ఈ ఘర్షణ సమసిపోవాలంటే..

3 Nov, 2016 00:59 IST|Sakshi
ఈ ఘర్షణ సమసిపోవాలంటే..

కొత్త కోణం
70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారికి ఆసరాగా నిలబడుతున్నది నక్సలైట్లే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. తుపాకులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు వారే. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి.

వామపక్ష తీవ్రవాదం(నక్సలిజం) జాతీయ భద్రతా సమస్యగా ఉన్నందున సైనిక చర్యలు మాత్రమే పరిష్కారమనే భావన ఉంది. కానీ ఈ విధానం ఆదివాసులను మరింత దూరం చేయగలదు. ప్రభుత్వానికి, ఆదివాసులకు మధ్య అగాధం పెంచగలదు. అందువల్ల ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఆచర ణీయం కాకూడదు. 2004లో ఆదివాసీ సమస్యలపై నియమించిన ఉన్నత స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలోని వాక్యాలివి. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అవసరమని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వర్జినియస్‌ కాకా నేతృత్వంలోని ఆ కమిటీ భావించింది. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను కొల్లగొట్టడానికి ప్రభు త్వాలు, కార్పొరేట్‌ సంస్థలు కలిసి చట్టాలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడటాన్ని అరికట్టాలని అది చాలా స్పష్టంగా పేర్కొన్నది.

ఆదివాసుల ప్రయోజనాలకు, అభీష్టానికి వ్యతిరేకంగా వారి ఆవాస ప్రాంతాల నేలలో నిక్షిప్తమై ఉన్న సహజ వనరులను గిరిజనేతరులకు ధారాదత్తం చేయకూ డదని, వాటి ద్వారా వచ్చే లాభాల్లో ఆదివాసులకు సైతం వాటా ఉండాలని, దానిని వారి అభివృద్ధికి ఉపయోగించాలని కమిటీ సూచించింది. కానీ భారత ప్రభుత్వాలు ఏనాడూ అడవి బిడ్డలైన ఆదివాసులను ఈ సమాజంలో భాగంగా చూడలేదు. వారికి తమదైన సొంత సంస్కృతి, ప్రత్యేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నాయని కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. నక్సలైట్‌ పార్టీలు అటవీ ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్మించడానికి ముందు ప్రభుత్వ యంత్రాంగం అక్కడ అడుగుపెట్టిన జాడే లేదు. ఆదివాసీలను, వారి వన రులను దోపిడీ చేసేందుకే అటవీ ప్రాంతాల్లోనికి అడుగుపెట్టిన షావు కార్లు, కాంట్రాక్టర్లు, వారిని నిత్యం హింసించే ఫారెస్ట్‌ అధికారులు మాత్రమే అప్పు డప్పుడు వెళ్లేవారు. 1993లో కొంత మంది జర్నలిస్టులం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతానికి వెళ్లాం. మమ్మల్ని చూసిన ఆడవాళ్లు, పిల్లలు గుడిసెల్లో దూరి పోయారు. మాతో ఒక షావుకారు ఉండటం వల్ల కొంతమంది మగవాళ్లు మాత్రం నిలబడ్డారు.

కార్పొరేట్ల ధన దాహం వల్లనే...
అంటే, ఆ ప్రజలకు అప్పటికి షావుకార్లు, ఫారెస్టు ఆఫీసర్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియదు. ప్రభుత్వాధికారుల జాడే ఉండేది కాదు. పైగా, మేం వెళ్లినది వాహనాలు వెళ్ళగలిగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం. వారం రోజుల క్రితం నేటి ఏపీ పోలీసులు ఒడిశాలో నక్సలైట్లపై దాడి చేసిన ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం. దాదాపు 27 మంది నక్సలైట్లని, లేదా ఆదివాసులను ఒకేసారి కాల్చి చంపిన మొదటి ఘటన అది. ఇవి ఎదురు కాల్పులని పోలీసులు ప్రకటించినా, సాధారణ పౌరులెవ్వరూ ఇది నిజంగానే ఎన్‌కౌంటర్‌ అని విశ్వసించే స్థితిలో లే రు. మావోయిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు అక్కిరాజు హరగోపాల్‌ అలి యాస్‌ ఆర్కే ఘటనాస్థలిలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారే కానీ, ఇంకా ఆయన ఆచూకీని బయటపెట్టలేదు. ఆర్కే భార్య పద్మక్క ఈ సోమవారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్‌ ఎమ్మెస్కే జైస్వాల్‌... మావోయిస్టయినా, సాధారణ పౌరుడైనా వారి ప్రాణ రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని తేల్చి చెప్పడం ప్రభుత్వాల తీరుతెన్నులకు మందలింపుగా భావించవచ్చు.

ప్రభు త్వాలు పౌరుల రక్షణకు బాధ్యత వహించాలని కోర్టులు పదే పదే చెప్పినా అది వాటి చెవికి ఎక్కక పోవడం యాదృచ్ఛికం కాదేమో. నిజమైన ఎదురు కాల్పులు జరిగినప్పుడు రెండు వైపులా భావోద్వేగాలు ఉంటాయన్నది వాస్తవం. కానీ ప్రభుత్వాలు మరింత బాధ్యతతో పౌరుల ప్రాణాలకు హానీ కలిగించకుండా జాగ్రత్త వహించాలి. కానీ అందుకు భిన్నమైనదే ఆచరణలో జరుగుతోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని నక్సలైట్లకూ పోలీసులకూ మధ్య యుద్ధంగా మార్చి ప్రభువులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రభు త్వాల పెద్దలు తమ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు సాధారణ పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి ఇది పోలీసులకు, నక్సలైట్లకు మధ్య యుద్ధం కాదు. ఇది కార్పొరేట్ల ధన దాహం, ప్రభుత్వాల దళారీతనాలకూ, ఆదివాసీల అస్తిత్వ, ఆత్మ గౌరవాలకూ మధ్య సంఘర్షణ. ఈ ప్రాథమిక అంశాన్ని మరుగుపరచడానికి పోలీసులను, ఆ తర్వాత సైన్యాన్ని ముందు పెట్టి కార్పొరేట్‌ కంపెనీలు ఖనిజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నాయి.


నక్సలిజం, మావోయిజాలకు మూలం
నక్సలైట్లు, మావోయిస్టుల పుట్టుకకు, మనుగడకు రాజకీయ, సిద్ధాంత కార ణాలకన్నా స్థానికమైన సామాజిక, ఆర్థిక విషయాలే ప్రధాన కారణమని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలన్ని ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కాయి. ‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయంపాలనా వ్యవస్థలు ఉంటాయి. వారి ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వారి ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ల ప్రత్యేక మండలుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి’’ అని రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ 1949లోనే అన్నారు. మన రాజ్యాంగకర్తలు ఎంతో సామాజిక చైత న్యంతో, బాధ్యతతో చట్టాలను రూపొందిస్తే  మన పాలకులు వాటిని బుట్ట దాఖలు చేశారు. నక్సలైట్‌ ఉద్యమ ప్రస్థానమే దానికి నిదర్శనం. నక్సలైట్‌ ఉద్యమం పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరిలో ఆరంభమైంది. ఆదివాసీలు తరతరాలుగా తమ అధీనంలో ఉన్న భూములను బయటి ఆదివాసేతరులైన భూస్వాములు ఆక్రమించు కోవడాన్ని ఎదిరించి, తమ భూములు తాము దున్నుకోవడం ప్రారంభించగా ఘర్షణ ప్రారంభమైంది. ఇది ప్రారంభం. నక్స ల్బరీలో రక్తపుటేరులు ప్రవహించాయి. దానికి సమాంతరంగా, సరిగ్గా అదే సమయంలో శ్రీకాకుళం ఏజెన్సీ ఆదివాసీలు తమ హక్కుల కోసం, షావు కార్లు, భూస్వాముల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. భూస్వాముల గూండాలు దాడి చేసి కోరన్న, మంగన్న అనే తొట్టతొలి మార్క్సిస్టు, లెనినిస్టు కార్యకర్తలను హతమార్చారు. వారి మరణంతో ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు.

ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా ఆదివాసీ తిరుగుబాట్లకు మార్గం వేశాయి, నక్సలైట్‌ సాయుధ పోరాటానికి కారణమయ్యాయి. ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి వందలాది మంది నక్సలైట్‌ నాయకులను, కార్యకర్త  లను, సామాన్య ప్రజలను చంపివేశాయి. ‘ఎన్‌కౌంటర్‌’లు  ప్రారంభమైంది కూడా శ్రీకాకుళంలోనే. ఆదివాసీ ఉద్యమా లపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూనే, ఆదివాసీ రక్షణ పేరుతో కొన్ని చట్టాలను, సంస్కరణలను ప్రభు త్వాలు ముందుకు తెచ్చాయి. ఆ విధంగానే మన రాష్ట్రంలో 70 (1) చట్టం ఉనికిలోనికి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐటీడీఏ) వ్యవస్థలు. ఆదివాసుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం, 1974లోనే ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ (టీఎస్‌పీ)లు అందులో భాగమే. అయితే కాలక్రమేణా 70 (1) చట్టం నీరుగారి పోయింది. ఆదివాసుల నుంచి ఆదివాసీయేతరులు భూములు కొనకూడదనే రక్షణను కల్పించడంలో ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు అరకొరగానే అయినా కొంత మెరుగైన సౌకర్యాలు కలిగాయి. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ అమలు కూడా సరైన విధంగా ఫలితాలను ఇవ్వలేదు.

ఆదివాసీ హక్కుల నిరాకరణే అసలు సమస్య
అందువల్లనే నక్సలైట్‌ ఉద్యమం అటు జార్ఖండ్‌కు, ఇటు గోదావరి లోయ ప్రాంతంలోనికి, ఆదిలాబాద్‌ అడవికి విస్తరించింది. 1980 తర్వాత ఛత్తీస్‌ గఢ్‌లోకి ప్రవేశించినప్పటికీ, 1990 తర్వాతనే అక్కడ ఉద్యమం బల పడింది. 1990 అనంతరం ఆర్థిక సంస్కరణల ద్వారా వచ్చిన ప్రపంచీకరణలో భాగంగా ముందుకు వచ్చిన సరళీకరణ విధానాలు ప్రైవేట్‌ కంపెనీల జోరుకు ఊపునిచ్చాయి. దానితో కార్పొరేట్‌ కంపెనీల దృష్టి ఆదివాసీ ప్రాంతాల మీదకు వెళ్ళింది. మన దేశంలో లభించే బొగ్గు, ఇతర ఖనిజాల్లో నూటికి 70 శాతం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1995లో చంద్రబాబు అధికారం లోని వచ్చిన తర్వాత ఒడిశా–ఏపీ సరిహద్దుల్లో బాక్సైట్‌ గనులపై సర్వహ క్కులు«  ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేశారు. ఈ ఒప్పందంపైనే సమత అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆదివాసులు ఈ బాక్సైట్‌ తవ్వ కాలపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. చివరకు సుప్రీంకోర్టు, ఆదివాసీ ప్రాంతాల్లోని భూమితో సహా ఎటువంటి వనరులనూ గిరిజనేతరులు ఉప యోగించుకోవడానికి వీలులేదని, ప్రభుత్వాలు కూడా గిరిజనేతరు లేనని, వారికి కూడా ఈ నియమం వర్తిస్తుందని చారిత్రాత్మకమైన తీర్పును వెలు వరించింది. అయినా ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను మానుకోకపోవడం వల్ల దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఆదివాసులు నిరాశ్రయులైనట్టు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ నక్సలైట్లు, మావోయి స్టులు ఆదివాసులకు అండగా నిలిచారు.

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆసరాగా నిలబడుతున్నది, వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది నక్సలైట్లు మాత్రమే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్ప గించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌. ఇది ఆదివాసులలో మరింత తీవ్ర అశాంతిని రగులుస్తోంది. తుపా కులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు ఆదివాసులేనంటే ఆశ్చర్యపోవా ల్సిన పనిలేదు. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి. తామూ ఈ దేశంలో భాగమే ననే విశ్వాసం ఆదివాసులకు కలగాలి. అది జరగకుంటే అక్కడ అలజడి ఆగదు. సంఘర్షణ సమసిపోదు. నక్సలైట్‌ ఉద్యమాన్ని ఈ చారిత్రక క్రమం నుంచి అర్థం చేసుకోకుంటే ప్రభుత్వాలు భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలను ఎదుర్కోక తప్పదు.

(వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు  మొబైల్‌ : 97055 66213)

మరిన్ని వార్తలు