మానవీయతా మకుటధారి..!

9 May, 2017 01:49 IST|Sakshi
మానవీయతా మకుటధారి..!

ఆలోచనం
కిస గౌతమి అనే స్త్రీ మరణించిన తన బిడ్డని బతికించమని అడిగినపుడు బుద్ద భగవానుడు, తల్లో, బిడ్డో, స్నేహితులో, బంధువులో ఇలా ఇంతవరకూ ఎవరూ మరణించని ఇంటి నుండి గుప్పెడు ఆవాలు తెమ్మన్నాడట, ఎవరూ మరణించని ఇల్లు ఈ భూమిపైన ఎక్కడయినా ఉంటుందా? ఆ గుప్పెడు ఆవాల కోసం తిరిగి  అలిసిపోయిన గౌతమికి జననమరణాలు అత్యంత సహజమని తెలియవచ్చింది. సుఖదుఃఖాలు కూడా అంతే. ఈ పృథ్విపై సుఖాన్ని మాత్రమే అనుభవించే మనుషులు ఎవరూ వుండరు. కానీ కష్టాన్ని అనుభవించడం ఎంతో కష్టం. నాకొచ్చిన అటువంటి అత్యంత కష్టంలో సాంత్వనమిచ్చిన వాడు టాగోర్‌. టాగోర్‌ రాసిన 2230 పాటలలో ఒక పాట ‘‘ఎయి కోరేచి బాలో నిటుర్‌ హే’’. అందులో టాగోర్‌ అంటాడు కదా ‘‘నన్ను దుఃఖంతో జ్వలింపజేస్తున్నావ్‌ మంచిదే, ధూపం నిప్పులలో దహించబడకపోతే సుగం ధం వస్తుందా, దీపం జ్వలించకపోతే వెలుగు పుట్టదు కదా’’ అని. ఈ పాటను నాకు మానవి బందోపాధ్యాయ అనే ట్రాన్స్‌పర్సన్‌ పరి చయం చేశారు. తృతీయ ప్రకృతిగా మానవ సమూహాల నుంచి హేళనను ఎదుర్కొంటున్నపుడు, తనచేతిలో లేని తన పుట్టుక తనని బాధపెడుతున్నపుడు ఆ పాట ఇచ్చిన ఓదార్పు అనన్యమైనదని ఆమె చెప్పారు. నన్ను, మానవినే కాదు, కష్టసందర్భాలనే కాదు, టాగోర్‌ పాటలు మానవుని జీవితంలోని ప్రతి సందర్భాన్ని పలకరిస్తాయని ఆ పాట లను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్న సందర్భంలో నాకు అర్థమయింది.

ఇవాళ వైశాఖం 25వ తేదీ, టాగోర్‌ పుట్టిన రోజు. కొంతమంది జీవించినపుడే కాదు, జీవితానంతరమూ జీవిస్తారు. మానవ సమాజ ఔన్నత్యానికి ఏమేంకావాలో అంచనావేయగల శక్తి వారిని కాలాతీతులను చేస్తుంది. టాగోర్‌ అటువంటి దార్శనికుడు. కథకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, నాట కకర్త, గేయరచయిత ఇలా టాగోర్‌ సాహిత్య సృజనకారుడిగా అనేక  రూపాలను సమర్థవంతంగా పోషించారు. ఆయన స్పృశించని మానవజీవన కోణమూ, ప్రశ్నించకుండా వదిలిన మూఢత్వమూ బహుశా లేవు. మాష్టారు గారు కథలో హరలాల్, రాస మణి కొడుకు కథలో కాళీ పద్‌ మరో మార్గమేమీ లేకుండా పేదరికానికి బలికావడం, పోస్ట్‌ మాస్టర్‌ కథలో రతన్, సమాప్తిలో తనకు తెలియకనే బాల్యం నుంచి యవ్వనంలోకి సాగిన చిన్ని మ్రున్మయి, ఎప్పుడు ఎందుకు అట్లా జరిగిందో తెలియక దుఃఖాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత, కులం గురించి మాట్లాడిన చండాలిక, సౌందర్యం గురించి చర్చించిన చిత్రాంగద రవీంద్రుని రచనా నైపుణ్యానికి మృదువైన చిరునామాలు. భార్య రాసిన లేఖ అనే కథలో రవీంద్రుడు తానే భార్యగా, ఒక స్త్రీ హృదయాన్ని చది వినట్లు, చీరకి నిప్పంటించుకుని చనిపోయిన తన అనాథ బాంధవి గురించి ‘ఊళ్లో వాళ్ళందరూ రేగారు. ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది’ అన్నారు. ఇదంతా నాటకం అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ–కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతుందేం? బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ? అది కూడా ఆలోచించి చూడ టం యుక్తం..! అని 1913 లోనే స్త్రీల తరపున నిర్ద్వంద్వపు వకాల్తా పుచ్చుకున్నాడు. నోబెల్‌ బహుమతి పొందిన గీతాంజలి ఆయన రచనలో ఒక చిన్ని పాలు మాత్రమే.

టాగోర్‌ పూర్వీకులలో కొందరు ముస్లిం మతంలోకి మారగా, మిగిలిన వారిని పిరాలి బ్రాహ్మణులంటూ సమాజం వెలివేసింది. ఈ కారణం చేత టాగోర్‌ కుటుంబం  తమకున్న అనేకానేక వ్యాపారాల చేత ఆర్థికంగా సంపన్న వర్గంగా ఉన్నప్పటికీ కులపరంగా చిన్నచూపును అనుభవించారు. వీరి ఇంటి పిల్లలకి సరయిన వివాహ  సంబంధాలు రాక కాదంబరి, మృణాళిని వంటి పేదపిల్లలని వివాహమాడారు. అందుకే టాగోర్‌ తనపై మహమ్మదీయుల, హిందువుల, ఆంగ్లేయుల ప్రభావం ఉందనీ ఒక చోట అన్నాడు. మనుషులందరం ఒక్కటిగానే పుట్టాం దుర్మార్గులు కొందరు హెచ్చు తగ్గులను సృష్టిం చారు అన్న కబీరును టాగోర్‌ అనువదించడం వెనుక ఈ  ప్రభావం కూడా ఉంది. ఈ రోజు ఉదాత్తులనుకునే కొంతమంది కులాలు లేవు మనందరం భారతీయులం అంటుండగా, టాగోర్‌ ఆ రోజులలోనే నా  ప్రాణం ఉండగా నేను మానవీయతకంటే జాతీయత గొప్పది అనే భావనను అంగీకరించను అన్నాడు. ‘ఇంట బయట’లో ఆ విషయాలను చర్చించాడు. ఈ రోజు మనం మాట్లాడుతున్న మారిటల్‌ రేప్‌ గురించి అనేక ఏళ్ళ క్రితం ‘కుముదిని’లో చర్చించి, గర్భము, వివాహం, సమాజం స్త్రీ జీవితాన్ని ఎలా సంకెలలో ఉంచేస్తుందో చెప్తాడు.

‘‘నేను గే లాగా జీవించడమనేది, మైనారిటీలో ఉండ టం అంటే ఏమిటన్న అంశంపై నాకు లోతైన అవగాహనను ఇచ్చింది, నిత్యం ఇతర మైనారిటీ బృందాలలోని వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి తోడ్పడింది’’ అన్నాడు ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌. బహుశా టాగోర్‌ పిరాలి బ్రాహ్మణత్వం, మాతృ లేమి, ప్రియబాంధవి కాదంబరి మరణము, సునిశితహృదయం అన్నీ కలిపి సమాజాన్ని కులము, మతము, లింగము, దేశము అనే భావనలకు అతీతంగా చూడటం నేర్పాయేమో. ఏది ఏమయినా టాగోర్, నెహ్రూ చెప్పినట్టు ఒక ‘‘సుప్రీమ్‌ హ్యూమన్‌’’. నాటికీ నేటికీ ఆయన మార్గం అనుసరణీయం. రాజులకు మరణం ఉంటుంది, కవులకు కాదు కదా. ఈ గొప్ప సాహిత్యకారుడికి, మానవీయ మూర్తికి, శాంతి నికేతన్‌ వ్యవస్థాపకునికి అత్యంత ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు!

వ్యాసకర్త: సామాన్య కిరణ్‌
ప్రముఖ రచయిత్రి - 91635 69966

మరిన్ని వార్తలు