అంతర్గత చర్చ అవసరం కాదా?

1 Apr, 2017 04:24 IST|Sakshi
అంతర్గత చర్చ అవసరం కాదా?

జాతిహితం
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా మన ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు. ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని పరిరక్షించుకుని, మరింతగా విస్తరింపజేసుకునేట్టు చేయడం ఎలాగని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ప్రతిష్టను కాపాడుకునే ఉత్తమ మార్గం అవుతుందా?

చచ్చేటంత విసుగెత్తించే  రాజకీయాల నుంచి తరచుగా నేను క్రికెట్‌లోకి జారు కుంటూ ఉంటాను. మన న్యాయ వ్యవస్థ గురించి వ్యాఖ్యానించాల్సి వచ్చిన ప్పుడు సినిమా సంగీతాన్ని అందులోకి చొప్పించడమూ చేస్తుంటాను. ప్రత్యే కించి సుప్రసిద్ధ సినీ గేయ రచయిత ఆనంద్‌ బక్షీ వర్థంతి (మార్చి 30) సంద ర్భంగా ఇది రాస్తున్నాను కాబట్టి.

మన న్యాయ వ్యవస్థతో పాటూ బక్షీ శకాన్ని గురించి  ఒకే సమయంలో ఆలోచిస్తుంటే, నాకు ఆయన రాసిన ఒక గేయ చరణాలు గుర్తుకు వస్తు న్నాయి. 1969లో విడుదలైన దో భాయ్‌ చిత్రంలో అశోక్‌ కుమార్, జితేంద్ర– మాలాసిన్హా  నటించారు. అందులో అశోక్‌ కుమార్, జితేంద్ర అన్నదమ్ములు. ఒకరు న్యాయమూర్తి, మరొకరు పోలీసు అధికారి. ఇక మిగతా కథంతా ఊహించి చెప్పేయ గలిగిందే. తమ్ముడ్ని శిక్షించడమా లేక క్షమించడమా? అనే సందిగ్ధంలో పడతాడు అన్న. ‘‘ఇస్‌ దునియా మెయ్‌ ఓ దునియావాలో, బదా ముష్కిల్‌ హై ఇన్సాఫ్‌ కర్నా/బడా ఆసాన్‌ హై దేనా సజాయేం, బడా ముష్కిల్‌ హై రపర్‌ మాఫ్‌ కర్నా’’ (క్షమించడం కంటే శిక్షించడం చాలా సులువైనప్పుడు న్యాయమూర్తిగా ఉండటం చాలా కష్టం అని సంక్షిప్తార్థం). ఆనంద్‌ బక్షీ రాసిన ఈ గేయాన్ని మహ్మద్‌ రఫీ పాడారు.

న్యాయమూర్తితో పోలిస్తే సంపాదకుని జీవితం ఎన్నో యోజనాలు దిగు వన ఉంటుంది. అయినా మా జీవితాలకు కూడా అదే తర్కం వర్తిస్తుంది. ప్రచురించకుండా ఆపి, అందుకు కారణాలను వివరించడం కంటే ప్రచురించి బాధపడటం  తేలిక.
ఒక సంచలనాత్మక కథనాన్ని, అది కొంత నమ్మదగినదిగా లేనంత మాత్రాన ప్రచురించకుండా వదిలేసేవాడు తెగువలేని సంపాదకుడు మాత్రమే. నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నది 1998 శీతాకాలం నాటి భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన కథనాన్ని గురించి. కొందరు వివేక వంతులు, గౌరవనీయులైన వ్యక్తులు నాపై ఉంచిన నమ్మకాన్ని 20 ఏళ్ల తర్వాత వమ్ము చేసి వారి పేర్లను వెల్లడి చేయాల్సి వస్తోంది. అందుకు నాకున్న కారణాలను వారు అర్థం చేసుకుంటారు, మన్నిస్తారు.

న్యాయమూర్తిపై సంపాదక సందిగ్ధం
అప్పుడే ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన జస్టిస్‌ ఏఎస్‌ ఆనంద్‌ గత జీవితంపై మంచి దిట్టౖయెన మా న్యాయ సంపాదకుడు క్షుణ్ణ మైన దర్యాప్తును చేపట్టారు. అది జస్టిస్‌ ఆనంద్‌ను ప్రయోజనాల సంఘ ర్షణను విస్మరించిన వారిగా, కానుకల విషయంలో పారదర్శకత పాటించని వారుగా, తన భూముల భాగస్వామ్య కౌలుదారులతో నిజాయితీలేకుండా ప్రవర్తించిన వారిగా చిత్రిస్తుంది. ఆ కథనాన్ని సాధ్యమైనంత అతి సూక్ష్మ వివరాలు సైతం ఉన్నదిగా రూపొందించే క్రమంలో అది ఎన్నోసార్లు మార్పులు, చేర్పులకు గురైంది.

ఆ కథనాన్ని ప్రచురించే విషయమై 12 మంది అగ్రశ్రేణి న్యాయవాదు లలో దాదాపు 10 మంది సలహాలను నేనే స్వయంగా తీసుకున్నాననుకోండి. అంత గొప్ప కథనాన్ని ప్రచురించాలా, వద్దా అనే విషయంలో తీర్పు 2:8 నిష్పత్తిలో వచ్చింది. ప్రచురించవద్దన్న 8 మంది అభ్యంతరాలు పూర్తిగా న్యాయపరమైనవిగానీ లేదా వాస్తవాలకు సంబంధించినవిగానీ కావు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, చివరకు అమాయకులను బాధపెట్టి, మన అతి గొప్ప సంస్థకు నష్టం కలుగజేయడంగా ఇది ముగియకుండా చూడంyì . ఇదే వారి సలహా. ఇక ప్రచురించమన్న ఇద్దరిలో ఒకరు వాస్తవాలు వాస్తవాలే, ఇక మరే తర్కమూ పనిచేయదు అంటే, మరొకరిది మహోత్సాహం. ఆ న్యాయ మూర్తి మనల్ని ఏం చేస్తారు, కోర్టు ధిక్కారం నేరం మోపి చావగొడతారా? అని ఆయనను అడిగాను. అలాంటిదేమీ చేయరు, ఆయన చేయగలిగిందే మైనా ఉంటే అది ఆత్మహత్య చేసుకోవడమే అన్నారు. ఆ సమాధానం మమ్మల్ని కుదిపి పారేసింది. భారత న్యాయ వ్యవస్థలోని అత్యంత సుప్రసి ద్ధులైన ఆ న్యాయవాది అనాలోచితంగానే... మేం ఏం చేయాలని యోచిస్తు న్నామో దాని ప్రాధాన్యం స్ఫురించేలా చేశారు. మా కథనంలోని ప్రతి వాక్యాన్ని తిరిగి చదివాం. అందులో ఒకే ఒక్క అంశం లోపించింది. అది జస్టిస్‌ ఆనంద్‌ ప్రతిస్పందన. ఆయన కార్యాలయంతో మేం జరిపిన సంప్ర దింపులన్నిటికీ ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడం వల్ల మీడియాతో మాట్లాడరనే సమాధానం వచ్చింది. కాబట్టి మా వద్ద రుజువులు ఉన్నట్టే.

తుస్సుమన్న సంచలనాత్మక కథనం
అప్పుడు నేను గొప్పగా గౌరవించే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నన్ను సంప్రదించారు. వారు, సుష్మా స్వరాజ్, అరుణ్‌ శౌరి. వారిద్దరూ నాటి వాజ పేయి ప్రభుత్వంలో మంత్రులు. ఇద్దరికీ చాలా కాలంగా జస్టిస్‌ ఆనంద్‌తో, ఆయన కుటుంబంతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏదైనా నిజా యితీ లోపించిన పని చేసి ఉంటారనే  విషయాన్ని వారిద్దరూ ఏ మాత్రమూ అంగీకరించలేదు. మేం ఈ కథనాన్ని ప్రచురించడం కోసం ఇప్పటికే తగినంత కాలం వేచి చూశామని, ఇంకా దాన్ని దాచి ఉం^è డం సాధ్యం కాదని వారికి  చెప్పాను. మేం పేర్కొన్న వాస్తవాలు తప్పయితే జస్టిస్‌ ఆనందే మమ్మల్ని ఆ విషయంలో ఒప్పించాలి.   

సుష్మా స్వరాజ్‌ ఒక సూచన చేశారు. నన్ను ఆయనకు ఓ సారి ఫోన్‌ చేయమన్నారు, నేనా పని చేశాను. ఆయన నన్ను నా వద్ద ఉన్న వాస్తవాల ఆధారాలను తీసుకుని రమ్మన్నారు. అయితే మా సంభాషణ జనాంతికంగానే జరుగుతుంది. ఆ తర్వాత జరిగింది సంక్షిప్తంగా ఇది. అనుమానం, ఆదరణ కలగలిసిన భావనతో ఆయన నన్ను ఆహ్వానించారు. ప్రతి ఆరోపణ గురించి మేం గంటల తరబడి చర్చించాం. ఆయన ఒక లెదర్‌ బ్రీఫ్‌ కేసు నిండా ఉన్న పత్రాలు, ట్యాక్స్‌ రిటర్నులు, రాసి ఉంచుకున్న చిట్టీలు, వరి అమ్మకం వల్ల వచ్చిన రాబడుల రసీదులు, తన పిల్లల పెళ్లి శుభలేఖలు, ఆయన కోర్టులకు, ట్యాక్స్‌ అధికారులకు సమర్పించిన పెళ్లిళ్లకు వచ్చిన నగదు కానుకల పద్దుల పుస్తకాలను చూపారు. ఆయన చూపిన ‘‘వాస్తవాల’’న్నిటి చుట్టూ తిరిగాను. అదీ ఇదీ ఇంకా చాలానే తిరగేశా. చూడబోతే ఆయన వద్ద అన్నిటికీ ఒప్పించ గలిగిన సమాధానాలు ఉన్నట్టే ఉంది. చివరకు నికరంగా ఒకే ఒక్కటి లెక్కకు రానిది తేలింది. అది చాలా ఏళ్ల క్రితం ఆరు అర బస్తాల వరి ధాన్యం విలువ. అది నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువేమీ కాదు. కాబట్టి అది పద్దుల పరమైన పొరపాటుగా పోయేదే. దీంతో నా గాలంతా తీసేసినట్టయింది. దీనిలో మా జీవితకాలపు రహస్య కథనం ఏదో ఉన్నదని మేం అనుకున్నాం. తీరా చూస్తే మా ఉత్సాహంపై నీళ్లు చల్లే వాస్తవాలు ముందుకు వచ్చాయి. సందేహాస్పదమైన ఆరు అర బస్తాల వరి ధాన్యం లావాదేవీ కోసం ప్రధాన న్యాయమూర్తిని ఏ దినపత్రికా తప్పు పట్టలేదు.

జస్టిస్‌ ఆనంద్‌తో కలసి గంటల తరబడి గడిపిన ఇద్దరికీ  బాధాకరమైన ఆ సమయంలో ఒక్క „ý ణం ముద్ర నా మదిలో అలాగే నిలిచిపోయింది. దాన్ని ప్రస్తావిస్తున్నందుకు ఆయన క్షమిస్తారనే అనుకుంటున్నా. ప్రతి వాస్తవాన్ని మీ ముందుంచాను, భారత ప్రధాన న్యాయమూర్తినైన నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను... అయినా మీరు మీ కథనాన్ని ప్రచురించి నన్ను మాత్రమే కాదు, ఇంతటి గొప్ప సంస్థను కూడా గాయపరుస్తారా? అని అడిగారు. జస్టిస్‌ ఆనంద్, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు మన్నించండి... ఆ మాటలు అంటున్నప్పుడు చెమ్మగిల్లిన మీ కళ్లను నేను తత్త రపడుతూ, భీతావహుడినై చూశాను.

ఆ కథనం గొంతు నులిమేశాం. నా వృత్తి జీవితంలో అలాంటి అతి కొన్ని సందర్భాలలో అదే అత్యంత బాధాకరమైనది. ఈ విషయంపై నేను తగినం తగా తిరిగి ఆలోచించలేదు. ఇదే గనుక ఒక రాజకీయవేత్త విషయంలో ఇంత ఓపికగా, ఇంత నిష్పక్షపాతంగా, అన్నిటికీ మించి ఇలా స్వీయ ప్రయోజన నిరాకరణతో వ్యవహరించేవారమా? ప్రధాన న్యాయమూర్తి కథనాన్ని తెలు సుకోవడానికి అంత సుదీర్ఘంగా వేచి చూడటానికి కారణం.. అది మనం ఎంతగానో గౌరవించే సంస్థకు సంబంధించినది కావడమే. మన స్వేచ్ఛలలో దేనికి ముప్పు వాటిల్లినా ఆశ్రయించే సంస్థను ఏమాత్రమూ దిగజార్చరాదనే.

న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేదెలా?
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. మన న్యాయ వ్యవస్థలో లోపాలున్నా, కోర్టులు ఎంత అధ్వా నంగా ఉన్నా... ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరు మరొకరితో ఏమంటారు? నీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటాననే. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతారు.

ఈ కారణాలన్నిటి రీత్యా, ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని, సామాజిక ఒప్పందాన్ని కాపాడుకుని, మరింతగా అది విస్తరించేట్టు చేయడం ఎలా అని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనా రంగంలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ఈ ప్రతిష్టను కాపా డుకునే ఉత్తమ మార్గం అవుతుందా? పాలనాపరమైన సమస్యల నుంచి వాయు కాలుష్యం, అక్రమ కట్టడాలు, క్రికెట్‌ వరకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో సాధికారిక కమిటీలను ఏర్పాటు చేయడమనే భావన.. న్యాయ నిఘావాదం నుంచి ఎంత దూరంగా వచ్చేసింది? ఆగ్రహంతో మాట్లాడటం, చర్యలు చేపట్టడం నాయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందా? పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో 70 శాతం మంది ఏదో ఒక ప్రభుత్వ ట్రిబ్యునల్‌లో లేదా కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో స్థానం పొందుతున్నారని అంచనా. అది చర్చనీయాంశం కాదా? దాని నుంచి తేలే నిర్ధారణ పదవీ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచాలనే అయినా దాన్ని నేను సమర్థిస్తా. హైకోర్టు న్యాయమూర్తులు 60 ఏళ్లకు, సుప్రీం న్యాయ మూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణచేయడం అంటే అది మరీ త్వరగానే లెక్క. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గవర్నర్‌ కావడం సమం జసమేనా? చర్చించరాని  సున్నితమైన విషయం అంటూ ఏదీ లేదు. ఇది ఇంతటి కీలకమైన, విలువైన సంస్థ కాబట్టే సంపాదకులమైన మేము ఒక సంచలనాత్మక క£ý నం ప్రచురణపై వారాల తరబడి తర్జనబర్జనలు సాగించి, దాని గొంతు నులిమి పారేశాం. అది, దివంగత ఆనంద్‌ బక్షీ గీతంలో వర్ణించి నంతటి కష్టభరితమైన నిర్ణయం.


- శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

మరిన్ని వార్తలు