ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

5 Oct, 2016 22:07 IST|Sakshi
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
 మహాత్మా గాంధీ 147 జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా డల్లాస్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా నుంచి గాంధీ పీస్ వాక్ ను నిర్వహించింది. శాంతికి సంకేతమైన తెలుపురంగు దుస్తులను ధరించి పిల్లలు, పెద్దలు పీస్ వాక్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. 
 
పీస్ వాక్ పూర్తయిన అనంతరం ప్రవాసాంధ్రులందరూ గాంధీ విగ్రహం వద్ద పూలు ఉంచి ఘననివాళులు అర్పించారు. వేడుకలకు మహాత్మాగాంధీ ముని మనవరాలు అర్చనా ప్రసాద్, ఆమె భర్త హరి ప్రసాద్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఎంజీఎంఎన్టీ డైరెక్టర్ షబ్నమ్ మొద్గిల్ మాట్లాడుతూ.. గాంధీజీ పుట్టిన అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ తన జీవితం మొత్తం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి పాటు పడ్డారని చెప్పారు.
 
చాలా ప్రాంతాల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నా ఆహ్వానం మేరకు డల్లాస్ కు విచ్చేసిన అర్చనా ప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అర్చనా ప్రసాద్ అభినందించారు. అమెరికాలోనే అతిపెద్ద అందమైన గాంధీ స్మారక స్ధూపాన్ని ఏర్పాటు చేసిన ఎంజీఎంఎన్టీకి అర్చనా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం నిర్వహించిన గాంధీ బాంకెట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన అర్చనా ప్రసాద్ గాంధీ మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ సమాజసేవ చేస్తున్నట్లు తెలిపారు.
 
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఎంజీఎంఎన్టీ అర్చనా ప్రసాద్ ను సమాజసేవ అవార్డుతో సత్కరించింది. ఎంజీఎంఎన్టీ గురించి మరిన్ని వివరాల కోసం www.mgmnt.orgను చూడొచ్చు లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డా. తోటకూర ప్రసాద్, పీయూష్ పటేల్, ఇందు రెడ్డి మందాడి, రావు కాల్వల, సల్మాన్ ఫర్షోరి, తయ్యబ్ కుంద్వాలా, షబ్నమ్ మొద్గిల్, జాక్ గొద్వాని, జాన్ హమ్మండ్ లను సంప్రదించవచ్చు.
Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా