మౌలికంగా చాసో

16 Jan, 2017 00:03 IST|Sakshi
మౌలికంగా చాసో

ప్రారంభం

వస్తువు, శిల్పం మధ్య దేనికెంత ప్రాముఖ్యం ఇవ్వాలి, సాహిత్యపు ప్రయోజనం పాఠకుడిలో ఎలా ఉండే వీలుంది– వీటిని కథా రచయితగా లోకం ముందుకు వచ్చే నాటికి పరిష్కరించుకున్న తీరు నిరుపమానం.

చాసో కథలు ‘‘చదివితే చాలదు... తిరిగి తిరిగి చదివి అధ్యయనం చెయ్యవలసినదే!’’. 1968లో వెలువడిన ‘చాసో కథలు’ మొదటి కూర్పుకు సుశర్మ (పురాణం సుబ్రహ్మణ్య శర్మ) రాసిన చలాకీ బిగువైన ముందుమాటలోని వాక్యమది. ‘చెయ్యవలసినదే’. ఎందుకంటే అని కూడా వివరించారు: ‘‘ప్రతి వాక్యం, ప్రయోగించిన ప్రతి పదము సాభిప్రాయంగా తూచి వాడబడతాయి’’.

పాఠకుడి నుండి అతి నిశితమైన విమర్శనాత్మక సంవాదాన్ని ఆశించి, అది ఎంత నిశితమైతే, అంతకు సాటిరాగల నిశితమైన అవగాహనను, అదే స్థాయిలో కళాత్మక– కళకు మాత్రమే సాధ్యమయ్యే– సంతృప్తిని అందించడంలో చాసో కథలకు సాటి రాగల రచనా సంవిధానం బహు అరుదనే చెప్పాలి. అందుకనే 40–45 దాటని చాసో చిన్ని కథలు తెలుగు వారికి, మానవాళికి కూడా దక్కిన ఎంతో విలువైన సంపద!

సామాజిక ప్రయోజనంతో–– అంటే సమాజంలో మానవ అస్తిత్వంలో పనిచేసే శక్తులు, ప్రేరేపణల గురించిన లోతైన, వాడిౖయెన అవగాహనతో, మరింత మంచి, దోపిడీ లేని, సమాజపు రాకడకు తోడ్పడే–– సాహిత్యం ప్రవర్తిల్లాలని, మార్క్సిజం ప్రభావంతో వ్యాపించిన అభ్యుదయ సాహిత్య దృక్పథంతో చాసో సాధించిన పరిణతి, ప్రయోజనం ఒక అద్భుతమనే చెప్పాలి. వస్తువు, శిల్పం మధ్య దేనికెంత ప్రాముఖ్యం ఇవ్వాలి, సాహిత్యపు ప్రయోజనం పాఠకుడిలో, సమాజంలో అత్యంత ప్రయోజనకరంగా ఎలా ఉండే వీలుంది– వీటి గురించి చాసో కథా రచయితగా లోకం ముందుకు వచ్చే నాటికి పరిష్కరించుకున్న తీరు కూడా నిరుపమానం. అందువల్లే చింపి పారేయగా మిగుల్చుకొని ప్రచురణకు ఇచ్చిన ఆయన కథలను చూస్తే రచయితగా క్రమంగా ఎదుగుతూ, లోపాలు సవరించుకుంటూ పరిణతి సాధించే(లేక సాధించలేని) గడబిడలేవీ కనిపించవు. కనిపించేది– విజయనగరంలోని తన స్థానికతలో నిండుగా నిలిచి ఉంటూనే, మనిషికి కళకు సంబంధించిన బహు ఆయామాల, చిట్టచివరి మూలాల అసలును ప్రోది చేసుకుంటూ, తనివి తీరనంత కళాత్మక ఆనందాన్ని మరల మరల అందించగల శిల్ప సంవిధానాన్ని సరికొత్త రీతుల్లో సాధించుకొని, ‘‘క్లుప్తత’’ అనే సూత్రపు రహస్యాన్ని చరమస్థాయికి నిగారింపు చేసిన అద్భుత విన్యాసం!

చాసో కథలను ఇది, అది అని సులభంగా సూత్రీకరించడానికి లేదు. సామాన్య పాఠకుడి సామాన్య ఆకాంక్షలు, ఆపేక్షలతో చదివినా ఆయన చాలా కథలు నచ్చుతాయి. కాని చాసో సవాలేమిటంటే, ఏ తావులోనైనా ఈ పైపై ‘చదువు’ల తీరును పాఠకుడు దాటాలి. ఆయన కథలలో సంవాదంలో పడుతున్నకొద్దీ ఆ మార్పు పాఠకుడిలో తెలుస్తుంది. చాసో అనన్యుడంటే ఇందువల్ల!

1979లో ప్రచురితమైన ‘పోనీ తిను’ కథలోని చివరి వాక్యాలను పరికిద్దాం: ‘‘గున్నమ్మ అక్కడ చచ్చిపోవడానికి రాలేదు! నెత్తిన కొరివి పెట్టే కొడుకని రాలేదు. ఆఖరిసారి కొడుకుని చూసుకోవడానికి వచ్చింది. బతుకల్లా చూసుకుంటూనే ఉంది. ఆఖరికి కొడుకుని చూడకుండా చచ్చిపోయింది.
ఆ కొడుక్కోసం దాని కళ్లు వెతుక్కుంటూ వెతుక్కుంటూ నిలబడిపోయాయి. ఆ కళ్లు కొడుక్కోసం చూస్తూనే ఉండిపోయాయి. చూస్తూనే ఉన్నాయి’’.

దోపిడీ వ్యవస్థ సూక్ష్మరూపాలను బీభత్సంగా ఆవిష్కరిస్తూనే పాఠకుడిలో ఈ వాక్యాలు తలెత్తింపజేసే వందలాది భావాలు ఎన్నో ‘పోనీ తిను’ అనే శీర్షిక ఉన్న 7 పేజీల కథ పరిశీలనగా చదివి అనుభవించవచ్చు! కేవలం సెంటిమెంట్‌గా చూసి విడిచిపెట్టలేని వాక్యాలు అవి.
చివరగా చాసో కథల గురించి చెప్పదగినదేమంటే: ‘‘పోనీ, తినగూడదా!’’

(విజయనగరంలో చాసో సాహితీ వేదిక ప్రారంభం,
చాసో స్ఫూర్తి అవార్డు ప్రదానం సందర్భంగా
సుమనస్పతి 9676180802 )

మరిన్ని వార్తలు