రిజర్వేషన్ల అగ్గి

18 Apr, 2017 00:14 IST|Sakshi
రిజర్వేషన్ల అగ్గి

ఏదైనా చేయదల్చుకున్నప్పుడు ఎన్ని వివాదాలు ఎదురైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో తనకెవరూ సాటిరారని నిరూపించుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విద్య, ఉద్యోగావకాశాల్లో వెనకబడిన ముస్లింలు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్లు పెంచే కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. శాసనసభలో ఆదివారం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతూ ఆయనన్నట్టు ఇది చరిత్రాత్మకమైనదే. 119మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి చెందిన అయిదుగురు మినహా మిగిలినవారంతా ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. త్వరలో ఎస్సీ, బీసీల కోటాను పెంచే ప్రక్రియ కూడా మొదలుపెడతామని కేసీఆర్‌ అంటున్నారు.

కుల వ్యవస్థ కారణంగా మన దేశంలో శతాబ్దాల నుంచి వేళ్లూనుకున్న అసమానతలను పారదోలడానికి రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన పలు మార్గాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒకటి. విచారకరమైన అంశమేమంటే, స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఆ వర్గాలవారి స్థితిగతులు పెద్దగా మారింది లేదు. ముఖ్యంగా కొన్ని అణగారిన కులాలవారు, ఆదివాసీలు ఈనాటికీ తమకు లభించిన కోటాను అటు చదువుల్లో కావొచ్చు... ఇటు ఉద్యోగావకాశాల్లో కావొచ్చు సంపూర్ణంగా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. మరోపక్క వేరే మతంలో ఉంటున్నా ఇదే తరహా వివక్ష ఎదుర్కొంటున్న వారి ఉద్ధరణను ప్రభు త్వాలు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ముస్లింలలోగానీ, క్రైస్తవుల్లోగానీ అత్యధిక శాతంమందికి చెందిన పూర్వీకులు హిందూ దళితులు, వెనకబడిన వర్గాలవారేనని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వీరికి ఎలాంటి ఆసరా కల్పించాలన్న విషయంలో అనేక వివాదాలున్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం మాట్లాడలేదు గనుక ఆ వర్గాలకు కోటా వర్తింపజేయడం సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సామాజిక, ఆర్ధిక వెనకబాటు ప్రాతిపదికగా దేశంలోనే తొలిసారి ముస్లిం గ్రూపులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2004లో ఉత్తర్వులు జారీచేశారు. ఒకసారి హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేశాక మరు సటి సంవత్సరం మరోసారి జీవో జారీచేశారు. దాన్ని కూడా కాదన్నాక బీసీ కమిషన్‌ ద్వారా అధ్యయనం చేయించి ఆ సిఫార్సుల ప్రాతిపదికన ముస్లింలను బీసీ-ఈ జాబితాలో చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో చట్టం తీసుకొచ్చారు. దాన్ని సైతం రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చాక సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ రిజ ర్వేషన్లు కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం 2010లో మధ్యంతర ఆదే శాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ ఆదేశాలే అమల్లో ఉన్నాయి.
దేశంలో భిన్న వర్గాల్లో చైతన్యం పెరిగింది.

సమాజంలో తాము కూడా అందరిలా ఎదగాలని, గౌరవప్రదంగా బతకాలని, అడ్డంకుల్ని అధిగమించాలని ఆకాంక్షిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. తమకూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కాపులు, పటేళ్లు, గుజ్జర్లు, జాట్లు, మరాఠాలు డిమాండ్‌ చేస్తున్నారు. వివిధ వర్గాల సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష జరిపి, లోటుపాట్లను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పదే పదే తలెత్తుతున్న ఈ ఆందోళనలన్నీ తెలియజెబుతున్నాయి. ముస్లింలతోసహా సామాజికంగా, విద్యాపరంగా వెనక బడిన వర్గాల వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం అవసరమేనని ఆదివారం భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభిప్రాయపడ్డారు. ముస్లింలలో వెనకబడినవారి సంఖ్య ఎక్కువేనని అంగీకరించడమేకాక... ఓబీసీలపై జరిగే చర్చలో ముస్లింలను భాగం చేయాలని కూడా సూచించారు. ఇది కేసీఆర్‌ ప్రయత్నానికి నైతికబలం ఇచ్చే పరిణామం.

పదేళ్లక్రితం జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ నేతృత్వంలోని కమిటీ వెలువరించిన నివేదిక మన దేశంలో ముస్లింల స్థితిగతులను వెల్లడించింది. సామాజిక వెనక బాటుతనంలో ముస్లింలు షెడ్యూల్‌ కులాలు, తెగలకన్నా దయనీయంగా ఉన్నారని గణాంక సహితంగా తెలిపింది. సివిల్‌ సర్వీస్‌ అధికారుల్లో ఆ వర్గాలవారు మూడు శాతానికి మించిలేరని, ప్రభుత్వోద్యోగాల్లో అయిదు శాతం మించరని తెలిపింది. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి చిన్నా చితకా వృత్తులు చేసుకుంటూ పొట్ట పోషించుకునేవారు ముస్లింలలో అధికం. హిందువుల్లోని వెనకబడిన వర్గాలకూ, వీరికీ ఆర్ధిక సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి వ్యత్యాసమూ లేదు. అలాంటపుడు కేవలం ముస్లింలన్న కారణంగా ఆ వర్గాల అభ్యున్నతిని విస్మరించడం అమాన వీయం అవుతుంది.  

ప్రస్తుత రిజర్వేషన్ల బిల్లు చకచకా ముందుకు కదిలి వెనువెంటనే చట్టరూపం తీసుకుంటుందని చెప్పలేం. అందుకు ఎన్నో అవరోధాలున్నాయి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడం కోసం బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చమని కేంద్రాన్ని కోరతామని కేసీఆర్‌ చెబుతున్నారు. 69శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న తమిళనాడు, 73 శాతం వరకూ అమలు చేస్తున్న జార్ఖండ్‌ ఈ బాటనే ఎంచుకున్నాయి. కోటా 50 శాతం మించరాదన్న 1992నాటి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడమే వాటి ఉద్దేశం. అయితే ఏ చట్టమైనా రాజ్యాంగ మౌలిక స్వరూ పానికి భిన్నంగా ఉన్నదని భావించిన పక్షంలో న్యాయసమీక్ష జరిపేందుకు 9వ షెడ్యూల్‌ తమకు అవరోధమేమీ కాదని 2007లో సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇదెంత వరకూ అక్కరకొస్తుందో అనుమానమే. పైగా ఏ చట్టాన్నయినా 9వ షెడ్యూ ల్‌లో చేర్చాలంటే పార్లమెంటు ఆమోదంతోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో సగానికిపైగా అందుకు ఒప్పుకోవాలి. బీజేపీ నిరసనల సంగతలా ఉంచి ప్రస్తుత రిజర్వేషన్ల బిల్లు ఇన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. ముస్లింలలో వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతికి తోడ్పడే ఇలాంటి చర్యలు విజయవంతం కావాలని ప్రజాస్వా మికవాదులంతా ఆకాంక్షిస్తారు.

మరిన్ని వార్తలు