సాగుకు చేటు రైతుకు చేదు

1 Jan, 2016 02:13 IST|Sakshi
సాగుకు చేటు రైతుకు చేదు

విశ్లేషణ
ఈ ఏడాది సాగు వ్యవస్థను ధ్వంసం చేసినది ప్రకృతి ఒక్కటే కాదు. ఒక క్రమపద్ధతిలో వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యాన్ని పెంచుకుంటూ వస్తున్న పాలకులు కూడా కారణం. రైతాంగం అతి ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో కేంద్రం గోధుమకు, వరికి అధిక కనీస మద్దతు ధరలతోపాటూ, రైతులకు కనీసం రూ.2,00,000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటిస్తుందనుకున్నాం. కానీ రైతాంగం ఆక్రందనలను అది పట్టించుకోలేదు. రైతులను వ్యవసాయం నుంచి తరిమేయాలనేదే దీని అంతరార్థం. సాగును బొత్తిగా గిట్టుబాటుకానిది చేసి, రైతులు తమంత తాముగా సాగును వదిలేసేలా చేయాలనేదే దీని సారాంశం.
 
గడచిన ఏడాది వ్యవసాయానికి బహు చెడ్డ కాలం. అలా అని అంతకు ముందు పరిస్థితి మెరుగ్గా ఉండేదని కాదు. కాకపోతే 2015లో రైతాంగం మరీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏడాది మొదటి నుంచి చివరి వరకు వ్యవసాయరంగం దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం దీనికి తోడై పరిస్థితి మరింత అధ్వానమైంది. వ్యవసాయ సంక్షోభం మరింతగా విష మించింది. వరుసగా రెండో ఏడాది దుర్భిక్ష పరిస్థితులు కొనసాగాయి. వేసవి తదుపరి వానాకాలపు వర్షపా తంలో 14 శాతం లోటు ఏర్పడింది. గత ఆరేళ్లలో ఇదే అత్యధిక లోటు. దేశంలోని మొత్తం సాగుయోగ్యమైన భూమిలో 40 శాతం అల్ప వర్షపాతం సమస్యను ఎదుర్కొంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తీవ్ర దుర్భిక్షానికి గురయ్యాయి. పంజాబ్, హరియాణాల్లో సైతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే విస్తృతమైన నీటిపారు దుల సదుపాయాల వ్యవస్థ ఉండటం వల్ల అవి ఆ దుష్ర్పభావం నుంచి తప్పించుకోగలిగాయి.
 

పెరిగిన ఆత్మహత్యల పరంపర
పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్ లోనూ, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతా ల్లోనూ వేసవి తదుపరి జూన్‌లో వానాకాలం మొదలు కావడానికి ముందే వర్షాలతోపాటూ, బలమైన గాలులు, వడగళ్ల వానలు విరుచుకుపడ్డాయి. దీంతో చేతికి అంది వచ్చిందనుకున్న గోధుమ పంట తీవ్రంగా దెబ్బతిని పోయింది. వడగళ్ల వానల తాకిడికి గురైన ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ పాంతాల్లో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగాయి.

నేల వాలిన పంటను చూసి గుండె పగిలిన రైతులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ సంక్షోభం తీవ్ర స్థాయిలో కొనసాగుతు న్నదని భావించే కర్ణాటకలో జూన్ నుంచి సాగుతున్న ఆత్మహత్యల పరంపరలో 600 మంది రైతులు బలైపో యారు. కొందరు రైతులైతే మండుతున్న చెరుకు తోటల్లోకి దూకి మరీ ఆత్మాహుతికి పాల్పడ్డారు. ప్రభు త్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, నిర్లక్ష్య వైఖరి పట్ల వారి తీవ్ర ఆగ్రహాన్ని ఇది వ్యక్తీకరించింది. కర్ణాటకలో ఈ ఆత్మహత్యల ఉరవడి, తీవ్రత పెచ్చు పెరిగిపోవడంతో ఆ రాష్ట్రం కూడా దేశంలోని ప్రధాన రైతు ఆత్మహత్యల ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది.
 

విస్తరిస్తున్న రైతు ఆత్మహత్యలు
మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నది. గత ఏడాది మొదటి నుంచి అక్టోబర్ నాటికే 2,950 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం అంతకు ముందటి ఏడాది జరిగిన రైతు ఆత్మహత్యలు 1,611 మాత్రమే. ఆత్మహత్యలకు నెల వుగా ఉంటున్న విదర్భ ప్రాంతానికి తోడు, మరాఠ్వాడా ప్రాంతంలోనూ రైతుల పరిస్థితి అధ్వానంగా దిగ జారింది. దీంతో ఆ ప్రాంతం కూడా  ప్రధాన ఆత్మ హత్యల ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఈ ఆత్మ హత్యలను ఆపడానికి ఏం చేయాలో తోచక మహారాష్ట్ర ముఖ్యమంత్రి సినీ నటి దీపికా పదుకొనేను రంగంలోకి దించి, మానసిక చికిత్స ద్వారా మరణాల సంఖ్యను కనీస స్థాయికి తగ్గించాలని ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన రూ. 10,512 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌లలో సైతం ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగాయి. మధ్య ప్రదేశ్‌లో పల్లాకు తెగులు సోకి సోయా బీన్ పంట పూర్తిగా దెబ్బ తినిపోవ డంతో ఇప్పటికే అక్కడ నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మరీ తీవ్రమైంది. కాగా, ఒడిశాలో సైతం రైతు ఆత్మ హత్యల పరంపర అనూహ్యంగా పెరిగి పోవడం దిగ్భ్రాంతిని కలుగజేసింది.

అక్కడ దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంతో, ఆ సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర బీజేపీ, బీజేడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను చేపట్టాల్సి వచ్చింది. దేశానికి ధాన్యాగారాైలైన పంజాబ్, హరియా ణాల్లో సగటున రోజుకు ఇద్దరు నుంచి నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్చి-ఏప్రిల్‌లోని అకాల వర్షాలకు పలువురు రైతులు నష్టపోయారు. పైగా బంగాళదుంప ధర ఘోరంగా పడిపోవడంతో పలు ప్రాంతాల్లో ఉచితంగా వాటిని పంచిపెట్టేశారు. రెండేళ్ల క్రితం బాసుమతి వరికి క్వింటాలుకు రూ. 4,000 లేదా ఎక్కువ ధర లభించేది. అయినా అది ఆ సమయంలోని కనీస మద్దతు ధర కంటే తక్కువే. పైగా కనీస మద్దతు ధరకు సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన రూ. 5,500 కోట్లను సేకరణ ముగిశాక నెల దాటాక కూడా చెల్లించలేదు.
 

బీటీ పత్తికి తెల్ల దోమ కాటు
ఇంతవరకు చిన్నపాటి చీడగానే భావిస్తున్న తెల్లదోమ అంది వచ్చిన పత్తి పంటలో 75 శాతాన్ని కబళించేసింది. ప్రధానంగా జన్యుపరంగా మార్పిడి చెందించిన బీటీ పత్తికే తెల్లదోమ చీడ సోకి నష్టం వాటిల్లడం విశేషం. 3.32 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పత్తి పంట తెల్లదోమ తాకిడికి నాశనమైందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌సింగ్ పార్లమెంటుకు తెలిపారు. ఫలితంగా రూ. 4,600 కోట్లు నష్టం వాటిల్లినట్లు కొన్ని అంచనాలు పేర్కొన్నాయి. ఆగ్రహం చెందిన రైతులు, తెల్లదోమ సోకిన పంట పొలాలకు ఎకరాకు రూ.  40,000 నష్టపరిహారాన్ని కోరుతూ పలుచోట్ల రైల్ రోకోలు నిర్వహిం చారు. ఆ కీటకం దాడికి పంట నాశ నం కావడం వల్ల పనులు కోల్పో యిన వ్యవ సాయ కూలీ లకు కూడా రూ. 20,000 నష్ట పరిహారం చెల్లిం చాలని రైతులు కోరారు. రైల్ రోకో ఆందోళనలు ఆగాయి కానీ, అధికార పార్టీ నేతలెవరినీ తమ గ్రామాల్లోకి రాకుండా రైతులు అడ్డగిస్తూనే ఉన్నారు.
 

ఉద్దేశపూర్వకం ప్రభుత్వ నిర్లక్ష్యం
దేశవ్యాప్తంగా సాగు వ్యవస్థను ధ్వంసం చేసినది ప్రకృతి విలయం మాత్రమే కాదు. వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ఒక క్రమపద్ధతిలో పెంచు కుంటూ వస్తున్న పాలకులు కూడా వ్యవసాయ సంక్షో భం మరింత ముదరడానికి దోహదం చేశారు. రైతాంగం ఇలా అతి ఘోరంగా దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గోధుమ, వరి పంటలకు ఎక్కువ కనీస మద్దతు ధరలతోపాటూ, రైతులకు కనీసం రూ. 2,00,000 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా ప్రకటిస్తుందనుకుంటే... అదసలు రైతాంగం ఆక్రం దనలను పట్టించుకోనేలేదు. సరికదా, 7వ పే కమిషన్ సిఫారసుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి ఆదాయాలను మూడు రెట్లు పెంచింది. రైతులకిచ్చే కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 50 మాత్రమే పెంచింది. అంటే దాదాపు 3.5 శాతం పెరుగుదల. అత్యంత దిగువస్థాయి ఉద్యోగైన చప్రాసీ మూల వేతనం సైతం 260 శాతం పెరిగింది!

 రైతును సాగుకు దూరం చేస్తేనే వృద్ధి
 రైతులను వ్యవసాయరంగం నుంచి తరిమేయాలనేదే ప్రభుత్వ వైఖరిలోని అంతరార్థమూ, ఉద్దేశమూ అని నా గట్టి నమ్మకం. సాగును బొత్తిగా గిట్టుబాటు కానిదిగా మార్చడం ద్వారా, సాగును వదిలిపెట్టేయడం తప్ప రైతులకు వేరే గత్యంతరం లేకుండా చేయాలనేదే దీని సారాంశం. బలవంతంగా వారిని గెంటేయడం కంటే ఇదే ఉత్తమమైన పద్ధతి! వ్యవసాయం నుంచి పెద్ద ఎత్తున జనాభా పట్టణ ప్రాంతాలకు తరలిపోవడమే అతి పెద్ద సంస్కరణ అవుతుందని నీతి ఆయోగ్ ఉపా ద్యక్షులు అరవింద్ పనగారియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ తరచుగా అంటూనే ఉన్నారు.
 

మరోవంక ‘ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’(సీఐఐ) మౌలిక సదుపాయాల కోసం చౌకగా లభించే శ్రమశక్తిని కోరుకుంటోంది. రైతులను సాగు నుంచి పారదోలితేనే వారికి అలాంటి కారుచౌక శ్రామిక శక్తి అందుబాటులోకి వస్తుంది. అప్పుడే ఈ క్రమానికి సంబంధించిన సూచనలు వార్తా కథనాలలో కనిపి స్తున్నాయి. ఢిల్లీకి అనుకుని ఉన్న సోనేపట్ జిల్లాలో, ఒక విద్యా సంస్థను నెలకొల్పడం కోసం జరుపుతున్న భూసేకరణకు 500 మంది రైతులు తమ భూములను ఇవ్వజూపారని వచ్చిన కథనం అలాంటిదే. మరో కథనం ప్రకారం ఒక్క ఉత్తరాఖండ్‌లోనే గత 15 ఏళ్లలో 3,000 గ్రామాలు నిర్మానుష్యమైపోయాయి!
 

రైతులను పేదరికంలోనే ఉంచేయాలని ఏళ్లతరబడి ఉద్దేశపూర్వకంగా సాగుతున్న కృషి ఫలితాన్ని ఇది కళ్లకు కడుతుంది. ప్రభుత్వానికి తెలవకుండానే రైతులు బాధలకు గురవుతున్నారనుకుంటే పొరబడుతున్నట్టే. ఆర్థికంగా ఒక దేశం వృద్ధి చెందాలంటే, వ్యవసాయంపై ఆధారపడి ఉండటం తగ్గించుకోవాలనేది మన పాల కులు సూచిస్తున్న పరిష్కారం. అందువల్లనే రైతాంగాన్ని ఇంతటి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేసి, తమంతట తామే వారు సాగును వదిలేసి, పట్టణాలకు వలసపో యేలా చేయాలనే కృషి జరుగుతున్నది. ప్రభుత్వానికి కావాల్సింది కారుచౌక శ్రామికశక్తి లేదా అతి తక్కువ వేతనాలకు పనిచేసే దినసరి కూలీలు.

కానీ మన దేశం లో నేటికీ వ్యవసాయరంగమే అతిపెద్ద ఉపాధి వనరుగా ఉన్నదనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. గ్రామా లను వల్లకాళ్లను చేసే శక్తి పాలకులకు ఉండొచ్చు గానీ, అలా పట్టణాలకు చేరిన వారందరికీ ఉపాధిని చూపిం చగల శక్తి మన పారిశ్రామిక, సేవారంగాలకు లేనే లేదు. కాబట్టి నేల విడిచి సాముచేయడం లాంటి ఈ విధా నాలను వదిలిపెట్టి... వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకమ య్యేదిగా, పర్యావరణాన్ని సుస్థిరపరి చేదిగా చేయడానికి సకల ప్రయత్నాలూ చేయాల్సి ఉంది.

(వ్యాసకర్త: దేవిందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు  hunger55@gmail.com)

మరిన్ని వార్తలు