అందుబాటు

29 Dec, 2016 00:46 IST|Sakshi
అందుబాటు

అందుబాటులో ఉండటం ప్రేమను వ్యక్తీకరించే పద్ధతులలో అతి ప్రధానమైనది. ఆ ప్రేమ–స్నేహం, వాత్సల్యం, దాస్యం, భక్తి, గౌరవం... ఏ రూపంలోనైనా ఉండవచ్చు. నా గుండెల నిండా నీమీద ప్రేమ ఉంది అని చెబితే సరిపోదు. ఆ ప్రేమ లేదా నిర్హేతుకమైన ఇష్టం ఎవరిమీద ఉన్నదో వారికి అన్నివిధాలా– భౌతి కంగా, మానసికంగా చేరువై ఉండాలి. ప్రేమ మాత్రమే కాదు, బాధ్యత విద్యుక్త ధర్మాల విషయమూ అంతే.

చిన్న పిల్లవాడికి భయం వేసి అమ్మా! అని కేక పెడితే.. గజేంద్రమోక్షం చదువుతున్నాను, అయ్యాక వస్తాననో, టీవీ సీరియల్‌లో పతాక సన్నివేశం పూర్తి అయ్యాక వస్తాననో అంటే ఆ తల్లిదండ్రులు ఉండి ఏం ప్రయోజనం? ఎక్కడో విదేశాలలో ఉంటూ, పిల్లలను వసతి గృహాల్లో ఉంచిన దానికీ, దీనికీ తేడా లేదు.

కార్యాలయాల్లోనూ అంతే. అవసరానికి తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి వెంటనే సమస్యను పరిష్కరించి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి తీసుకుంటున్న జీతానికి న్యాయం చెయ్యాలి. కొంతమంది ఎప్పుడూ తమ స్థానాల్లో కనపడరు. వినియోగదారుడికి అందుబాటులో లేకపోవటం ఉద్యోగి ధర్మం కాదు.

అందుబాటులో ఉండటం అన్నది దైవీ లక్షణం. భగవంతుడు ఎప్పుడూ భక్తులకు అందుబాటులోనే ఉంటాడు. ఇప్పుడు తీరిక లేదనిగాని, అలసిపోయాననిగానీ, నీకు అర్హత లేదనిగానీ వాయిదా వెయ్యడు. అడగటం చేతకాక ఏమి అడగాలో, ఎలా అడగాలో తెలియకే చాలామంది కోరికలు తీరవు. ఆదర్శ మానవుడు శ్రీరాముడు తనను ఎప్పుడైనా ఎవరైనా కలవవచ్చును. నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను అని.. పిలవడానికి ఒక గంటను ఏర్పాటు చేశాడు. ఒకమారు తనకి అన్యాయం జరిగిందని ఆరోపించి, న్యాయం చెయ్యమని ఒక కుక్క వచ్చి అడిగితే వెంటనే  దానికి హాని చేసిన వాడికి అది చెప్పిన శిక్షనే విధిం చాడు. మానవులకే కాదు. సర్వజీవులకు అందుబాటులో ఉండి తన ధర్మాన్ని నిర్వర్తించాడు.

లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబ య్యె... కావవే వరద ‘సంరక్షింపు భద్రాత్మకా’ అని గజేంద్రుడు ప్రార్థించగానే ‘ఆట పూర్తి అయ్యాక వస్తాను.. అలంకరించుకుని, మంది మార్బలం కూర్చుకొని వస్తాను’ అని అనలేదు శ్రీమహావిష్ణువు. తన భక్తుణ్ణి కాపాడటానికి ఉన్నవాడు ఉన్నట్టుగా ఎలా పరుగెత్తాడంటే ‘సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడే/ పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం/ తరధమ్మిల్లము చక్క నొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచో/ పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహిౖయె’.
అదీ అందుబాటులో ఉండటం అంటే..
(వ్యాసకర్త : డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి)

మరిన్ని వార్తలు