పన్నీర్‌ సెల్వం రాయని డైరీ

12 Feb, 2017 00:39 IST|Sakshi
పన్నీర్‌ సెల్వం రాయని డైరీ

గవర్నర్‌కి ఏదో అయిందన్నట్లుగా అంతా వెళ్లి ఆయన్ని కలిసొస్తున్నారు! గవర్నర్‌ కూడా తనకేదో అయిందన్నట్లుగా అందర్నీ రాజ్‌భవన్‌కి పిలిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇప్పుడిది గవర్నర్‌ పదవీ విరమణలా ఉంది కానీ, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్న బల నిరూపణలా లేదు!

సాయంత్రం గవర్నర్‌ని కలిశాను. తీక్షణంగా నా వైపు చూశారు! నేను చీఫ్‌ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయనలో అంత లోతైన చూపు లేదు. అంత ఘాటైన భావన లేదు. ‘ఉన్న దాన్ని ఊడదీసుకుని, మళ్లీ ఇప్పుడొచ్చి నన్ను తగిలించమంటే ఎలా?’ అన్నట్లు చిరాగ్గా చూశారు.

‘మీరు మునుపటిలా లేరు’ అనబోయి ఆగిపోయాను. ఆయన మునుపటిలానే ఉన్నారు గవర్నర్‌గా! నేనే.. మునుపటిలా లేను ముఖ్యమంత్రిగా! అందుకే ఆగిపోయాను. ‘మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు’ అని మొదలుపెట్టాను.

మళ్లీ ఆయన చిరాగ్గా చూశారు. ‘ఏంటి చూసేది! నువ్వే అన్నీ చూపిస్తున్నావు’ అన్నారు. హర్ట్‌ కాబోయి ఆగిపోయాను. హర్ట్‌ అయినప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లొస్తే తుడుచుకోమని చెప్పడానికి ఇప్పుడు అమ్మ లేదు. తుడుచుకోమని అమ్మ చెప్పందే తుడుచుకునే అలవాటు నాకూ లేదు. అందుకే ఆగిపోయాను.

‘ఉత్తి పుణ్యానికి నా నెత్తిన బండెత్తేశావు కదయ్యా సెల్వం. నా ఫ్యామిలీ టూర్‌ మొత్తం పాడు చేసేశావ్‌. కాసేపలా కూర్చో, ఏం చేయాలో ఆలోచిద్దాం’ అన్నారు ఆనరబుల్‌ గవర్నర్‌.
ఆయన చెప్పినట్లే కూర్చున్నాను. కానీ ఆయనే.. ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు లేదు! ‘ఒక్క చాన్సివ్వండి’ అని అడగబోయి ఆగిపోయాను. మూడుసార్లు ముఖ్యమంత్రిని అయ్యానన్న గౌరవం లేకుండా, ఎంత మాట పడితే అంత మాట అనేసేలా ఉంది ఆయన వాలకం! అందుకే ఆగిపోయాను.

నేనక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి చీఫ్‌ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్‌ వచ్చారు. ఆమె అక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి పోలీస్‌ చీఫ్‌ రాజేందర్‌ వచ్చాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి చీఫ్‌ జస్టిస్‌ కౌల్‌  వచ్చారు. వాళ్ల ముగ్గురూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి శశికళ వస్తోందన్న కబురొచ్చింది! అంతా కలిసి శశికళను రాజ్‌భవన్‌ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్లరు కదా!!

‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్‌..’ అనుకుంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను.  ‘సార్‌.. ముందు నాకే అవకాశం ఇస్తారు కదా.. బల నిరూపణకు’ అన్నాను.
‘నీకే ఇస్తానయ్యా పన్నీర్‌ సెల్వం’ అన్నారు గవర్నర్‌.
‘మరి.. వాళ్లెందుకొచ్చారు సార్‌’ అని అడిగాను.
గవర్నర్‌ మళ్లీ చిరాగ్గా చూశారు.
 ‘మీ ఇద్దరిలో ఎవరు బలాన్ని నిరూపించు కున్నా.. తర్వాత నేనే కదయ్యా లా అండ్‌ ఆర్డర్‌లో నా బలాన్ని నిరూపించుకోవలసింది’ అన్నారు!

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు