రామ్‌జఠ్మలానీ(న్యాయవాది) రాయని డైరీ

17 Jan, 2016 09:07 IST|Sakshi
రామ్‌జఠ్మలానీ(న్యాయవాది) రాయని డైరీ

జీవించడానికి ఒక ఆశ ఉండాలి. నాకైతే ఒక కేసు ఉండాలి. ఉదయాన్నే ఓ గంట బ్యాడ్మింటన్, కొద్దిగా పండ్ల ముక్కలు, మజ్జిగ తో మధ్యాహ్న భోజనం, రెండు పెగ్గుల విస్కీతో రాత్రి భోజనం, అకేషనల్‌గా ఓ స్కూప్ ఐస్‌క్రీమ్, వీటితో పాటు రోజూ కోర్టు మెట్లు ఎక్కిదిగడానికి ఎట్లీస్ట్ ఒక కేసు.. ఈ తొంభై రెండేళ్ల వయసులో నా జీవన మాధుర్యాలు.

 కొన్నిసార్లు బ్యాడ్మింటన్ ఉండదు. లంచ్‌కి, డిన్నర్‌కి టైమ్ కుదరదు. పండ్లముక్కలు, మజ్జిగ, విస్కీ, ఐస్‌క్రీమ్ కూడా అందుబాటులో ఉండవు. అవేవీ లేకున్నా.. ఆ పూట నేను వాదించిన కేసుతోనో, వాదించబోయే కేసుతోనో నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను. కోర్టులు, కేసులు ప్రాణాలు తీస్తాయంటారు. ఆ మాట తప్పు. వాయిదాలు, ఫీజులు మాత్రమే ప్రాణాలు తీస్తాయి. నేను వాదిస్తే వాయిదాలు ఉండవు. నేను కేసు టేకప్ చేస్తే ఫీజులు ఉండవు. ఫీజులు తీసుకోనని కాదు. కేసులు తీసుకున్నంత కుతూహలంగా ఫీజులు తీసుకోనని.

 వాదించడం నాకు ముఖ్యం. ఎవరి తరఫున వాదిస్తున్నాను అన్నది ముఖ్యం కాదు. హాజీ మస్తాన్ అండర్‌వరల్డ్ డాన్. హర్షద్ మెహతా స్టాక్‌మార్కెట్ డాన్. ఆశారామ్ బాపూ అత్యాచారాల డాన్. అమిత్ షా.. ఫేక్ ఎన్‌కౌంటర్‌ల డాన్. లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా డాన్. వాళ్ల వైపు వాదించాను కాబట్టి నేను అడ్వొకేట్ డాన్! ఇలాగే ఉంటుంది లోకం తీరు. లలిత్ మోదీ ప్రజల దృష్టిలో నేరస్థుడని చెప్పి అతడి తరఫున వాదించకపోవడం, ఇందిరాగాంధీని హత్యచేశారని చెప్పి, హంతకులకు వ్యతిరేకంగా వాదించడం వృత్తిధర్మం కాదు. లాయర్‌కి మనస్సాక్షి ఏదైతే చెబుతుందో అదే ధర్మం. వాదనల్లో జడ్జికి ఏదైతే ధర్మం అనిపిస్తుందో అదే తీర్పు.

 రెండు న్యాయాలు, రెండు ధర్మాలు, రెండు కోర్టులు, రెండు తీర్పులు ఉంటున్నప్పుడు.. న్యాయవాది దేనిపై నిలబడి వాదించాలి? దేనిపైనా నిలబడనవసరం లేదు. తను నమ్మినదాన్ని నిలబెడితే చాలు. నమ్మకం లేకపోయినా నిలబెట్టవలసిన కేసులు కొన్ని ఉంటాయి. సోనియాజీదీ, రాహుల్‌దీ అలాంటి కేసే. నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్లిద్దరూ నిర్దోషులన్న నమ్మకం నాకేం లేదు. కానీ వారి వైపు వాదిస్తానన్నాను. ఫీజు కూడా వద్దన్నాను. లేకుంటే కోర్టులో వాదించవలసిన కేసును వాళ్లు రాజ్యసభలో వాదించేలా ఉన్నారు. ‘మీరు అక్కడ వాదించడం మానండి, నేనిక్కడ వాదిస్తాను’ అని చెప్పాను. సరేనన్నారు సోనియాజీ. అనడానికైతే అన్నారు కానీ, సభలో రభస జరక్కుండా ఆపలేకపోయారు! నా స్టాండ్ మార్చుకున్నాను. మీ తరఫున వాదించేది లేదని చెప్పేశాను.

వాదనను బట్టి వాస్తవం మారిపోదు నిజమే. కానీ, వాస్తవాన్ని బతికించడమా? వాదనను బతికించుకోవడమా? అన్న మీమాంసలో ప్రతి న్యాయవాదీ జీవితంలో ఒక్కసారైనా అంతరాత్మ అనే బోనులో నిలబడవలసి వస్తుంది. నేను నిలబడిందైతే.. లెక్కలేనన్నిసార్లు!
 -మాధవ్ శింగరాజు
 

>
మరిన్ని వార్తలు