సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!

4 Nov, 2016 00:37 IST|Sakshi
సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!

సమకాలీనం
దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్‌ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నికరాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని లా కమిషన్‌ ఏనాడో సిఫారసు చేసింది.

ఏ దేశ న్యాయవ్యవస్థ నుంచైనా ఆ దేశస్తులు ఆశించేదేముంటుంది? అమె రికా చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన ఎర్ల్‌ వారెన్‌ (అంతకు ముందు మూడు పర్యా యాలు కాలిఫోర్నియా గవర్నర్‌) ఆ పదవి చేపట్టడానికి ముందు ఒక గొప్ప మాట చెప్పారు.
‘‘...ఎక్కడ అన్యాయం జరిగినా మనం సరిదిద్దాలి. ఎక్కడ పేదరికం ఉన్నా మనం నిర్మూలించాలి. ఎక్కడ హింస చెలరేగినా మనం శిక్షించాలి. ఎక్కడ నిర్లక్ష్యం పొడచూపినా మనం శ్రద్ధ–భరోసా కల్పించాలి’’
 
ఇంతకన్నా న్యాయవ్యవస్థ నుంచి ఎవరైనా ఏమాశిస్తారు? కానీ, ఇవేవీ లభించనప్పుడు... పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? పరిష్కారం నోచక న్యాయస్థానాల్లో కూరుకుపోయిన కోట్లకొలది కేసుల్లోని కక్షిదారులు మన దేశంలో సకాలంలో న్యాయం అందక అలమటిస్తున్నారు. ‘న్యాయ జాప్యం న్యాయ తిరస్కరణ కిందే లెక్క’ అన్న మౌలిక సూత్రం ప్రకారం చూస్తే ఇక్కడ న్యాయమెంత అపురూపమైందో ఊహించవచ్చు. ఎంత అరు దైనదో! అని కూడా అనిపిస్తుంది. ఒక లోతైన సమీక్ష, ఆత్మపరిశీలన, ప్రగతి శీల సంస్కరణలు, ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన దిశా నిర్దేశం అవస రమైన పరిస్థితిని భారత న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది.

న్యాయ మూర్తుల ఖాళీలు–నియామకాలు, కొలీజియం–కమిషన్‌ స్పర్థలు, సుప్రీం కోర్టు–కేంద్రప్రభుత్వం గిల్లికజ్జాలు వంటివి బయటకు కనిపించే పాలనాపర మైన వివాదాల్లాగున్నా... అంతర్లీనమైన ఎన్నో కారణాలు, ఎత్తులు–పై ఎత్తులూ తలచుకుంటే మనసును కలచివేస్తాయి. వాటి ప్రతికూల ప్రభావం ప్రజాస్వామ్య స్పూర్థికి గండికొట్టడమే కాక, భారత రాజ్యాంగం సంకల్పించిన దేశ సమ పురోగతినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పైపైన కనిపించే న్యాయ– కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విభేదాలుగానో, న్యాయ–శాసన వ్యవస్థల మధ్య పంతాలుగానో వీటిని చూడలేము. ఇంకొంచెం లోతుకు వెళ్లి, రాజ్యాంగం అమలును సాకారం చేసే మూడు కీలకాంగాల మధ్య  సమ న్వయ సాధనకు ప్రతిబంధకమౌతున్న కారణాల్ని అన్వేషించాలి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ వంటి వారు చిత్తశుద్ధితో కృషిచేయాలి.

ఏకాభిప్రాయం ఎందుకు రాదు?
ఏ విషయంలోనైనా కాస్త పట్టువిడుపులుంటే ఏకాభిప్రాయం సుసాధ్యమే! న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే ఎంపిక చేయడమేమిటన్న మౌలిక ప్రశ్నతో ‘కొలీజియం’ పద్ధతి వివాదాస్పదమైంది. కొలీజియం భేటీల్లో వెల్ల డయ్యే అభి ప్రాయాల్ని రికార్డు చేయటం లేదని, పారదర్శకత లోపించిందని, జవాబు దారీతనం కోసం వాటిని పొందుపరచడం అవసరమని... అందులో సభ్యు డైన జస్టిస్‌ చలమేశ్వర్‌ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వివాదం మరింత జటిల మైంది. న్యాయమూర్తుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ న్యాయ నియామక కమిషన్‌’ (ఎన్‌జేఏసీ) ప్రక్రియ కూడా లోపభూయిష్ఠంగా ఉందనే విమర్శలు వచ్చాయి. దరిమిలా గత సంవ త్సరం సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు కమిషన్‌ చెల్లుబాటునే కొట్టివేసింది. ఫలి తంగా తలెత్తిన ప్రతిష్ఠంభన ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి ఆటం కంగా మారింది. ఈ లోపు, నియామకాల కోసం కొంత ప్రత్యామ్నాయ ప్రక్రియ జరిగినా... ప్రతిష్ఠంభన మాత్రం తొలగలేదు. నిజానికి అసాధారణ ఖాళీలకు, కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాలకు అదొక్కటే కారణం కాదు. చివరకు పరిస్థితి, ‘న్యాయవ్యవస్థను ధ్వంసం చేసి, న్యాయ స్థానాల్నే మూసివేయాలనుకుంటున్నారా? అది సాగనివ్వం...!’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహించే దాకా వచ్చింది. ‘మా సహనం పరీ క్షించకండి, కార్యనిర్వాహక వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి న్యాయవ్యవస్థను బలిపెట్టకండి’ అని కూడా మందలించారు. కమిషన్‌ రద్దుతో పూర్వపు కొలీ జియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వపు అభ్యంతరాల దృష్ట్యా కొత్తగా ఒక ‘ప్రక్రియ పత్రం’ (ఎంఓపీ) రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు  కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఎంఓపీ పై ఏకా భిప్రాయం కుదరకపోవడంతో అది అమల్లోకి రాలేదు.

‘అయినా నియామక ప్రక్రియ ఏం ఆగిపోలేదు కదా! గడచిన రెండేళ్లలో పెద్ద సంఖ్యలోనే జడ్జీల నియామకాలు, సుప్రీం కొలీజియం ప్రతిపాదించినట్టు జడ్జీల బదిలీలు చేశాం’ అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ‘86 మంది హైకోర్టు జడ్జీల్ని, నలు గురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొత్తగా నియమించాం, 33 మంది హైకోర్టు జడ్జీల్ని, నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొలీజియం ప్రతిపాదించినట్టే బది లీలు చేశాం’ అన్నది కేంద్ర వాదన. ‘మేం 77 మంది జడ్జీల జాబితా ఇస్తే, కేవలం 18 మందినే ఖరారు చేశారు. మిగతా పేర్ల జాబితా పెట్టుకొని కూర్చో వడం ఏం పద్ధతి, అందులో ఎవరి విషయంలోనైనా అభ్యంతరాలుంటే వెనక్కి పంపొచ్చు కదా! మేం పరిశీలించి, సరిదిద్ది పంపుతాం’ అనేది సుప్రీం వాదన. ఎదుటివారి ఆధిపత్యాన్ని అంగీకరించరాదన్న ఇరువురి భావనే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమని న్యాయనిపుణులభిప్రాయపడుతున్నారు. కేంద్రం తాజాగా రూపొందించిన ఎంఓపీలో ఒక ప్రతిపాదన ఉంది. కొలీ జియం ప్రతిపాదనలు ఇష్టం లేకుంటే, దేశ భద్రత కారణాలతో వీటో చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. అది తుది నిర్ణయమౌతుంది, అలాంటి నిర్ణయాధికారం ఉండటాన్ని ఆధిపత్యంగానే సుప్రీం భావిస్తున్నట్టుంది.

గగుర్పాటు కలిగించే గణాంకాలు
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల్ని తలచు కుంటే గగుర్పాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా 2.72 కోట్ల కేసులు పెండిం గ్‌లో ఉండగా, అందులో 2.30 కోట్ల కేసులు కిందిస్థాయి (సబార్డనేట్‌) న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఒక లెక్క. అన్ని హైకోర్టుల్లో 40 లక్షల కేసుల వరకు, సుప్రీంకోర్టులో 60 వేల వరకు కేసులు, వివాదాలు అపరి ష్కృతంగా ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. గత సెప్టెంబరు1 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్‌ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నిక రాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని చాలా కాలం కిందటే లా కమిషన్‌ సిఫా రసు చేసింది. ఇక ఖాళీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఇదే నెల ఒకటో తేదీ నాటికి ఉన్నత న్యాయస్థానాల్లో ఈ ఖాళీల సంఖ్య 461 (1079 ఆమోదించిన పోస్టులు) అని న్యాయశాఖ వెల్లడించింది. అంటే, దాదాపు 46 శాతం పైనే ఖాళీలన్నమాట! అందులో అయిదు ఖాళీలు సుప్రీం కోర్టువి కూడా ఉన్నాయి. మన ఉమ్మడి న్యాయస్థానంలో ఆమోదించిన 61 జడ్జీ స్థానాలకు గాను 23 మంది మాత్రమే ఉన్నారు. ఇది సగం కన్నా చాలా తక్కువ. ఇక దేశంలో కింది స్థాయి న్యాయస్థానాల్లో 4,400 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుమతించిన పోస్టుల్లో ఇది దాదాపు సగం సంఖ్య. ఖాళీ లను భర్తీ చేసేలా జడ్జీల నియామకం పాలనాపరమైన నిర్ణయమే అయినా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల పాత్ర ఉంటుంది. కోర్టుల్లో కేసుల పరి ష్కారం కావడంలో జాప్యాలకు అనేకానేక కారణాలున్నా, జడ్జీల కొరత, ఖాళీలు కూడా ప్రధానమైనదేనని లా కమిషన్‌ 245వ నివేదిక స్పష్టం చేసింది. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక/కనీస సదుపాయాల్ని మెరుగు పరచాలని విస్పష్టంగా సిఫారసు చేసింది. అమలు ఆమడ దూరంలోనే ఉంది. ‘కేసు ఓడిన వాడు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడ’న్న నూరేళ్ల కింద పుట్టిన నానుడి కాస్త అటుఇటుగా ఇప్పటికీ వాస్తవం కావడమే దురదృష్టకరం!

సంస్కరణ లు, చొరవ అవసరం
‘దేశంలోని న్యాయస్థానాల్లో ప్రభుత్వమే ఓ పెద్ద కక్షిదారు, ఆ పరిస్థితి ఉండ కూడదు, వీలయినన్ని వివాదాల్ని ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకొని న్యాయస్థానాలపై భారం తగ్గించాల’ని స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు. నిజమే! పాలకుల నిర్లక్ష్యం, కార్యనిర్వాహక వ్యవస్థ తోలుమందం వైఖరి వల్ల సమస్యలు, చట్టోల్లంఘనలు తలెత్తి  బాధితులైన పౌరులు న్యాయస్థానాలకెక్కాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, పౌరులకు అనుకూలంగా కోర్టులు తీర్పిచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి, న్యాయధిక్కార (కంటెప్ట్‌) కేసులు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తు న్నారు. ఇది పౌరులకు అదనపు కష్టం, ఓ రకంగా వేధింపే! అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తున్నట్టు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను ఉపయోగించుకొని న్యాయ విచారణ ప్రక్రియల్లో ఇ–సిస్టమ్స్‌ అభివృద్ధి చేసుకోవాలి. న్యాయ వ్యవస్థలోనూ బాధ్యత–జవాబుదారీతనాన్ని వ్యవస్థాగతం చేయాల్సిన అవస రాన్ని న్యాయకోవిదులు నొక్కి చెబుతున్నారు.

రెండో తరం సంస్కరణలకు వాకిళ్లు తెరవడమే కాకుండా న్యాయమూర్తులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ మరింత చొరవ చూపాలి. న్యాయ జాప్యాల నివారణకు తోడ్పడుతూనే సత్వర న్యాయానికి మానవీయ దృక్పథాన్ని కనబరచాలి. యావజ్జీవ శిక్షపడ్డ కేసుల్లో సదరు అప్పీళ్లు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నపుడు, సదరు ఖైదీలకు సానుకూల దృక్ప«థంతో బెయిలివ్వాలని హైదరాబాద్‌ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. అభియోగం ఎదుర్కొం టున్న ఒక వ్యక్తి, సత్యాసత్య నిరూపణతో నిమిత్తం లేకుండా నేరాన్ని స్వయంగా అంగీకరించినా... విధించే పూర్తి శిక్షా కాలానికి మించి, విచారణ ఖైదీలుగానే జైళ్లలో మగ్గే దుస్థితినేమనాలి? విచారణ అనంతరం దోషిగా తేలినా, నిర్దోషిగా విడుదలైనా, మన పాలనాపరమైన నిర్హేతుక కారణాలతో జైల్లో మగ్గిన సదరు కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? ఖాళీల్ని భర్తీ చేస్తూ సత్వర నియామకాలు జరిపి కోట్లాది పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించాలి. మహ నీయుడు జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ చెప్పిన ఒకమాట గుర్తుచేస్తాను.

‘‘...తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం తీర్పుతో, దురదృష్టకరమైన ప్రయోగంగా వచ్చిన కొలీజియం పక్షపాత నియామకాలెంత అసంతృప్తి నిచ్చాయో తెలుసు... అలా అని కార్యనిర్వాహక వ్యవస్థనూ విశ్వసించలేము, ఎందుకంటే, దానివల్ల నియామక ప్రక్రియలోకి రాజకీయాలు జొరబడ తాయి. ప్రధానమంత్రికి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టే పద్ధతిని మనం బ్రిటిష్‌ పార్లమెంటరీ విధానం నుంచి అరువు తెచ్చుకున్నాం, అదెంత లోపభూయిష్ట మంటే, 30 మంది బంధువులు, పార్టీ శ్రేణుల్ని బెంచి మీదకు తెచ్చినట్టు

లార్డ్‌ హల్స్‌బరీనే విమర్శలెదుర్కోవాల్సి వచ్చింది. అందుకని, సమపాళ్లలో ప్రాతి నిధ్యముండే జాతీయ న్యాయ కమిషన్‌ నియామకమే మంచిది. జడ్జీల పనితీరును కూడా ఇదే కమిషన్‌ తనిఖీ చేయాలి, పర్యవేక్షించాలి.’’ ఆయన చెప్పిన బాటలో, ప్రజాస్వామ్య మూల స్తంభాలయిన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో ఆలోచించి పనికొచ్చే పరిష్కారం వెతకాలి.


(వ్యాసకర్త :  దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌:  dileepreddy@sakshi.com)

మరిన్ని వార్తలు