అసూయా రాహిత్యం

1 Jan, 2016 02:55 IST|Sakshi
అసూయా రాహిత్యం

జ్యోతిర్మయం
ఒక వ్యక్తి సజ్జనుడా, దుర్జనుడా అని నిష్కర్షించి చెప్పడానికి కారణంగా నిలిచేది ‘అసూయ’ అనేదే. అసూయా పరులను దుర్జనులని, అసూయా రహితులను సజ్జనులని వ్యవహరిస్తారు. గుణాలను గుణాలుగానే భావిస్తూ గుణవంతులను అభిమానించి ఆదరించి అక్కున చేర్చుకునే సజ్జనులను అందరూ ఆరాధిస్తారు. గుణాలలో దోషాలను ఆరోపించే దుర్జనులకు అందరూ దూరంగా ఉంటారు.
 
భగవంతుడిలో ఉండే కళ్యాణ (శుభ) గుణాలను కీర్తించే, స్మరించే, ఆస్వాదించే, అనుభవించే, ఆనందంగా శ్రవణం చేసే (వినే) అసూయా రహితులైన భక్తులంటే భగవంతునికి ఎంతో ఇష్టము. తనలోని శక్తియుక్తులను శిష్యులకు ధారపోసే సద్గురువుకు కూడా అసూయ అనే దుర్గుణం లేశమాత్రం కూడా లేనట్టి శిష్యుడు అంటేనే అధిక ప్రీతి. గీతాచార్యుడైన శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి కర్తవ్యమును ప్రబోధించే సందర్భములో అర్జునా! ‘‘ప్రవక్ష్యామి అనసూయవే’’ నీలో అసూయ లేనందున నీకు అనేకానేక రహస్యాలను ఉపదేశిస్తాను అని అర్జునుడితో పలికాడు.
 

ఇతరుల అభివృద్ధిని సహించలేకపోవడాన్ని ‘‘ఈర్ష్యా’’ (అక్షాంతిః ఈర్ష్యా) అని అంటారు. ఇట్టి ఈర్ష్య కన్న ప్రమాదకరమైనది అసూయ..... సహృదయ పుంగవులలో ఉండే సద్గుణ సముదాయాన్ని ఆస్వాదించలేని అసూయాపరులు ఏ ఒక్క సద్గుణాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నింటిలోనూ దోషాలను ఆరోపిస్తారు.
 

ఇష్టం వచ్చినరీతిలో కాకుండా పెద్దల పట్ల వినయ విధేయతలను కలిగివుంటూ కాస్త భయాన్ని, మొహమాటాన్ని, సంకోచాన్ని కలిగివున్న సజ్జనుణ్ణి దుర్జనులు జడుడని వ్యవహరిస్తారు. నియమనిష్టలు కలిగిన వ్యక్తినేమో దంభం కలవాడని అంటారు. సదా చారవంతుడైన వ్యక్తిని నటుడు అని సంబోధిస్తారు. శౌర్యవంతుణ్ణి దయలేనివాడు అని పేర్కొంటారు. సత్యమునే పలుకవలెను అని నియమాన్ని కలిగి పరిమితంగా మాట్లాడేవాడిని మతివిహీనుడని పలు కుతారు.

అందరితో ప్రియంగా మాట్లాడేవాడిని దీనుడని, తేజోవంతుణ్ణి గర్విష్టి అని, నేర్పుతో మాట్లాడే వానిని వదరుబోతు అని, దీర్ఘాలోచన పరుడైన వ్యక్తిని శక్తిలేనివాడని ఆక్షేపిస్తారని- ‘‘జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతరతే దంభః శుచే కైతవం  శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని తేజస్వి న్యవలిప్తతా ముఖరతా వక్తరి, అశక్తిఃస్థిరే  తత్కో నామ భవేత్ సుగుణినాం యో దుర్జనైః నాజ్కితః॥అనే శ్లోకం ద్వారా వెల్లడవుతోంది. అసూయాగ్రస్తులు సజ్జనులను ద్వేషిస్తూ తమ అస్తిత్వానికే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అసూయారహితులు అందరికీ ఆత్మయులవుతారు. అసూయ మన మది దరిచేరకుండా జాగ్రత్త పడదాం.
  

(వ్యాసకర్త: సముద్రాల శఠగోపాచార్యులు)

మరిన్ని వార్తలు