అధికారం అంతరార్థం?

25 Mar, 2017 01:57 IST|Sakshi
అధికారం అంతరార్థం?

మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ గురువారం ఉదయం ఎయిర్‌ ఇండియా అధికారి ఒకరిని కొట్టడమే కాదు, చెప్పుతో పాతికసార్లు కొట్టానని ఘనంగా చెప్పుకుని వార్తలకెక్కారు. అకారణంగా ఆయన ఆగ్రహానికి గురైన సదరు అధికారికి తాను క్షమాపణ చెప్పేది లేదని, ఆయనే తనకు క్షమాపణ చెప్పాలని ఎదురు వాదనకు దిగారు.

అది పూర్తి ఎకానమీ క్లాసు విమానమనీ తెలిసీ అందులోనే పుణే నుంచి ఢిల్లీకి చేరిన గైక్వాడ్, అక్కడకు చేరాక గంట సేవు విమానం దిగనని హఠం చేసి మరీ ఈ ఘన కార్యం చేశారు. ఎకానమీ క్లాసు విమానంలో ఉండని బిజినెస్‌ క్లాస్‌ సదుపాయాలను అందించనందుకు ఎయిర్‌ ఇండియాపై ఫిర్యాదు చేస్తానని సైతం అంటున్నారు. గైక్వాడ్‌ తాను శివసేన నేతనని గొప్పగా చెప్పుకున్నా ఇలాంటి నోటి దురుసుతనం, చేతి దురుసుతనం ఉన్న నేతలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలోనూ పెరుగుతున్నారన్నది వాస్తవం.

ఇది ప్రజాప్రతినిధు లకు, మంత్రులకు, రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే పరిమితమైన సంస్కృతి కాదు. అధికార యంత్రాంగంలో సైతం పైనుంచి కింది దాకా తర తమ స్థాయిలలో దిగువ వారిపై మాట తూలే, చేయి విసిరే అలవాటు తక్కువేం లేదు. ఇది అధికారం నుంచి సంక్రమిస్తున్న వ్యక్తిగత అహంకారం, తలబిరుసుతనం మాత్రమే కాదు... ప్రజా ప్రతినిధులుగా తమకు సంక్రమించిన అధికారం  తమది కాదు, ప్రజలదనీ, ఆ అధికారాన్ని ఉపయోగించాల్సింది స్వీయ స్వార్థ సంకుచితlప్రయోజనాల కోసం కాదు, ప్రజల ప్రయోజనాల కోసమేననే స్పృహను పూర్తిగా కోల్పోవడం. ప్రజా ప్రతినిధులుగా, మంత్రులుగా లేక మరే పదవిలోనో ఉన్నవారుగా తమకు సంక్ర మించే అధికారాలకు, విశేష హక్కులకు, సదుపాయాలకు అవధులు లేవని భావించే సంస్కృతి. చట్టాలను, నియమ నిబంధనలను ఉల్లంఘించడానికి నిరా కరించి, తమ విధులను నిజాయితీగా అమలు చేస్తున్నందుకే గ్రామ, మండల స్థాయిల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు ప్రభుత్వాధికారులపై చేయి చేసు కోవడం, దాడులు చేయడం, చివరకు హత్యలు చేయించడం వంటి వికృత రూపా లనూ ఇది ధరిస్తోంది. గ్వైక్వాడ్‌లో ఈ దుష్ట సంస్కృతి వ్యక్తి దురహం కారంగా వ్యక్తమైతే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల విషయంలో సంకుచిత పార్టీ ప్రయోజనాల పరిరక్షణగా, అధికార దుర్వినియోగంగా వ్యక్తమౌతోంది. చూడ బోతే, నేడు ప్రజాస్వామ్య రాజకీయాధికారం అంటే ప్రజల అధికారమని, అది రాజ్యాంగానికి, చట్టాలకు బద్ధమైనది అనే అర్థం రూపు మాసిపోతున్నట్టుంది.  

గైక్వాడ్‌ ఉదంతంతో ఏ విధంగానూ పోల్చరాని మరో ఘటన రెండు రోజుల క్రితం లక్నోలో జరిగింది. పట్టపగలు సినిమాకు వెళుతున్న ఒక యువజంటను పోలీసులు అటకాయించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన ‘రోమియోల వ్యతిరేక దళం’ పోలీసులకు వారు ‘అనుమానాస్పదం’గా కనిపిం చారు. ఆ యువతికి అక్కడే ‘నైతిక హితబోధ’ చేసి పంపేశారు. యువకుడ్ని పోలీస్‌ స్టేషన్లో కొన్ని గంటలు విచారించి, అతని మిత్రులు వచ్చి నచ్చ చెప్పాక విడిచి పెట్టారు. ఆడపిల్లలు, మహిళలపై ఈవ్‌టీజింగ్‌ పేరిట జరిగే వేధింపులను అరికట్ట డానికి ఈ ప్రత్యేక దళాలను బజార్లు, విద్యాలయాలు, పార్కులు తదితర రద్దీ ప్రదే శాల్లో నియమించారు. ఈ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తున్నది నైతికపరమైన పోలీ సింగ్‌ కోసమో, యువ జంటలను వేధిం^è డం కోసమో కాదని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, డీజీపీ పదే పదే చెబుతున్నా.. ఈ ప్రత్యేక దళాల ఏర్పాటు వల్ల ఆచరణలో జరిగేది పెళ్లి కాని జంటలు, యువతీయువకులపై వేధింపులేననే భయాలు ఇటీవలి ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ వాగ్దానం చేసినప్పటి నుంచి వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ ఘటనను పోలీసులకు అలవాటైన అత్యుత్సాహంగా కొట్టిపారే యలేం. యువకుల చూపులను బట్టే ఈవ్‌టీజర్లు ఎవరో గుర్తుపట్టేయగలమని ప్రత్యేక దళాలు చెప్పుకుంటున్నట్టూ, కళాశాలలు, పాఠశాలల వద్ద స్నేహితుల కోసమో, అక్కచెల్లెళ్ల కోసమో వేచి చూస్తున్నవారిని, పుస్తకాల దుకాణాల వద్ద పిల్లల  పుస్తకాల కోసం వచ్చి ఎక్కువసేపు అక్కడ ఉన్నట్టనిపించిన మహిళలను ప్రశ్నిస్తు నట్టూ వార్తలు వస్తున్నాయి. యువతీయువకులు కలసి తిరగడంlమన సంస్కృతి కాదని బాహాటంగానే ప్రత్యేక పోలీసులు బోధిస్తున్నట్టు తెలుస్తోంది.

యూపీలో జరుగుతున్నది వినూత్న ప్రయోగమేం కాదు. యూపీలో 1986–87 మధ్య అలహాబాద్‌లో ‘మజ్నూల పంజరం’గా పేరు మోసిన ఇలాంటి ప్రయత్నమే జరిగింది. 2011లో మాయావతి ప్రభుత్వం నోయిడాలో ఇలాంటి ప్రయత్నాలే చేసింది. 1990ల చివర్లో గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసింది. చివరకు అవి  రోమియోలనే గాక జూలియట్‌లను కూడా తరిమి కొట్టేవిగా మారి, భార్యాభర్తలు సైతం బయటకు రావడానికి సంకోచించే పరిస్థితిని సృష్టించాయి. నేడు అవి పండుగల్లో మాత్రం దర్శనమిస్తున్నాయి. ఈ దళాలవల్ల గుజరాత్‌లో మహిళలపై నేరాలు తగ్గు ముఖం పట్టిన దాఖలాలూ లేవు. మహిళలపై హింసను ప్రభుత్వ స్థాయిలో సాధ్యమైన మేరకు అరికట్టదలుచుకుంటే.. అందుకు తగ్గ శిక్షణపొందిన మహిళా పోలీసు వ్యవస్థను, ప్రత్యేక న్యాయస్థానాలను విస్తృ తంగా ఏర్పాటు చేసి, వాటికి అన్ని వనరులను అందించాలి.

కానీ యూపీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్న మరే ఇతర పార్టీలాగే రాజ్యాధికారాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకుంటున్నది. కాకపోతే అది ప్రత్యేక దళాల ద్వారా తమ పార్టీ నమ్మే సంప్రదాయలను, విలువలను అమల్లోకి తేవడానికి కూడా ప్రయత్నిస్తోంది. విశ్వవిపణికి తలుపులు బార్లా తెరిచి అత్యధునాతన వస్తువు లను, సాంకేతికతను దిగుమతి చేసుకుంటూ బాహ్య స్కాంస్కృతిక ప్రభావాలకు అతీతంగా మన యువతను బంధించి ఉంచడం అసాధ్యం. అది గుర్తిస్తే యూపీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని స్వీయ భావజాల ప్రచార సాధనంగా మార్చాలనే విఫల యత్నాన్ని మాని... ప్రజలు అపార విశ్వా సంతో అందించిన అసాధారణ అధికారాన్ని చట్టబద్ధమైన, రాజ్యాంగబ్ధమైన పద్ధ తుల్లో ప్రజా ప్రయోజనాలకే ఉపయోగించి ఇతరులకు ఆదర్శం కాగలుగుతుంది.

మరిన్ని వార్తలు