వితండవాదానికి విలువుండదు!

21 Apr, 2017 01:05 IST|Sakshi
వితండవాదానికి విలువుండదు!

సందర్భం

దేశ గౌరవానికి చెందిన కీలక అంశాలతోపాటు, అత్యంత సామాన్యమైన అంశాలపై కూడా రాద్దాంతం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ పనిగా పెట్టుకుంది. జాతి ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోదీపై వితండవాదంతో నెగ్గలేమని ప్రతిపక్షం గుర్తించాలి.

తెలంగాణలో ఒక సామెత ఉంది. ‘సుయ్‌ అంటే నాకో బూరె’ అంటావేందిరా అని పెద్దలు అంటుంటారు. అంటే సంబంధం లేకున్నా, విచక్షణ లేకుండా, చేస్తున్న పని ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందనే సోయి లేకుండా ప్రతీ విష యంలో జోక్యం చేసుకునే వారిపై ప్రయోగించే వాక్యం.. పైన పేర్కొన్న సామెత.

సరిగ్గా ఇదే రకంగా దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఉన్నది. నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత దేశంలో జరిగిన వివిధ సంఘటనలు, తదనంతర పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ తీరును పరిశీలిస్తే, ఎందుకు వారిని ఆ సామెతతో పోల్చానో అవగతమవుతుంది.

ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వారి దిమ్మతిరిగేట్లు వచ్చిన తర్వాత ఈవీఎంల పని తీరుపై చేసే వితండవాదం కావచ్చు. ఆ మధ్యన పుణే ఫిల్మ్‌  ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ నియామకం తరువాత జరిగిన నానా  యాగీ కావచ్చు. విషయం సహేతుకమా కాదా అనవసరం. విషయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా ఏదో రకంగా  పార్లమెంట్‌ వెలుపల లేదా బయట నానా కంగాళీ చేసి ఉనికి చాటుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. పని లోపనిగా  కాంగ్రెస్‌ పతనావస్థకి కారణమైన మోదీ నాయకత్వంపైన వీలైనంత బురదజల్లి అక్కసు తీర్చుకొని, కడుపుబ్బరం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలు మున్నెన్నడూ లేనంత మెజారిటీ కట్టబెట్టి అధికారాన్నిచ్చిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకుంటే అదేదో కొంపలు మునిగిపోయినట్లు ఎమ్మెల్యేలే లేరా అని దీర్ఘాలు తీస్తారు. యోగి ఆ రాష్ట్రం నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్న విషయం, ఆయన దక్షత పట్ల ఉన్న ఆదరణ తెలియనట్లు ప్రవర్తిస్తారు.

నల్ల ధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో  భాగంగా పాత పెద్ద నోట్ల ఉపసంహరణ చేసి వాటి స్థానే కొత్త  నోట్లను ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్ర  పక్షాలు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. మొదట దాన్ని  సమర్థిస్తున్నామని, ఆ తర్వాత నిర్వహణ బాగా లేదని,  చివరకు మొత్తంగా యూ టర్న్‌ తీసుకుని ఆ మొత్తం ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని వేసిన కుప్పిగెంతులకు జనం ఆశ్చర్యపోయారు. అసలు ఈ పార్టీకేమైంది అని  చర్చించుకున్నారు. యావత్‌ దేశం ఆ నోట్ల ఉపసంహరణను సమర్థించి, మోదీ వెంట నడిచి, ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొని, అవినీతిపై జరుగుతున్న యుద్ధంలో  భాగస్వాములైతే కాంగ్రెస్‌ నిలకడలేని మాటలు మాట్లాడి  అపహాస్యం పాలయింది.

చివరకు ఆ చర్య తరువాత జరిగిన అనేక పంచాయతీ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, కొన్ని పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు మెజార్టీ స్థానాలు బీజేపీకి కట్టబెట్టి మోదీ నాయకత్వంపట్ల విశ్వాసం ప్రకటించారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో నోట్ల ఉపసంహరణ ప్రజా వ్యతిరేక చర్య అని ప్రచారం చేసిన కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతైంది. వారితో జట్టు కట్టిన సమాజ్‌వాదీ  పరిస్థితి అగమ్య గోచరమైంది. అక్కడక్కడా జరిగిన చెదురు మదురు సంఘటనలను భూతద్దంలో చూపించి ప్రభుత్వాన్ని నిందించే కాంగ్రెస్‌కు, ప్రతీ విషయానికి అదే పనిగా ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించే కాంగ్రెస్‌ నాయకులకు వీరభద్రసింగ్‌పైనున్న అవినీతి మరకలు, కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడిపై జరుగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు గోచరించవు.

కశ్మీర్‌ విషయానికొస్తే అక్కడ జరిగిన అనేక అలజడులకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన విధానాలే కారణం. ఉదారవాద విధానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు బీజేపీతో కూడిన సంకీర్ణ  ప్రభుత్వం నేతృత్వంలో పరిస్థితులు మెరుగుపడితే  తట్టుకోలేక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తోంది. ఈమధ్యనే బీజేపీకి చెందిన మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ ఓ విదేశీ టీవీ ఛానెల్‌ చర్చలో చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల వైఖరి హాస్యాస్పదం, గర్హనీయం.

భారత దేశంలో ఉన్న ఆఫ్రికన్లపై స్థానిక అంశాల ప్రాతిపదికన జరిగిన దాడులకు సంబంధించి వ్యాఖ్యాత వేసిన ప్రశ్నల పరంపరకు సమాధానమిస్తూ, భారత్‌లో జాతి వివక్ష ఉండదు అనే విషయాన్ని చెప్పాలనుకుని పొరపాటున పదాల కూర్పు కారణంగా మరొక విధమైన అర్థమొచ్చిందని, అది అధిక్షేపణీయమని, తన ఉద్దేశం అది కాదని సదరు మాజీ ఎంపీ స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్‌ వారు రాజకీయం చేశారు.

కేంద్ర స్థాయిలో పటిష్ట నాయకత్వం లేని స్థితిని, అధినాయకురాలి అశక్తత, యువరాజు సామర్థ్యంపై అనుమానం, నెహ్రూ–గాంధీ కుటుంబం తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేని దీనావస్థ, అధిష్టానం విశ్వాసంతో మాత్రమే పనిచేసే వృద్ధనాయకుల వ్యవహార శైలి, యువనాయకత్వానికి మార్గదర్శనం చేసేవారు లేక పార్లమెం టులో కూడా ప్రభావవంతమైన రీతిలో పనిచేయలేని పరి స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.

అదేసమయంలో వీటన్నింటితో సంబంధం లేకుండా,  జాతిప్రయోజనం కోసం దృఢచిత్తంతో సుపరిపాలనను అందిస్తున్న మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కావున ప్రతి విషయాన్నీ రాద్ధా్దంతం చేయకుండా గుణా త్మక విశ్లేషణతో ప్రవర్తిస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతి పక్షం కూడా అవసరమే. కాబట్టి పరనింద మాని ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీ అవసరం.


రావుల శ్రీధర్‌ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర నాయకులు
మొబైల్‌ : 99855 75757

మరిన్ని వార్తలు