అవగాహన లేకనే ఈ అనర్థం!

16 Dec, 2016 01:07 IST|Sakshi
అవగాహన లేకనే ఈ అనర్థం!

అభిప్రాయం
ఇప్పుడు పొంచివున్న ప్రమాదం ఏమిటి? కొత్త 2000 రూపాయల నోట్లు ఎక్కువ రావ డంతో చిల్లర సమస్య ఏర్పడింది. 50, 100, 200 కొనుగోలు చేసినా కూడా ఈ 2000 నోటుకు చిల్లర ఇవ్వటం చిన్నా పెద్దా వ్యాపారులకు గగనమే. కాబట్టి, సహజంగానే వ్యాపార లావాదేవీలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, వినియోగదారులు కూడా 20, 50, 100 నోట్లను పొదుపుగా వాడుకోవటమే కాక, అలాంటి తక్కువ విలువ నోట్లను ముందు జాగ్రత కోసమని నిల్వ చేస్తారు.

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 8న తీసుకున్న నిర్ణయంతో ఏర్పడిన విపరీత పరిస్థితుల నుంచి ఇంతకాలమైనా దేశం కోలుకోలేకపోతున్నది. నిజానికి కొన్ని రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరుగ నున్న తరుణంలో ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన రెండు కీలక అంశాలను పక్కదారి పట్టించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారనిపిస్తున్నదనీ పరిశీల కులు అభిప్రాయపడుతున్నారు.

ఆ రెండు అంశాలలో మొదటిది–విదేశీ బ్యాంకులలో భారత నల్ల కుబేరులు దాచుకున్న ధనాన్ని వెనక్కి రప్పించి ప్రతి జన్‌ధన్‌ అకౌంట్‌లో  15 లక్షల రూపాయల వంతున జమ చేస్తామని మోదీ ఎన్నికల సభలలో చెప్పారు. ఆ సంగతి ఏమైనట్టు? మరొకటి–దేశంలోని బ్యాంకుల నుంచి కార్పొరేట్లు అప్పుగా తీసుకొన్న రూ. 28 లక్షల కోట్లు తిరిగి చెల్లించలేదన్న వాస్తవాన్ని రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ బయట పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వసూలు చేయటం లేదని ప్రజలు ప్రశ్నిస్తారన్న ఆందోళన కూడా ఈ తీవ్ర నిర్ణయానికి కారణం కావచ్చు (ఉదాహరణకు, ముకేశ్‌ అంబానీ రూ.1,87,070 కోట్లు, అనిల్‌ అంబానీ రూ. 1,24,956 కోట్లు – ఇలాగే తదితరులు). దేశం నుంచి పారిపోయిన విజయ్‌ మాల్యా వంటి వారి అప్పులు, వడ్డీలు; గత ఆర్థిక సంవత్సరంలో 1,14,000 కోట్ల రూపాయల మేర మాఫీ చేయటం వంటి అంశం గురించి ప్రజలు నిల దీస్తారన్న ఆందోళన కూడా మోదీని ఈ చర్యకు ప్రోత్సహించి ఉండవచ్చు.  

పెద్ద నోట్ల రద్దు ఒక రకంగా తుగ్లక్‌ కాలం నాటి చర్యను గుర్తుకు తెస్తు న్నది. తుగ్లక్‌ చర్యతో నాణేల సరఫరా పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తే, మోదీ నోట్ల రద్దు ప్రజలను రోడ్ల పైకి నెట్టింది. అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర బారులు తీరవలసి వచ్చింది. ఈ దేశ శ్రామిక వర్గంలో 92 శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఇలాంటి వారు ఏటీఎంల ఎదుట బారులు తీరితే, ఆ మేరకు ఉద్యోగితను పోగొట్టుకోవడమే. గృహిణులూ, వృద్ధులూ కూడా పనులు మానుకొని నగదు కోసం పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి నిలబడలేక తీవ్ర ఒత్తిడికి గురికావలసి వస్తున్నది. ఇప్పటికే కొద్దిమంది చనిపోయారు. తుగ్లక్‌ చర్యతో ద్రవ్యోల్బణ సమస్య ఎదురైతే, ఈనాడు పెద్దనోట్ల రద్దు వల్ల ప్రతిద్రవ్యోల్బణ సహిత ఆర్థికమాంద్య పరిస్థితులు ఏర్పడవచ్చనిపిస్తున్నది.

అనాలోచిత నిర్ణయం కాదా?
అసలు ‘నల్లధనం నిర్మూలన’ పెద్ద నోట్ల రద్దుతో సాధ్యమయ్యేదేనా? ఈ నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర పరిశోధన జరిగిందా? ఒకవేళ జరిగితే, రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సమయమెంత, దాని పర్యవసానాలేమిటి? జాతీయ ఆదాయం, ఉద్యోగిత, వినియోగ వ్యయం, ఉత్పత్తి వ్యయం తదితర అంశాలలో ఎలాంటి మార్పులు వస్తాయి? అవి సర్దుబాటు కావడానికి ఎంతకాలం పట్టే అవకాశ ముంటుంది? వంటి అంశాల మీద కూలంకషంగా అంచనాలు వేశారా? నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయానికి కనీసం ఈ మాత్రపు పరిశోధన అవసరం. ఎందుకంటే, దేశంలో ఉన్న కరెన్సీ మొత్తం 16.4 లక్షల కోట్ల రూపాయలు. అందులో 14.2 లక్షల కోట్ల రూపాయలు, అంటే 86.3 శాతం 500, 1000 రూపాయల నోట్ల రూపంలోనిదే. ఇంత పెద్ద మొత్తంలో అత్యధికంగా (ఎనిమిదింట ఏడు వంతులున్న కరెన్సీ) పెద్ద నోట్లను రద్దు చేస్తే ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభావం పడక తప్పదు.

స్థూల ఆర్థికశాస్త్రంలో ఏ కొద్ది పరిజ్ఞానం ఉన్న వారికైనా ద్రవ్యరాశి సిద్ధాంతాలు తెలిసే ఉంటాయి. సంప్రదాయ ద్రవ్య సిద్ధాంతం ఫిషర్‌ సమీ కరణం (MV=PT) ప్రకారం చూసినా ఒక అంశం అవగతమవుతుంది. ద్రవ్య సప్లయ్‌ తగ్గినప్పుడు ద్రవ్య ప్రసారవేగం తగ్గితే, దానికనుగణంగా ద్రవ్యంతో చేసే వ్యాపార, వ్యవహారాలు తగ్గినట్లయితే ఆర్థికవ్యవస్థలో ధరలు తగ్గు తాయి. అప్పుడు సాధారణ ధరల స్థాయి తగ్గడం ఖాయం. బ్యాంకుల ద్వారా వాడకం కూడా ద్రవ్యంతో సమానమే కాబట్టి, కొంతమేర ఈ వాడకం పట్టణ, మెట్రో నగర ప్రాంతాలలో ఉండబట్టి తీవ్ర పరిణామాలు సంభవించని మాట నిజమే.    

అసంఘటిత రంగ శ్రామికులు ఏటీఎంల దగ్గర వేచి ఉంటూ పనులు కోల్పోతే, వారి కొనుగోలు శక్తి తగ్గి వినియోగ వ్యయ డిమాండ్‌ తగ్గుతుంది. అలాగే అసంఘటిత రంగ చిన్న తరహా పెట్టుబడిదారులు కార్మికులకు జీతాలు చెల్లించలేకపోవడంతోపాటు, ఉత్పత్తి రంగంలో పెట్టవలసినంత పెట్టుబడి పెట్టకపోవడం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలు ఆగిపోతే, శ్రామికులకు ఉపాధి దొరకదు. ఈ విధంగా ఉత్పత్తి ప్రక్రియ పడిపోవడం ఒక పక్క జరుగు తుంటే, మరోపక్క పడిపోతున్న వ్యవసాయోత్పత్తుల ధరలు, పారిశ్రామిక వస్తువుల ధరలు ఆర్థిక మాంద్యాన్ని (ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితిని) బలవం తంగా తెరపైకి తెస్తాయి.   

నల్లధనం రాబట్టే మార్గాలు వేరు
అసలు అమలులో ఉన్న కరెన్సీ (16.4 లక్షల కోట్ల రూపాయల ద్రవ్య సప్లయ్‌)లో 6% కంటే ఎక్కువ నల్లధనం ద్రవ్యరూపంలో ఉండదనీ, అంటే దాదాపు 98 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదనీ అంచనాలున్నాయి. అసలు నల్లకుబేరులు నల్లధనాన్ని ద్రవ్యరూపంలో తక్కు వగా ఉంచుతారు. మన దేశంలోని నల్లధనం మన స్థూల దేశీయ ఉత్పత్తి (135.67 లక్షల కోట్ల రూపాయలు)లో, దాదాపు 50% పైనే, అంటే (67.85 లక్షల కోట్ల రూపాయలుపైగా) ఉండవచ్చునని అంచనాలున్నాయి. అంటే నల్లధనం మొత్తం ద్రవ్య సప్లయ్‌ కంటే 4 రెట్లు ఉందన్నమాట. కాబట్టి నల్లధనాన్ని రాబట్టాల్సిన మార్గాలు వేరే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇంకొక అంశాన్ని కూడా గమనిద్దాం! అధికారపక్షానికే చెందిన ఎంపీ సుబ్ర హ్మణ్యస్వామి నోట్ల రద్దు విషయంలో మోదీని సమర్థించినట్టు కనిపిస్తు న్నారు. కానీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా నోట్ల రద్దుకు ప్రధాన మంత్రిని సిద్ధం చేయటం వల్లనే ఈనాడు ప్రజలు క్యూల్లో నిలబడుతూ బాధలు పడవలసివస్తున్నదనీ, విత్తశాఖకు ఆర్థికశాస్త్ర నిపుణులను నియ మించకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయనీ పదేపదే చురకలంటి స్తున్నారు.    

500, 1000 రూపాయల నోట్లు మార్చుకున్నవారికి గానీ, డిపాజిట్‌ చేసిన వారికి గానీ మొత్తం కొత్త నోట్లు  తిరిగి ఇవ్వకపోవటం వల్ల, డిపాజిట్ల పరిమాణం పెరిగి బ్యాంకులు ఎక్కువ లిక్విడిటి (ద్రవ్యత్వం) కలిగి ఉంటాయి. వాటి దగ్గరున్న డిపాజిట్లను వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ రుణాలుగా ఇవ్వవలసిన పరిస్థితి అనివార్యమవుతుంది. అయితే రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. కానీ తీసుకునేవాళ్లు ఉండాలి. ఆర్థికవేత్త కీన్స్‌ సిద్ధాంతం ప్రకారం ఆర్థికవ్యవస్థలో ఏర్పడ్డ అనిశ్చితి వల్ల లాభాల రేటు గణనీయంగా పడిపోతే, చిన్నా పెద్ద పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు సరిగా నడపలేరు. కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రారు. ఆ మేరకు కార్మి కులకూ/శ్రామికులకూ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. ఆదాయాలు పడి పోతాయి. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇప్పటికే ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి, ఆదాయాలు 30–40% తగ్గినట్టు అంచనా. అయితే ఇంతకుమించి పడి పోకుండా ఉండడానికి కారణం–ఆచరణలోని డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు ఇతర నగదు/ నగదు రహిత లావాదేవీలే.  

ఒకటి నిజం. నల్లధనాన్ని వెలికితీసే కొన్ని ముఖ్య మార్గాలు లేకపోలేదు. ముఖ్యంగా ఉద్యోగుల సంఖ్య పెంచి, కట్టుదిట్టమైన చట్టాలతో ఆదాయపన్ను శాఖను ప్రక్షాళన చేస్తే ఇది సాధ్యపడే అవకాశం ఉంది. అలాకాకుండా పెద్ద నోట్ల రద్దే ప్రధానం అనుకుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టే ఉంటుంది. అయితే ఈ కష్టాలు తాత్కాలికమే అంటున్నారు మోదీ. 50 రోజులలో అన్నీ సర్దుకుంటాయని ధీమాగా చెప్పారు. కానీ సగానికి పైగా రోజులు గడిచినా, కొత్త 500 నోట్లు ప్రజలకు అవసరమైన స్థాయిలో రానేలేదు. కొత్త 2000 నోట్లు అందుబాటులోకి వచ్చినా చిల్లర లేక, దొరకక ప్రజలు నానా ఇబ్బం దులూ పడుతున్నారు.

ఈ కష్టాలు ఇలా ఉండగా పాలకులు మాత్రం ప్రజలంతా నగదురహిత  చెల్లింపులు చేయాలని సుద్దులు చెçప్పడం నీరో చక్రవర్తి ప్రవర్తనను గుర్తుకు తెస్తున్నది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్‌లో మన రూపాయి కంటే తక్కువ విలువ ఉన్న (యెన్‌=60 నయా పైసలు) కరెన్సీ నాణేలతో ద్రవ్య చలామణి జరుగుతున్నది. కానీ మన పాలకులు మాత్రం లేడికి లేచిందే పరుగన్నట్లుగా వ్యవహరించడం బాధాకరం.  

సమస్యంతా రెండువేల నోటుతోనే!
ఇంతకీ ఇప్పుడు పొంచివున్న ప్రమాదం ఏమిటి? కొత్త 2000 రూపా యల నోట్లు ఎక్కువ రావడంతో చిల్లర సమస్య ఏర్పడింది. సమస్య ఈ నోటుతోనే అన్నది అందరికీ అనుభవమైంది. 50, 100, 200 కొనుగోలు చేసినా కూడా ఈ 2000 నోటుకు చిల్లర ఇవ్వటం చిన్నా పెద్దా వ్యాపారులకు గగనమే. కాబట్టి, సహజంగానే వ్యాపార లావాదేవీలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, వినియోగదారులు కూడా 20, 50, 100 నోట్లను పొదుపుగా వాడుకోవటమే కాక, అలాంటి తక్కువ విలువ నోట్లను ముందు జాగ్రత కోసమని నిల్వ చేస్తారు. ఈ ధోరణితో కూడా చిల్లర సమస్య విజృంభించే అవకాశం ఉంది. మొత్తం ప్రజలు డిపాజిట్‌ చేసిన పెద్దనోట్లకు సమంగా 500 నోట్లను రిజర్వు బ్యాంక్‌ సప్లయ్‌ చేయాలంటే ఆరేడు నెలలు పడుతుందని పరిశీలకుల అంచనా. ఈ లోపున  నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఎంత వరకు అలవాటు పడతారు? కరెన్సీ, చిల్లర సమస్యల తీవ్రత కూడా ఆ అంశం మీదే ఆధారపడి ఉంది.


(వ్యాసకర్త :  డా‘‘ ఆకిన వెంకటేశ్వర్లు  ఆర్థిక–సామాజికాధ్యయనాల కేంద్ర సలహాదారు
మొబైల్‌ : 99482 07181 )

మరిన్ని వార్తలు