రాజకీయాల్లో కులం అనర్థం

5 Jan, 2017 00:24 IST|Sakshi
రాజకీయాల్లో కులం అనర్థం

కొత్త కోణం
జాతీయ స్వభావంతో ప్రారంభమైన సమాజ్‌వాదీ పార్టీ కుల స్వభావాన్ని సంతరించుకుని, కుటుంబపరమైనదిగా, చివరకు వ్యక్తిగతమైనదిగా దిగజారింది. ఇది ఎస్పీకి మాత్రమే పరిమితమైన పరిణామం కాదు. 1977 అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్‌కు వ్యతి రేకంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలన్నిటిదీ ఇదే ధోరణి. ఈ పరిణామా లన్నింటికీ దేశంలో కొనసాగుతోన్న కుల వ్యవస్థే కారణం. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధ్యం కాదు అని అంబేడ్కర్‌ అన్నారు అందుకే.

‘‘మన దేశంలోని సామాజిక సంబంధాల అంతరాలను మార్చకుండా మనం ఎటువంటి అభివృద్ధినీ సాధించలేము. కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేము. ప్రజల మధ్య ఐక్యతను, సోదరత్వాన్ని సృష్టిం చలేము... కులం పునాదుల మీద ప్రగతిని సాధించాలనుకుంటే అది విచ్ఛిన్న మౌతుందే తప్ప ఎటువంటి ఫలితాలను ఇవ్వదు’’ అని బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ ఏనాడో చెప్పారు. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధి  కారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో అంబేడ్కర్‌ మాటలను మరోసారి గుర్తుచేసుకోవడం అవసర మైంది. ఆ పార్టీ చరిత్ర, దాని నాయకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ రాజ కీయ జీవితం తొలిదశ ప్రగతిశీల మార్గంలోనే నడిచాయి. క్రమంగా ఆ పార్టీ ఒక కులానికి చెందిన పార్టీగా, తదనంతరం ఒక కుటుంబ పార్టీగా అవత రించింది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార కుటుంబంలోనే  కలహాలు రేగాయి. మన దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఏర్పడక ముందే లేదా ఏర్పడ్డ తర్వాత ఒకటి లేదా కొన్ని కులాల ప్రయోజనాల కోసం పనిచేయడం సర్వ సాధారణమైంది. జాతీయోద్యమ కాలం నుంచే రాజకీయ పార్టీల నిర్మా ణంలో సైతం కులం బీజాలున్నాయి. ‘‘అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీ ఒక సాధనం వంటిది. అయితే ఒక సామాజిక ప్రయోజనం కోసం ఒక సంఘటిత రూపం కావాల్సి ఉంటుంది. అది వర్గం, జాతి, మతం, సామాజిక హోదా లాంటి ఏ ప్రయోజనమైనా కావచ్చు’’ అంటూ మాక్స్‌ వెబర్‌ రాజ కీయ పార్టీ నిర్మాణం గురించి చెప్పినది సత్యమనిపిస్తుంది. అంటే రాజకీయ పార్టీ సమాజంలోని ఏదో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ప్రజ లందరికీ తాము ప్రతినిధులమని చెప్పుకోవడం ఆత్మవంచన మాత్రమే.

భిన్న సామాజిక వర్గాల సమ్మేళనం
భారత స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలో జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే మన దేశ రాజకీయ చరిత్ర స్వరూపం తేటతెల్లమవుతుంది. కాంగ్రెస్‌ నాయకత్వం పూర్తిగా బ్రాహ్మణాధిపత్యంలో ఉన్నదని భావించిన కొందరు దానికి వ్యతిరేకంగా జస్టిస్‌ పార్టీని ప్రారం భించారు. అది కనుమరుగు కాగా, అదే స్ఫూర్తితో 1942లో కుల వ్యతిరేక ద్రవిడ కజగం (డీకే) ఏర్పడింది. దాని నుంచి విడివడి ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) క్రమంగా కుల రాజకీయాల పార్టీగా మారింది. అంటే మన దేశంలో ప్రారంభమైన ఏ సంస్థయినా లేదా పార్టీ అయినా మొదట కులాతీతమైనదిగా కనిపించినా క్రమేణా ఒక కులం చేతుల్లోకి పోవడం సర్వసాధారణం. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ప్రస్థానం కూడా అటు వంటిదే. ‘‘ఉత్తరప్రదేశ్‌ తరతరాలుగా విభిన్న సామాజిక వర్గాల సమ్మేళ నంగా ఉన్నది. అందులో వైరుధ్యాలున్నాయి. అనుబంధాలున్నాయి, సంఘర్ష ణలున్నాయి, సామరస్యాలున్నాయి’’ అని విద్యావేత్త అలోక్‌ రాయ్‌ అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడి సామాజిక నిర్మాణమే ఆ రాష్ట్రంలోని ఉద్రిక్త తలకు కారణమని భావించవచ్చు. అక్కడి జనాభాలో హిందూ మత రక్షకులుగా భావించే బ్రాహ్మణులు 12 శాతం, ముస్లింలు 19 శాతం, దళి తులు 21 శాతం ఉన్నారు. ఈ కుల, మత సంపుటిని అక్కడి సామాజిక సంఘర్షణకు మూలంగా భావించవచ్చు.

సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భావాన్ని ఈ నేపథ్యం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీకి తాత్విక పునాదిని అందించింది సోషలిస్టు భావజాలం. ఆ సోషలిస్టు భావజాలానికి స్వాతం త్య్రానికి పూర్వమే పునాదులు పడ్డాయి. బ్రాహ్మణాధిక్య స్వభావం కలిగిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. తమిళనాడులో జస్టిస్‌ పార్టీ ఏర్పడినట్టే ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణేతర వర్గాలు సోషలిస్టు భావజాలంతో 1952లో ప్రజా సోషలిస్టు పార్టీ(పీఎస్‌పీ)ని ఏర్పర్చుకున్నాయి. కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ, సోషలిస్టు పార్టీలు కలిసి ప్రజా సోషలిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. ఆ తదుపరి కాలంలో అది 1964 నాటికి సంయుక్త (యునైటెడ్‌) సోషలిస్టు పార్టీ (ఎస్‌ఎస్‌పీ)గా రూపొందింది. లోహియా నాయకత్వంలో ఎస్‌ఎస్‌పీ చాలా మిలిటెంట్‌గా ప్రజలను సమీకరించడం మొదలుపెట్టింది. అందులో ములా యంసింగ్‌ క్రియాశీల కార్యకర్తగా ఉండేవారు. మొదటిసారిగా 1967లో ఆయన ఎస్‌ఎస్‌పీ తరఫున లోహియా నాయకత్వంలో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఆయన 1969లో చౌధరీ చరణ్‌సింగ్‌ నాయకత్వంలోని భారతీయ క్రాంతిదళ్‌ (బీకేడీ)లో చేరారు. దాన్ని భారతీయ లోక్‌దళ్‌ అని పిలిచారు. అప్పటి నుంచి చౌధరీ చరణ్‌సింగ్‌ను ములాయం తన రాజకీయ గురువుగా భావించారు.

సమాజ్‌వాదీ మూలాలు
లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ 1974లో ప్రారంభించిన ప్రజా స్వామ్య ఉద్యమంలో చౌధరీ చరణ్‌సింగ్‌తో పాటు ములాయంసింగ్‌ కూడా పాల్గొ న్నారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీలో వీరంతా నిర్బంధా నికి గురయ్యారు. ఆ తర్వాత ఏర్పడిన జనతా పార్టీలో వీరు భాగస్వాము లయ్యారు. 1979 జనతా చీలిక అనంతరం ములాయం లోక్‌దళ్‌లో చేరారు. ఆ తదుపరి 1989లో ఏర్పడిన జనతాదళ్‌లో చేరి, ఆ ఏడాదే మొదటి సారిగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో వీపీ సింగ్, చంద్రశేఖర్‌ మధ్య చీలిక వచ్చినప్పుడు ఆయన చంద్రశేఖర్‌ నాయకత్వంలోని సమాజ్‌ వాదీ జనతా పార్టీలో చేరారు. చివరకు 1992లో ములాయం నేటి సమాజ్‌ వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. 1993 ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీఎస్‌పీతో ములాయంకి తలెత్తిన వివాదాల వల్ల 1996 జూన్‌లో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత నుంచి బీఎస్‌పీ, ఎస్పీలు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో వైరి వర్గాలుగానే కొనసాగుతున్నాయి.

కులం నుంచి కుటుంబానికి దిగజారాక...
ములాయంసింగ్‌ రాజకీయ జీవితం సోషలిస్టు సిద్ధాంతాలతో ప్రారంభ మైనా సమాజ్‌వాదీ పార్టీ ఏర్పడేనాటికి ఆ సామాజిక దృక్పథం మారి పోయింది. సమాజ్‌వాదీ పార్టీ అంటే బీసీల పార్టీగా, ప్రధానంగా యాదవుల పార్టీగా మారింది. యాదవులతో పాటు మిగతా వెనుకబడిన కులాల (బీసీ ల)ను ఎన్నికల్లో తన వెనుక నిలబెట్టుకోవడానికి ములాయం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకు, బీíసీలకు మధ్యనున్న వైరుధ్యాలను మరింత తీవ్రతరం చేశారు. క్రైం రికార్డ్‌ బ్యూరో తాజా లెక్కల ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో యూపీలో దళితులపై దాడుల సంఖ్య రెట్టింపైంది. ఎస్సీలకు రిజర్వేషన్లలో ప్రమోషన్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లును పార్ల మెంటులో ప్రవేశపెడుతున్న సమయంలో ఎస్పీ ఆ బిల్లు ఆమోదం పొంద కుండా అడ్డుకుంది. జాతీయ స్వభావంతో ప్రారంభించిన ఆ పార్టీ కుల స్వభా వాన్ని సంతరించుకుని, కుటుంబపరమైనదిగా, చివరకు వ్యక్తిగతమైనదిగా దిగజారింది. ఇది ఎస్పీకి మాత్రమే పరిమితమైన పరిణామం కాదు. 1977 అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలన్నిటిదీ ఇదే ధోరణి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో ముందుకు వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చేసిన వెనుకబడిన కులా లను, ఎస్సీలలోని మాదిగలను తమ రాజకీయ స్నేహితులుగా భావించి సమీకరించింది. కమ్మ సామాజిక వర్గం నాయకత్వంలో కొనసాగినప్పటికీ, అటువంటి మచ్చ పడకుండా ఆ పార్టీ కొంతకాలం నడిచింది. కానీ ఆ తదు పరి కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కులం నుంచి చివరకు ఆ పార్టీ కుటుంబ సంస్థగా మారిపోయింది.  

ఈ పరిణామాలన్నింటికీ దేశంలో కొనసాగుతోన్న కుల వ్యవస్థే కారణం. ఈ దేశంలో సామాజిక హోదాకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు అందివచ్చిన ఆధి పత్య కులం.. రాజకీయాధికారం కోసం అప్పటికప్పుడు కొన్ని విధానాలను చేపట్టి ప్రభుత్వాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికి ప్రధానమైన పునాది ఆ కులంలో ఎదిగివచ్చిన ధనిక, మధ్యతరగతి వర్గాలే. తమ కులం ఆర్థికరంగంలో మరింత ఆధిపత్యం సంపాదించేందుకే అవి అధికారాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. కులం హోదాను మళ్లీ రాజకీయాధికారం కోసం ఉప యోగించుకోవడం.. ఇది ఒక చక్రంలా సంభవిస్తోంది. కాలక్రమేణా అదే కులం పదేపదే అధికారాన్ని అందిపుచ్చుకోవడం, తదనుగుణంగా ఆర్థికవన రులను చేజిక్కించుకోవడం జరుగుతోంది. ఇది ఒకరకంగా మిగిలిన సామా జిక వర్గాల మీద వారు ఆధిపత్యం వహించేందుకు ఉపయోగపడుతోంది. రాజకీయాల్లో కుల ప్రమేయం వల్ల తరతరాలుగా కొనసాగుతోన్న మనుధర్మ వ్యవస్థ మరింత పటిష్టమౌతోంది. రాజ్యాంగంలోని సమానత్వం, సోదరత్వం అనే పదాలకు అర్థం లేకుండా పోయింది. సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కులాలు ఆర్థికంగా ఎదిగి రాజకీయాధికారాన్ని చేపట్టి మళ్లీ తమ ఆధి పత్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనితో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన వర్గాలు, కులాలకు రాజకీయాధికారం అందని ద్రాక్షే అవుతోంది. సామా జిక, ఆర్థిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధ్యం కాదు అని అంబేడ్కర్‌ అన్న మాట రోజు రోజుకు మరింత స్పష్టంగా రుజువవుతోంది.

(వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్‌ : 97055 66213 )

మరిన్ని వార్తలు