ఈ అంతరంతో అనర్థమే!

18 Mar, 2017 02:58 IST|Sakshi
ఈ అంతరంతో అనర్థమే!

విశ్లేషణ
న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 65 ఏళ్లకు పెంచడానికి  కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లు– 2010ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ పదవీకాలం ముగిసిపోవడం వల్ల అప్పుడు ఆ బిల్లు ప్రాధాన్యం కోల్పోయింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదు.

రాజ్యాంగ విలువల రక్షణలో న్యాయ వ్యవ స్థది ప్రముఖ పాత్ర.. న్యాయమూర్తుల ఎంపి కలో ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థకీ, కార్య నిర్వాహక వ్యవస్థకీ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కలవరపెట్టింది. అయితే ఆ పద వుల నియామకంలో ఈ రెండు వ్యవస్థల మధ్య అంగీకారం కూడా కుదురుతుందన్న వార్త ఆశా వహమైనదే.

దేశ జనాభాతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య అతి తక్కువ నిష్పత్తిలో ఉంది. 10 లక్షల జనాభాకి 15.5 న్యాయ మూర్తుల వంతున మాత్రమే ఉన్నారు. కేసుల సంఖ్య 3 కోట్లు దాటిం దని అంచనా. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాజ్యాంగంలోని అధి కరణ 224ఎ ప్రకారం న్యాయమూర్తులని నియమించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. రాజ్యాంగంలోని అధికరణ 128, 224(ఎ) ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో గతంలో పనిచేసిన వారిని తాత్కాలిక న్యాయ మూర్తులుగా నియమించే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా నియ మించే బదులు న్యాయమూర్తుల వయోపరిమితి పెంచడం మంచిది. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయ సులోని అంతరం సమంజసమనిపించదు. 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన నాడు హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. సుప్రీంకోర్టు  న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. 1963లో రాజ్యాంగాన్ని సవరించి హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచారు. అమెరికాలో ఫెడరల్‌ న్యాయ మూర్తులకి పదవీ విరమణ వయసు లేదు. తమ బాధ్యతలని నిర్వర్తించ లేనప్పుడు వారు పదవీ విరమణ చేయవచ్చు. యూకే న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 75 ఏళ్లు. కానీ భారతదేశంలో ఆ అంతరం ఎందుకో అర్థం కాదు.

భారత ప్రభుత్వ చట్టం–1935లోని సెక్షన్‌ 200 ప్రకారం ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఆర్గురు న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. దీనినే భారత రాజ్యాంగ సంస్కరణల సంయుక్త సంఘం ఆమోదిం చింది. ఐదేళ్ల ఆ అంతరం ఇలా కొనసాగుతున్నది. రాజ్యాంగ నిర్మాణ మండలి ఇదే విషయాన్ని ఆమోదించింది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడానికే కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడానికి ఇష్టపడలేదు. ఈ విష యం జార్జ్‌ హెచ్‌. గాడ్బోయిస్‌ తన ‘జూనియర్‌ జడ్జెస్‌ ఆఫ్‌ సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ పరిస్థితులు మారాయి. మన సుప్రీంకోర్టు ప్రపంచంలోనే శక్తిమంతమైనదిగా రూపొందింది. ఇవాళ వారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని తిరస్కరించే అవకాశం లేదు. 1980 నుంచి ఇప్పటి వరకు గమనిస్తే హైకోర్టు నుంచి వచ్చిన న్యాయమూర్తుల సంఖ్యే సుప్రీంకోర్టులో ఎక్కువ. అలాగే ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తులని సివిల్‌ సర్వెంట్స్‌తో పోల్చడానికి వీల్లేదు. ఈ విషయం గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో చెప్పిన మాటలు ఉదహరించక తప్పదు.

‘‘న్యాయమూర్తులు చేసే పని సివిల్‌ సర్వెంట్స్‌ పనికి భిన్నమైనది. శారీరక శ్రమ తక్కువ అనిపిస్తుంది. సివిల్‌ సర్వీస్‌ ఎదుర్కొనే పరిస్థితి న్యాయమూర్తికి ఉండదు  కానీ న్యాయమూర్తులు చాలా బాధ్యతాయుత మైన పనులను నిర్వహిస్తారు. మిగతా దేశాల్లో ఈ పదవీ విరమణ వయసు మన దేశంలో కన్నా ఎక్కువ. అమెరికాలో 92 సంవత్సరాల దాకా న్యాయమూర్తులు బాగా పనిచేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ప్రివీ కౌన్సిల్‌లో కూడా న్యాయమూర్తులు చాలాకాలం పనిచేస్తున్నారు. న్యాయమూర్తి పదవి యువకుల ఉద్యోగం ఇవ్వడం లాంటిది కాదు. మంచి వ్యక్తులు కావాలనుకున్నప్పుడు వయసనేది ఆటంకంగా ఉండ రాదు.’’ (రాజ్యాంగ సభ డిబేట్‌ వాల్యూమ్‌ 7, పేజీ 246,47) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విమరణ వయసు పెంచారు. కానీ హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వరకే పరి మితమయ్యారు.

న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 65 ఏళ్లకు పెంచడానికి  కేంద్రం రాజ్యాంగ (114వ సవరణ) బిల్లు, 2010ని లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. లోక్‌సభ పదవీ కాలం ముగిసిపోవడం వల్ల అప్పుడు ఆ బిల్లు ప్రాధాన్యం కోల్పోయింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంచాలని జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీ, లా కమి షన్‌ 232 నివేదికలో సిఫారసు చేసినప్పటికీ, న్యాయమూర్తుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.     

ఈ అంతరం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మధ్యనే కాదు, మరో రాజ్యాంగ సంస్థ  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల దగ్గరా ఉంది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల పదవీ విరమణ  వయసు 65 ఏళ్లు. కానీ ఈ రెండు సంస్థలు నిర్వహించే బాధ్యతలు ఒకే విధమైనవి. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయసులోని వ్యత్యాసమే  యూనియన్, రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమి షన్‌ల చైర్మన్, సభ్యుల పదవీ విరమణ వయసులో అంతరాన్ని ఏర్పరి చినట్టు కనిపిస్తుంది. సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమి షన్‌లో కూడా పదవీ విరమణ వయసు 65, 70 సంవత్సరాలు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల న్యాయమూర్తులు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వీరి పదవీ విరమణ వయసు లోని అంతరం ఎందుకో అర్థం కాదు. శాసనానికి కారణమనేది ఆత్మ లాంటిది. అలాంటి ఆత్మే లేనప్పుడు అంతరం ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం అమల్లోకి తెచ్చినపుడు అలాంటి అవసరం ఉందేమో కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు.


- మంగారి రాజేందర్‌

వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు,  జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు