కోటా చిచ్చు

23 Feb, 2016 00:24 IST|Sakshi

దాదాపు పదిరోజులుగా సాగుతున్న జాట్ కులస్తుల ఆందోళనలతో హరియాణా అట్టుడుకుతోంది. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా హింస చెలరేగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు బుగ్గి అయ్యాయి. 16మంది మరణించాక...దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గిపాలయ్యాక వారి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాట్‌లను ఓబీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. హరియాణా అసెంబ్లీలో వచ్చే సమావేశాల్లోనే జాట్‌లను ఓబీసీల్లో చేర్చడానికి వీలుకల్పించే బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.

హరియాణా పరిణామాలపై కేంద్రం ఎంతగా కలవరపడుతున్నదో ఈ నిర్ణయాలు చెబుతున్నాయి. అయితే  జాట్‌ల ఆగ్రహం చల్లారలేదని సోమవారం కూడా కొనసాగిన ఘటనలు నిరూపిస్తున్నాయి. చాలాచోట్ల రైలు మార్గాలు, రహదార్ల దిగ్బంధం ఆగలేదు. దేశ రాజధాని నగరానికి హరియాణానుంచి రావలసిన మంచినీటి సరఫరా సైతం నిలిచిపోగా సైన్యం జోక్యంతో దాన్ని పునరుద్ధరించవలసి వచ్చింది. పెట్టుబడులకు అనువైన, ఆదర్శవంతమైన రాష్ట్రంగా చెప్పుకునే హరియాణా ఇప్పుడు అరాచకానికి మారుపేరైంది.  

 పంజాబ్‌నుంచి 1966లో విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో జాట్ కులస్తులదే ప్రాబల్యం. ఇంతవరకూ రాష్ట్రాన్నేలిన ముఖ్యమంత్రులు పదిమందిలో ఏడుగురు ఆ కులానికి చెందినవారే. అసెంబ్లీలోని 90 స్థానాల్లో మూడోవంతు వారివే. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాక ఖట్టర్ కులానికి చెందిన మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. జాట్ కాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తి సీఎం కావడం చాన్నాళ్ల తర్వాత ఇదే మొదటిసారి. దానికితోడు కేబినెట్‌లోని 8మంది మంత్రుల్లో ఇద్దరు మాత్రమే జాట్ కులస్తులు. గ్రామసీమల్లో ప్రాబల్యం ఉన్న కులస్తులుగా జాట్‌లు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిజం.

1991లో గుర్నాంసింగ్ కమిషన్ మరో ఏడు కులాలతోపాటు జాట్‌లను కూడా బీసీల్లో చేర్చవచ్చునని సిఫార్సు చేసినప్పటినుంచి ఆ కులంలో కోటా ఆందోళన రాజుకుంది. అప్పట్లో భజన్‌లాల్ సర్కారు జాట్‌లను బీసీలుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేయడం, ఆ తర్వాత ఉపసంహరించుకోవడం వారిలోని ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత రెండు కమిషన్లు వచ్చాయి. 2011లో ఏర్పాటైన కేసీ గుప్తా కమిషన్ జాట్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏడాది తర్వాత సిఫార్సుచేసింది. దానికి అనుగుణంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి భూపేందర్‌సింగ్ హూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడటానికి ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కేంద్ర జాబితాలో జాట్‌లను చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

హరియాణాతోపాటు రాజస్థాన్, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉన్న జాట్ కులస్తుల ఓట్లు రాబట్టడమే యూపీఏ సర్కారు లక్ష్యం. 1931నాటి జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయంలోని ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు నిరుడు ప్రశ్నించింది. యూపీఏ సర్కారు నిర్ణయాన్ని కొట్టేసింది. రిజర్వేషన్లకు వాస్తవంగా అర్హత ఉన్నవారెవరో తేల్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుండాలని... ఆ అధ్యయనాంశాల ఆధారంగా నిర్ణయం ఉండాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల దృష్టితో ఆలోచించి ఎవరికి పడితే వారికి కోటా వర్తింపజేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. హరియాణా విషయానికొస్తే రాష్ట్రంలోని 80 కులాల్లో ఇప్పటికే 63 కులాలు వివిధ కేటగిరీల కింద రిజర్వేషన్లు పొందుతున్నాయి.

 పాతికేళ్ల క్రితంనాటి పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుని ఇప్పటితో పోల్చుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతిభకు చేటు కలిగిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆనాడు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అప్పుడు ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన కులాలే ఇప్పుడు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తున్నాయి. తామూ వెనకబడిన కులాలకిందికే వస్తామని వాదిస్తున్నాయి. తమలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నదో ఏకరువు పెడుతున్నాయి. అయితే వీరి వాదనలో ఓ మెలిక ఉంది. ‘ఇస్తే మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి...లేదా అందరికీ తీసేయండి’ అన్నదే వారి డిమాండ్. రాజస్థాన్‌లో గుజ్జర్‌లైనా, గుజరాత్‌లో పటేళ్లయినా, ఇప్పుడు జాట్‌లైనా, మహారాష్ట్రలోని మరాఠాలైనా అదే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులైతే 1966 వరకూ తమకున్న కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో ప్రపంచీకరణ విధానాల అమలు మొదలెట్టాక క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో పాలకులు తెలుసుకోవడం లేదు. మెజారిటీ ప్రజానీకం ఆధారపడే వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోవడం, అందులో ఉపాధి అవకాశాలు తగ్గడంలాంటి పరిస్థితులను వారు గుర్తించడంలేదు. కొండలా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పాలకులు పట్టించుకోవడంలేదు. గుజరాత్‌లో పటేళ్లది మరో సమస్య. వారు నిర్వహిస్తున్న చిన్నా చితకా వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడుతున్నాయి. అభివృద్ధి పేరిట అమలవుతున్న విధానాలే దీనికి కూడా కారణం. ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న కులాలకు రిజర్వేషన్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో ఓబీసీ కులాలు కలవరపడుతున్నాయి. రిజర్వేషన్లకు సామాజిక వెనకబాటుతనం ప్రాతిపదిక కావలసినచోట ఆర్థిక స్థితిగతులు గీటురాయి కావడమేమిటని ఆ కులాలు ప్రశ్నిస్తున్నాయి. అన్నివిధాలా అభివృద్ధి చెంది ఉన్న కులాలవారికి ఓబీసీ గుర్తింపునిస్తే తమకున్న కొద్దిపాటి అవకాశాలూ దెబ్బతింటాయన్నది వారి వాదన. ఇలాంటి వైరుధ్యాలను పరిష్కరించడం అంత సులభం కాదు.

ముద్రగడ దీక్ష సందర్భంగా చంద్రబాబు సర్కారిచ్చిన హామీ అయినా...ఇప్పుడు జాట్‌ల ఆందోళనను చల్లార్చడానికి కేంద్రం ఏర్పరిచిన కమిటీ అయినా తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. గండం గట్టెక్కడం కోసం తీసుకునే ఇలాంటి చర్యలు దీర్ఘకాలంలో పెద్దగా ఉపయోగపడవు. సమస్యను సమగ్రంగా దర్శించి తమ విధానాల్లోని లోటుపాట్లను సవరించుకోవడంతోపాటు ఆయా వర్గాల డిమాండ్లలోని సహేతుకతను నిర్ధారించడానికి శాస్త్రీయ మార్గాలను అనుసరించడం ఉత్తమమని పాలకులు తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు