కవి కాలం

21 Sep, 2017 01:21 IST|Sakshi
కవి కాలం

పూర్వకాలంలో  కవిత్వాలూ కావ్యాలూ చెప్పగల వారు గానీ, శాస్త్ర గ్రంథాలూ వగైరా రాసేవారు గానీ తక్కువగా  ఉండేవారు. పూర్వం గ్రంథ రచన అంటే దండకారణ్యంలో కట్టెలు కొట్టుకొని, దుంపలు తవ్వి తెచ్చుకొని, కట్టెలపొయ్యి మీద కందమూలాలు వండుకొని తినటమంత కష్టం. ఈ రోజు, చాక్లెట్‌ నోట్లోవేసుకొని చప్పరించినంత తేలిక.

ఇప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చినా వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ తీసుకొని, టక టకా స్వహస్తాలతో ముద్రణ చేసి, ఒక్క మీట నొక్కి, క్షణాల మీద  ఒకేసారి ఖండ ఖండాంతరాలలో ఉన్న వేలాదిమంది చదువరుల చేతుల్లో పెట్టచ్చు. పైసా ఖర్చు లేదు. ఇప్పటికి సుమారు మూడు వేల ఏళ్ల క్రితం వరకూ కవులకు పాపం తమ కవిత్వం లిఖిత రూపంలో పెట్టేందుకు లిపి అనే కనీస సౌలభ్యం కూడా ఉండేది కాదు. అప్పటిదాకా ఎంత మహా గ్రంథమైనా నోటి మాటే.

లిపి ఏర్పడిన తరవాత లేఖన సామగ్రి సమస్య. భాసుడూ కాళిదాసూ లాంటి మహాకవులు కావ్యాలు రచించే రోజుల్లో, అవి పుస్తక రూపంలో కావాలంటే భూర్జ పత్రాలే ఆధారం. భూర్జ పత్రాలను హిమాలయాల నుంచి  తెప్పించుకొని పేజీల లాంటి ముక్కలుగా కోసుకొనే వారు. వాటిమీద మేఘ సందేశమో, ప్రతిమా నాటకమో మంచి దస్తూరీ గల వ్రాయసగాళ్ళతో కుదురుగా బొగ్గు మసి సిరాతో పక్షి ఈకలతో  రాయించేవారు. ఆ ముక్కలు నారపోగులతో కట్టకట్టేవారు.

తాటాకులు (తాళ పత్రాలు) వాడుకలోకి వచ్చిన తరవాత కవుల కష్టాలు కొంత తగ్గాయి. దిట్టమైన తాటాకులు కోయించి, వాటిని ఉడక పెట్టించి, మెరుగు పూత పూయించి కట్టలు కట్టి పెట్టుకొనేవారు. ఈ కట్టలను అలేఖ్యాలు అనేవారు. తోచినప్పుడు వాటి మీద ఇనప గంటంతో రాసుకొంటూ పోయేవారు. అయితే, జాగ్రత్తగా భద్రపరచకపోతే తాళపత్ర గ్రంథాలు క్రిమి కీటకాలకూ, అగ్నిప్రమాదాలకు గురై నాశనమైపోయేవి. తరవాతి రోజుల్లో కలంతో కాగితం మీద రాసుకొనే సౌకర్యం వచ్చేసరికి గ్రంథ రచన గ్యాస్‌ స్టవ్‌ మీద వంటలా తేలికయిపోయింది.

ఆ పైన 18వ శతాబ్దంలో ముద్రణ యంత్రాలే వచ్చేశాయి. 19వ శతాబ్దానికి భారతదేశంలో పుస్తకాల ముద్రణ ముమ్మరమైంది. క్రమంగా దేశంలో వందలాది ప్రచురణ కర్తలూ, వేలాది గ్రంథకర్తలు వచ్చేశారు. ఇరవయ్యో శతాబ్దం చివర్లో వచ్చిన కంప్యూటర్లతో  గ్రంథకర్తల సంఖ్య లక్షలలోకి చేరింది. ఇరవయ్యొకటి ఆరంభంలో, ‘గూగుల్‌’, ‘ఫేస్‌బుక్‌’, ‘వాట్సప్‌’ వచ్చిన తరవాత, కవులూ రచయితల సంఖ్య కోట్లు దాటుతున్నట్టు కనిపిస్తున్నది. కలికాలం కవికాలం కాబోతున్నది.

– ఎం. మారుతి శాస్త్రి

మరిన్ని వార్తలు