అచంచల ప్రేమ

30 Dec, 2016 01:26 IST|Sakshi
అచంచల ప్రేమ

రుజుమార్గం

మానవుడు ఈ ప్రపంచంలో అనేక వాటిని ప్రేమిస్తాడు. కొన్నింటిని చాలా ప్రియమైనవిగా కూడా భావిస్తాడు. తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని, బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు. తనఇంటిని, ఊరును, దేశాన్ని, జీవనసామగ్రిని, పెంపుడు జంతువుల్ని, కొన్నివస్తువుల్ని, కొన్నిజ్ఞాపకాలను ప్రేమిస్తాడు. ఇది మానవ సహజం. ఆయా పరిధుల్లో ధర్మసమ్మతం. అయితే ఇవన్నీ దేవుని ప్రేమకు, ఆయన ప్రవక్తపై ప్రేమకు లోబడి ఉండాలి. దీన్నే ఈమాన్‌ (విశ్వాసం) అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య ఎదురుబొదురు వ్యవహారం సంభవిస్తే దేవుడు, ప్రవక్త ప్రేమ మాత్రమే ఆధిక్యం పొందాలి.

ఒకవ్యక్తి దేవుని ప్రేమలో నిమగ్నమైనప్పుడు,  దైవ స్మరణ, చింతనలో లీనమైనప్పుడు, ఆరాధనలో, సేవలో రేయింబవళ్ళు గడిపినప్పుడు, కృతజ్ఞతా భావంతో అతని ఆత్మ తన్మయత్వం చెందుతున్నప్పుడు, దైవ మార్గంలో కష్టాలు కడగండ్లు భరిస్తున్నప్పుడు దేవుని కరుణా కటాక్షవీక్షణాలు అతనిపై ప్రసరి స్తాయి. దైవం అతణ్ణి తన ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తాడు. ఈవిధంగా ఒక బలహీనుడైన మనిషి తనచిరు ప్రయత్నంతో దేవుని ప్రేమను పొందగలుగుతాడు. ఆయన కారుణ్యం అతనిపై కుండపోతగా వర్షిస్తుంది. అంటే సర్వకాల సర్వావస్థల్లో దైవ ప్రేమ, దైవ ప్రవక్త ప్రేమ ఉఛ్చ్వాస నిశ్వాసలుగా ఉండాలి. ప్రవక్త ఇలా చెప్పారు ‘ఎవరైతే అల్లాహ్‌ కొరకే ప్రేమిస్తారో, అల్లాహ్‌ కొరకే ద్వేషిస్తారో, ఇచ్చినా ఆయన కోసమే, ఇవ్వకున్నా, నిరాకరించినా ఆయన కోసమే చేస్తారో అలాంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నవారవుతారు’.  

ఎవరిపట్లనైనా ప్రేమానురాగాలు కలిగిఉన్నామంటే, లేక ఎవరితోనైనా విభేదిస్తున్నామంటే దైవ సంతోషమే దానికి పునాది కావాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా అది కూడా దైవంకోసమే కావాలి. ఒక నిరుపేదకు ఫలానా సాయం చేయడం వల్ల దేవుడు నన్ను ప్రేమిస్తాడు అన్నభావనే పునాదిగా ఉండాలి. ఎంతగొప్ప పని చేసినా, ఎంతమంచి పని చేసినా దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి. దాని వెనుక మరే ప్రయోజనమూ ఉండకూడదు. నలుగురూ చూడాలని, తనను పొగడాలని ప్రదర్శనా బుధ్ధితో చేస్తే అది ఎంత గొప్ప సత్కార్యమైనా బూడిదలో పోసిన పన్నీరే. అందుకే నీ కుడిచేయి చేసిన దానం నీ ఎడమ చేతికి తెలియకూడదన్నారు మహమ్మద్‌ ప్రవక్త(స). ప్రదర్శనా బుధ్ధి మనిషిని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ పరాభవం పాలు చేస్తుంది. ప్రతిఫల దినాన దైవం, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడావు గనుక అవి నీకు ఇహలోకంలోనే ప్రసాదించాము. ఇక్కడ నీకెలాంటి వాటా లేదు అంటాడు. దైవం పట్ల, దైవ ప్రవక్త పట్ల అచంచలమైన ప్రేమ ఉన్నట్లయితే మానవుడి మనసు విశ్వాసం, విధేయత, భయభక్తులకు నిలయమవుతుంది. అదే అతడి ఇహపర సాఫల్యాలకు జామీనుగా నిలుస్తుంది.
 – యండి.ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు