కొత్త జిల్లాల కల్లోలం!

5 Oct, 2016 00:56 IST|Sakshi
కొత్త జిల్లాల కల్లోలం!

డేట్‌లైన్ హైదరాబాద్
ఇదంతా చూస్తుంటే రాజకీయ అవసరాల కోసమో, ఒత్తిడి కారణంగానో జరిగినట్టుందే తప్ప శాస్త్రీయంగా చేసినట్టు మాత్రం కనిపించదు. జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటును అంగీకరించడానికి ఒప్పుకోక, భీష్మించుకుని కూర్చున్న ముఖ్యమంత్రి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, ఆ రెండు జిల్లాల ఏర్పాటును కూడా ఈ లెక్కలో తోసేశారన్న విమర్శ ఎదుర్కోక తప్పదు.  ఈ ప్రక్రియ శాస్త్రీయంగా జరగడంలేదనడానికి బోలెడు ఉదాహరణలు.
 
 మొత్తానికి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ  రాష్ట్రానికి బోలెడు కొత్త జిల్లాలు దసరా కానుకగా రానున్నాయి. ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రథమ లక్ష్యం పరిపాలనను ప్రజలకు అత్యంత చేరువలోకి తీసుకుపోవడం. చిన్న పనికి కూడా జిల్లా కేంద్రానికో, రాష్ట్ర రాజధానికో వందల మైళ్లు ప్రయాణించి, డబ్బు ఖర్చు చేసుకుని, శ్రమకోర్చి పడిగాపులు పడి, నానా ఇక్కట్లు ఎదు ర్కొని, చివరికి పనికాక మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ప్రజ లకు రాకూడదు. పంచాయతీ సమితులు, తాలూకాలకు స్వస్తి చెప్పి మూడంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఎన్.టి. రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థ ఆవిర్భవించింది. వీలైనంత వరకు పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకుపోవడానికి వికేంద్రీకరణను మించిన మార్గంలేదు.
 
 పునర్ విభజన తప్పుకాదు కానీ...
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రెండు రాష్ట్రాలలోనూ పరిపాలనా వికేంద్రీకరణ కోసం జిల్లాల విభజన ఎంతో అవసరమన్న విషయంలో ఎవరికీ భిన్నా భిప్రాయం ఉండనక్కరలేదు.  ఇతర రాష్ట్రాల జనాభాతో పోల్చితే ఈ రెండు రాష్ట్రాలలోని జిల్లాల వారీ జనాభా చాలా ఎక్కువ. దేశంలో చాలా రాష్ట్రా లలో ఒక్కొక్క జిల్లా జనాభా అత్యధికంగా పది లక్షలు ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య 30 లక్షల దాకా ఉంది. జనాభా ప్రాతిపదికగా జిల్లాల విభజన తప్పకుండా జరగాల్సిందే. అందునా దశాబ్దాల పోరాటం తరువాత తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి తెలంగాణలో అభివృద్ధి ఫలితాలను జనానికి వేగంగా అందించేందుకు ప్రభుత్వం ఆలోచించడం మంచిదే. తెలం గాణ  రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న 10 జిల్లాలను ఇప్పుడు ప్రభుత్వం 31 జిల్లా లుగా పునర్ విభజించాలని ఆలోచిస్తున్నది.
 
 అంటే జనాభాను మూడొం తులుగా విభజించి పరిపాలన అందించాలన్న ఆలోచన. 31 జిల్లాలేం ఖర్మ, అవసరమైతే 40 జిల్లాలుగా విభజించడానికి కూడా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ‘పండుగపూట వాళ్లెందుకు ఏడవాలి? నన్నెందుకు తిట్టాలి?’ అని ముఖ్యమంత్రి అన్నట్టు కూడా వార్తలు వచ్చారుు. ప్రజాభీష్టానికే పెద్ద పీట వేస్తామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
 
 మంచిదే, 30 లక్షల మందికి ఒక కలెక్టర్ ఉండటం కంటే, 10 లక్షల మందికి ఒక కలెక్టర్ చొప్పున ఉంటే సమస్యల మీద దృష్టి పెట్టడానికైనా, వాటిని సత్వరం పరిష్కరించడానికైనా ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. కొన్నిచోట్ల జనాభా కారణంగా జిల్లాల విభజన అనివా ర్యం కాగా, కొన్నిచోట్ల భౌగోళిక స్వరూపం కారణంగా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమైంది. పరిపాలన మీద దృష్టి ఉన్న ఏ ప్రభుత్వమైనా ఈ పని చెయ్యా ల్సిందే. ఉదాహరణకు కొన్ని తెలంగాణ  జిల్లాలనే తీసుకుందాం. పెద్దలు కొండా వెంకటరంగారెడ్డి పేరును చిరస్మరణీయం చేయడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు.
 
 జిల్లా యంత్రాం గమంతా హైదరాబాద్‌లో ఉంటుంది, ఆ జిల్లాలో  ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతంతో సంబంధం ఉండదు. రంగారెడ్డి జిల్లాలో భాగమైన తాండూర్, వికారాబాద్ వంటి దూరప్రాంతాల నుండి ఏ చిన్న పనికైనా జనం హైదరా బాద్ రావాలి. మెదక్ జిల్లా కేంద్రం ఓ మూలన సంగారెడ్డిలో ఉంటుంది. ఆదిలాబాద్ అతి పెద్ద జిల్లా. దాన్ని రెండుగా విడగొట్టాలని తూర్పు ప్రాం తంలో చాలాకాలంగా డిమాండ్ ఉంది.

ఇట్లా కచ్చితంగా జిల్లాలని విభజించి, సంఖ్య పెంచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది, దాన్ని ఎవరూ కాదన డంలేదు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ప్రతిపక్షాలన్నీ కూడా జిల్లాల విభజనకు సంబంధించి అధికారపక్షం ఆలోచనను వ్యతిరేకించలేదు. అరుునా జిల్లాల విభజనకు సంబంధించి ఎందుకు ఇంత చర్చ, రగడ ఇన్ని మాసాలు జరిగింది? ఎందుకు నిరసనలు, రాజీనామాలు, ఆమరణ దీక్షల దాకా పరిస్థితి వెళ్ళింది? ఎన్ని జిల్లాలు చేయడానికైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే ప్రతిపక్షాలకు ఏమిటి అభ్యంతరం?
 
 ఎన్ని జిల్లాల ఏర్పాటుకైనా సిద్ధమేనా?
 జిల్లాల విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి ఆరంభంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు, అన్ని పక్షాల అభిప్రాయాలు అడిగారు. ఆ తరు వాత అంతా అధికారపక్షం తెలంగాణ  రాష్ట్ర సమితి సొంత వ్యవహారం లాగా, మళ్లీ మాట్లాడితే ముఖ్యమంత్రి సొంత వ్యవహారం లాగా సాగింది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలను, ప్రజలను, మేధావులను, ఇతరులను కలుపుకొని వెళ్లి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని చేసిన ట్టుగా లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. గద్వాల జిల్లా సాధించుకోవడం కోసం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అరుణ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసే దాకా వెళ్లారు.  జనగామను ప్రత్యేక జిల్లా చేయాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నాయక త్వంలో దాదాపు అన్ని పార్టీల వారూ, ప్రజలూ ఆందోళనకు దిగారు.
 
 స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గం సిరిసిల్లను జిల్లా చెయ్యాలని కూడా ఆందోళన సాగింది. తన నియోజకవర్గ ప్రజలు కోరినా సిరిసిల్ల జిల్లా ఏర్పరచడానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదంటే తమ ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా ఉందో అర్థం చేసుకోవాలని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. మొదటి సమావేశం తప్ప మళ్లీ ప్రతిపక్షాలతో మాట్లాడే ఆలోచన కూడా చెయ్యని ముఖ్యమంత్రి రెండురోజులనాడు అన్ని జిల్లాల నుండి తమ పార్టీ ప్రజా ప్రతినిధులను, నాయకులను రెండురోజుల పాటు క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని జిల్లాల పంచారుుతీ తెంపివే శారు. ఇంకా ఏమైనా పంచారుుతీ మిగిలి ఉంటే తేల్చండని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్యమంత్రి మాటల్లోనే అర్థమైంది ఆయన మనోగతం, కావాలంటే మరికొన్ని  జిల్లాలు కూడా ఏర్పాటు చేసేస్తారు.
 
 శాస్త్రీయంగా జరిగిందనుకోగలమా?
 ఇదంతా చూస్తుంటే రాజకీయ అవసరాల కోసమో, ఒత్తిడి కారణంగానో జరిగినట్టుందే తప్ప శాస్త్రీయంగా చేసినట్టు మాత్రం కనిపించదు. జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటును అంగీకరించడానికి ఒప్పుకోక, భీష్మించుకుని కూర్చున్న ముఖ్యమంత్రి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, ఆ రెండు జిల్లాల ఏర్పాటును కూడా ఈ లెక్కలో తోసేశారన్న విమర్శ ఎదుర్కోక తప్పదు. ఆదిలాబాద్  భౌగోళికంగా పెద్ద జిల్లా.
 
 దానిని నాలుగు జిల్లాలుగా విభజించడం, అందునా ఆసిఫాబాద్ కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షించదగ్గది. అదే సమయంలో కొన్ని జిల్లాలకు యాదాద్రి, భద్రాద్రి, రాజాద్రి అన్న పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆధ్యాత్మిక భావాలు గల వారిని సంతృప్తి పరచవచ్చు. కానీ, మన రాజ్యాం గంలో రాసుకున్న సెక్యులర్ స్టేట్ అన్న మాటకు అర్థం లేకుండా పోతున్నదని అనిపిస్తుంది. ఇక జిల్లాల ఏర్పాటు ఇట్లా ఉంటే ఏ మండలాలు ఏఏ జిల్లాలలో ఉండాలన్న విషయంలో, ఏవి రెవిన్యూ డివిజన్‌లు కావాలన్న విషయం కూడా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఉద్యమాలు చేస్తున్నారు.
 
 ఈ ప్రక్రియ శాస్త్రీయంగా జరగడంలేదనడానికి బోలెడు ఉదాహరణలు. విభజ నలో భాగంగా నగరానికి దగ్గరగా ఉన్న మొయినాబాద్ మండలాన్ని తీసుకు పోయి అక్కడెక్కడో ఉన్న వికారాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించి మళ్లీ ప్రజాభిప్రాయానికి తలొగ్గి శంషాబాద్‌లో చేర్చారు. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ కోసం కాంగ్రెస్ యువ శాసనసభ్యుడు వంశీచంద్ రెడ్డి ఆమరణ దీక్ష చేసే దాకా వెళ్లాల్సివచ్చింది. ఇంకా చాలా మండలాలు,  రెవిన్యూ డివిజన్‌ల సమస్య పరిష్కారం కావాల్సి ఉన్నది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో ఏయే ప్రాంతాలను లేదా మండలాలను ఏ జిల్లాలలో కలపాలనే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలాచోట్ల ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా ఉందనడానికి ఒక్క ఉదాహరణ కరీంనగర్ జిల్లా. సామాజిక మాధ్య మాల్లో ఇప్పుడు విస్తృత ప్రచారంలో ఉన్న ‘కరీంనగర్ ఒంటరి అయింది’ శీర్షికన రాసిన కొన్ని పంక్తులు  ‘‘ఏములాడ రాజన్న లేడు/అంజన్న అండ లేదు/ధర్మపురి దర్శనం లేదు /కొమురెల్లి మల్లన్న లేడు/ కాళేశ్వరం ఇక కాన రాదే/ఓదెల మల్లన్న లేడు/బసంత్‌నగర్ వసంతం పాయే/ సింగరేణి సిరులు పోయే /రామగుండం వెలుగు పాయే/ సిరిసిల్ల సింగారం పోయే/ కళ్లలోని కన్నీరు కడుపులో దాచుకున్న /మానేరు నిండు కుండలా /రెక్కలు విరిగిన పక్షిలా / కొమ్మలు నరికిన చెట్టులా /కొడుకులు వదిలిన ముసలిలా / ఒంట రిగా మిగిలింది నా జిల్లా.’’ విభజనలో కరీంనగర్ నాలుగు జిల్లాలయింది.
 
అసెంబ్లీలో ఏదీ చర్చ?
అన్నీ అందరికీ కావాలంటే సాధ్యం కాకపోవచ్చు కానీ అధికారంలో ఉన్న వారు ఇంతటి ప్రధాన నిర్ణయాలు చేసేటప్పుడు ప్రతిపక్షాల మనోగతాన్ని తెలుసుకోవడంతోపాటు ప్రజల భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరింత మంచి పేరు తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి చెప్పినట్టు 2019 ఏం ఖర్మ, ఇంకా ఎక్కువ కాలం పరిపాలన చెయ్యవచ్చు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చెయ్యడం కోసం తీసుకుంటున్న ఇంత ప్రధాన నిర్ణయం ప్రతిపాదనలను రాష్ట్ర శాసనసభ చర్చించక పోవడం అన్యాయం.
 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు