పిల్లలు.. పరీక్షలు..!

31 Dec, 2016 02:14 IST|Sakshi
పిల్లలు.. పరీక్షలు..!

సందర్భం

ఈ ప్రత్యేక పరీక్షా క్యాంపులు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి జిల్లాలో ఇలాంటి క్యాంపులు పెడితే పేద పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.

పిల్లలకు పరీక్షల కాలం వచ్చింది. ఒక ఏడాది మొత్తం చదివిన చదువుపై పరీక్షలు రాసి తమ అర్హతను ప్రకటించుకోవాల్సి ఉంది. పరీక్షలను మార్కులతో మాత్రమే కొలిచే దశ నుంచి మనం ఇంకా బయటపడలేదనుకుంటా! కానీ మారిన కాలంతో పరీక్షలను అంచనా కట్టి పరీక్షించుకోవాల్సి ఉంది. పరీక్షలంటే ఫలితాలలో వచ్చే ర్యాంకింగ్‌లు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల తేదీలు ప్రకటించడం జరిగింది. కానీ పరీక్షలతో నేర్చుకోవలసినటువంటి పాఠాలు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. ఫలితాలలో విశ్లేషణలు జరగటం లేదని చెప్పటం లేదు. జిల్లాలవారీగా పరీక్షల ఫలితాల లెక్కలు చెబుతున్నారు. అది కేవలం జిల్లాల మధ్య పోటీకి పనికొస్తుంది. కానీ సమాజంలో ఆర్థిక ఎత్తువొంపులలో తేడా ప్రభావం విద్యార్థులపై ఏ విధంగా పడుతుందో దానిపై విశ్లేషణ జరగటం లేదు. అది జరిగితే  విద్య వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో అంచనా వేయవచ్చును.

పరీక్షల లక్ష్యం పోటీలను పెంచటం కాదు, విద్య వలన అభివృద్ధి ఎంత జరుగుతుంది? సమాజం పురోభివృద్ధికి మన చదువులను ఏ మేరకు మలుచుకోగలుగుతున్నాం? సమాజంలో అన్నీ వర్గాలను సమత్వంగా తీసుకువచ్చేందుకు ఈ చదువులను ఎలా ఉపయోగించుకోవాలి? చదువుకు పేదరికానికి సంబంధం ఉంది. ఆ క్రమంలోనే పేదరికానికి పరీక్షల ఫలితాలకు సంబంధం ఉంటుంది. కొందరు పిల్లలు గుడిసెల నుంచి; మురికి వాడల నుంచి వస్తున్నారు. వీరి సంసారమంతా ఒకే గదిలో జరుగుతుంది. సంసారంలో జరిగే అవకతవకలు, ఆర్థిక ఇబ్బందులు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆహార రక్షణ భద్రత లేని కుటుంబాల ప్రభావం కూడా పరీక్షలు రాసే పిల్లలపై పడుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు తీసుకునే పుష్టికరమైన ఆహార ప్రభావం కూడా పరీక్ష ఫలితాల్లో ఉంటుంది. తల్లిదండ్రుల చదువు ప్రభావం కూడా పిల్లల సాధనపై ఉంటుంది.

తెలంగాణలోని చాలా మంది పిల్లలు చదువు విషయంలో మొదటి తరంగా ముందుకు వచ్చారు. కొన్ని కులాలు, సంచార జాతులకు చెందిన వారు, బలహీన వర్గాలలో కూడా బాగా వెనుకబడ్డ కులాల పిల్లలు మొదటి తరంగా చదువులోకి అడుగు పెడుతున్నారు. 10వ తరగతి దశకు వచ్చిన మొదటి తరం పిల్లలు ఉన్నారు. వారు ఆ కుటుంబంలోనే మొదటి తరం చదువుకున్న వారుగా చూడాలి. ఇవన్నీ గమనించే గత 15 సంవత్సరాల నుంచి వందేమాతరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ పై లోపాలను సరిచేస్తూ పరీక్షలకు ముందు 45 రోజుల పరీక్షల క్యాంపును నిర్వహిస్తోంది. ఈ క్యాంపులో చదువుకునే పిల్లలు వెనుకబడిన వర్గాల పిల్లలు, మరీ ముఖ్యంగా సగం కంటే ఎక్కువ మంది ఆడపిల్లలున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లా తొర్రూర్‌ తదితర ప్రదేశాలలో ఈ వందేమాతరం సంస్థ చేసే పరీక్షల క్యాంపుల ఫలితాలను విశ్లేషించటం జరిగింది. చాలా మంచి ఫలితాలు కన్పించాయి. ఈ శిక్షణ పొందిన  వారు మంచి మార్కులను తెచ్చుకోవడమే కాక ఉన్నత చదువుల వైపుకు వెళుతున్నారు. దీని వలన ట్రిపుల్‌ ఐటీలో గత ఏడాది 13 క్యాంపులు నిర్వహించారు. అది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇలాంటి క్యాంపులు ప్రతి జిల్లాలోనూ నడిపించగలిగితే అది ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. పరీక్షలంటే పాస్, ఫెయిల్‌ అని ముద్రలు వేయడానికి కాదు. పరీక్షలంటే జవాబుదారీతనాన్ని వ్యక్తం చేయాలి. పేదరికానికి, చదువుకు ఉన్న సంబంధాన్ని విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు జీవితం తెలుసు, అట్టడుగు బహుజన వర్గాల పేదరికం తెలుసు. ఈ ప్రత్యేక పరీక్షా క్యాంపులు తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది.

ప్రతి జిల్లా ఇలాంటి క్యాంపులు పెడితే పేద పిల్లలకు ఉపయోగపడుతుంది. పరీక్షల ఫలితాలతో పాటు పిల్లల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రోజులో కుటుంబ సర్వేని నిర్వహించింది. ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా, ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను ఆధారం చేసుకుని విశ్లేషిస్తే  రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంపులు పెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడున్న తక్కువ  సమయంలో ఈ పరీక్షల నిర్వహణకు ఏ మేరకు పరీక్షల క్యాంపును ఏర్పాటు చేయగలిగితే ఆ మేరకు మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణ వెనుకబడిన వర్గాల పిల్లలకు ఈ పరీక్షల క్యాంపులు ఎంతో దోహదం చేస్తాయి.


(వ్యాసకర్త : చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు)

మరిన్ని వార్తలు