సీతారాం ఏచూరి రాయని డైరీ

5 Mar, 2017 02:47 IST|Sakshi
సీతారాం ఏచూరి రాయని డైరీ

తొలిసారి నేనొక కొత్త మాట విన్నాను! ఆ మాటన్న పెద్దమనిషి మనోహర్‌ పారికర్‌. ఈ దేశపు డిఫెన్స్‌ మినిస్టర్‌! ఎంత పెద్ద ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలట! అంటే ఏమిటి? లోబడి ఉండడంలోని స్వేచ్ఛను అనుభవించేవారు మాత్రమే నిజమైన జాతీయవాదులని పారికర్‌ అంటున్నారా?!

నిజానికైతే.. గౌరవనీయులైన మనోహర్‌ పారికర్‌ గారిని ‘ఈ దేశపు డిఫెన్స్‌ మినిస్టర్‌’ అని కాకుండా ‘నా దేశపు డిఫెన్స్‌ మినిస్టర్‌’ అనాలి నేను. అయితే అలా అనిపించుకోవడం పారికర్‌కి కానీ, పరివార్‌ సభ్యులకు కానీ ఇష్టం లేకపోవచ్చు. ఈ దేశంలోని ముస్లింలను, క్రైస్తవులను, కమ్యూనిస్టులను ఈ దేశ పౌరులుగా వారు ఎప్పటికీ అంగీకరించరు. అంగీకరించకపోవడమే వారి జాతీయవాదం.

నేషనలిజం అన్నది ఇండియాలో చెడ్డ మాట అయిపోయిందని అరుణ్‌జైట్లీ రెండు రోజులుగా ఆవే దన చెందుతున్నారు. ఇది నేను వింటున్న ఇంకొక కొత్త మాట. నాకూ బాధేసింది. పాపం.. ఈ పెద్దాయ నకు ఇంత కష్టం ఏమిటా అని! మా ఇద్దరి వయసూ ఒకటే. కానీ నేషనలిజం గురించి తరచూ మాట్లాడు తుండేవారు త్వరగా పెద్దవాళ్లయిపోతారు.

కమ్యూనిస్టుల రాకపోకలపై నిషేధాజ్ఞలేవీ లేకపోవడంతో కోల్‌కతా నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్లడం నాకు తేలికవుతోంది. ఇందుకు ప్రతి కమ్యూనిస్టు మహాసభలోనూ ముందుగా మేము మోదీకి ధన్యవాద సమర్పణ చేయాలి. సాధారణంగా ధన్యవాద సమర్పణ సభ చివర్లో చేస్తారు. మోదీకి సభ మొదట్లోనే చేయాలి.

నిన్నా, మొన్నా నేను ఢిల్లీలోనే ఉన్నాను. దేశ రాజధాని ఇప్పుడు ఢిల్లీ కాదు. ఢిల్లీ యూనివర్సిటీ! ప్రతినిధుల సభ ఇప్పుడు పార్లమెంటు కాదు. డీయూ క్యాంపస్‌! డీయూలో ఇప్పుడు దేశం పట్టనంత నేషనలిజం!! క్యాంపస్‌ సిలబస్‌లో ఇప్పుడు గ్రేస్‌ మార్కులు ఉన్న ఒకే ఒక సబ్జెక్టు.. నేషనలిజం! ఈ సబ్జెక్టు తీసుకున్న విద్యార్థులు విద్యార్థులు కారు! నేషనలిజంలో తల పండి, కర్రలు పట్టుకుని తిరుగు తున్న ప్రొఫెసర్‌లు. నేనూ ఇక్కడ తిరిగిన వాడినే. ఇప్పటంత నేషనలిజం అప్పుడు లేదు. నేషనలిజంలో ఇప్పటంత ప్రొఫెషనలిజం కూడా అప్పుడు లేదు.

పాకిస్తాన్‌ మీద పది రన్నులు ఎక్కువ తీయడం కూడా వీళ్లకు నేషనలిజమే! ‘మా నాన్నను పాకిస్తాన్‌ చంపలేదు. యుద్ధం చంపేసింది’ అనడం మాత్రం యాంటీ నేషనలిజం. ‘అంత మాట అంటుందా.. ఆ పిల్లని ఇండియా నుంచి తరిమికొట్టండి. జైహింద్‌’ అంటున్నాడు అనిల్‌ విజ్‌. మరొక జాతీయవాద మినిస్టర్‌ ఆయన. హరియాణలో ఉంటాడు. దేశమంతా ఆయనదే. మోదీ ఆయనకు స్వయానా జాతిపిత!
కోల్‌కతా వచ్చేశాను. మళ్లీ ఓ కొత్త మాట వినిపించింది! మాటకు స్వేచ్ఛ ఎక్కువైతే.. జాతికి భద్రత తక్కువౌతుందట! వెంకయ్యనాయుడు అంటున్నారు. ఏ జాతి? భరతజాతా? హైందవజాతా?

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు