తెలివి మీరిన నేరాలు

14 Sep, 2017 02:01 IST|Sakshi
తెలివి మీరిన నేరాలు

జీవన కాలమ్‌
చదువు మాత్రమే మనిషిని మార్చదు. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం.

మొన్న విశాఖపట్నం బీచి దగ్గర మా కారు ఆగింది– రోజూలాగే. పార్కింగులో పది మోటారు సైకిళ్లు ఉన్నాయి. రామకృష్ణా బీచిలో రోడ్డుకి ఎడమపక్క కార్లు, కుడిపక్క మోటారు సైకిళ్లు ఆపాలని రూలు. కాని కొన్ని డజన్ల మోటారు సైకిళ్లు ఎడమపక్కనే ఆపుతారు. కారణం – పక్కనే కూర్చునే వసతి.

మా డ్రైవరు ఒకాయన్ని మోటారు సైకిలు కాస్త వెనక్కి పెట్టమన్నాడు. ఆ మోటారు సైకిలు ఓనరు ఇతని మీద విరుచుకుపడ్డాడు. ‘నా బండి తీయమనడానికి నువ్వెవడివి? ఇక్కడ కార్లే ఆపాలని రాసి ఉందా? ఇది నీ బాబు గాడి సొమ్మా? నా బండీ పెడితే ఆపేవాడెవడు? ఇక్కడే పెడతాను. నీ దిక్కున్నవాడితో చెప్పుకో–పో. నేను తియ్యను‘ ఇలా అరుపులతో సాగింది.

ఇంతలో ఎవరో ఆ కేకలు వేసే మనిషికి పలానా కారు గొల్లపూడిదని చెప్పారు. అతని తడబాటు వర్ణనాతీతం. ఇతణ్ని ఆపే శక్తి పోలీసు వ్యవస్థకి లేదు. కారణాలు మన దేశంలో చెప్పనక్కరలేదు. లేదన్న అవగాహన ఇతను బోర విరుచుకోవడానికి దన్ను. ఈ కాలమ్‌ కొందరయినా పోలీసు అధికారులు చదువుతారని ఆశి స్తాను. ఇది చదువుకున్న నేలబారు మనిషి – తన ఆ క్రమశిక్షణకు తాను సమకూర్చుకున్న లాజిక్‌. అతను చదువు రానివాడు కాదు. స్పష్టంగా తెలుస్తోంది. కాని చదువువల్ల రావలసిన సంస్కారం రానివాడు. ఇలాంటి చదువుల వెర్రితలలు మనదేశంలో కోకొల్లలుగా ప్రస్తు తం చూస్తున్నాం. ఈ చదువుకున్న మూర్ఖుడి మూర్ఖత్వానికి రెండు చికిత్సలు. దమ్మున్న అధికారం. చదువుకు సరైన తోవని మప్పే వ్యవస్థ.

నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశీలనకు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (పరిపక్వతకు రాని వయసున్న నేరస్థుల నేరాలను పరిశీలించే సంస్థ) తరఫు న్యాయవాది అబ్దుల్‌ రఖీబ్‌ అనే ఆయన ప్రొఫెసర్‌ సంపత్‌ కుమార్‌ పర్యవేక్షణలో.. విశాఖపట్నంలో చట్టానికి అడ్డం పడే ఈ జువెనైల్‌ నేరస్థుల కథనాలను– 100 నమూనాలను రెండేళ్లు పరిశీలించి పరిశోధన చేశారు. తేలిన నిజాలు విచిత్రం. ఇక్కడ జరిగే నేరాలు– చదువులేక, రోడ్డుమీద పడిన అలగా జనం చేసేవి కావు! నేరస్థులలో 40 శాతం ఇంటర్మీడియెట్‌ చదువుకున్నవారు. పదిశాతం పట్టభద్రులు! ఇంకా 67 శాతం కింది మధ్యతరగతినుంచి వచ్చినవారు.

వీరిలో మళ్లీ గంజాయి రవాణా, అమ్మాయిల వేట, మానభంగాలు, గొలుసుల దొంగతనాలు, మా బీచి మిత్రుడిలాగ చట్టాన్ని ఎదిరించి రొమ్ము విరుచుకునే కేసులు– 58 శాతం. వీరిలో వెనుకబడిన కుటుంబాల నుంచి 56 శాతం, జూనియర్‌ కాలేజీల్లో చదువుకునేవారు– 30 శాతం ఉన్నారు.

ఇది చాలా విచిత్రమైన నిజాలను ఆవిష్కరించే పరిశోధన. ఇదేమిటి? చదువు వీరిని మార్చలేదేం?

బాబూ, చదువు మాత్రమే మనిషిని మార్చదు. గమనించాలి. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చిల్లర దొంగతనాలు చేసి బతికే తండ్రి కొడుకు– అదృష్టవశాత్తూ చదువుకోగలిగితే– ఆ దొంగతనాల్ని మరింత పకడ్బందీగా, దొరక్కుండా, మెరుగైన స్థాయిలో ఎలా చేయాలో– ఆ వృత్తికి మెరుగుపెడతాడు. వెనుకబడినవాడు– తన వెనుకబడినతనానికి తరతరాలు కారణమైన వాడిమీద కత్తికడతాడు. ఆ కత్తిని పదునుపెట్టడం చదువు నేర్పుతుంది. చదువు దానికి మన్నికయిన కారణాన్ని జత చేస్తుంది. వ్యవస్థ తప్పిదం వ్యక్తిది కాదన్న అవగాహన చదువుది కాదు. సంస్కారానిది.

సంస్కారం పుష్పం. పురుగులు పట్టిన, కుళ్లిన గెత్తంలోంచే కళ్లు విప్పి, విత్తనమనే ప్రత్యేక అస్థిత్వాన్ని ఒడిసి పట్టుకుని– వికసించి పుష్పమవుతుంది. చదువు– ఏతావాతా– ప్రజ్ఞనిస్తుంది. ఉపజ్ఞని ఇవ్వదు. చట్టాన్ని ఎలా ఎదిరించాలో నేర్పగలదు. ఎందుకు ఎదిరిం
చాలో ఒప్పించగలదు. మప్పగలదు. దానికి ఒరిపిడి– సంస్కారం. నిజానికి దీనికీ, చదువుకీ– న్యాయంగా సంబంధం ఉండనక్కరలేదు. కానీ ఉంటుంది. చదువుతో వచ్చే ‘వికసనం’ ఆ వాతావరణం ఇస్తుంది. సాంగత్యం ఇస్తుంది.

ఆదిశంకరులు సజ్జన సాంగత్యానికి– జీవన్ముక్తిదాకా మజిలీలు ఉన్నాయని సూచించడంలో అర్థం ఇదే. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం.

తెల్లవారిలేస్తే– మన డబ్బుని తినేసే ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ ఇంట్లో 50 కోట్ల ఆస్తి బట్టబయలు, కొల్లగొట్టిన డబ్బుతో పట్టుబడిన ఎమ్మార్వోల కథనాలు, రిజిస్ట్రార్‌ ఆఫీసులో లక్షల లంచాలు, చట్టాన్ని ఎదిరించి చెల్లుబడి చేసుకున్న డబ్బున్న నాయకుడి విర్రవీగుడు– ఇవన్నీ పైన చెప్పిన 62 శాతం చదువుకున్న కుర్రాడి మెదడులో పెట్టుబడులు. కుళ్లు చూపే వ్యవస్థలో తన ఒక్కడి సత్ప్రవర్తన జవాబుదారీ కాదన్న ‘నిరసన’ని అతని చదువు నేర్పుతోంది. ఇదీ చదువుకున్న 90 శాతం కుర్ర నేరస్థుల కథ.
గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు