‘మద్యం’తో ఫుట్‌ బాల్‌ క్రీడ

22 Nov, 2016 01:13 IST|Sakshi
‘మద్యం’తో ఫుట్‌ బాల్‌ క్రీడ

విశ్లేషణ
బిహార్‌లో మద్య నిషేధం విధించిన నితీష్, ఎన్టీఆర్‌లా తాగుడు సామాజిక పర్య వసానాలకు, ప్రభుత్వ నిధులకు మధ్య సమతూకం సాధించారు. సమర్థ పాలనకు మద్యం రాబడులు కావాలనేవారు ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య విధానం తలకిందులు అవుతుండటం పరిపాటిగానే సాగింది. 1993లో సారా నిషే« ధాన్ని, 1995లో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. మద్యం ద్వారా వచ్చే పన్నుల రాబడిలో నష్టాన్ని కారణంగా చూపి 1997లో దాన్ని సడలిం చారు. ఇటీవల బిహార్‌ మద్య నిషేధాన్ని విధించగా, కోర్టులు దాన్ని కొట్టేశాయి. దీంతో మరో కొత్త చట్టంతో ఆ రాష్ట్రం తిరిగి నిషేధాన్ని విధించింది. చూడబోతే మద్య నిషేధం ఫుట్‌ బాల్‌ ఆటలా మారినట్టుంది.

తమిళనాడులో మద్య నిషేధం అప్పుడప్పుడు అమల్లోకి రావడం, ఎత్తివేయడం జరిగింది. మద్యం దుకాణాల సంఖ్యను, అమ్మే సమయాన్ని తగ్గించడం ద్వారా ఇప్పుడు అది తిరిగి ఆ దిశగానే సాగుతోంది. మద్రాస్‌ ప్రెసిడెన్సీగా ఉన్నప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మద్య నిషేధ వారసత్వం ఉంది. మొదటిసారిగా 1971లో దాన్ని సడలించి, 1974లో బిగుతుగా బిగించే శారు. 1981లో మొత్తంగానే ఎత్తేశారు. ఎప్పటికప్పుడు దేశవాళీ మద్యాన్ని అనుమతించడం, నిషేధించడం జరు గుతోంది. నేడు అన్ని పార్టీలూ నిషేధానికి కట్టుబడి ఉన్నామని వాగ్దానం చేస్తున్నాయి. అయితే నిషేధాన్ని అమలు చేయడం ఎలాగనే విషయంలో భిన్నాభిప్రాయా లతో ఉన్నాయి. మహారాష్ట్రలో అధికారికంగా నిషేధం ఊసులేకున్నా, అది కూడా ఆ బాటలోనే సాగుతోంది. అక్కడ మొరార్జీ దేశాయ్‌ హయాం నుంచి మద్యం తాగడానికి ఎవరికైనా అనుమతి (పర్మిట్‌) ఉండాలి. నిత్య వ్యవహారంలో ఈ అనుమతి ఒక పరిహాసోక్తిగా మారింది. మందు పుచ్చు కోవాలంటే ఆరోగ్యపరమైన కారణాలను చూపాలి. అయితే రెస్టారెంట్లు ఇప్పుడు యథేచ్ఛగా మందును అందిస్తున్నాయి.

మద్య నిషేధ సరళీకరణ విధానాన్ని ప్రకటించాక నెలకు సరిపడా మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవడాన్ని అనుమతించారు. ఇప్పుడు దాన్ని తిరగదోడి రెండు ‘యూనిట్ల’కు పరిమితం చేశారు. యూనిట్‌ అంటే 40 శాతం శుద్ధ ఆల్కహాల్‌ను కలిగిన ఒక బాటిల్‌ మద్యం అని అర్థం. ఈ విన్యాసానికి కారణమేమిటో వివరించ లేదు గానీ బహుశా అన్నా హజారే ప్రభావం కావాలి. మునుపటి నిబంధన ప్రకారం నెలకు 48 బీరు సీసాలను (650 ఎమ్‌ఎల్‌) లేదా 16 వైన్‌ సీసాలను(750 ఎమ్‌ఎల్‌) లేదా 16 ఆల్కహాల్‌ సీసాలను (750 ఎమ్‌ఎల్‌) ఇంట్లో ఉంచుకోవచ్చు. పర్మిట్‌ ఉన్నవారు మొత్తం శుద్ధ ఆల్క హాల్‌ 12 యూనిట్లకు మించకుండా ఈ మూడు రకాల మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎక్సైజు పన్నుల రూపంలో రూ. 13,500 కోట్లు, వ్యాట్‌ రూపంలో మరో రూ. 8,000 కోట్లు గత ఏడాది మద్యం వ్యాపారం నుంచి రాబడి లభించింది. కాబట్టి ఇప్పటికే భారీ రుణ భారాన్ని మోస్తూ, కార్లపై విధించే టోల్‌ను కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లిస్తున్న రాష్ట్రం మద్య నిషేధం విధించనున్నదని ఊహించడమూ కష్టమే. మద్య నిషేధం ఎత్తివేతకు చంద్రబాబు చూపిన ఆర్థిక సహేతుకత గుర్తుందా? చివ రకు ఇది ప్రభుత్వ ఖజానాలోని నగదుగా తేలుతుంది.

ఉదాహరణకు, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ కఠోర నిబంధనలతో కూడిన మద్య నిషేధం కోసం పట్టుబట్టడం సాహసోపేతమైన చర్యే. రూ. 4,000 కోట్ల వార్షిక రాబడి నష్టాన్ని అది పరిగణనలోకి తీసుకుంది. ఎన్‌టీఆర్‌లాగే నితీష్‌ కూడా నిర్లక్ష్యంగా మద్యాన్ని సేవించడం వల్ల కలిగే సామాజిక పర్యవసా నాలకు, ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమయ్యే నిధు లకు మధ్య సమతూకం పాటించారు. ప్రభుత్వాలను సమర్థంగా నడపడానికి అవసరమయ్యే రాబడులకు వనరుగా మద్యాన్ని చూపే ప్రభుత్వాలు ప్రతి రూపా యిని లెక్క చూసి జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాయా?

మద్య నిషేధం అమలు సులువైనదేమీ కాదు. మహాత్మాగాంధీ పేరు చెప్పుకునే గుజరాత్‌లో సైతం అది కష్టమే. చుట్టూ మద్యాన్ని వినియోగించే రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలుండగా నిషే ధాన్ని అమలు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మహా అయితే వీధుల్లో ఊగుతూ, తూలుతూ పోయే వారు కనబడని నగరాలు మాత్రమే అందుకు మినహా యింపు అవుతాయి. ఎక్కడ దొరుకుద్దో తెలుసుకోవాలే గానీ... గడగడా సీసాలు ఖాళీ చేయడం సాధ్యమే. లాంఛనంగా సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు ఆనం దం కలిగించడం కోసం మద్య నిషేధానికి స్వల్పమైన సడలింపు కూడా ఉంది.

మద్య నిషేధం ఉన్నా, లేకున్నా అక్రమ మద్యం సమస్య మాత్రం ఆందోళనకరమైనదే. భారీ ప్రాణ నష్టా నికి దారి తీసే మద్యం కల్తీ కారణంగా అది  మనం ఊహించగలిగిన దానికంటే ప్రమాదకరమైనది. తమ వ్యాపారానికి దెబ్బ అని మద్యం వ్యాపారులు అక్రమ మద్యాన్ని పట్టించుకునేంత కంటే కూడా తక్కువగానే ప్రభుత్వాలు ఈ సమస్య పట్ల పట్టింపును చూపుతాయి. దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లు ప్రభుత్వ అనధికార ప్రతినిధులుగా నాటు సారా బట్టీ లపై దాడులు చేయడమూ, అధికారులు వాటిని అధి కారికమైనవిగా చేయడానికి కాగితాలపై సంతకాలు చేయడమూ నాకు గుర్తుంది.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మహేష్‌ విజాపర్కర్‌
ఈ–మెయిల్‌: mvijapurkar@gmail.com

 

మరిన్ని వార్తలు