒకరైన ఆయన నాయకత్వంలోని ఉద్యమంతో పాటు, పీపుల్స్‌వార్‌ నాయకత్వంలో సాగిన ఉద్యమాలు సైతం సమాజ గమనాన్ని మార్చాయన డంలో సందేహం లేదు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాన్ని, ఉద్యమ ప్రభావాన్ని మననం చేసుకోవడానికే ఈ ప్రయత్నం.

ఉద్యమ ప్రస్థానంలో తొలి దశ
1917 జనవరి 19న కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి  ఇంజనీరింగ్‌ చదువు కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య తదితర కమ్యూనిస్టు నాయకులతో ఏర్పడ్డ పరిచ యాలు ఆయనను వలస వ్యతిరేక పోరాటంలో భాగం చేశాయి, కాలేజీ నుంచి బహి ష్కరణకు గురిచేశాయి. ఆ తర్వాత ఆయన పూర్తి కాలం కమ్యూనిస్టు కార్య కర్తగా మారారు. అప్పటికే తెలంగాణలో సాగుతున్న మహత్తర రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి బయలుదేరి, మార్గ మధ్యంలోనే అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న ఆయన నాటి పార్టీ నాయ కత్వం తీసుకున్న సాయుధ పోరాట విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో నాటి మద్రాసు రాష్ట్రంలోని నందికొట్కూరు  నుంచి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థిగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రి యలో అప్పటికే తక్కువ విశ్వాసం ఉన్న ఆయన... ప్రజా ఉద్యమ సమీకర ణపైనేlదృష్టి కేంద్రీకరించేవారు. ఆ క్రమంలోనే ప్రముఖ నక్సలైటు నాయ కుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఆయన సుందరయ్య నాయకత్వంలోని సీపీఐ (ఎం) పక్షాన నిలిచారు. 1962 నాటి భారత–చైనా యుద్ధం సందర్భంగా చైనాను సమర్థించినందుకుగాను దేశ రక్షణ చట్టం కింద 1964–66 మధ్య జైలు జీవితం గడిపారు.

నగ్జల్బరీ, శ్రీకాకుళాల వెలుగున సాగిన విప్లవ నేత
ఆ కాలంలో ఆయన జైలులో సాగించిన అధ్యయనం, రచనా వ్యాసంగం కమ్యూనిస్టు విప్లవోద్యమానికి చాలా తోడ్పడింది. నాటి కీలక అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా రష్యా–చైనా విభేదాల విషయంలో కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి సహచర నాయకుడు మానికొండ సుబ్బారావుతో కలిసి ఆయన ‘‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం–దాని పరి ణామాలు’’ అనే గ్రంథాన్ని రాశారు. చైనాలో మావో ప్రారంభించిన ‘గ్రేట్‌ డిబేట్‌’లో చర్చకు వచ్చిన తొమ్మిది విషయాలపై ‘‘రష్యా–చైనా వాద నలు’’అనే పుస్తకాన్ని రాశారు. మావో సూక్తులను తెలుగులోకి అనువాదం చేసి. అచ్చు వేయించారు. ఇలా అధ్యయనం, రచనా వ్యాసంగం ఒకవైపు సాగిస్తూనే పుల్లారెడ్డి... చైనాకు వ్యతిరేకంగా క్రమక్రమంగా సీపీఐ (ఎం) తీసుకొస్తున్న వాదనలను పసిగట్టి, బహిరంగపరిచారు. అనతికాలంలోనే దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్యలతో కలిసి విప్లవకారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోని పని మీదనే ఉండేది. ఆనాటికే పశ్చిమ బెంగాల్‌ లోని నక్సల్బరీలో చారు మజూందార్‌ నాయకత్వంలో సాగుతోన్న రైతాంగ ఉద్యమం పుల్లారెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేసింది.

తెలంగాణలోని ములుగు అటవీ ప్రాంతాన్ని ఆయన తన మొదటి ఉద్యమ స్థానంగా ఎన్ను కున్నారు. అందుకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ‘‘వీర తెలంగాణ విప్లవ పోరాటం–గుణ పాఠాలు’’ అనే పుస్తకాన్ని రాశారు. అదే సమయంలో శ్రీకాకుళ రైతాంగ పోరాటంతో సంబంధాలను పునరుద్ధరించారు. అప్పటికే ఎంతో మంది నాయకులు పోలీసు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అంతటి నిర్బంధంలో కూడా ఆయన ఇంకా కార్యాచరణలో ఉన్న నాయ కులను, కార్య కర్తలను సమన్వయం చేశారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పైలా వాసుదేవరావుతో కలిసి కమిటీని ఏర్పరి చారు. ఆ విధంగా చండ్ర పుల్లారెడ్డి శ్రీకాకుళ పోరాటాన్ని అనేక ఒడిదుడుకుల తర్వాత కూడా సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వంలో సాగిన ఉద్యమాల్లో నాలుగు ప్రధానమైనవి. ఒకటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గిరిజన పోరాటాలు. రెండవది కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్‌ మైదాన ప్రాంతాల్లో సాగిన రైతుకూలీ పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు. మూడవది విద్యార్థి ఉద్యమం, నాల్గవది పట్టణ మధ్యతరగతి వర్గాలైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలను సమీకరించడం.

మార్పును మోసుకొచ్చిన విప్లవ వెల్లువ
1968లో చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలోని పార్టీ ములుగులో అడుగు పెట్టే నాటికి ఆదివాసీల పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. బాగా పంటలు పండే మాగాణి భూములన్నీ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి అధీనంలో ఉండేవి. గిరిజనుల చేతుల్లో ఉన్నవి పోడు భూములే. పైగా ఫారెస్టు అధి కారులు గిరిజనులను క్రూరంగా దోపిడీ చేసేవారు. ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం కర్రను ముట్టనిచ్చేవారు కారు. వంటచెరుకు కోసం అడవిలో కర్రలు ఏరినా జరిమానాలకు,  చిత్రహింసలకు గురిచేసే వారు. ఇక పటేల్, పట్వా రీలు గిరిజన తండాల మీద పడి బియ్యం, జొన్నలు పప్పు, నెయ్యి, కోళ్లు, డబ్బులు లంచాలుగా గుంజుకునేవారు. వెట్టి చాకిరీ చేయించుకునేవారు. షావుకారులు ఉప్పు, కిరోసిన్‌ ఇచ్చి గిరిజనులు సేకరించిన అటవీ ఉత్ప త్తులను దోచుకునేవారు. షావుకారులు, అడవిని ఆనుకొని ఉన్న భూస్వా ములు అప్పులు ఇచ్చి గిరిజనుల భూములను, వస్తువులను కారు చౌకకు కాజేసేవారు. పుల్లారెడ్డి నాయకత్వంలో అడవిలో అడుగుపెట్టిన ఉద్యమం గిరిజనులను సమీకరించింది. చైతన్య పరిచింది. దాదాపు మూడు లక్షల ఎకరాల సాగుభూమిని గిరిజనులు సొంతం చేసుకోగలిగారు.

కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో 1970ల నాటికి కూడా అంటరానితనం వికృత రూపంలో ఉండేది. దళితుల భూములను కబ్జా చేయడం, వెట్టిచాకిరీతో శ్రామికుల రక్తమాంసాలను దోచుకోవడం ఆనాడు సర్వసాధారణం. గ్రామాల్లో దళితులు చెప్పులు వేసుకొని నడవడానికి, బీడీలు తాగడానికి, లుంగీ కట్టుకొని పోవడానికి వీలులేదు. ఇక గొల్ల, గౌండ్ల, చాకలి, మంగలి లాంటి కులాల వారంతా భూస్వాములకు వెట్టికి అన్నీ సమర్పించాల్సిందే. ఉచితంగా సేవలు చేయాల్సిందే. అడిగితే తన్నులు, గుద్దులు, హత్యలే. కరీంనగర్‌ జిల్లాలో సాగుతోన్న ఈ దౌర్జన్యాలకు వ్యతి రేకంగా వెల్లువెత్తిన పోరాటాలకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి పురుడు పోసింది.

అదే సమయంలో జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరులో పీపుల్స్‌ వార్‌ పార్టీ ఇటువంటి ఉద్యమాన్నే చేపట్టింది. దౌర్జన్యాలు చేస్తున్న భూస్వా ములు గ్రామాలను వదిలారు. వెట్టి చాకిరీ రద్దయింది. అంటరాని తనం పూర్తిగా పోకపోయినా, దళితుల్లో చైతన్యం పెరిగింది. భూమి సంబంధాలలో మార్పు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1987లో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1987 పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో మార్పులు తీసు కొచ్చింది. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించింది. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో వచ్చిన సామాజిక, రాజకీయ, చైతన్యానికి తోడుగా ఈ రిజర్వేషన్లు అప్పటి వరకు సాగిన రెండు మూడు కులాల రాజకీయ గుత్తాధిపత్యానికి తెర దించాయి. అప్పటి వరకు గ్రామాలకు పరిమితమైన ఆధిపత్య కులాల వారు పట్టణాలకు తరలిపోయి, ఇతర వృత్తులు, వ్యాపారాల్లో ప్రవేశించి గతంకన్నా ఆర్థికంగా పుంజుకున్నారు. అలా ఈ ఉద్యమం తెలంగాణలోని గ్రామీణ  సంబంధాలను సమూలంగా మార్చివేసింది.

భవితకు దిక్సూచి
1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం ఏర్పడిన ప్రజాస్వామిక వాతా వరణం పట్టణాలలోని మధ్యతరగతి వర్గాన్ని, గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థి లోకాన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లోకి ఆకర్షించింది. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, గాంధీ, ఉస్మానియా కాకతీయ వైద్య కళాశాలలు ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాలకు నెలవుగా ఉండేవి. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న జవహర్‌ భారతి కళాశాలలో ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమం బలమైన స్థానాన్ని సాధించింది. విద్యార్థి ఉద్యమంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో వచ్చిన ప్రజాస్వామిక చైతన్యం తదనంతర సామాజిక రాజకీయ మార్పులపై ఎంతో ప్రభావాన్ని చూపింది. 1996 తరువాత ముందుకు వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నాయకత్వం ఈ ప్రజా స్వామిక చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నదే. 1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకతరంపైన నిండైన ముద్రవేసిన చండ్రపుల్లారెడ్డి జీవితం ఆయన సాగించిన ఉద్యమం సమాజ గమనానికి ఒక దిక్సూచిగా నిలిచింది. 1984 నవంబర్‌ 9న అజ్ఞాతవాసం లోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం. (నేడు చండ్ర పుల్లారెడ్డి శతజయంతి)

మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు  మొబైల్‌ : 97055 66213  
 

మరిన్ని వార్తలు