మన కాలపు హీరోలదే రిపబ్లిక్ డే

26 Jan, 2016 01:12 IST|Sakshi
మన కాలపు హీరోలదే రిపబ్లిక్ డే

‘భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను’ అంటూ మొదలుపెట్టి ‘నా దేశంపట్ల, ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనం దానికి మూలం’ అంటూ ముగించే ఆ ప్రతిజ్ఞ ప్రతి రోజూ స్కూల్లో, చదువుకునే రోజుల్లో మనందరం నేర్చుకున్నదే! ఔను... ప్రతిజ్ఞలైనా, వాగ్దానాలైనా చేయడం తేలిక. నిలబెట్టుకోవడమే కష్టం.

 ప్రస్తుతం మనం 67వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఒక్కసారి ఈ ప్రతిజ్ఞ చేసిన మన భారతీయ సహోదరులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒకడు సిగ్నల్ లైట్స్ దగ్గర అడుక్కు తింటుంటే మరొకరు సైబర్ క్రైమ్ చేసి దొరికి పోతున్నాడు. ఇంకో సోదరుడు మాతృదేవతను వీలుంటే చంపేసో, వృద్ధాశ్రమంలో వదిలేసో.. భూమిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఇంకో సోదరుడు కనబడిన ప్రతి గుడినీ, గోపురాన్ని దర్శించుకుంటూ చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. మరికొందరు సోదరులు టీమ్‌వర్క్‌తో సామూహిక అత్యాచారాలు చేసుకుంటూ పోతు న్నారు. గాంధీ పుట్టిన దేశంలో గజానికో గాంధారి కొడుకు పుడుతూనే ఉన్నాడు.

 కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. కళ్లెదుట ముసురుకున్న ఈ కటిక చీకట్లను ఛేదించుకుంటూ కొత్త కాంతుల్ని ప్రసరింప చెయ్యడానికి ఈ దేశం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విజయ ప్రస్థానానికి మూలం వర్తమానం లో లేదు. ఎందరో మహాత్ములు వాళ్ల స్వేదంతో, రక్తంతో ఈ మట్టిని పునీతం చేశారు. భగత్‌సింగ్, అల్లూరి, టంగుటూరి, జతీంద్రనాధ్ దాస్, ఖుదీ రామ్ బోస్, మేడం భికాజీ, బేగం హజ్రత్, ఝాన్సీ లక్ష్మీబాయ్, దుర్గావతీ దేవి, అష్పాఖుల్లా ఖాన్, బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, రాజ్‌గురు, నేతాజీ, కొమురం భీం వంటి వారు మన మట్టిని సుసంపన్నం చేసిన త్యాగధనులు.

 ఇది గతం. కానీ వర్తమానంలో జరుగుతున్న అకృత్యాలకు చరమగీతం పాడటానికి కూడా ఎక్కడో ఒక చోట, ప్రతిరోజూ ఎవరిదో ఒక స్వరం బలహీనంగా అయినా వినపడుతూనే ఉంది.  మైనస్ 60 డిగ్రీల చలిలో, సియాచిన్ లాంటి చోట నిరంతరం పహారా కాస్తూ, తమ కుటుంబానికి దూరంగా ఉంటూనే, కోట్లాదిమంది కుటుంబాలకు రక్షణగా నిలుస్తున్న మనుషులు సాధారణ జవాన్లు కారు. అలాగే ఆకలికి అల్లల్లాడుతున్న వృద్ధులను చూసి చలించిపోయి విదేశాల్లో ఉన్నతోద్యోగాలనే వదిలేసి అక్షయ్ ట్రస్టుతో అన్నార్తులకు కడుపునిండా అన్నం పెడుతున్న  నారాయణన్, హైదరాబాద్‌లోని అజహర్ మక్సూసి, ముంబైలోని సందీప్ మనోహర్ దేశాయ్ లాంటి వాళ్లు మానవతకు నిజమైన అర్థంగా నిలుస్తున్నారు. వీళ్లే మనకాలపు హీరోలు.

 మనం మహాత్ములం కాలేకపోవచ్చు. కానీ గతకాలపు మహాత్ముల వీర చరిత్రల్ని, మన మధ్యే ఉంటూ మానవత్వపు విలువల్ని గగనపు అంచుకు చేరుస్తున్న రియల్ హీరోల కృషినీ, మన పిల్లలకు కథలుగా చెబుదాం. వాటినుంచి ఏ ఒక్కరు స్ఫూర్తిని పొందినా మరో మహాత్ముడు అవతరించినట్లే. అందుకే ముందుగా మనం, మన కుటుంబం మంచి గా, నీతిగా, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు.. ఈ దేశపు ప్రక్షాళన మొదలైనట్లే. అప్పుడు మాత్రమే మన 67 ఏళ్ల గణతంత్ర భారత్ వెయ్యేళ్లు వర్థిల్లగలుగుతుంది.
 శాంతి మంత్రం జపించకపోయినా పర్లేదు/ అశాంతి జ్వాల రగిలించకుండా ఉంటే చాలు.. నువ్వు బుద్ధుడివే!/ పక్కవాణ్ణి ప్రేమించకపోయినా పర్లేదు/ద్వేషించకుండా ఉంటే చాలు.. నువ్వు దేవుడివే!!
(నేడు 67వ గణతంత్ర దినోత్సవం)
వైవి రమణ, ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారి,
సికింద్రాబాద్‌ మొబైల్: 9440496187
 

మరిన్ని వార్తలు