దమ్ము–సొమ్ము

29 Dec, 2016 06:53 IST|Sakshi
దమ్ము–సొమ్ము

జీవన కాలమ్‌
‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి.

ఎవరో నాకు వాట్సప్‌లో ఈ సమీక్షను పంపారు. ‘దమ్మున్నవాడికి పదవి లేదు. పదవి ఉన్నవాడికి దమ్ము లేదు. పదవి ఉండి దమ్మున్నవాడికి సపోర్ట్‌ లేదు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు గనుక మోదీని సపోర్ట్‌ చెయ్యకపోతే, ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదుగదా, మన తర్వాతి తరం కూడా కాదు’.

నవంబర్‌ 8 తర్వాత చాలామంది చాలాకాలం పాటు ఈమాటే అనుకున్నారు. క్రమంగా ఈ మాట బలహీనపడి–ఇలా వాట్సప్‌లో వాపోవాల్సిన అగత్యం ఏర్పడింది. కారణం–ఈ దేశంలో కనీసం 60 శాతం మందికి నల్లడబ్బు, పరాయి దేశపు దొంగనోట్లు వంటివి తెలీ దు–తెలియవలసిన దశలో వారు జీవించడం లేదు కనుక. తెల్లవారి లేస్తే–కందిపప్పు, బియ్యం, నూనె, కూరలు, అనారోగ్యానికి మందులు–ఇలాంటి దైనందిన అవసరాలు తీర్చుకోవడమే వారికి తెలుసు కనుక. ఇప్పుడిప్పుడు ఎవరో తమని ఎక్కడినుంచో దోచుకుంటున్నారనీ–ఇలా నోట్లని అదుపులో పెట్టడంవల్ల తమకి మేలు జరుగుతుందనీ వారు విన్నారు. నమ్మారు. లంబసిం గిలో ఎర్రప్పడికి, మర్రివలసలో చినపడాలకీ ఇంతకంటే ఏమీ తెలీదు.

వెనకటికి.. గిరీశం బండివాడికి రాజకీయాలమీద రెండు గంటలు లెక్చరిస్తే–అంతా విని ‘అయితే బాబూ– మావూరి హెడ్‌ కానిస్టేబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు’ అని అడిగాడట. ఎర్రప్పుడు, చినపడాల ఆ కోవకి చెంది నవారే. నవంబర్‌ 8 తర్వాత వీళ్లకి ఎవరో చెప్పి ఉంటారు. ‘ఒరేయ్, మోదీగారు చేసిన పనివల్ల మీకు లాభం కలుగుతుందిరా’ అని. ‘పోనీ బాబూ–అంతే శాన’ అనుకుని బ్యాంకుల ముందు వారు బారులు తీరారు. వారాలు గడచిపోయాక ‘ఎప్పుడొత్తాది బాబూ ఈ నాభం? ఇప్పుడెక్కడిదాకా వచ్చినాది?’ అని అడిగారు. క్రమంగా పేదవాడి విశ్వాసానికి నెరియలు పడే స్థితి వచ్చింది. ఇది ఒక పార్శ్వం.

ఆలోచన ప్రకారమే రిజర్వ్‌బ్యాంక్‌ కొత్త నోట్లను విడుదల చేస్తుండగా–ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి–రాత్రికి రాత్రే 30 లక్షల కొత్త నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచే సరాసరి తన గల్లాపెట్టెకి రవాణా చేయగా, అతని కొడుకు 5 కిలోల బంగారాన్ని, మరికొన్ని లక్ష ల కొత్త నోట్లని దోచుకోగా, వెంకటేశ్వర స్వామి సేవకు కంకణం కట్టుకున్న టీటీడీ బోర్డు సభ్యులు–దైవ భక్తుల్ని తలదన్నినట్టు పెద్ద నామా లు, జరీ ఉత్తరీయం ధరించి–ప్రజ లకు ఉపయోగపడాల్సిన కోట్ల సొమ్ముని (24 కోట్ల కొత్త నోట్లు, 50 కిలోల బంగారం) దోచుకుంటుం డగా, ఎక్సైజ్‌ కమీషనర్లు, హవాలా వ్యాపారులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసర్లు గడ్డి కరుస్తుండగా–మాయమైన కోట్ల సొమ్ము క్యూలలో నిలబడిన పెద గదిలి కూలీకి ఎలా అందుతుంది? ఇంతకాలం నేలబారు మనిషికి చేరాల్సిన ప్రయోజనం–ఎన్నిరకాల, ఎంత పెద్ద పదవుల్లో ఉన్న గుంటనక్కల పాలవుతుందో క్రమంగా తెలియ వస్తోంది. అయితే అవినీతి, అక్రమ చర్యలు కారణంగా– ఈ దేశపు వాయుసేన శాఖ అధిపతి త్యాగీ, టీటీడీ బోర్డు సభ్యులు, ఒక రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, బ్యాంకు సీనియర్‌ ఆఫీసర్లు బారులు తీర్చి జైలుకి వెళ్తున్నారు. ఇది 70 ఏళ్ల భారతీయ చరిత్రలో–గుండెలు తీసిన దొంగల్ని గుండెబలం గల ఒక వ్యవస్థ వీధిన పెట్టడం అనూహ్యమైన పరిణామం. అయితే ఏ విధంగా ఇది మామూలు మనిషికి ఉపయోగిస్తుంది?

ఏనాడూ రోడ్డుమీది మనిషిని పట్టించుకోకుండా 22 రకాల కుంభకోణాలలో శాస్త్రయుక్తంగా దేశాన్ని దోచుకున్న ఒకప్పటి రాజకీయ పార్టీ, మిగతా పార్టీలు హఠాత్తుగా నేలబారు మనిషి కష్టాలను నెత్తికెత్తుకుని 22 రోజులపాటు పార్లమెంటు సభల్ని మంటగలిపారు. ఓ చీఫ్‌ సెక్రటరీ, కొడుకూ సాక్ష్యాలతో ççపట్టుబడగా–ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి–మమతా బెనర్జీ ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ–కనీ వినీ ఎరుగని రీతిలో–ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యని విజయవంతంగా సాధించలేక పోయిందని తెలిసి కూడా–అతి శక్తిమంతమైన, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దోపిడీదారులను తట్టుకుని–రొంకిలి గుండు ముత్తడు, బూసాయవలస చెల్లమ్మలకు ఈ మేలు చేరడానికి 46 రోజులు సరిపోతాయా?

ఏమైనా 46 రోజుల తర్వాత వాట్సప్‌లో ఇలాంటి గొంతు విని పించడం విశేషం. కానీ రోజులు గడిచేకొద్దీ వేళ మించిపోతోంది. మన దేశంలో 2016లోనూ, 1889 నాటి కన్యాశుల్కం బండీవాళ్లు చాలామంది ఉన్నారు. వారికి ఉర్జిత్‌ పటేల్‌ కుప్పిగెంతులు తెలీదు. మోదీగారి ‘దమ్ము’ తెలీదు. తెల్లారితే ఉల్లిపాయ కొనుక్కునే ‘సొమ్ము’ మాత్రమే తెలుసు. నగదు రహిత లావాదేవీలు చదువుకున్న నాలాంటివాడికే చికాకు పరిచే సౌకర్యాలు. ‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి.


(రచయిత : గొల్లపూడి మారుతీరావు )

మరిన్ని వార్తలు