విశ్వకవికి చైనా నీరాజనం

28 Feb, 2016 23:36 IST|Sakshi
విశ్వకవికి చైనా నీరాజనం

భారత-చైనాల మధ్య సాహిత్య సాంస్కృతిక బంధాలకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పునాది వేశారు. తొమ్మిది దశాబ్దాల క్రితం ఆ మహాకవి చేసిన చైనా సందర్శన అక్కడి మేధావులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ మహానుభావుడిని ఆ దేశం ఈనాటికీ గౌరవిస్తూనే ఉంది.మొన్న డిసెంబరు నెలలో చైనాలో పర్యటించిన మా భారత-చైనా మిత్రమండలి బృందం దృష్టిని ఈ విషయం విశేషంగా ఆకర్షించింది.
 
చైనాలోని పాఠశాల విద్యలో ‘ఫ్రూట్ గ్యాదరింగ్’ అన్న టాగూర్ రచనను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ఆ కవితా ధారను ఆ జాతి యావత్తూ బాల్యం నుంచే ఆస్వాదించే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాదులో ఏడాదికోసారి పుస్తక ప్రదర్శన పెడితేనే పుస్తక ప్రియులకు పండుగ చేసుకున్నట్టుంటుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై మహానగరంలో ఉన్న ఏడంతస్తుల ‘షాంఘై బుక్ సిటీ’లో మాత్రం ప్రతి రోజూ పుస్తక పండుగే. మన పుస్తక ప్రదర్శనకు ఎన్నో రెట్లుండే బుక్ సిటీలో లూషన్, గోర్కీ వంటి మహామహుల చిత్రపటాలతోపాటు రవీంద్రుడి చిత్రపటాన్ని కూడా పెట్టారు.
 
సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా ఆయన గురించి వారు గర్వపడతారు. టాగూర్ కమ్యూనిస్టు కారు. నోబెల్ బహుమతి పొందిన ఆయన ‘గీతాంజలి’ని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దిగ్గజాలలో ఒకరైన చెన్ డుగ్జియు చైనా భాషలోకి 1915లోనే అనువాదం చేశారు.

 భారతదేశంలో చైనాపై అధ్యయనానికి ‘విశ్వభారతి’లో రవీంద్రుడు ఏర్పాటు చేసిన చైనా భవనం తొలి భారత-చైనా సాంస్కృతిక సంబంధాలకు ఎంతగానో దోహదపడింది. తాన్‌యున్ వంటి చైనా మేధావులు, ఉపాధ్యాయులు ఈ చైనా భవనంలో చాలా కాలం గడిపారు. చైనా నాగరికత, ఆధునిక అభివృద్ధి గురించి అర్థం చేసుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడింది.

 బ్రిటిషు ఇండియాలో ఎక్కువగా పండించే నల్లమందును చైనాపై రుద్దడాన్ని టాగూర్ తన ఇరవయ్యవ ఏటనే వ్యతిరేకించారు. ‘చీనీ మార్నరే బేబస్’ అంటే ‘చైనాలో ప్రజలను చంపే వ్యాపారం’ అన్న శీర్షికన నల్లమందు వ్యాపారంపై 1881లోనే వ్యాసం రాశారు.
 చైనా సందర్శనకు ముందే టాగూర్‌కు ప్రముఖుడిగా గుర్తింపు ఉంది. రెండు నాగరికతల మధ్య ప్రేమ, సోదర ప్రియత్వం వెల్లివిరియాలనీ, పరస్పర ప్రయోజనాలను పొందే సంబంధాలను కొనసాగించాలనీ చైనా పర్యటన సందర్భంగా ఆ మహాకవి ఆకాంక్షించారు. ‘మీ నుంచి కొన్ని కలలు పుట్టుకొస్తాయి. మీనుంచి వచ్చే ప్రేమ సందేశం విభేదాలను తొలగిస్తుందని భావిస్తున్నా. ఏది సాధ్యమో అది చేశా. స్నేహితులను సంపాదించుకున్నా’ అని చైనాలో తన చివరి మాటగా టాగూర్ అన్న మూడు దశాబ్దాల తరువాత పంచశీల సూత్రాలపై ఉభయ దేశాలూ సంతకాలు చేశాయి.

(వ్యాసకర్త : రాఘవశర్మ 9493226180)

>
మరిన్ని వార్తలు