తెలుగు హైకు: ఒక అవలోకనం

8 May, 2017 00:42 IST|Sakshi
తెలుగు హైకు: ఒక అవలోకనం

అభిప్రాయం
హైకు అనే కవితా ప్రక్రియ జపాన్‌ దేశంలో రూపొంది ఇంగ్లిష్‌తో పాటు పలు ఇతర భాషల్లోకీ, మన తెలుగులోకీ వచ్చింది. ఇంగ్లిష్‌తో సహా ఐరోపా భాషల కవితలు వ్యర్థ పదాలతోనూ, పెద్దవిగా సాగిపోయే తీరులోనూ ఉండటానికి భిన్నంగా క్లుప్తతను గుణంగా కలిగి రూపొందిన కవితా ప్రక్రియ హైకు. నొగుచి అనే జపాన్‌ కవి అంటారు: ‘‘గంపల కొద్దీ రాసి అచ్చెయ్యాలి అన్న ఒకే ఉత్సుకతతో ఎప్పుడూ తపించే వాడు కవి అవడు’’. ‘‘క్లుప్తంగా చెప్పి బోధ పరచడం హైకు వైశిష్ట్యం’’ అంటూ నొగుచి ఒక ఉదంతాన్ని ఉటంకిస్తారు. హŸకషి అనే కవి తన గురువుకు సొంత ఇల్లు కాలిపోయిన సంగతిని ఓ హైకుగా రాసి తెలియజేస్తారు ఇలా: ‘నిప్పు రాజుకుంది– రాలే పువ్వు ప్రశాంతత ఎంతో!’

‘ఇల్లు తగలబడింది కానీ తన మనసు ప్రశాంతతను కోల్పోలేదు’ అని హŸకషి తన హైకుతో తెలియ జేశారు. ఇంకా నొగుచి ఇలా అంటారు: ‘‘ఆకాశ నక్షత్రం, ఏకాంతం, మౌనం, పువ్వుల భాష వీటితో కలిసిపోయి బ్రతికేవాడే కవి’’. నొగుచి మోడర్న్‌ రివ్యూ అనే కలకత్తా పత్రికలో రాసిన వ్యాసాన్ని తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1916లో తమిళంలోకి అనువదించారు. హైకు ప్రాముఖ్యతను గురించి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఓ మంచి వ్యాసం రాశారు. దాన్ని గాలి నాసరరెడ్డి తెలుగులో అనువదించి 8–12–2008న ‘సాక్షి’లో ప్రకటించారు.

హైకు, విశ్వ కవితా రూపాలలో ఓ విప్లవం. జపాన్‌ భాషలో హైకుకు ఆదికవి బషో (1644–94). హైకు కవిగా ఆయన స్థానం అద్వితీయం. ‘పాత కొలను, కప్ప లోపలికి దూకింది – నీళ్ల చప్పుడు.’ ఇది బషో రాసిన ఓ హైకు. బషో తరువాత బుసోన్, చిఝె, హŸకషి, హిస, ఇస్స, కికకు, షికి ప్రభృతులు జపనీస్‌ హైకును పరిపుష్టం చేశారు. జపాన్‌ మతాలు బౌద్ధం, టాఔ ఇజం, ఎనిమిజం జపాన్‌ హైకులలో మిళితం అయినాయి. తంక అనే ఓ కవితా ప్రక్రియ నుండి విడివడి హŸకుగా కొంతకాలం ఉండి చివరికి హైకుగా స్థిరపడింది. తంకలోని మొదటి భాగం హైకు. జపనీస్‌లో అజ్జాత కవుల హైకులు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి: ‘కొత్త తండ్రి, జోల పాడాడు– అపశ్రుతిలో’.

హైకు అన్న పదంలో ‘హై’ అంటే వినోదకర అనీ, ‘కు’ అంటే కవిత అనీ అర్థాలు. ఇక్కడ కు– హ్రస్వమే. ఈ హై, ఈ కు– రెండూ చైనీస్‌ –బై–కియు– నుంచి వచ్చాయి. తెలుగులో మనం హైకులు అనొచ్చు.
హైకు జపనీస్‌లో 5, 7, 5  జిఒన్‌(jion)లతో రాయబడుతుంది.

హైకు 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఇంగ్లిష్‌లోకి వెళ్లింది. ఇమేజిజం అనే ఎజ్రాపౌండ్‌ ఉద్యమం ద్వారా హైకు ఇంగ్లిష్‌లోకి వ్యాపించింది. ఎజ్రాపౌండ్‌తో పాటు ఎమిలో వెన్, ఫ్లింట్, జాన్‌ ఫ్లెచర్‌ వంటి కవులు హైకును ఇంగ్లిష్‌ లోకి తెచ్చారు. రాబర్ట్‌ ఫ్రాస్ట్, డబ్ల్యూ బి. ఈట్స్, వాలెస్‌ స్టీవెన్స్‌ వంటి కవులపై హైకు ప్రభావం పడింది. హెరాల్డ్‌ జి.హెన్‌డర్‌సన్‌ హైకుపై ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ప్రక్రియ పరంగా జపనీస్‌ జిఒన్‌లను ఇంగ్లిష్‌లో 5,7,5 సిలబల్స్‌గా తీసుకున్నారు. అది తప్పు. జపనీస్‌ హైకు ఒకే పాదంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో హైకును మూడు పాదాలుగా రాస్తారు. అదీ తప్పే. ఇంగ్లిష్‌లో హైకు అన్న పదం బహువచనాన్నీ సూచిస్తుంది. ఇంగ్లిష్‌ ద్వారా  వ్యాపించడం వల్ల హైకు తన రూపాన్నీ, ఆత్మనూ కోల్పోయింది. ఈ నిజాన్ని ఇంగ్లిష్‌ పరిశీలకులే గ్రహించి ప్రకటించారు.

తెలుగులో 1923లో దువ్వూరి రామిరెడ్డి మర్మ కవిత్వం అన్న తమ వ్యాసంలో బషో హైకులను హŸక్కులు అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించి హైకులను తెలుగుకు పరిచయం చేశారు. ఆయన పద్యాలలో అనువదించారు.  తరువాత కట్టమంచి రామలింగారెడ్డి 1931లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘గాథా సప్తశతి’ అనువాదానికి రాసిన పీఠికలో కొన్ని జపనీస్‌ హైకులను తేటగీతి ఛందస్సులో రెండు పాదాలుగా అనువదించారు. ఆ తరువాత 1950లో సంజీవదేవ్‌ కొన్ని హైకులను వచన కవితలుగా అనువదించారు.

తొలి తెలుగు హైకు రాసినది గాలి నాసర రెడ్డి. 1990లో ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన రాసిన 5 హైకులు అచ్చయినాయి. తొలి తెలుగు హైకు: నదిలో ఈత/ చంద్రుడి శకలాలు/ గుచ్చుకున్నాయి. మూడు పాదాల్లో 5, 7, 5 అక్షరాలతో ఆ 5 హైకులు ఉన్నాయి. 1991లో పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో తొలి తెలుగు హైకుల సంకలనాన్ని వెలువరించారు. ఇస్మాయిల్, బి.వి.వి.ప్రసాద్, లలితానంద ప్రసాద్, డా. శిరీష, మాకినీడి సూర్యభాస్కర్, అద్దేపల్లి రామమోహన రావు ప్రభృతులు తమ హైకులను, హైకులపై రచనలను వెలువరించారు. తొలి తెలుగు హైకు కవయిత్రి రత్నమాల. తెలుగులో హైకు పేరుతో ఎక్కువ రచనలు చేసినవారు పృథ్వీరాజ్‌. ఇంకా కొంతమంది కవులు, కవయిత్రులు హైకులు రాశారు. హైకు పత్రికలు కూడా వచ్చాయి. మొదట్లో తెలుగు హైకులు 5,7,5 అక్షరాలతో మూడు పాదాలలో రాయబడినా రానురాను ఆ నియమం సడలిపోయింది. 1950లోనే సంజీవ దేవ్‌ జపనీస్‌ జిఒన్‌లకు మన భాషలోని మాత్రలు ప్రత్యామ్నాయం అని సూచించారు. 2003లో ఉప్పలధడియం వెంకటేశ్వర తొలిసారి 5,7,5 మాత్రలతో మూడు పాదాలలో హైకు రాశారు. అది: ‘విత్తనం, నేల త్రోవను–చిరయాత్ర’.

పెన్నా శివరామకృష్ణ ‘దేశదేశాల హైకు’ పేరుతో కొన్ని విదేశీ హైకులను తెలుగులోకి అనువదించారు. గాలి నాసరరెడ్డి కొన్ని విదేశీ హైకులని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ముండకోపనిషత్‌(3–1–1) లోనే హైకు శిల్పం ఉందని చెబుతూ నాసర రెడ్డి ఓ శ్లోకాన్ని సూచించారు. అది:
‘‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరణ్యః పిప్ఫలం స్వాద్వత్త్వ నశ్నన్నన్న్యో అభిచాక శీతి’’
ఒక దానితో ఒకటి కలిసి ఉన్న రెండు పక్షులు చెట్టుపై– ఒకటి చెట్టు ఫలాలను ఆస్వాదిస్తూ తింటోంది; మరొకటి తినకుండా చూస్తోంది.

హైకు అన్నది శిల్పాత్మకమైన ఓ ప్రక్రియ. హైకు శిల్పంలో ఋతువుల్ని సూచించే పదాలు, చిత్రణలు, ఘటనలు, రెండు చిత్రణల కలయిక, రెండు ఘటనల కలయిక, చిత్రణ, ఘటన కలయిక అన్నవి ముఖ్యం. హైకు అన్నది నిర్వచనంలా ఉండదు. వివరణలా ఉండదు. హైకులో ఉపమ, రూపకం లాంటి అలంకారాలు ఉండవు. హైకుపై సరైన అవగాహన కావాలంటే జపనీస్‌ హైకులనే చదవాలి.
హైకు 5,7,5 మాత్రలతో ఒకే పాదంలో ఉండటం శాస్త్రీయమైన పద్ధతి. ఆ పద్ధతిలో సిసలైన హైకు శిల్పంతో హైకు, హైకుగా తెలుగులో పునర్భవం పొందాల్సిన అవసరం ఉంది.
రోచిష్మాన్‌
09444012279

మరిన్ని వార్తలు