దయ గురించి రాస్తే దయ పుట్టదు!

25 Apr, 2016 00:56 IST|Sakshi
దయ గురించి రాస్తే దయ పుట్టదు!

రచనా ప్రక్రియ

అమెరికన్ కథా, నవలా రచయిత్రి ఫ్లానెరీ ఓ కానర్ (1925-1964)కు కథా ప్రక్రియ గురించి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి:
‘‘కథంటే ఒక పరిపూర్ణ నాటకీయత కలిగిన కథనం. మంచి కథలో యాక్షన్ ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది. పాత్రలే యాక్షన్‌ను కంట్రోల్ చేస్తాయి. ఫలితంగా, కథ ఒక అనుభవైకవేద్యమైన అనుభూతిగా మిగిలిపోతుంది. పాత్రంటే ఒక వ్యక్తి. లక్షల మందిలో అతడొకడైనప్పటికీ కథకు సంబంధించినంతవరకూ అతడో ప్రత్యేకమైన వ్యక్తి. కథా గమనంలో ఆ ప్రత్యేక వ్యక్తిలోని అనిర్వచనీయత, మిస్టరీ పాఠకునికి అవగతమవుతుంది.

కానీ, కొందరు రచయితలు వ్యక్తుల్ని గురించి గాక, సమస్యల గురించి రాయాలని తహతహలాడుతారు. తమకు తెలిసిన లౌకిక జ్ఞాన సారమంతా పాఠకులకు కథలుగా చెప్పాలనుకుంటారు. అసలు విషయమేమిటంటే, వాళ్ల దగ్గర జ్ఞానం వుంటే వున్నదేమోగాని కథ మాత్రం లేదు. ఉన్నా రాసే ఓపిక లేదు.
 
కథలు రాసేటప్పుడు మన నమ్మకాలు, మన నైతిక విలువలు మనకు మార్గదర్శకంగా, కరదీపికలుగా వుంటాయి. అయితే, ఆ విలువలు వెలుగుగా పనికొస్తాయిగాని వస్తువులు మాత్రం కావు. వెలుగు సాయంతో లోకాన్ని చూడాలి. కాని వెలుగే లోకం కాదు.
 
దయ గురించి రాసి దయనూ, సానుభూతి గురించి రాసి సానుభూతినీ , ఉద్రేకం గురించి రాసి వుద్రేకాన్నీ పాఠకుల్లో కలిగించలేమని రచయితలు గ్రహించాలి. ఈ దయ, సానుభూతి, వుద్రేకం వున్న సజీవ వ్యక్తుల్ని- బరువూ, ఒడ్డూ, పొడుగూ, కొంత నిర్ణీత జీవితకాలమూ వున్న వ్యక్తుల్ని సృష్టించాలి.కథా రచన అనే ప్రక్రియకు మూలం కథ చెప్పడం కాదు, జరిగింది చూపించడం’’.
 (రెండు నవలలూ, 32 కథలూ, ఎన్నో వ్యాసాలూ రాసిన ఫ్లానెరీ ఓ కానర్ నలభై ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.)
 ముక్తవరం పార్థసారథి
 9177618708

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా