ఫిరాయింపులు అప్రజాస్వామికం..!

26 Oct, 2016 08:43 IST|Sakshi
ఫిరాయింపులు అప్రజాస్వామికం..!

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌



'పాలనలో లోపాలను ఎత్తిచూపే వారివల్లే అభివృద్ధికి ఆటంకం కలుగు తోందనీ ఆరోపించడం తప్పు. మాకు అన్నీ తెలుసు కదా మీరెవరు చెప్పడా నికి అని పాలకులు ప్రశ్నించడమే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం తనను ప్రశ్నిస్తున్న సంస్థల పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పే అభిప్రాయాలు తప్పయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు.'

ఒక పార్టీ తనను తాను బలోపేతం చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి ప్రజలకు దగ్గర కావడమే.. కానీ, ఇంకో పార్టీ లోని రాజకీయ నాయకుడిని కొనేసి తెచ్చుకుంటే నేను బలపడతాను అంటే అది ప్రజాస్వామ్య పద్దతి కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అంటున్నారు. పార్టీ విసిరే పైసలకు ఇటు వచ్చినోడు మరో పార్టీ ఇంకో ఆకర్షణ చూపితే మరోవైపుకు పోడని చెప్పలేమని, ప్రభుత్వాన్ని పడ గొట్టడానికి జరిగే ప్రయత్నాన్ని రాజకీయంగా ఎదుర్కొంటేనే ప్రజాస్వామ్యం బలపడు తుందని స్పష్టం చేశారు. పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలని చూడటం ఎంత తప్పో, అవతలివాళ్లు కూడా పైసలిచ్చి ఓట్లు వేయించుకోవాలని చూడటం అంతే తప్పు అనీ, తప్పుకు అదే తప్పు చేయడం పరిష్కారం కాదన్నారు. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల విషయంలో రాజీ పడబోమని, ఎంతటి కొండను ఢీకొనవలసి వచ్చినా ఢీకొంటామని తేల్చి చెబుతున్న తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండ రామ్‌ ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

బంగారు తెలంగాణ అనేది మీ నినాదం కాదా?
బంగారు తెలంగాణ అంటే కొంతమంది దృష్టిలో కేవలం కొంత ఉత్పత్తి పెరిగితే చాలు. ఒక రోడ్డేమయినా బాగుపడగానే బంగారు తెలంగాణ అయిపోయిందని కొంద రనుకుంటారు. ప్రతి మనిషీ అత్మగౌరవంతో జీవిస్తూ, సామాజిక న్యాయం పొంద గలిగినప్పుడు అసలైన తెలంగాణ ఏర్పడుతుందని నేను భావిస్తున్నా.

ప్రస్తుతం పాలనలో ఎక్కడ తేడా వచ్చింది?
వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సరళీకరణ విధానాల ప్రభావం కారణంగా ఈ రంగాలను విస్మరించారు. ఇవాళ తెలంగాణలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిని నమ్ముకుని బ్రతు కుతున్న వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఇది జరగటం లేదు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి. అన్నిటి కంటే ముఖ్యంగా చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉపాధి కల్పన చేయాలి.

ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పని చేయడం లేదంటారా?
ప్రాధాన్యతల విషయంలో తేడా ఉంది. ఇప్పుడు చెరువులు పునరుద్ధరిస్తున్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు అది ప్రజా వ్యతిరేక విధానమని చెప్పగలమా? ప్రభుత్వం చేసే పనులు ప్రజానుకూలమైనవే. కానీ ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన అభివృద్ధి నమూనా ఇప్పుడు పనికి రాదు. ప్రజలు కేంద్రంగా ప్రత్యామ్నాయంగా ఇంకో అభివృద్ధి నమూనాను తీసుకోవాలి. ఇదే మా భావన.

ప్రజలకు అన్నీ చేస్తున్నామంటున్నారు కదా?
ఎక్కడ చేస్తున్నారు? నీళ్లు వస్తే వ్యవసాయంలో అన్నీ పరిష్కారమైపోతాయనే ఆలోచనలో ఉన్నారు. నీళ్లు వస్తే తెలంగాణ సమాజం ఇవ్వాళ ఎదుర్కొంటున్న సమ స్యల్లో ముఖ్యమైన సమస్య పరిష్కారం అయిపోతుంది. కాని అదొకటే కాదు. చిన్న, సన్నకారు రైతులు నిరంతరం మార్కెట్‌ దోపిడీకి గురవుతున్నారు. ఆ దోపిడీ నుంచి రైతుకు రక్షణ కలిగించాలి కదా.

మల్లన్నసాగర్‌కు మీరే వెళ్లి ఆందోళన చేస్తే. ప్రభుత్వం దీన్ని ఎలా డీల్‌ చేయాలి?
ఇప్పటికీ మల్లన్న సాగర్‌ విషయంలో డీపీఆర్‌ అనేది రెడీ కాలేదు కదా. డీపీఆర్‌ లేకుండా ఎట్ల గడతారు? మేం దీన్నే నిలదీశాం. ప్రభుత్వాలు తప్పు చేసేది ఇక్కడే మరి. చట్టం చెప్పిన సూత్రాల ప్రకారం నడచుకోవాలి కదా. మేం అధికారంలో ఉన్నాం. అన్నీ కరెక్టుగా చేస్తాం మాకు వదిలివేయొచ్చు కదా అంటే ఇక చట్టమెందుకు? రాజ్యాం గమెందుకు? ఎన్నికలే ఎందుకు? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రధాన లోపం ఏదంటే భూసేకరణ విషయంలో చట్టం కల్పించిన హక్కులన్నింటినీ విస్మరిస్తున్నారు. అసైన్డ్‌ భూములు కలవారిని బెదిరించి భూమి తీసుకోవడం ఏమేరకు సమంజసం?

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారేంటి?
ప్రజల తరపున గళం విప్పడం, వారికోసం పనిచేయడమే అనవసరం... వీరివల్లే అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మాకు అన్నీ తెలుసు కదా మీరెవరు చెప్పడానికి అనే ప్రశ్నలే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం ఇలాంటి సంస్థల పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పే అభిప్రాయాలు తప్పయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రభుత్వ గౌరవం ఇంకా పెరుగుతుంది. వారు చెప్పేది వాస్తవమే అయితే ప్రభుత్వానికి పడిపోయే కిరీటాలు ఏవీ లేవు. ప్రజాస్వామిక వ్యవస్థలో సలహాలు వినడం అవసరం. ప్రజాస్వామిక దేశాల్లో ప్రభుత్వానికి చెట్టుకున్నంత, భూమికున్నంత, రాయికున్నంత సహనం ఉండాలి.
 

తెలంగాణ ప్రభుత్వం సక్సెస్‌ అయినట్లా, ఫెయిల్‌ అయినట్లా?
టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం చేస్తున్న తప్పిందం ఏమిటంటే. పాత అభివృద్ధి విధానాల్లో చాలావాటిని మనం కొనసాగిస్తున్నాం. వాటిని వదిలిపెట్టాలి. ఉదాహరణకు కార్పొరేట్‌ విద్య ఉంది. కార్పొరేట్‌ విద్యా సంస్థలను పర్మిషన్‌ లేకున్నా, గ్రౌండ్‌ లేకున్నా, ల్యాబ్‌ లేకున్నా అడగరు. బతుకుదెరువు కోసం చిన్న కాలేజీ పెట్టుకుంటే నాలుగైదుసార్లు తనిఖీ చేస్తారు. ఎందుకీ వ్యత్యాసం? అలాగే ఒక పెద్ద కంపెనీని తెలంగాణకు ఆకర్షించటం చాలా అవసరం. కానీ ఇక్కడున్న చిన్న, సూక్ష్మ పరిశ్రమల సంగతి? వీళ్లేమో తమకు 200 గజాల జాగా ఇస్తే.. షెడ్డు కట్టుకుని మనగలమని అంటున్నారు. ఇలాంటి వర్గాల అవసరాలను, ప్రయోజనాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరిస్తోంది.

ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరడం లేదా?
ప్రాధాన్యతల విషయంలో ప్రభుత్వం కచ్చితంగా విఫలమవుతోంది. వివిధ వర్గాల ప్రయోజనాలను గుర్తించడంలో, పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిర్ణయాలు చేసేటప్పుడు పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రా ంగం సమిష్టిగా భాగస్వామ్యం వహించటం చాలా అవసరం. అలా భాగస్వామ్యం లేనప్పుడు కూడా సమస్యలు వస్తాయి. మంత్రికి చెబితే కూడా పనులు కాకపోతే ఎట్లా? ఇది మంచి పరిణామం కాదు. అంటే సగటు మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభు త్వానికి చేరటం లేదు. చేరుకున్నా ఒక పరిష్కారం అనేది రావటం లేదు. ఆ లింకే తెగిపోయింది. పరిష్కారానికి అవకాశం కూడా కనబడక పోయేసరికి ప్రజల ఆవేదన మరింత తీవ్రంగా ఉంటోంది. ఇవ్వాళ మల్లన్నసాగర్‌ ప్రజల సమస్య ఇదే. వారి ఆవేదన చెప్పుకోవాలి కదా. వినాలి కదా.. ప్రజలకు చెప్పుకోవడానికి దారులు మూసేశారు.

ఫిరాయింపులపై మీ స్పందన ఏమిటి?
అనైతిక రాజకీయాలకు మారుపేరే ఫిరాయింపులు. ఒక పార్టీ తనను తాను బలోపేతం చేసుకోవడానికి ప్రజాస్వా మ్యంలో ఉన్న పద్ధతి ప్రజలకు దగ్గర కావ డమే. ఇంకొక రకమైన రాజకీయాలకు స్థానం లేకుండా చేయాలి. అదే సరైన పద్ధతి. కానీ ఇంకో పార్టీ లోని రాజకీయనాయకుడిని తెచ్చుకుంటే నేను బలపడతాను అంటే,  పైసలకు ఇటు వచ్చినోడు, ఇంకా ఆకర్షణ చూపితే ఇంకోవైపుకు పోడని చెప్ప గలమా? అలా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ప్రయత్నాన్ని రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే, కచ్చితంగా ఇంకాస్త ఎక్కువ మద్దతు వచ్చేది. మేం కూడా మద్దతుగా నిలిచేవాళ్లం. ఎన్టీరామారావును 1984లో బర్తరప్‌ చేసినప్పుడు ఎంత పెద్ద ప్రతిస్పందన వచ్చిందో తెలుసుకదా. అప్పట్లో మేము పౌరహక్కుల సంఘంలో ఉండి అలాంటి పద్ధతులను కూడా విమర్శిస్తూ కరపత్రాలు వేశాం. అది కరెక్టు పద్ధతి అంటాను. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.


ఓటుకు నోటు కేసు పోన్‌ ట్యాపింగ్‌ కేసుపై మీ అభిప్రాయం?
తెలంగాణలో పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలని చూడటం ఎంత తప్పో, అవతలివాళ్లు కూడా పైసలిచ్చి ఓట్లు వేయించుకోవాలని చూడటం అంతే తప్పు కదా. నువ్వు ఒక తప్పును విమర్శిస్తూ, నువ్వు అదే తప్పును చేస్తే తేడా ఏముంది. నువ్వు ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు రావాలి. ఓటుకు కోట్లు కేసులో రాజీపడ్డట్టుగా లోప ల్లోపల ఏదయినా ఉందేమో. కేసును సీరియస్‌గా పట్టించుకోవడం లేదనే అభి ప్రాయం అయితే ఉంది కానీ నేను దానిపై వ్యాఖ్యానించలేను.
(కోదండరామ్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి)

https://www.youtube.com/watch?v=8XDbVBEP8Wg

మరిన్ని వార్తలు