ఏది సత్యం ఏదసత్యం మోదీ?!

3 Jan, 2017 00:42 IST|Sakshi
ఏది సత్యం ఏదసత్యం మోదీ?!

రెండో మాట

భారత ఆర్థిక వ్యవస్థ మౌలికంగానే నగదుపై ఆధారపడిన వ్యవస్థ అని తెలిసి కూడా ఏ శక్తుల ప్రోద్బలంతో ఈ చర్యకు దిగారు? దేశాన్ని ఆకస్మికంగా నగదు రహిత (డిజిటల్‌) లావాదేవీల గోదాలోకి దించడానికి కారణమైన ఆ అజ్ఞాత బాహ్య శక్తి ఏది? ఇంత పెద్ద సమస్యను పార్లమెంటులో చర్చించకుండా, చర్చలో తాను పాల్గొని ప్రజల అనుమానాలను తీర్చకుండా బయటి ప్రసంగాల్లో మాత్రం ప్రజల, ప్రతిపక్షాల దేశభక్తిని శంకిస్తూ వీరంగాలు వేయడానికి మోదీ ఎందుకు సాహసించినట్టు?

‘పెద్ద నోట్ల రద్దు తర్వాత ముద్రించిన కోట్లాది రూపాయల విలువ చేసే కొత్త నోట్లు కొంతమందికే లభిస్తుండగా, ప్రజా బాహుళ్యం తాము బ్యాంకు లలో డిపాజిట్‌ చేసుకున్న సొంత డబ్బును వినియోగించుకోనివ్వకుండా నియంత్రించి ప్రభుత్వం ఎందుకు కొత్త నోట్లు అందుబాటులో లేకుండా చేసిందో సమాధానం కావాలి’  – సుప్రీంకోర్టు ప్రశ్న (15. 12. 2016)

ఈ సూటి ప్రశ్నకు ఇంతవరకూ అంతే సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. పైగా మోదీ ప్రభుత్వం ఈ నెపాన్ని బ్యాంకుల మీదికీ, బ్యాంకుల యజమానుల మీదికీ నెట్టేసింది. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు (నవంబర్‌ 8) నిర్ణయం ప్రజల్ని, వ్యవసాయ, వృత్తి సంస్థల, చిన్న వ్యాపారుల, ఉద్యోగ వర్గాలను అతలాకుతలం చేసింది. కనుకనే సామాన్య, మధ్యతరగతి ప్రజా బాహుళ్యం మోదీకి ఒక ప్రశ్నను సంధించాల్సి వచ్చింది. రూ.500, రూ.1,000 నోట్లను చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం భావించినప్పుడు, అంతకన్నా పెద్దది, రూ. 2,000 నోటు ఎలా చెల్లుబాటు అవుతుంది? ఈ ప్రశ్న లేవనెత్తినందుకు మోదీ ‘నన్ను చంపడానికి కుట్ర పన్నుతారని తెలుసుననీ, నాకు కుటుంబం లేదు, ప్రజా సేవకే అంకితమయ్యా’ననీ; పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్నీ, అవినీతినీ అరికట్ట డానికేనని చెప్పారు. ఈ చర్యను టెర్రరిజంతో ముడిపెడుతూ ఆయన సమ ర్థించుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆచరణలో నోట్ల రద్దు చర్య ఉద్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి దోహదపడడం కన్నా, దేశాన్ని 50 రోజులు గందరగోళానికి గురి చేసింది. అదింకా కొనసాగుతూనే ఉంది.
 
ఒక తప్పుకు పది తప్పులు చేస్తూ, నిరంతర తప్పుల మధ్యనే మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది. స్వతంత్ర ప్రతిపత్తి గల రిజర్వు బ్యాంకును క్రమంగా నిర్వీర్యం చేస్తున్న క్రమంలో 45 రోజుల్లో 60కి పైగా పరస్పర విరుద్ధ సర్క్యులర్లు విడుదల చేసి ప్రజల మధ్య మరింత గందరగోళానికీ, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత నిర్వీర్యం కావడానికీ సర్కార్‌ దోహదం చేసిందని మరచి పోరాదు. డిసెంబర్‌ 31నాడు (50 రోజుల గడువు అనంతరం) మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటనలో కూడా కొత్తదనం లేదు. తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించుకుంటూ, అనాలోచిత నిర్ణయం దొంగడబ్బును వెలికి తీయకపోగా అవినీతిని అరికట్టలేకపోగా రకరకాల మార్గాలలో రద్దయిన లక్షల కోట్లు తిరిగి ముడుపులతో బ్యాంకింగ్‌ వ్యవస్థలకి చేరాయి.

క్షమాపణలు చెప్పలేరా?
ఏ నల్లధనాన్నీ అవినీతినీ అరికట్టాలని బయల్దేరేమో ఆ ‘రెండు జబ్బులు’ మరింత విజృంభించాయే గానీ నయం కాలేదు. ఈ అక్రమార్జన, అవినీతిలో బీజేపీ/కాంగ్రెస్, వాటి కూటములు రెంటికీ భాగస్వామ్యం ఉంది. 2014 తర్వాత కొన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోలేకపోయినందుకు పరిహా రంగా, అయిదు రాష్ట్రాలకు త్వరలో జరుగనున్న ఎన్నికల ‘యజ్ఞం’లో రాజ కీయులకు ఈ నోట్ల రద్దు ఒక ‘తురుపు’ ప్రయోగంగా భావించాలి. ఈ సందర్భంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ధియొడర్‌ రూజ్‌వెల్ట్‌ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘కోట్లాది ప్రజలు మంచి పౌరులుగా రూపుదిద్దు కోకుండా చేస్తున్నది మరెవరో కాదు, పాలకులమైన మనమే! ఎందుకంటే జీవించడానికి వీలులేని పరిస్థితుల్లోకి అసంఖ్యాకుల్ని మనం నెట్టికూర్చున్నాం కాబట్టి’ అన్నాడు రూజ్‌వెల్ట్‌. ఆయనకు సమర్ధనగానే మరో అమెరికా ప్రెసి డెంట్‌ జాన్‌ కెన్నెడీ, ‘ప్రజాస్వామిక స్వేచ్ఛా సమాజ వ్యవస్థే అసంఖ్యాక పేద ప్రజా బాహుళ్య ప్రయోజనాలను రక్షించలేకపోయినప్పుడు, సమాజంలోని అల్పసంఖ్యాకులయిన సంపన్నులను అసలే రక్షించలేదు’ అన్నారు!
 
అసలు, నోట్ల ఆకస్మిక రద్దు వల్ల రానున్న పరిణామాల్ని మోడీ ఎందుకు ఊహించలేకపోయారు? భారత ఆర్థిక వ్యవస్థ మౌలికంగానే నగదుపై ఆధా రపడిన వ్యవస్థ అని తెలిసి కూడా ఏ శక్తుల ప్రోద్బలంతో ఈ చర్యకు దిగారు? దేశాన్ని అకస్మాత్తుగా నగదు రహిత (డిజిటల్‌) లావాదేవీల గోదాలోకి దించ డానికి కారణమైన ఆ అజ్ఞాత బాహ్య శక్తి ఏది? గోదాలోకి దించిన తర్వాత, తన మాట నెగ్గించుకోవడానికి ఇప్పుడు అవినీతిపరులను, నల్లధనాధిప తులను వదిలిపెట్టం అని ప్రకటించడంలోని నిజాయితీ ఎంత?  ఇంత పెద్ద సమస్యను పార్లమెంటులో చర్చించకుండా, చర్చలో తాను పాల్గొని ప్రజల అనుమానాలను తీర్చకుండా బయటి ప్రసంగాల్లో మాత్రం ప్రజల, ప్రతి పక్షాల దేశభక్తిని శంకిస్తూ వీరంగాలు వేయడానికి మోదీ ఎందుకు సాహ సించినట్టు? నోట్ల రద్దు వల్ల అష్టకష్టాలకు గురైన సామాన్య, మధ్య తరగతి ప్రజా బాహుళ్యం గంటల తరబడి నాలుగు రాళ్ల కోసం క్యూలు కట్టిన కార ణంగా దాదాపు 120 మంది వృద్ధ స్త్రీలు, పురుషులు మరణించినందుకు ఎలాంటి బహిరంగ క్షమాపణ చెప్పకుండా మోదీ ప్రజల ఓర్పునకు మాత్రం ‘కృతజ్ఞతలు’ తెలిపి చేతులు దులుపుకున్నారు!

టక్కుటమార టంకసాలలు
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిర్లా, సహారా కంపెనీల నుంచి పొందిన నల్లధనం గురించి ఆదాయపు పన్నుశాఖ పత్రాలలో నమోదైవున్న విషయం సుప్రీం కోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు. పెక్కు ఆరోపణలలో ఇంత మందికి సమాధానం చెబుతున్న మోదీ, ప్రశాంత్‌భూషణ్‌ ప్రభృతుల ఆరోపణలపై  స్పందించకపో వటం సంచలనమే. ఇలా ఉండగా అసలు కరెన్సీ ముద్రణ సంస్థల ఆను పానుల గురించే పెద్ద రహస్యం బద్దలయింది. కాగా, నోట్ల రద్దు నిర్ణయం సందర్భంగా ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణ్యం, ఆర్థికమంత్రి జైట్లీల అభిప్రాయాల్ని సలహాలను తీసుకున్నారా, లేదా అని ఆర్‌బీఐ నుంచి సమాచారం రాబట్టడం కోసం ఆర్టీఐ కింద ఒక బాధ్యుడు ప్రశ్నించి, దాని నకళ్లను ప్రధానికి, ఆర్థిక మంత్రిత్వశాఖలకు పంపించారు. దానికి కూడా స్పందనలేదు! ఈ భాగోతం ఇలా నడుస్తూ ఉండగానే కేరళ మాజీ సీఎం ఊమన్‌ చాందీ బ్రిటిష్‌ ముద్రణ సంస్థ దిలారూ ఎలాంటిదో బయటపెట్టారు. 1997–98లో రూ. 500, రూ. 100 నోట్లు మొత్తం 360 కోట్ల విలువైన కరెన్సీ ముద్రణకు ఈ కంపెనీకి ఆర్‌బీఐ కాంట్రాక్టు ఇచ్చింది.
 
ఈ లోపు పార్లమెంటు ప్రభుత్వ సంస్థల వ్యవహారాల పార్లమెంటరీ తనిఖీ సంఘం (2012–13) ఈ కాంట్రాక్టు గురించి తీవ్ర అనుమానాలను వ్యక్తం చేసింది. ఆనాడు ఆ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్‌ సభ్యుడు జగదం బికాపాల్‌ తర్వాత బీజేపీలో చేరారు. ఆ కమిటీయే టెర్రరిస్టులు, అతివాదులు, ఇతర ఆర్థిక నేరస్థులు, అసాంఘిక శక్తుల చేతుల్లోకి ముద్రిత కరెన్సీ పాకి పోవడాన్ని గుర్తించింది. ఫలితంగా 2011లో ఆ బ్రిటిష్‌ కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ను ప్రభుత్వం నిషేధించింది. 2013, 2014, 2015 సంవత్సరాల వార్షిక నివేదికల్లో ఈ కంపెనీ కార్యకలాపాల ఊసే ఎత్తకుండా మభ్యపెట్టారు. కానీ ఆ విదేశీ ముద్రణ  సంస్థ తాలూకు 2016 నాటి నివేదికలో మాత్రం ఆ కంపెనీ అనుబంధశాఖ ‘దిలారూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’గా పేర్కొన్నారు. ఇది  ఢిల్లీలో ఆఫీసు పెట్టింది. దాని సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్ర పారిశ్రామిక, ప్రమోషన్‌శాఖతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది. ఈ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ మార్టిన్‌ సూదర్‌లాండ్, ప్రధాని మోదీ తలపెట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకంలో తమ కంపెనీ కీలక పాత్ర వహిస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించాడు (హిందూ 1.1. 2017). దీంతో ఆ కంపెనీ వాటా విలువ 2016 ఏప్రిల్‌ తర్వాత 33. 35 శాతానికి పెరిగింది.

సమాధానాలు రావేమి?
మార్కెట్‌లోకి నగదు విడుదల కావలసి ఉందన్న హుకుంపైన రూ. 10ల చిన్న నోట్లను ప్లాస్టిక్‌ కరెన్సీ (డిజిటల్‌)గా ముద్రించడానికి దిలారూ కంపె నీతో పాటు, మరో మూడు కంపెనీలను ఆర్‌బీఐ ఎంపిక చేసింది. దానికి తగ్గట్టు గానే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌ రాయ్‌ మెఘ్వాల్‌ డిసెంబర్‌ 9న పార్లమెంట్‌లో వెల్లడించారు! గత కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వ హోంశాఖ నిషేధించిన విదేశీ ప్రింటింగ్‌ కంపెనీతో మోదీ ప్రభుత్వా నికున్న సన్నిహిత భాగస్వామ్య స్వభావాన్ని కేంద్ర ప్రభుత్వం వివరించాలని చాందీ కోరారు! చాందీ ప్రశ్నలకే కాదు, ప్రశాంతభూషణ్‌ తాజా ఆరోపణలకు కూడా ఈ క్షణందాకా ప్రధాని మోదీ నుంచి వివరణ  అందిన దాఖాలాలు లేవు. అన్నిటికన్నా ఈ అవినీతి, నల్లధనం గురించి ఆరోపణలలో రాజకీయ వేత్తలెందరో, వారి పనుపున పెరుగుతున్న అధికారులెందరో కూడా వివ రాలు వెల్లడించడం లేదు! నీతిమంతులెందరో, ఎవరో తేలడం లేదు! అంతా శ్రీవైష్ణవులే గానీ రొయ్యల బుట్ట మాత్రం ఖాళీ అన్న సామెత చిరంజీవిగా నిలిచిపోయింది!

మరీ ఘోరమైన విషయం, అమెరికా కేంద్రంగా ఉన్న ‘మూడీస్‌’అనే ఘరానా రేటింగ్‌ ఏజెన్సీ (ఆర్థికాభివృద్ధి,  క్షయాలను అంచనా కట్టే సంస్థ) భారతదేశ రుణగ్రస్థ పరిస్థితి, దుర్బలస్థితిలో ఉన్న బ్యాంకుల దుస్థితినీ అంచనా వేస్తే, ఆ అంచనాను తారుమారు చేసి విదేశీ పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలంగా రేటింగ్‌ను పెంచమని భారత ప్రభుత్వం ఆ సంస్థను ప్రాధేయపడటమే మన పరువు నష్టమని పాల కులు భావించడం లేదు! పెట్టుబడిదారీ వ్యవస్థలో మార్కెట్‌ వ్యవస్థపై ఆధార పడిన రాజకీయాలు ఏనాడూ ప్రజాస్వామిక రాజకీయాలు కాజాలవని లేస్‌ స్పష్టం చేశాడు. అంతకుమించి క్యూబా విప్లవనేత ఫిడెల్‌ కాస్ట్రో ‘అపారమైన మానవ సంపద వనరులున్న దేశం రుణాల కోసం ఎగబడనక్కర్లేదు. వదరు బోతులయిన పాలకులు మాత్రమే అబద్ధాలతో, ఊదరతో ప్రజలను మభ్య పెడుతుంటారు’ అని హెచ్చరించాడని మరచిపోరాదు. సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు కేశవ తాజా పరిణామాలను వర్ణిస్తూ ‘50 రోజుల్లోనే మనం అభివృద్ధి చెందిన  దేశం అయిపోదాం! ఇకనేం, ఇది వెలిగిపోతున్న భారతం (ఇండియా ఈజ్‌ షైనింగ్‌) రెండవ అవతారం’’ అని అంటించి ఉంటాడు?



(వ్యాసకర్త :  ఏబీకే ప్రసాద్‌ సీనియర్‌ సంపాదకులు)

మరిన్ని వార్తలు