ఆత్మ రక్షణలో అధికార పక్షం

2 Apr, 2017 06:28 IST|Sakshi
ఆత్మ రక్షణలో అధికార పక్షం

త్రికాలమ్‌
మంత్రివర్గంలో మార్పులు చేసే క్రమంలో శనివారం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో, శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. అలిగేవారు అలుగుతున్నారు. బెదిరించేవారు బెదిరిస్తున్నారు. వేడుకునేవారు వేడుకుంటున్నారు. విన్నవించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్ది చెబుతున్నారు. మంత్రివర్గంలో మార్పులు జరిగిన ప్రతిసారీ ఈ తంతు అని వార్యం. పదవులు ఆశించేవారు ఎక్కువ. పదవులు తక్కువ. ఇంతవరకూ మంత్రులుగా పని చేసినవారు సాధించిన ఘనకార్యాలు ఏమిటో, ఇప్పుడు కొత్తగా చేరేవారు చేయబోయేది ఏమిటో తెలియదు. మంత్రివర్గ సభ్యులతో సమాలోచన జరిపి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక నిర్ణయం తీసుకునే ముందు చర్చ జరిగినట్టు, ముఖ్యమంత్రి అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఒక్క మంత్రి అయినా వెలిబుచ్చినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక పొరపాటు నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు వారించే సాహసం, వివేకం ఉన్న వారికి  అవకాశం ఇచ్చినట్లయితే ప్రభుత్వం తప్పులు తక్కువ చేస్తుంది. ముఖ్య మంత్రి ఏది చెబితే దానికి తలలూపేవారినే చేర్చుకుంటే ప్రభుత్వం తప్పులు ఎక్కువ  చేసి చిక్కులు కొనితెచ్చుకుంటుంది.  

విషయ పరిజ్ఞానం ఉన్న శాసనసభ్యులకు అవకాశం ఇస్తే మంత్రివర్గం పనితీరు మెరుగవుతుంది. ప్రభుత్వానికీ, అధికారపార్టీకీ, ముఖ్యమంత్రికీ మంచి పేరు వస్తుంది. రెండున్నర సంవత్సరాలుగా మంత్రులు పని చేసిన తీరును చూసిన ముఖ్యమంత్రి ఎవరికి ఉద్వాసన చెప్పాలో, ఎవరికి ముఖ్యమైన శాఖలు అప్పగించాలో నిర్ణయించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చింది. కేవలం కులాల సమతౌల్యం మాత్రమే చూడకుండా పార్లమెంటరీ  సంప్రదాయాలు తెలిసినవారికీ, అధ్యయనశీలం ఉన్నవారికీ, ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయం కలిగినవారికీ  మంత్రి పదవులు ఇస్తారో లేక  ప్రతిభకు కాకుండా విధేయతకే ప్రాధాన్యం ఇస్తారో కొన్ని గంట లలో తెలిసిపోతుంది.  వైఎస్‌ఆర్‌సీపీ టికెట్టుపై గెలిచి పార్టీ ఫిరాయించివారిని పార్టీలో చేర్చుకున్న సమయంలో వారికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయ డం ఒక సవాలు. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించడం అనైతికం. వారికి మంత్రి పదవులు ఇవ్వడం అక్రమం. తెలంగాణలో టీడీపీ టికెట్టుపైన గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ చేత మంత్రిగా ప్రమాణం చేయించినందుకు గవర్నర్‌ను తప్పుపట్టి విమర్శించిన చంద్రబాబు అదే గవర్నర్‌ నరసింహన్‌ చేత ఫిరాయింపుదారులతో ప్రమాణం చేయించడం ద్వంద్వ ప్రమాణాలకూ, విలువల పతనానికీ పరాకాష్ఠ. బాదల్‌ నుంచి కేసీఆర్‌ వరకూ అందరూ చేస్తున్నదే కనుక  కుమారుడు లోకేశ్‌ను చేర్చుకోవడాన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. కానీ ఫిరాయింపుదారులకు పద వులు ఇవ్వడం మాత్రం ప్రజలు సహించరు. కేసీఆర్‌ చేసినా చంద్రబాబు చేసినా అది అనైతికమే, అభ్యంతరకరమే.  

ఒకటి ఉదాహరణ, ఒకటి హెచ్చరిక
సమావేశాలు ఎట్లా జనరంజకంగా జరగాలో చెప్పుకోవాలంటే తెలంగాణ అసెం బ్లీనీ, ఎట్లా జరగకూడదో చూపించాలంటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీనీ ఉదాహరణగా చెప్పుకోవచ్చునంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు బాగా ప్రచారమైనాయి. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరు పాతరోజులను గుర్తుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు చర్చ లేకుండా సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ, కేకలూ, పొలికేకలతో అట్టుడికాయి. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లా  డటానికి అవకాశం లభిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతకు మైకు దొరకడమే గగనం అవుతోంది. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు ఏదైనా చెప్పడానికి లేస్తే ప్రతిపక్ష నాయకుడు కూర్చోవడం ఆనవాయితీ. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుండగానే ఆయన మైక్‌ ఆగిపోయి అచ్చెన్నాయుడూ, బుచ్చయ్య చౌదరీ, కాల్వ శ్రీనివాసులూ, యనమల రామకృష్ణుడూ, అనిత తదిరులంతా ప్రతిపక్ష నాయకుడిని తనివితీరా తిట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ‘పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి మైక్‌ కట్‌ అవుతోంది అధ్యక్షా’ అంటూ తెలంగాణ శాసనసభలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అమ రావతిలో అధికారపక్షం ధోరణిలో మార్పు లేదు. చంద్రబాబు మొత్తం 13 రోజుల్లో ఎనిమిది గంటలకు పైగా మాట్లాడితే 67 మంది సభ్యులున్న (ఫిరా యించినవారి పేర్లు సైతం వైఎస్‌ఆర్‌సీపీ జాబితాలోనే ఉన్నాయి) ప్రతిపక్షానికి కేవలం 3.46 గంటల సమయం దొరికింది. నలుగురు సభ్యులున్న బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడటానికి  3.13 గంటల సేపు అనుమతించారు.  

సభలో చర్చ జరగకపోవడానికి బాధ్యత ఎవరిది? ప్రతిపక్షానిది అనే సమా ధానం అధికారపార్టీ నుంచి వస్తుంది. కానీ సభను సజావుగా  జరిపించవలసిన బాధ్యత అధికారపక్షానిదీ, సభానాయకుడిదీ. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి అదేపనిగా ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ సంగతి విస్మరిస్తే కుదరదు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రత్యేకత ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు కేంద్రంగా సభ నడవడం. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో ప్రతిపక్షనేతను అదే పనిగా తిట్టించడం. తిట్ల దండకం మినహా వారి నియోజకవర్గాలను పట్టిపీడిస్తున్న సమస్యల ప్రస్తావనకు ఫిరాయింపుదారుకు అవకాశం లేదు. ప్రతిపక్ష నాయకుడు అన్ని అంశాలపైనా అధ్యయనం చేసి గణాంకాలతో సహా సవివరంగా మాట్లాడుతుంటే అధికారపక్ష సభ్యులకు ఆ అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిని తిడితే సరిపోతుంది. మంత్రులూ ఇదే పని చేస్తున్నారు. ఉత్తరోత్తరా ఎవరైనా పరిశోధకులు ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ కార్యకలాపాలను అధ్యయనం చేస్తే ఎంత నేలబారుగా కొందరు సభ్యులు వ్యవహరించారో చూసి విస్తుపోతారు.

చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం
ఒక్క బిల్లుపైన కూడా సంపూర్ణంగా చర్చ జరగని సమావేశం ఇదే. మొత్తం 21 బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ ఒక్కదానిపైన కూడా ప్రతిపక్షం అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ముఖ్యమంత్రి వ్యక్తి గతంగా దూషించడం, ప్రతిపక్ష నాయకుడు పరీక్షలు రాయలేదనీ, ఆర్థిక ఉగ్ర వాది అనీ, నేరస్థుడనీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఎవరి స్థాయి తగ్గింది? తన అభిప్రాయం చెప్పడానికి రెండు నిమిషాలు మైకు ఇవ్వమని పదేపదే ప్రతిపక్ష నాయకుడు విజ్ఞప్తి చేసినా నాలుగు రోజుల పాటు మైకు ఇవ్వని పరిస్థితి గతంలో ఎన్నడూ కనలేదు. వినలేదు. ప్రతిపక్షనేత తీరుపైన రెండు గంటలు చర్చ జరిపి ఆయన వైఖరిని నిరసిస్తూ ఒక తీర్మానం ఆమోదించిన ఘనత సైతం ఈ శాసనసభదే.  ప్రతి విమర్శకీ జగన్‌మోహన్‌రెడ్డి దీటుగా సమా ధానం చెప్పారు. తన ఆస్తుల గురించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య లను సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా తన మీద సీబీఐ విచారణ వెనుక, కేసుల వెనుక ఉన్న కారణాలు  ఏమిటో, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి ఎట్లా కేసులు పెట్టించారో సవివరంగా చెప్పారు. తాను ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలలో చదివిన వైనం, ప్రతి పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైన విషయం స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు చంద్రబాబు ఆంగ్లభాషా ప్రావీణ్యంపైన కూడా వ్యాఖ్యానించారు. జానెడు పోయి మూరెడు కుంగడం అంటే ఇదే. జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యార్హతలను ప్రశ్నించడం అక్కడ అనవసరం. విద్యా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి మంత్రిపదవి ఇవ్వడం, ఆ మంత్రికి విద్యామంత్రి బంధువు కావ డం వంటి లాలూచీ వ్యవహారం దేశంలో మరెక్కడా లేదు. అటువంటి వ్యక్తుల నిర్వాకాలను ముఖ్యమంత్రి వెనకేసుకొని రావడంతో ఆయనే అపఖ్యాతి పాలవు తున్నారు. మంత్రిత్వశాఖలను మార్చే సమయంలోనైనా ఇటువంటి పొర పాట్లను ముఖ్యమంత్రి సర్దుకుంటారేమో చూడాలి.

ఎంఎల్‌సీ ఎన్నికల ఫలితాలపైనా తొందరపాటు వ్యాఖ్యలు
స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి టీడీపీ అభ్యర్థులు ఎట్లా ఎన్నికైనారో అందరికీ తెలుసు. టీడీపీకి చెందిన సభ్యుల కంటే వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు రెట్టింపు కంటే అధికంగా ఉన్న కడపలో కూడా ఓటర్లను సంపాదించి విజయం సాధించడం ఒక ఘనకార్యంగా ముఖ్యమంత్రి డంబాలు పోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  పులివెందులలో సైతం గెలుస్తామంటూ, 2019 ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ఉచ్ఛస్వరంతో భీషణ ప్రతిజ్ఞ చేయడం చూశాం. టీచర్లూ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పీడీ ఎఫ్, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు పెద్ద మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులపై గెలిచిన ప్పుడు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

బడ్జెట్‌ సమావేశాలు 80 రోజులకు తక్కువ కాకుండా జరగాలంటూ టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్‌ చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాదన విస్మరించారు. ఈ యేడు శీతాకాల సమావేశాలు జరగనే లేదు. బడ్జెట్‌ సమావేశాలు జరిగింది 14 రోజులు మాత్రమే. అందులో ఒక రోజు గవర్నర్‌ ప్రసంగానికి పోతే మిగిలినవి 13. అందులో రెండు రోజులు నారాయణ స్కూల్లో పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీపైన రచ్చ. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగి ఉంటే పద్ధతిగా ఉండేది. ప్రతిపక్షం రెండు రోజులు గొడవ చేసిన తర్వాత పరీక్ష పత్రం లీకేజీపైన చర్చ జరపక తప్పలేదు. లీకేజీ వ్యవహారంపైన  నారాయణ ఒక విధంగా, విద్యామంత్రి గంటా  మరో విధంగా మాట్లాడటం, ఈ సంగతి ‘సాక్షి’కి మాత్రమే ఎట్లా తెలిసిందంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించడం విడ్డూరం. ప్రశ్నపత్రం లీకైనట్టు తెలుసుకున్న ‘సాక్షి’ విలేకరి తనకు అందిన ప్రశ్నపత్రాన్ని జిల్లా విద్యాధికారికి పంపించి, లీకైన మాట వాస్తవమని, అది అసలైన ప్రశ్నపత్రమేనని అధికారి ధ్రువీకరించిన తర్వాతనే వార్తను టీవీ చానల్‌కు పంపించాడు. ఇది వృత్తిపరంగా ఉన్నతమైన ప్రమాణాలు పాటించే జర్నలిస్టులు చేసే ప్రక్రియ. ఇందుకు అభినందించవలసింది పోయి అతడిని అభి శంసించినట్టు మాట్లాడటం అన్యాయం.

ఏదైనా అంశంపైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుకోవడం ఆనవా యితీ. కానీ అగ్రిగోల్డ్‌ వ్యవహారంపైన చర్చ ముందుకు సాగకుండా పత్తిపాటి పుల్లారావు చేత సవాళ్లు చేయించి చర్చను పక్కదారి పట్టించింది అధికారపక్షమే. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు బజారుపాలు కావడంలో యాజమాన్యంతో పాటు కొందరు అధికారపక్ష ప్రముఖుల పాత్ర ఏమిటో కూడా వెల్లడి కావాలి. సీబీఐ దర్యాప్తు జరిపించవలసిన వ్యవహారం ఇది. కేసీఆర్‌ చేసినట్టే చంద్రబాబు కూడా సభలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు ప్రారంభించారు. సభాపతి తన ఇంట ర్వూ్యని సభలో ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుపైన ఒక ప్రజెంటేషన్, ఖరారు కాని అమరావతి న గర డిజైన్లతో మరో ప్రజెంటేషన్‌ చూపించారు. ప్రతిపక్షాన్ని కలుపుకొని పోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వం దేశం మొత్తంలో బహుశా ఇది ఒక్కటే. ప్రత్యేక హోదా విష యంలో కానీ పోలవరం ప్రాజెక్టు సందర్భంలో కానీ ప్రతిపక్షం ప్రస్తావనే లేదు. రాజధాని నిర్మాణంపైన కె. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను ఎందుకు బుట్ట దాఖలు చేశారో చెప్పలేదు. ఆ నివేదికపైన శాసనసభలో కానీ వెలుపల కానీ చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో ప్రతిపక్షం సరి పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయం.

మొత్తంమీద బడ్జెట్‌ సమావేశాలు మొదటి నుంచీ అధికారపక్షానికి ప్రతి కూలంగానే సాగాయి. రోడ్డు రవాణా కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపైన టీడీపీ నాయకులు కేశినేని నానీ, బోండా ఉమా తదితరుల దాడి, నారాయణ స్కూలులో ప్రశ్నపత్రం లీజేకీ, ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు వ్యాపించి నలు గురి మృతి వంటి ఘటనలు అధికారపక్షాన్ని చిరాకు పరిచాయి.  చివరికి ‘కాగ్‌’ నివేదిక రెండున్నరేళ్ళుగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అక్షరసత్యాలంటూ ఘోషించింది. పట్టిసీమపైన అవసరానికి మించి ఖర్చు చేశారనీ, కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారనీ, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతు న్నప్పుడు పట్టిసీమ కానీ,  పురుషోత్తపట్టణం, చింతలపూడి ప్రాజెక్టులు కానీ అన వసరమనీ ‘కాగ్‌’ స్పష్టం చేసింది. కేంద్ర అనుమతులు లేని ఈ ప్రాజెక్టులపైన ఇంత ప్రజాధనం ఎట్లా ఖర్చు చేశారంటూ ప్రభుత్వాన్ని ‘కాగ్‌’ నిలదీసింది. అధి కారపక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోగా ప్రతిపక్షం ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సారి సభలో ప్రతిపక్షానిదే పైచేయి అన్నది టీడీపీ నాయకులు కూడా అనుకుం టున్న మాట. సభానాయకుడే ప్రతిపక్ష నాయకుడిని కథానాయకుడిని చేసిన సన్నివేశం మనం ఈ సమావేశాలలో చూశాం.


- కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు