తీర్పు పలు అసంతృప్తుల కూర్పు

31 May, 2016 14:00 IST|Sakshi
తీర్పు పలు అసంతృప్తుల కూర్పు

విశ్లేషణ
 
బీజేపీ దాని మిత్రులు తెలివిగా చట్టవిరుద్ధ వలసలపై దృష్టిని కేంద్రీకరించారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలవరించడంలో విఫలమైన కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలను అది వెంటనే ఆకట్టుకుంది. తీవ్ర సమస్యలలో మునిగి ఉన్న రాష్ట్రం తిరుగుబాటుదారుల చేతుల్లో అనుభవించినంత దారుణమైన బాధను ప్రభుత్వం వల్లా, ప్రభుత్వ సంస్థలవల్లా కూడా అనుభవించింది. రాష్ట్ర సామాజిక జీవితానికి సంకేతంగా మారిన అశాంతికి స్వస్తి పలకడమూ, ఊపిరి పీల్చుకోవడానికి తగినంత తాజా గాలి అస్సాంకు కావాలి.
 
 
అస్సాంలో గత రెండేళ్లుగా పెంపొందుతున్న పరిస్థితిని బట్టి చూస్తే  సుదీర్ఘంగా, మూడు దఫాలు వరుసగా అధికారం నెరపిన కాంగ్రెస్ ఓటమి పాలు కావడంలో అశ్చర్యమేమీ లేదు. కాకపోతే బీజేపీకి, దాని మిత్రులకు ప్రజలు కట్టబెట్టిన అఖండ విజయం ఆ పార్టీ నేతలకు, ఎన్నికల పండి తులకు సైతం ఊహాతీతమైనదిగా ఉండటం  విస్మయకరం.


ప్రతిపక్షం బలహీనంగా, చీలిపోయి ఉండటం వల్ల కాంగ్రెస్ అక్కడి శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలను సాధించగలిగింది. అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఐదేళ్ల దుష్పరిపాలన  ఫలితంగా 2001లో ఓటర్లు ప్రత్యామ్నాయం కోసం తహతహలాడారు. ఏజీపీ ప్రభుత్వం చేయించిన ‘రహస్య హత్యల’ వల్ల ఉల్ఫా తిరుగుబాటుదార్ల బంధువులైన పలువురు అమాయకులు బలైపోయారని ఆరోణపణలున్నాయి. ఏజీపీతో ఎన్నికలకు ముందే కూటమిని నిర్మించిన బీజేపీ కూడా అప్రతిష్టపాలై, రెండు పార్టీలూ ఆ శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గురయ్యాయి. ఆ హత్యలకు బాధ్యులని భావిస్తున్న కొందరు పోలీసు అధికారులను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ప్రజలు కొంత ఊరట కలిగినట్టు భావించారు.
 
కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలు
బీజేపీ, ఏజీపీల పతనోన్ముఖ పయనం కొనసాగుతుండగా... కాంగ్రెస్ 2006, 2011 శాసనసభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతలతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షమే లేకపోవడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు వేగంగా క్షీణించిపోయింది, అవినీతి మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో పెరిగి పోయింది. అయితే 2016 పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైనదిగా మారింది. రెండేళ్ల క్రితమే దానికి సంబంధించిన తొలి హెచ్చరికలు పొడ సూపాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌ని తొలగించాలని హేమంత బిశ్వశర్వ నేతృత్వంలోని కాంగ్రెస్ అసమ్మతి శాసనసభ్యులు డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదులను కాంగ్రెస్ హైకమాండ్ చెవికెక్కించుకోలేదు.
 
ఫలితంగా వారంతా గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనుకూలతను సృష్టించగల వ్యూహ చతురునిగా ప్రసిద్ధి చెందిన బిశ్వశర్వ బీజేపీకి కలిసొచ్చిన అదృష్టమే అయ్యాడు. పార్టీలో చేరిన కొన్ని వారాలకే ఆయన బీజేపీ అగ్రనేతలతో రహస్య సమావేశం జరిపి అస్సాంలో కాంగ్రెస్‌ను గద్దెదించడానికి పథకాన్ని రచించారు.

ప్రాంతీయ పార్టీలతో, ఆదివాసి సంస్థలతో బృహత్ కూటమిని ఏర్పరచాలనే ఆయన సూచనకు బీజేపీలోనే కొంత వ్యతిరేకత ఉన్నాగానీ వారు అంగీకరించారు. అసోంలోని ప్రతి పౌరునికి సంబంధించిన సాధారణ సమస్యలపై ఆదివాసి, ఆదివాసియేతర ప్రజలను అందిరినీ ఐక్యం చేయాలనేదే... ఏజీపీ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో, మరో రెండు చిన్న ఆదివాసి పార్టీలతో బీజేపీ ఒప్పందాలకు కారణం.
 
చట్టవిరుద్ధ వలసలే కీలక సమస్య
బీజేపీ దాని మిత్రులు తెలివిగా చట్టవిరుద్ధ వలసలపై దృష్టిని కేంద్రీకరించి, అలాంటి వారిని గుర్తించడం అనే రాష్ట్రస్థాయి అంశాన్ని చేపట్టారు. బంగ్లాదే శ్ నుంచి జరుగుతున్న చొరబాట్లను నిలవరించడంలో విఫలమైన కాంగ్రెస్‌పై ప్రజలు అప్పటికే ఆగ్రహం చెంది ఉండటం వల్ల ఈ వైఖరి వెంటనే ప్రజలను ఆకట్టుకుంది.

చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారి జనాభా అసాధారణంగా పెరిగిపోయిందని 2001, 2011 జనాభా లెక్కలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశించకపోతే అస్సాం ఒప్పందంలో పొందుపరచిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ)ను సవరించే ప్రక్రియను చేపట్టడం జరిగేదే కాదు.
 
ఇలా ముందు చేయాల్సిన ప్రధాన కృషి అంతా జరిగాక ప్రజలను ఆకట్టుకునేదిగా ఉండే ఒక సంకేతం బీజేపీకి అవస రమైంది. వెంటనే అది, చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిలో అతి పెద్ద వర్గాల మద్దతు ఉన్న  ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), దాని అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ నుంచే ‘‘అసలు ముప్పు’’ పొంచి ఉన్నదని గట్టిగా నొక్కి చెప్పసాగింది. ఇది మతాలకు, తెగలకు ప్రాంతాలకు అతీతంగా అస్సాం ఓటర్లను ప్రభావితం చేసింది.
 
కాగల కార్యం తీర్చిన ‘కింగ్‌మేకర్’
ఎన్నికలకు ముందు అజ్మల్ ప్రవర్తన బీజేపీకి సానుకూలతను కల్పించడమే కాదు, ఆయన మద్దతుదార్లలో గందరగోళాన్ని రేకెత్తించింది. జనవరి 23న ఆయన హిందువుల కేంద్రీకరణ అనే దానికి వ్యతిరేకంగా మైనారిటీలంతా ఐక్యం కావాలంటూ రంగియాలో జరిగిన ఓ బహిరంగ సభలో విజ్ఞప్తి చేశారు. దీంతో సరిగ్గా బీజేపీ కోరుకుంటున్న పనినే ఆయన చేసినట్టయింది. విదేశీ పౌరుల పట్ల భయం మరింత బలపడేట్టు చేసింది.
 
దీనికితోడు, ఇంతకు ముందు ఏఐయూడీఎఫ్‌కు ఓటు చేసిన బెంగాలీ ముస్లింలలోని చాలా మంది పౌరులు చట్టవిరుద్ధంగా వలసవచ్చినవారితో గుర్తింపును పొందడానికి ఇష్టపడక కాంగ్రెస్ వైపు మళ్లారు. వీటన్నిటి మధ్యన అజ్మల్, కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అదే సమయంలో ఆయన కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభు త్వమంటూ ఒక విధమైన మూడో ఫ్రంట్‌గురించి కూడా మాట్లాడటం మొదలెట్టారు. అదీ పనిచేయక పోవడంతో ‘కింగ్ మేకర్’ను అవుతానని, తన మద్దతు లేనిదే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమని ప్రకటిం చారు. క్షేత్రస్థాయి వాస్తవికత గురించి ఏ మాత్రం తెలియక కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
 
 చాపకింది నీరై వచ్చిన ‘పరివర్తన్’ గాలి
 ఈ స్థూల సమస్యలన్నీ వివిధ రకాల స్థానిక సమస్యలతో కలసి ఈ ఎన్నికల్లో ‘పరివర్తన్’ గాలిని సృష్టించాయి. ఈ గాలే పది మంది మంత్రులను ఓటమికి గురిచేసి పలువురికి విస్మయం కలిగించింది. ‘‘బరాక్ లోయలో కాంగ్రెస్ మాజీ మంత్రి గౌతమ్‌రాయ్‌పట్ల ఉన్న అసంతృప్తి గాలి అతన్ని, అతని బంధువులను ఓడించడం కోసం అక్కడి ప్రజలను మతాలకు, తెగలకు అతీ తంగా ఐక్యం  చేసింది’’ అని ఏఐయూడీఎఫ్ మాజీ ఉపాధ్యక్షుడు హఫీజ్ రషీద్ చౌధ్రీ అన్నారు. మర్ఘేరిటాలో కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రద్యుత్ బార్డొలాయ్ సన్నిహిత బంధువు బేకరీ పెట్టుకోవడం కోసం ఒక బస్  స్టాండ్‌ను కూల్చివేయడం బెడిసికొట్టి పెద్ద వివాదంగా మారి, చివరికి బీజేపీ విజయానికి కారణమైందని అక్కడి స్థానికులు చెప్పారు. ఈ అంతఃప్రవాహాలు బలమైనవేగానీ పైకి కనిపించకుండా దాగి ఉన్నవి. కాబట్టే బీజేపీ సైతం అన్ని సీట్లను సంపాదించగలమని ఊహించలేక పోయింది.
 
మిత్రులతో కలసి దాదాపు 75 నుంచి 80 సీట్లు రావచ్చని అది ఆశించింది. మొత్తం 126 శాసనసభ స్థానాలలో బీజేపీ కూటమికి 86 లభించాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా 60 స్థానాలను సాధించగా, ఏజీపీ, బీపీఎఫ్‌లకు వరుసగా 14, 12 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు వచ్చినవి 26 కాగా, ఏఐయూ డీఎఫ్‌కు 3 స్థానాలు దక్కాయి. బీజేపీ గెలుస్తామనుకున్న ఐదు స్థానాల్లో ఓడినా, అనూహ్యంగా గెలిచిన 6 ఇతర స్థానాలతో ఆ లోటు పూడిపోయింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రకటించిన తీర్పు. సుదీర్ఘ కాలంగా తీవ్ర సమస్యలలో మునిగి ఉన్న రాష్ట్రం తిరుగుబాటు దారుల చేతుల్లో అనుభవించినంత దారుణమైన బాధను కాంగ్రెస్ ప్రభు త్వంవల్లా, ప్రభుత్వ సంస్థలు, అధికారుల వల్లా కూడా అనుభవించింది. 1970ల నుంచి రాష్ట్ర సామాజిక జీవితానికి సంకేతంగా మారిన అశాంతికి స్వస్తి పలకడమూ, ఊపిరి పీల్చుకోవడానికి తగినంత స్వచ్ఛమైన తాజా గాలి అస్సాంకు కావాలి.
 
రాజీవ్ భట్టాచార్య
 వ్యాసకర్త అసోంలోని సీనియర్ పాత్రికేయులు, రచయిత

 ఈమెయిల్: rajkrbhat@gmail.com

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా