నోట్లు పెద్దలకి, పాట్లు పేదలకి

22 Nov, 2016 00:47 IST|Sakshi
నోట్లు పెద్దలకి, పాట్లు పేదలకి

రెండో మాట
నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీ ప్రకటించడానికి సుమారు 10–15 రోజుల ముందే, వాటిని తొలగించాలని బాబు బహిరంగంగా ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఫార్చ్యూన్‌ గ్రూప్‌ సంస్థకు కుటుంబ హెరిటేజ్‌ సంస్థ వాటాలను అమ్మడమూ జరిగిందని మరచిపోరాదు. పెద్ద నోట్ల రద్దు గురించి తనకన్నా ముందే బాబు ప్రస్తావించ డాన్ని ఈ రోజు దాకా ప్రధాని మోదీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే ప్రశ్నించినట్టు గుసగుసలు వినిపించాయి.

‘రూ. 500, రూ. 1,000 కరెన్సీ నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేయ బోతున్న విషయం ముఖేశ్‌ అంబానీకీ, గౌతమ్‌ ఆదానీకీ ముందే తెలుసు. ఒక్కొక్క మెట్టు చొప్పున ఈ పెద్ద నోట్ల రద్దు అమలులోకి వస్తుందనీ వాళ్లకు తెలుసు. పరిస్థితిని చక్కదిద్దే ముందు ప్రజలకు కొంత వ్యవధి ఇచ్చి ఉండా ల్సింది. ఈ భారీ నోట్లు రద్దు చేయబోతున్న సంగతి అంబానీ, ఆదానీలకు ముందే తెలుసు కాబట్టే సర్దుకున్నారు.’

►18–11–16న ‘ది హిందూ’లో భవానీసింగ్‌ (రాజస్తాన్‌ బీజేపీ శాసన సభ్యుడు) ప్రకటన
అయ్యా! కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌ మాల్యా సహా మహా కోటీశ్వరులు బాకాయి పడిన రూ. 7,000 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేసినట్టే నేను తీసుకున్న రూ. 1.5 లక్షల రుణం కూడా రద్దు చేస్తే బతికి బయటపడతాను’
► నాసికా త్రయంబకేశ్వర్‌ మునిసిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మి కుడు భానూరావ్‌ సోనావానే మొత్తుకోలు (21–11–16)

ఉన్నమాటంటే ఉలుకెక్కువ అంటారు. కానీ అన్నివేళలా ఉలికిపాటు పనికి రాదు. వివిధ స్థాయిలలో, పాలకపక్షంలో ఉన్న బీజేపీ పెద్దలెవరూ సొంత పార్టీ శాసనసభ్యుడు చేసిన ఆరోపణకు గానీ, రోడ్లూ, దొడ్లూ ఊడుస్తూ పూటబత్తెం పూట వెలుగుగా బతుకు బండి లాగుతున్న నిరుపేద పారిశుధ్య కార్మికుడు బయటపెట్టిన మనసులోని మాటకు గానీ నొచ్చుకోనవసరం లేదు. జుట్టు పీక్కోవలసిన అవసరం కూడా లేదు. చిత్రమేమిటంటే, పారి శుధ్య కార్మికుడు సోనావానే బ్యాంకుకు రాసిన లేఖ కూడా పాలకులు భరించ లేని వ్యంగ్య రచనే ఇప్పుడు.

ఎందుకంటే, మాల్యా భారీ బకాయిని బ్యాంక్‌ రద్దు చేసి ‘ఇంతమంచి నిర్ణయం’ తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే, అంతే ఔదార్యం తన పట్ల కూడా చూపి ఆ చిరు బకాయిని రద్దు చేస్తే సంతోషమని అతడు ఎదురుదెబ్బ తీశాడు. జబ్బుపడిన కొడుకును బతి కించుకోవడానికి అతడు ఆ రుణం తీసుకున్నాడు. చాలాకాలంగా తీర్చలేక పోతున్నాడు. అందుకే లేఖ రాశాడు. కానీ నేటి దాకా అతనికి జవాబు లేదు. సోనా వానే లేఖ రాసిన సమయం ఎలాంటిది? నోట్ల రద్దు దరిమిలా రాజ్య సభలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘బకా యిలను రద్దు చేయడం అంటే పూర్తిగా రద్దు చేయడమని అర్థం చేసుకోవద్దు, బకాయి అలా ఉంటుంది. కానీ అది తిరిగి చెల్లించడమన్న డిమాండ్‌ కూడా అలాగే ఉంటుంది అని అర్థం’ అంటూ ఆర్థికశాస్త్రంలో వినని కొత్త అర్థాన్ని తీశారు. అలా ప్రజల ఉనికినీ, వారి జ్ఞానాన్నీ ప్రశ్నించి సంతృప్తి పడ్డారాయన.

జనసామాన్యం నెత్తిన పిడుగు
ఒకవైపున పెద్ద నోట్ల రద్దుతో (ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే) వాటిని మార్చడానికి గంటల తరబడి బ్యాంకుల దగ్గర పడిగాపులు పడవలసి వచ్చింది. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, హమాలీలు, గ్రామీణ వృత్తి దారులు, పేద–మధ్య తరగతి ప్రజలు మోదీ ఆకస్మిక నిర్ణయం వల్ల, రోజు వారీ బ్యాంకు లావాదేవీలకు ఏర్పడిన ప్రతిబంధకాల వల్ల ఈ దుస్థితి వచ్చింది. కోటీశ్వరులు, మహా కోటీశ్వరులు రహస్యంగా సర్దుబాటు చేసు కోవడానికి ముందుగానే, కొత్త కరెన్సీ గుద్దుడుకి ఆరుమాసాల ముందు నుంచే వారంతా జాగ్రత్త పడడానికి ఇచ్చిన సమయంలో సగం కూడా అసం ఖ్యాక సామాన్య జనానికి మోదీ సర్కారు ఇవ్వలేదు. ఇంత చిల్లరగా వ్యవహ రించడం ఖండనార్హం. అయినా మోదీ ఆర్థిక రంగాన్నీ, కరెన్సీ లావాదేవీ లనూ కొద్దికాలంలోనే డిజిటల్‌ కరెన్సీ వైపుగా మళ్లించే యత్నంలో వ్యూహం పన్నారు.

అదేమాటను చంద్రబాబు కూడా వల్లించడమే కాకుండా, భారీ నోట్ల మీద ఆకస్మిక మార్పిడి ప్రయోగానికి తానే ప్రతిపాదకుడినని, ఈ విష యంలో మోదీకి తానే మార్గదర్శకుడినని చాటుకున్నారు. మోదీ ఛాతీ కొలత ఎంతో గుర్తులేకనే ఆయన ఈ పని చేశాడా? లేదా ఆ ఇద్దరు కూడబలుక్కునే ముందుగానే కోటీశ్వరుల దొంగ ఆస్తుల రక్షణకు జమిలిగానే సిద్ధపడ్డారా? ఈ విషయం ఇంకా బయటపడవలసి ఉంది. అయితే  డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) కరెన్సీ ప్రవేశపెట్టడానికి తొలి అడుగుగానే పెద్ద నోట్ల రద్దు ఆరంభించారనేది సుస్పష్టం. నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్ర పోతున్నారనీ, ధనికులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారనీ మోదీ చెప్పడంతో ఎవరి బాధలకు ఆ ఇరువురు ఇంతకాలం ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలు తెలుసుకోగలుగు తున్నారు. కానీ ప్రజల దుస్థితి పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర నిర సన తెలియచేయవలసి వచ్చింది. ‘పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న వారు సామాన్య ప్రజలేనని, బ్యాంకుల ముందు గంటల తరబడి వారే క్యూలలో మగ్గుతున్నారని ఈ అసాధారణ పరిస్థితులు దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారితీయవచ్చునని’ (18–11–16)సుప్రీంకోర్టు హెచ్చరించవలసి వచ్చింది. భారీ నోట్ల రద్దు వెనుక నడిచిన బాగోతానికి ఎన్నికల కమిషన్‌ కళ్లు కప్పి నల్లధనం వ్యాప్తి ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభించిందీ పాలకపక్షాలే నని తాజా ఉదాహర ణలూ బట్టబయలు చేస్తున్నాయి.

అంబానీ సిమ్‌ రహస్యం
ఇక అంబానీ వర్గీయులు ఇటీవల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోడానికి వీలైన కొత్త తరహా మొబైల్‌ ‘సిమ్‌’ను అజ్ఞాతంగా రూపొందించారనీ, దీని ద్వారా రహస్యంగా ఇంటర్నెట్‌ ద్వారానే ప్రత్యేక ‘కోడ్‌’ ద్వారా బట్వాడా చేసు కోవచ్చుననీ, డిజిట్స్‌ సాయంతోనే ధన లావాదేవీలు సాగించుకోవచ్చుననీ గత వారంలో వదంతులు వ్యాపించాయి. ఈ సౌకర్యాన్ని డిసెంబర్‌ 31 ద్వారా వాడుకొని నోట్లను ‘వైట్‌’ చేసుకోవచ్చునని కూడా బయటి సమా చారం. అంబానీ గ్రూపు ‘డిసెంబర్‌ 31 లోగా’ అని మొదట నిర్ణయించడానికి కారణం బీజేపీ పాలకులు భారీ నోట్ల మార్పిడికి నిర్ధారించిన ఆఖరి తేదీ కూడా అదే కావడమై ఉండాలి. ఈ పూర్వ రంగంలో, ఇంటర్నెట్‌లో సమా చారాలు అంతర్ధానం కావడానికి అసలు మొత్తం వివరాలను ‘నెట్‌’ నుంచి తొలగించి హైజాక్‌ చేయడం, హ్యాకింగ్‌కు పాల్పడటం ప్రపంచ వ్యాపితంగా ఎలా జరుగుతోంది? అదే పద్ధతిలో దొంగ కరెన్సీ ట్రాన్స్‌ఫర్‌లూ ఎలా జరుగుతున్నాయి? ఈ విషయం గ్రహించటానికి ఏ డాక్టర్‌ డేవిడ్‌ క్రోటన్‌ (ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త)నో, వరల్డ్‌ బ్యాంక్‌ మాజీ అధిపతులలో ఒకరు సిగ్లిజ్‌నో ఆశ్రయించనక్కరలేదు. 10–15 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికీ, కరెన్సీ సంక్షోభాలకూ బడా బడా కార్పొరేట్‌ సంస్థల అకౌంటింగ్‌ కుంభకోణాలూ ఎలా కారణమయ్యాయో (ఉదాహర ణకు 10 కార్పొరేట్‌ సంస్థలు) అకౌంటింగ్‌ సంస్థల బాగోతాన్ని ‘వికీపీడియా’ వెల్లడిస్తోంది.

ఈ కుంభకోణాలు రెండు రకాలు: 1. రాజకీయ పరమైనవీ, 2. వ్యాపార లావాదేవీ కుంభకోణాలు. వీటన్నింటిలోనూ కార్పొరేట్లు ఖర్చుల్ని అతిగా పెంచి దొంగ లెక్కలు చూపడం, పెంచుకున్న ఆదాయాల్ని తక్కువ చూపడం సర్వసాధారణంగా జరుగుతోందని తేలింది. చంద్రబాబు హయా ములో ఎలా (తొలి 9 సంవత్సరాల పాలనలో) సత్యం సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మోసాలకు పాల్పడిందో పత్రికలు బయటపెట్టాయి. ఇలాంటి మోసాలకు ‘సృజనాత్మక జమా ఖర్చులు’ అని వ్యంగ్యంగా పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి ఆర్థికపరమైన మోసాలకు పాల్పడిన గుత్త కంపెనీలపైన అమెరికన్‌ సెక్యూరిటీల ఎక్సే్చంజ్‌ కమిషన్‌ కేసులు కూడా పెట్టింది.

కంప్యూటర్‌ ఆధారంగా నల్లధనం/దొంగ డబ్బు ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా 1983 నాటికే ఎలా మారడం ఆరంభమైందో, ఇందుకు ఏటీఎమ్‌లు, వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఎలా సాయపడుతున్నాయో 16 అమెరికన్‌ బ్యాంకులపై జరి గిన సర్వే రుజువు చేసింది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ద్వారా సాగే ధన లావా దేవీలకు సంబంధించిన మోసాలకు ఉదాహరణగా తోషిబా (జపాన్‌) సంస్థ చేసిన ఆర్థిక నేరాన్నీ అమెరికన్‌ డెలోటీ సంస్థనూ పేర్కొన్నారు. ఇటీవల అనేక విదేశీ గుత్త వ్యాపార సంస్థలు మారిషస్‌ కేంద్రంగా మన దేశంలో వ్యాపార లావాదేవీలు పెట్టుబడులూ నడుపుతూ వేల కోట్ల రూపాయల పన్నులకు ఎగ నామం పెట్టిన ఘటనలున్నాయి (ఉదా.వొడాఫోన్‌). ఇండియాలో ‘ఎన్‌రాన్‌’ విదేశీ కంపెనీ ఎలాంటి అకౌంటింగ్‌ కుంభకోణాలకి పాల్పడిందో తెలుసు. బ్లాక్‌మనీ ట్రాన్స్‌ఫర్లు అన్నీ డిజిటల్‌ మాయలోనే జరిగాయి. ఇలాంటి కంపె నీలకు ‘గొడుగు’ పడుతున్న మన దేశంలోని అన్ని రకాల ‘బ్రాండ్‌’ పాలకు లకు ఆ వివరాలన్నీ తెలుసు. ఎన్నికల సందర్భంలో చేసిన అమలు సాధ్యం కాని వాగ్దానాలు జనానికి గుర్తు రాకుండాను తాత్కాలిక సంచలన నిర్ణయా లను బెదిరింపుల రూపంలో ముందుకు తెస్తున్నారు. తీరా ఆ నిర్ణయాలు మరో రూపం తీసుకుని ఎదురు తిరిగినప్పుడు, తప్పుదోవ తొక్కి అభాసు పాలైనప్పుడు ‘నన్ను చంపడానికి కుట్ర పన్నుతున్నారనీ, నేను జంకేది లేద’నీ పూనకంతో ఊగిపోతున్నారు. అనవసర ఆగ్రహాన్ని కోపంతో, దూషణతో ప్రదర్శించటం కొందరి నైజం.

ముందే కూసిన పసుపు కోయిల
నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దును మోదీ ప్రకటించడానికి సుమారు 10–15 రోజుల ముందే, వాటిని రద్దు చేయాలని బాబు బహిరంగంగా ప్రకటిం చారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఫార్చ్యూన్‌ గ్రూప్‌ సంస్థకు కుటుంబ హెరి టేజ్‌ సంస్థ వాటాలను అమ్మడమూ జరిగిందని మరచిపోరాదు. పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని మోదీ కన్నా ముందే బాబు ప్రస్తావించడాన్ని ఈ రోజు దాకా మోదీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే ప్రశ్నించినట్టు గుసగుసలు వినిపించాయి. అందుకే నూతన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ ఎందు కన్నాడోగానీ ఇలా అన్నాడు:‘‘ప్రైవేట్‌ కార్పొరేట్ల అధికారాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థను మించి బలమైన శక్తిగా ఎదగడాన్ని ప్రజలు సహించితే ప్రజాస్వామ్య స్వేచ్ఛ మనుగడకు క్షేమం కాదు. అప్పుడది ప్రజాస్వామ్యం కాదు, ఫాసిజం. అప్పుడది ఒక వ్యక్తి నియంతృత్వం, లేదా ఒక గ్రూపు యాజ మాన్యం లేదా వ్యక్తి ప్రైవేట్‌ అధికారం అవుతుంది’’.

సీనియర్‌ సంపాదకులు ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in

 

>
మరిన్ని వార్తలు