నిప్పురవ్వను ఊది మంటచేసి...

8 Mar, 2016 00:08 IST|Sakshi
నిప్పురవ్వను ఊది మంటచేసి...

విశ్లేషణ
 రోహిత్ వేముల ఆత్మహత్య...  కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మహత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మితవాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలలను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదోసింది. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపింది.

 కన్హయ్య కుమార్, నికార్సయిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి. ఆలో చనాపరుడు, లోతైన పరిశీలన గలవాడు, ధైర్యవంతుడు, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తపరచగలవాడు. రారమ్మని పిలుస్తున్న కొత్త వృత్తి రాజ కీయాలకు బదిలీ అయితే తప్ప, ఆయనకు పీహెచ్‌డీ ఎలాగూ వస్తుంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన చేసిన ఉపన్యాసం ఉత్తేజకరమైనది. ఆయన తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హృదయం, మేధస్సు కూడా రాజద్రోహంపైనే లగ్నమై ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి మనం సాధించుకున్న స్వేచ్ఛలను, గౌరవాన్ని ఆయన కోరుతున్నారు.

 మితవాదానికి ఆయన బద్ధవ్యతిరేకి. నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, పెట్టుబడిదారీ విధానం అంటూ ఆ శక్తులనూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఆర్థికవ్యవస్థకు సెన్సెక్స్‌లా, సోషల్ మీడియా కూడా ఒక విధమైన ప్రతిస్పందనా సూచిక. అయితే ఇవి రెండూ కిందా మీదా చేయగలిగినవే, చేస్తు న్నారు కూడా. మొదట ఉద్దేశపూర్వకంగా ఏదైనా రెచ్చ గొట్టే వ్యాఖ్యను చేసి, ఆ తర్వాత ఏదో ఒక సాకుతో దానికి అనుకూలంగా, ప్రతికూలంగా చర్చను రేకెత్తించవచ్చు.  

 కన్హయ్య, సాధారణంగా కంటే కొన్నేళ్లు ఎక్కువే జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నారు. కాబట్టి ఆయన విద్యార్థి మాత్రమేనా లేక ఇంకా మరేదైనా కూడా అయి ఉండి, ఆ విద్యా సంస్థలో తలదాచుకున్నారా? అనే ప్రశ్నలు రేగు తున్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. విద్య నేర్వడం ఎప్పుడూ ఒకే పద్ధతిలో నడవాలనేం లేదు. వివిధ టీవీ చానళ్లకు ఆయన తన గురించి తెలిపిన దాని ప్రకారం...  అతను ‘రాజకీయ కార్యకర్త’, ‘విద్యార్థి నేత’, ఆసక్తికరంగా ‘కమ్యూనిస్టుల అధికారిక ప్రతినిధి కాదు.’  

 బతికి బట్టకట్టడం కోసం ఆయాసపడుతున్న వామపక్షాలకు ఆయన ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి కొన్నేళ్లపాటూ జాగ్రత్తగా గమనించాల్సిన వ్యక్తి. విస్పష్టంగా మాట్లాడటంలోనూ, భావాలలోనూ నరేంద్ర మోదీకి సరిగ్గా దీటుగా నిలవగలవాడిగా కన్హయ్యను గుర్తించిన వామపక్ష నేతలు వెంటనే ఆయన రక్షణకు రంగంలోకి దిగారు. వామపక్షాలలోని అతి కొద్దిమంది తప్ప మరెవరూ సాటిరాని విధంగా ఆయన ఆ పనిని చేశారు లేదా ఆయన అద్భుత వాగ్ధాటిని చూస్తే అలా అనిపిస్తోంది.

 చర్చా వేదకపై గంధకంలా ఘాటుగా అనిపించే ఆయనకు మరో పార్శం కూడా ఉంది. మార్క్ ఆంటోనీ (గొప్ప ప్రభావశీలియైన ఉపన్యాసకునిగా) కన్హయ్య కమార్ వద్ద పోస్టల్ ట్యూషన్ తీసుకోవాలని నాకు తెలిసిన కొందరు వ్యాఖ్యానించారు. వేదిక మీద లేనప్పుడు అతడు తన ఆలోచనలను సుస్పష్టంగా, ప్రశాంతంగా వ్యక్తం చేయగలిగినవారు. అందువల్ల సాధారణ టీవీ వీక్షకులకు అతను చెప్పే విషయాలు తేలికగా అర్థం అవుతాయి. వివిధ వైఖరులను మృదువుగా వ్యక్తం చేయగలిగిన ఆయన స్వరం.. సాధారణంగా ఆధిపత్యం చలాయించే టీవీ యాంకర్లను  మెత్తబరచేస్తుంది. ‘చెబుతావా, లేదంటే నీ తల’ అన్నట్టు  సాగే ఇంటర్వ్యూను సంప్రదాయక పద్ధతిలో ప్రశ్నలు అడగడంగా మార్చేస్తుంది. అందుకే టీవీ చానళ్లు ఆయన పట్ల చాలా గౌరవం చూపాయి. చూడండి, పరిస్థితులన్నీ మహా అస్తవ్యస్తంగా ఉన్నాయి,  వాటితో పోట్లాడతానని అతను అంటున్నాడు అన్నట్టుంటాయి.

 టీవీల్లో ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మళ్లీ చెప్పడానికైతే ఈ కాలం అవసరం లేదు. అయితే ఆయన చెప్పినవాటినీ, చెప్పిన పద్ధతినీ చూస్తే కచ్చితంగా ఆయన రాజకీయాల్లో బాగా రాణించగల వ్యక్తి. ప్రయాణాలు చేసి, అన్ని సెక్షన్ల ప్రజలతో మాట్లాడాలని తన కోరికని ఆయన చెప్పాడు. అయినా, ఆయన ఇంకా నిజంగా రాజకీయాలకు అంకితమైన రాజకీయవేత్త కారు.

 ఆయన, భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, యూపీఏ నుంచి బయటకు వచ్చేసి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేతుల్లో ఓడిపోయినప్పటి నుంచి... ఒక దిశంటూ లేకుండా ఉన్న వామపక్షాలకు కేంద్ర రంగ స్థలిపైకి తలుపులు కూడా తెరిచారు. జేఎన్‌యూ, జాధవ్‌పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లూ, ఇటీవల అల్హాబాద్ వారికి కొత్త వేదికను కల్పించాయి. కాకపోతే వారు దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి.

 విద్యార్థి సంఘాలు, వివిధ వామపక్షాలకు అను బంధ సంస్థలు మాత్రమే. అయితే రోహిత్ వేముల ఆత్మ హత్య...  కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మ హత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మిత వాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలల ను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదో స్తోంది. అసలు మొదట్నించీ వారే.. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపారు.

 బూటకపు వీడియోలుగా ఆరోపిస్తున్న వాటిని మితవాద పక్షం సభ్యులు, మద్దతుదార్లు అందించకపోగా ఆయన్ను కొట్టారు, అది చూస్తూ పోలీసులు నిలబడ్డార నేదే లెక్కలోకి వస్తుంది. అత్యంత బలమైన ప్రభుత్వం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలిచిందనే ఆలోచనను సామాన్యునిలో కలుగజేస్తుంది. ఒక విద్యార్థి జాతి వ్యతిరేకి అని రుజువు చేయాలని వారు అంతగా తాపత్రయపడకపోతే... కన్హయ్య బహుశా ఓ కళాశాల నేతగానే మిగిలిపోయేవాడు. అతని ఉపన్యాసం కళాశాల  ఉపన్యాసంగానే మిగిలేది. మితవాద పక్షం ఆయన్ను ఒక్కసారిగా ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  
http://img.sakshi.net/images/cms/2015-03/41427657601_295x200.jpg 
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కార్
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

 

మరిన్ని వార్తలు