రాజ్యాంగ స్ఫూర్తికి కోర్టు రక్ష

18 Mar, 2016 00:39 IST|Sakshi
రాజ్యాంగ స్ఫూర్తికి కోర్టు రక్ష

సమకాలీనం
 
శాసన వ్యవస్థలపరంగా ఎవరు చర్య తీసుకున్నా, అది నిబంధనల ప్రకారం చట్టాలకు లోబడి, రాజ్యాంగబద్దంగా ఉండాలి. ఏపీ శాసనసభలో అందుకు భిన్నంగా జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించడమేగాక, సహజ న్యాయ సూత్రాలకు భంగం కలిగిస్తూ ఏక పక్షంగా సభ్యురాల్ని సస్పెండ్ చేశారని కోర్టు గుర్తించింది. అవతలి వాళ్లకు ఏమీ తెలి యదు, మాకే అన్నీ తెలుసు, మేం ఏం చెబితే అదే రూలు, చట్టం, రాజ్యాంగం’ అన్న మితి మీరినతనమే ఇందుకు కారణమని అధికార పార్టీలోని విజ్ఞులు తలలు పట్టుకుంటున్నారు.
 
 
స్పీకర్ మా మనిషే! పాలకపక్షంగా చట్టసభను మా ఇష్టానుసారం నడుపు కుంటాం. రూల్స్ గీల్స్ జాన్తా నహీ! రాజ్యాంగమూ....! దానికో ఆత్మనా! అదెక్కడ?’ అన్న అధికార పక్షాల విపరీత ధోరణి నడవదని గురువారం రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్పష్టం చేశాయి. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నడుస్తున్న, దాన్ని నడిపిస్తున్న తీరుకు ఈ ఆదేశాలు చెంప పెట్టులాంటివి. జరిగిన పరిణామాలపై ఉన్నత న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యల్ని... ఈ ఒక్క కేసు దృక్కోణంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, కేం ద్రంలో ఇప్పుడు చట్టసభలు నడుస్తున్న తీరుతెన్నులకు, వ్యవహారాలకు అన్వ యించి చూస్తే ఈ వ్యాఖ్యలు సందర్భోచితమైనవే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజాను ఏకపక్షంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. సస్పెన్షన్ విధించే ముందు పాటించాల్సిన నిబంధనల్ని ఉల్లంఘించడమే కాక, సహజ న్యాయ సూత్రాలకూ తిలోదకాలిచ్చినట్టు న్యాయస్థానం భావించింది.

ఈ మధ్యంతర ఉత్తర్వులతో రోజా శాసనసభకు హాజరు కావడానికి ఉన్న ప్రతిబంధకం తొలగిపోయింది. అయితే, ఇంకా చాలా చాలా సందేహాలు తొలగాల్సి ఉంది. సభా నిర్వహణకు, న్యాయ సమీక్షకు సంబంధించి ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల నాన్చివేత వైఖరిలోని ఔచిత్యాన్ని తేల్చాల్సి ఉంది. అధికారపక్షం వ్యవహార శైలి మారాల్సి ఉంది. తాజా పరిణా మంతోనైనా ప్రభుత్వ పెద్దలు విజ్ఞత ప్రదర్శించి, తీరు మార్చుకుంటారేమో చూడాలి. శాసన సభాపతిగా ఉన్న వ్యక్తి పాలకపక్షం కనుసన్నల్లో సభా కార్యకలాపాల్ని నడపడం గాక, నిష్పక్షపాతంగా వ్యవహరించగలరేమో వేచి చూడాలి. ఏపీ శాసనసభలో బాహాటంగానే వివక్ష, ఏకపక్ష దుందుడుకుతనం యథేచ్ఛగా సాగుతున్న క్రమంలో తాజా తీర్పుకు అత్యంత ప్రాధాన్యము న్నదని పరిశీలకుల భావన. నేటి రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులే కాక, ఇదే విషయమై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడెంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే స్ఫూర్తి కొనసాగితే చట్టసభల నిర్వహణలో బాధ్యత, జవాబుదారీతనం పెరగటమే కాదు, ప్రజల్లో న్యాయస్థానాలపై నమ్మకం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం బలపడతాయి.
 
ఇంత జరిగితే గాని.....
రోజా న్యాయ పోరాటం సాగించారు కనుక ఈ పాటి న్యాయమైనా జరిగింది. రోజా సుప్రీం తలుపులు తడితే, వారిచ్చిన ఆదేశాల మేరకు... ముందు స్పం దించని హైకోర్టు ఇప్పుడు విచారణ జరపడం వల్ల ఈ ఉత్తర్వులొచ్చాయి. ఆమెకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఇంకా జరగాలన్నారు. ఈ ఏడాది కాలం పాటు జీతభత్యాలు కూడా ఉండవన్నారు. అసెంబ్లీ ప్రాంగణానికి రానిచ్చేది లేదన్నారు. అందులోనే ఉన్న పార్టీ శాసనసభా కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. సభలో ముఖ్యమంత్రిపై అనుచితవ్యాఖ్యలు చేశారన్నది ఆమెపై అభియోగం. ఏ పరిస్థితుల్లో తానా మాటలన్నానో వివరణ ఇచ్చుకునే అవకాశమైనా ఆమెకు ఇవ్వకుండా చర్య తీసుకున్నారు. పైగా, ఇది క్రమశిక్షణా చర్య కాదు, సస్పెన్షన్ మాత్రమే కనుక వివరణ తీసుకోవాల్సిన అవసరం రాలేదని న్యాయస్థానం ముందు పిడివాదం చేశారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోంది, తదనంతరమే తగిన చర్య అన్నది  కవిహృదయం! శాసనసభ నిబంధన 340 (2) కింద తీర్మానం ప్రతిపాదించి ఏడాది పాటు సస్పెండ్ చేశారు.

నిజానికా నిబంధన కింద, గరిష్టంగా ఆ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసే అధికారమే ఉంటుంది. ఇక్కడే నియమో ల్లంఘన జరిగిందని రోజా కోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు అతీతంగా సభకు, స్పీకర్‌కు విస్తృతాధికారం ఉంటుందనే మొండి వాదనను, ఈ పరిణా మాలు చోటుచేసుకున్న 2015 డిసెంబరు 18న పాలకపక్షం సభలో వినిపించే యత్నం చేసింది. అది సరి కాదు, గతంలో ఇలా ఒక సభ్యుడ్ని సెషన్ పరిధికి దాటి సస్పెండ్ చేయాల్సి వచ్చినపుడు, అందుకు అవరోధంగా ఉన్న ఇదే నిబంధన 340 (2)ను సస్పెండ్ చేసి, ఆ పైనే స్పీకర్ విస్తృతాధికారాల్ని ప్రయోగించారని చేసిన సూచనని కూడా వారు పట్టించుకోలేదు. అవతలి వాళ్లకు ఏమీ తెలియదు, మాకే అన్నీ తెలుసు, మేం ఏం చెబితే అదే... రూలు, చట్టం, రాజ్యాంగం’ అన్నట్టు వ్యవహరించే మితిమీరినతనమే ఈ పరిస్థితికి కారణమని పార్టీలోని విజ్ఞులూ తలపట్టుకుంటున్నారు. హైకోర్టు ముందు భిన్నమైన వాదన వినిపించే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మంత్రి తెలియక నిబంధనను తప్పుగా ప్రస్తావించార’న్న అదనపు అడ్వొకేట్ జనరల్ వాద నను న్యాయమూర్తి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. సదరు మంత్రి లోగడ స్పీకర్‌గా పని చేసినందున ఏ నిబంధన ఎప్పుడు ఉపయోగించాలో తెలియదని చెప్పడానికి వీల్లేదనీ స్పష్టం చేశారు.
 
పిల్లలాటా! రాజ్యాంగ స్ఫూర్తి అక్కర్లేదా...?
అడ్డొస్తుందంటే చాలు... సదరు నిబంధనను సస్పెండ్ చేసెయ్ అన్న ధోరణి ప్రజాస్వామ్య పద్ధతి కాదు సరికదా, విచ్చలవిడితనానికి ప్రతీక! రాజ్యాంగ స్ఫూర్తినేగాక, రాజ్యాంగం నిర్దేశించే విధివిధానాల్ని యధాతథంగా ప్రతిబింబి స్తున్న నిబంధనను కూడా ఇదే ముఖ్యులు, ఇదే అసెంబ్లీ, ఇదే సెషన్‌లో ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చి నపుడు, అది అర్హమైనదైతే... నోటీసు అందిన 14 రోజుల తర్వాత మాత్రమే చర్చకు తేదీని ఖరారు చేయాలని శాసనసభ నిబంధన 71(1) చెబుతోంది. పాలకపక్షం రాజకీయ స్వప్రయోజనాల కోసం, విపక్ష ప్రయోజనాల్ని దెబ్బతీ యడానికి ‘మా ఇష్టం.. సదరు నిబంధనను తొలగించేస్తాం!’అంటే ఎలా?  రాజ్యాంగంలోని అధికరణం-179, అందులో విస్పష్టంగా పేర్కొన్న స్ఫూర్తి ఏం కావాలి? మంద బలం ఉందని నిబంధనల్ని అడ్డగోలుగా సస్పెండ్ చేస్తూ, తమకనువైనదే నిబంధన అన్నట్టు ఏపీ శాసనసభ అధికార పక్షం వ్యవ హరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘పద్నాలుగు రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలన్నారే తప్ప, విధిగా పద్నాలుగు రోజుల తర్వాతే చర్చ చేపట్టా లనలేదు, కనుక చర్చ ఎప్పుడైనా చేపట్టొచ్చు’ అన్న మంత్రి విచిత్ర అన్వయం అసెంబ్లీ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంది. విపక్షం తన సభ్యులకు అందేలా విప్ జారీ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి కల్పించే ఎత్తుగడతో పాలకపక్షం అడ్డగోలుగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనించారు.

స్పీకర్ విస్తృతాధికారాలు వినియో గించడానికి ప్రతిబంధకమని తెలిసీ ఒక నిబంధనను సస్పెండ్ చేయక పోవడమైనా, ఓ నిబంధనను సస్పెండ్ చేయడమైనా రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధమని తెలిసీ అందుకు పూనుకోవడం... తామేమైనా చేయొచ్చన్న అహం భావ ప్రదర్శనే తప్ప మరొకటి కాదు. సభా దినాల్ని, కార్యకలాపాల్ని నిర్ణ యించడం నుంచి సభ ముగించే వరకు ఇంత యథేచ్ఛగా నిబంధనలకి, సంప్రదాయాలకు, ప్రజాస్వామ్య స్పూర్తికి నీళ్లొదలడం గతంలో ఎప్పుడూ లేదు. ఇదే సెషన్‌లో, వాతావరణం అనుకూలంగా లేదనగానే గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపే చర్చను కూడా అర్థంతరంగా ఆపి ‘క్లోజర్ మోషన్’ను (నిబంధన-329) తెర మీదకు తేవడం ఒక ఉదాహరణ మాత్రమే. విపక్షం లేవనెత్తిన అనేకానేక అంశాలకు సమాధానమిచ్చే అవకా శాన్ని వదులుకొని, ఆ చర్చకు ముఖ్యమంత్రి సమాధానం కూడా ఇవ్వని అరుదైన పరిస్థితి! అటువంటిదే అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగింపు. ఏ ఒక్క సభ్యుడు అభ్యంతర పెట్టినా, మూజువాణి ఓటింగ్ కన్నా మెరుగైన ఫలితాలిచ్చే తలలు లెక్కించే ఓటింగ్‌కు వెళ్లాలన్న నిబంధనను గాలికొదిలే శారు. తమకు అనుకూలంగా ఉండటం కోసం ‘మమ’ అనిపించారు.

ఎవరి అధికారాలు-పరిమితులు వారికున్నాయి
ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని శాసన, న్యాయ వ్యవస్థల మధ్య పోరుగా అన్వయించడానికి కొందరు యత్నిస్తారు. స్పీకర్, చట్టసభ నిర్ణ యాల్లో న్యాయస్థానాల అనుచిత జోక్యమని అన్వయించే ఆస్కారమూ ఉంది. కానీ, ఎవరి అధికారాల పరిధిని, పరిమితుల హద్దును వారికి నిర్దేశించే స్పష్టత రాజ్యాంగంలో ఉంది. చట్టసభల సభ్యులు నిబంధనల్ని ఉల్లంఘిం చినపుడు, అనుచిత ప్రవర్తనతో తప్పు చేసినపుడు చర్యలు తీసుకునే అధికారం శాసనవ్యవస్థకే ఉంది. అందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవా ల్సిన అవసరమే లేదు.

ఈ విషయమై లోగడ వివాదాలొచ్చినపుడు కొన్ని అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని కోర్టులు స్పష్టం చేశాయి. అలాగే సముచితమైన కొన్ని సందర్భాల్లో విచారించి, తీర్పులిచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ వంటి వారు న్యాయ వ్యవస్థ అనుచిత జోక్యాలను సమర్థంగా అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, శాసన వ్యవస్థల పరంగా ఎవరు చర్య తీసుకున్నా, సదరు చర్య నిబంధనల ప్రకారం చట్టాలకు లోబడి, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నదే ముఖ్యం. చట్ట సభల కార్యాకలాపాల్ని తాము నిర్దేశించలేమని స్పష్టం చేసే న్యాయస్థానాలు, సదరు సభల్లో  నిర్ణయాలు జరిగాక, అవి నిబంధనలకు, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించిన సందర్భాలు కోకొల్లలు. అన్నీ సవ్యంగా ఉన్నపుడు... తమ సభ్యులు తప్పు చేస్తే నేరుగా తామే శిక్షించే అధికారం చట్టసభలకుందని రాజారాంపాల్ వర్సెస్ స్పీకర్, లోక్ సభ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ప్రశ్నలు వేయడానికి డబ్బులు పుచ్చుకున్న అభియోగాలు నిర్ధారణ అయిన ఈ కేసులో ఒక రాజ్యసభ, పది మంది లోక్‌సభ సభ్యుల్ని అనర్హులుగా ప్రకటిస్తూ సభ నుంచి బహిష్క రించినపుడు, సదరు నిర్ణయాన్ని సుప్రీం ఆమోదించింది. సభ్యులు తమ వాదన వినిపించడానికి తగిన అవకాశం కల్పించడమే కాకుండా సహజ న్యాయసూత్రాల్ని పార్లమెంటు రెండు సభలు, ఎథిక్స్ కమిటీ, పార్లమెంట్ ప్రత్యేక కమిటీలు సవ్యంగా పాటించాయని న్యాయస్థానం కితాబిచ్చింది. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అలా జరుగలేదు. అందుకు భిన్నంగా జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా సహజన్యాయ సూత్రాలకు కూడా భంగం కలిగిస్తూ ఏకపక్షంగా సభ్యురాల్ని సస్పెండ్ చేశారని న్యాయస్థానం గుర్తించింది. సభ నిర్ణయం జరిగిపోయింది, కానీ, అది నిబంధనల ప్రకారం జరుగలేదు. సభ అయినా, స్పీకర్ అయినా నిబంధనలకు అతీతులు కారనే విషయాన్ని న్యాయస్థానం ఈ కేసు మధ్యంతర ఉత్తర్వులోనే స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పప్పుడైనా, అప్పీలుకు వెళితే ధర్మాసనమైనా, విస్తృత ధర్మాసనమైనా... సమీక్షించి న్యాయమే చేస్తుంది. అది న్యాయస్థానాల విధి. సత్యమేవ జయతే!

(వ్యాసకర్త: దిలీప్ రెడ్డి)                  
 

మరిన్ని వార్తలు