-

సత్యానికి సంకెళ్లు వేయకండి!

1 Nov, 2016 00:52 IST|Sakshi
సత్యానికి సంకెళ్లు వేయకండి!

రెండో మాట

ఆలస్యంగానైనా మేల్కాంచి పౌరులపై జరుగుతున్న పోలీసు, మిలటరీ దాడులను, చిత్ర హింసలను ఖండిస్తూ సుప్రీంకోర్టు నషాళానికంటే తీర్పులను వెలువరించవలసి వస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ– జస్టిస్‌ మదన్‌ లోకూర్, యు.యు. లలిత్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఈశాన్య భారతం నుంచి దక్షిణ భారత రాష్ట్రాల దాకా ఒడిశా–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వరకూ కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సందర్భంగా పోలీసు, సైనిక దళాలు జరుపుతున్న మారణకాండ పూర్వరంగంగా ఇచ్చిన ఈ తీర్పులో హెచ్చరికలు ఎన్నో.


‘నిజాన్నే–సత్యాన్నే అన్ని సమయాల్లోనూ చెప్పాలి. ముఖ్యంగా, నిజం పలకడమే ప్రమాదకరమైన సందర్భాలలో ఆ సత్యాన్నే మరీ మరీ చెప్పి తీరాలి!’                  – కోల్‌రిడ్జ్‌ (ఇంగ్లండ్‌ మహాకవి)

నిజం కురచ, అబద్ధం పొడవు అన్నారు మన పెద్దలు కూడా. కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరాగాంధీ పదవీ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు బీజేపీ–ఎన్‌డీఏ పరివార్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అదే పదవీ పరిరక్షణలో సరాసరి సామ్రాజ్యవాద పాలకుల సెడిషన్‌ (రాజ ద్రోహం) చట్టాన్ని దుమ్ము దులిపింది. భావ స్వాతంత్య్రాన్నీ, భావ ప్రకట ననూ అణచేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ప్రభుత్వ విధానాలతో, పాలక వర్గాల ప్రకటనలతో విభేదించే రచయితలు, కవులు, కళాకారులు, మానవ హక్కుల పరిరక్షణా సంస్థలు, వాటి కార్యకర్తలను వేధించడం; నిర సన తెలిపిన వారిలో కొందరిని అజ్ఞాతంగా పరిమార్చడం దేశవాసులందరికీ తెలిసిన ‘రహస్యం’. కనుకనే ప్రజాకవి కాళోజీ సమాజాన్నీ, దేశాన్నీ అభాసు పాలుచేస్తున్న పాలనా వ్యవస్థలోని ఒక సాదృశ్యం గురించి ఒక మరాఠీ సామెత ఆధారంగా వివరించేవారు. ధనస్వామ్య వ్యవస్థ దోపిడీకి గురవు తున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని సత్యాలను నిర్భయంగా చాటిన కాళోజీ ఇలా చెప్పారు: ‘ఒక తేలు శివలింగం మీద కూర్చుంది. చేత్తో జరిపితే కాటేస్తుంది. చెప్పుతో కొడదామంటే లింగానికీ, శివుడికీ అపచారం. చేత్తో జరపలేం, చెప్పుతో కొట్టలేం.’ అలాగే నేడు అధికారంలో కూర్చుని అన్యాయా లకు ఒడిగడుతున్న బద్మాష్‌లు అంతా లింగం మీది తేళ్లే. చెప్పుతో కొడదా మంటే పోలీసు శాఖకూ, ప్రభుత్వాలకూ అపచారం.

ఈ సంక్షోభం ఎవరి పుణ్యం?
పాలకుల అవసరం ఉన్నా సామాజిక వ్యవస్థను తీర్చిదిద్దడం రాజ్యాంగ శాఖ లన్నిటికి(ప్రభుత్వం, శాసనవేదికలు, న్యాయవ్యవస్థ) ధ్యేయంగా ఉండాలి. రాజ్యాంగం భరోసా ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం ఆధారం ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలన, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ, శాంతి స్థాపనలు కూడా ఆ రాజ్యాంగ శాఖల ధ్యేయం కావాలి. కానీ ఇదే ధ్యేయంతో నిర్మిత మైన రాజ్యాంగానికి ఆరున్నర దశాబ్దాలుగా పాలక వర్గాలు తూట్లు పొడు స్తూనే ఉన్నాయి. దీని ఫలితం ఏమిటి? విచ్చలవిడిగా సాగుతున్న అన్యాయా లకు, దుర్మార్గాలకు పీడనలకు వ్యతిరేకంగా దేశం నలుమూలల నుంచి ఉద్య మాలు, ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. మళ్లీ వీటిని అణచడానికి ప్రభు త్వాలు తమవైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వాతంత్య్రం సాధిం చుకున్న తొలి రెండు దశాబ్దాలను మించి, ఇవాళ దేశవ్యాప్తంగా అలాంటి దృశ్యాలే మరిన్ని కనిపించడానికి కారణం ఏమై ఉంటుంది? మరీ ముఖ్యంగా తమ ఆర్థిక సంక్షోభాలకు మూలాలను ఇండియా వంటి ఆసియా దేశాలకు, లేదా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలోని కొన్ని దేశాలకు అమెరికా, ఇంగ్లండ్‌ సామ్రాజ్యవాదులు అంటగడుతున్నారు.

నిజానికి వారు ఆ సంక్షోభాల నుంచి బయటపడడానికి ఇలాంటి ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. నూతన సమా చార వ్యవస్థ మాటున దాగి వారు ముమ్మరంగా వ్యాప్తి చేసిన ‘నూతన ఆర్థిక వ్యవస్థ’ వికృత రూపమే ప్రపంచీకరణ/ప్రైవేటీకరణ. ఈ పరిస్థితిని ప్రజా స్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు వ్యతిరేకించకూడదు. ప్రతిఘటించకూ డదు. దుష్ట పాలన మీద, దుష్ట శక్తుల మీద శ్రీకృష్ణుడు, శ్రీరాముడు (భార్గవ రాముడు), శివుడు తిరగబడితే, అది ‘ధర్మ సంరక్షణ .’ కానీ బలహీనులు అలాంటి ధర్మ రక్షణ గురించి ప్రస్తావించరాదు. 150 దేశాలలో సైన్యాన్నీ, వాటి స్థావరాలనూ బలవంతంగా రుద్ది, దోపిడీ చేస్తున్నందుకు ఆయుధ వ్యాపారి అమెరికాని నిరోధించరాదనడమే ఇప్పుడు ‘ధర్మం’. నిజానికి అమె రికా సాగిస్తున్న తాజా దోపిడీ స్వరూపాన్ని ఫ్రెంచ్‌ బిషప్పులు కొందరు ఇటీ వలనే ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు కూడా.


‘‘ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దేశాలకు చెందినవారమని చెప్పు కుంటున్న మేము ఎలాంటి బాపతు? అభివృద్ధి దశలో ఉన్న వర్ధమాన దేశా లను దోచుకుంటున్న దేశాలకు చెందిన వాళ్లం మేము. కనుకనే ఈ దోపిడీ యావత్తూ ప్రజల రక్తమాంసాలనూ, ఉచ్ఛ్వాసనిశ్వాసాలనూ ఎలా ఉడికి స్తుందో మాకు తెలియదు. ఈ క్రమంలో పేదవారిపైన సంపన్నుల పెత్తనం, బలహీనులపైన బలవంతుల దౌర్జన్యాలు ముందు మరెంత బాహాటంగా విరుచుకుపడనున్నాయో గమనించగలరు. ఈ పరిస్థితుల్లో చిక్కుపడిన ప్రస్తుత ప్రపంచాన్ని రెండుగా విభజించి పునర్వ్యవస్థీకరించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మారక వ్యవస్థపైన పశ్చిమ రాజ్యాల ఆధి పత్యాన్ని అడ్డుకుని నియంత్రించనిదే, బడుగు దేశాల వనరులను, ముడి సరుకుల్ని మా ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం సాధ్యపడదు. ఆయుధ సరఫరాల ద్వారా లాభిస్తున్న వారెవరో మనకు తెలియదా? ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌లతోపాటు మా ఫ్రెంచి ప్రభుత్వం కూడా సమ ఉజ్జీయే. సంపన్న పారిశ్రామిక దేశాల్లో లాభాల వేట ద్వారా, ధనశక్తి మాత్స ర్యంతోనే జీవితాల్ని శాసిస్తున్నారు. నేడు పారిశ్రామిక సంపన్న దేశాల ఆర్థిక, సాంస్కృతిక పెత్తనం ఫలితంగానే పేద దేశాల సైనికీకరణ (సైనిక, రక్షణ సంధుల ద్వారా) సాధ్యపడుతోంది’’ అని స్పష్టం చేశారు. ఈ రకమైన అధర్మ వర్తన మన వ్యవస్థలోనూ ప్రవేశించి శాంతి ధ్వంసమవుతోంది. ఇక్కడ ధర్మ యుద్ధానికి చోటులేదు, దాగుడుమూతల రాజకీయాలకు, అభ్యుదయ శక్తు లపై దాడులకు, ప్రతిఘటనా శక్తులపై పోలీసుల చిత్రహింసలకు, కస్టడీ హింసలకు చోటు. అది కూడా అహింస ముసుగులోనే.

శత్రువూ పౌరుడే కదా!
ఆలస్యంగానైనా మేల్కాంచి పౌరులపై జరుగుతున్న పోలీసుల, మిలటరీ దాడులను, చిత్రహింసలను ఖండిస్తూ సుప్రీంకోర్టు నషాళానికంటే తీర్పులను వెలువరించవలసి వస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ– జస్టిస్‌ మదన్‌ లోకూర్, యు.యు. లలిత్‌ ధర్మాసనం (8.7.2016) ఇచ్చిన తీర్పు. ఈశాన్య భారతం నుంచి దక్షిణ భారత రాష్ట్రాల దాకా ఒడిశా–ఆంధ్రప్రదేశ్, తెలం గాణల వరకూ కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సందర్భంగా పోలీసు, సైనిక దళాలు జరుపుతున్న దాడులు, మారణకాండ పూర్వరంగంగా ఇచ్చిన ఈ తీర్పులో చెరపరాని, చెరగరాని హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి: ‘‘పోలీ సుల, సైనిక దళాల చర్యలవల్ల మరణించిన వ్యక్తి పచ్చి క్రిమినల్‌ అయినా లేక మిలిటెంట్‌ అయినా లేదా ఒక టెర్రరిస్టు అయినా లేదా తిరుగుబాటు దారుడైనా– ఆ అంశంపైన పరిపూర్ణ విచారణ జరపాలి. పోలీసులు/సైని కులు ఎదురుకాల్పుల పేరిట హింసాకాండకు దిగారన్న ఆరోపణలను విచారించి తీరాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పాటించాల్సిన కనీస విచా రణ పద్ధతి. ఇది పౌరులకైనా, పోలీసులకైనా, సైనికులౖకైనా వర్తించాల్సిన న్యాయసూత్రం, వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణకు పాటించాల్సిన అనివార్య సూత్రం...’’ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (1958) కింద అసోం, మణిపూర్‌ రాష్ట్రాల్లో సైనిక/పోలీస్‌ చర్యల పేరిట బూటకపు ఎన్‌కౌంటర్ల ఫలితంగా వందలాది కుటుంబాలపై 1,528 కేసులను నమోదు చేసినప్పుడు సుప్రీం వెనువెంటనే స్పందించింది. ఆ సందర్భంగా ఈ కేసుల్లో విచారణ నుంచి సైనిక/పోలీసు దళాలకు మినహాయింపు కల్పించకపోతే రక్షణ దళాల నైతిక స్థాయి పడిపోతుందన్న ప్రభుత్వాల వాదనను కోర్టు తిప్పికొట్టింది. ‘‘శత్రువును చంపడమొక్కటే సమస్యలకు ఏకైక పరిష్కారం కాదు’’ అని చెప్పింది. ఇదే పరిస్థితి ప్రజాస్వామ్యంలో తుపాకీ కనుసన్నల్లో గడిపే పౌరులు అస్థిమితమైన, నైతిక ధైర్యాన్ని కోల్పోవలసి వచ్చినప్పుడు వారి మనో నిబ్బరం ఎలా ఉంటుందో ప్రభుత్వాలు ఊహించుకోవాలని పాఠం చెప్పింది. ఎంత ‘శత్రు’వైనా అతడు దేశ పౌరుడని మరచిపోరాదనీ, రాజ్యాంగంలోని 21వ అధికరణ సహా ప్రాథమిక హక్కులకూ అతను/ఆమె అర్హులనీ కోర్టు స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఆదివాసీ యువకుల్ని బలవంతం చేసి ‘సల్వాజుడుం’ పేరిట మావోయిస్టుల్ని ఎదుర్కోవడానికి దళంగా ఏర్పర్చిన సందర్భంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని న్యాయమూర్తులు సుద ర్శన్‌రెడ్డి, ఎస్‌.ఎస్‌.నిజ్జార్‌ల సుప్రీం ధర్మాసనం (2011) ప్రకటించింది.

ప్రతిహింసను కాదనగలమా!
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ‘ఎదురుబొదురు కాల్పుల’ తతంగాలనూ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ‘హింస’ను సరదాగా ఎవరూ సమర్థించరు. అందుకే కాళోజీ ‘హింసను వ్యతిరేకిస్తాం, రాజ్య హింసను మరీ వ్యతిరేకిస్తాం, ప్రతిహింసను కాదనలేం’ అని చాటి ఉంటాడు. ఈ పరిస్థితికి రాజకీయాలూ, రాజకీయులూ ఎందుకు దిగజారిపోయారు?  మానవ నాగరికతా చరిత్రలో మూలవాసులైన ఆదివాసీ జాతులకు, అసం ఖ్యాక షెడ్యూల్డ్‌ కులాలకు, తెగలకు రాజ్యాంగం హామీ పడిన 5–6 షెడ్యూళ్ల కింద కేటాయించిన భూములనుంచి, క్రమంగా సాగుభూముల నుంచి, ఇతర ప్రత్యేక రక్షణలనుంచీ పాలకులు ఉద్వాసన చెబుతూ ఆ భూములను మైనింగ్‌ వ్యాపారులకు దఖలు పర్చడమే వారి ప్రతిఘటనకూ కారణమైం దని గ్రహించాలి. అందుకే ఆశయాలు సంఘర్షిస్తున్నాయి, కనుకనే భావ సంఘర్షణే ‘ఆయుధం’గా మారుతోందా? అందుకే అన్నాడేమో క్రిష్టఫర్‌లోగ్‌ అనే కవి :‘‘మానవుడు రాజకీయ జీవి/ముఠాలుగా తిరిగేవాడు/ఒక గుంపు మరో గుంపును ద్వేషించేది/అబ్బో ఎన్నెన్ని విద్వేషాలు/అన్నిటిలో ప్రధానమై నది ‘దేశాభిమానం’/మానవుడికి రెండు చెవులుండేవి కాని/ఏదీ విని పించుకునేవాడు కాడు/ఎప్పుడైనా వింటే/వాగ్దానాలు, వాటి విలువను గూర్చిన అంచనాలూ/అభినందనలూ/విశేషించి ‘కృతజ్ఞతా’ ప్రకటనలూ/ ఇవి మాత్రమే వినేవాడు/మరికొందరుండేవారు/విజ్ఞానులూ, జిజ్ఞాసవులూ, విప్లవకారులూ/కానీ వీరు అల్పసంఖ్యాకులు/వీళ్లని పెందరాళే పంపించేసే వాళ్లు/సిలువ వేసీ/షూట్‌ చేసీ/విషం ఇచ్చీ’’ మన కాలంలో మన దేశంలో కూడా ఈ వైపరీత్యం ఎంత వాస్తవం?


(వ్యాసకర్త :  ఏబీకే ప్రసాద్‌ సీనియర్‌ సంపాదకులు)

మరిన్ని వార్తలు