జల్లికట్టు కనికట్టు

22 Jan, 2017 01:20 IST|Sakshi
జల్లికట్టు కనికట్టు

త్రికాలమ్‌
తమిళనాడు గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు జల్లికట్టు సుగ్రీవాజ్ఞ (ఆర్డినెన్స్‌) ముసాయిదాను ఆమోదించడంతో సముద్రతీరంలో అలజడి సద్దుమణిగింది. చెన్నై మెరీనా బీచ్‌ నిరసనధ్వనులతో హోరెత్తడానికీ, యువజనంతో పోటెత్తడానికీ కారణం ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారకులు ఎవరు? తప్పు ఎవరిది? అమలు సాధ్యం కాని తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానానిదా? వాటిని  అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానిదా? కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రజలదా? ఈ ఉదంతం నుంచి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమిటి?
సముద్రతీరంలో ఉద్యమించిన వారిలో అత్యధికులు జల్లికట్టు క్రీడను చూసి ఉండరు. ఎడ్లను తాకి ఉండరు.

సోషల్‌ మీడియా విశ్వరూపం
ఉద్యమకారులలో రైతులు తక్కువ. కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న  యువతీ యువకులు ఎక్కువ. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ ఉన్నారు. నినాదాలు చేయడం, ధిక్కారస్వరం వినిపించడం కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద ప్రదర్శనలు లేవు. మెరీనాలో యువతరం సంబరం చేసుకున్నట్టు దృశ్యాలు సూచించాయి. యువ శక్తి  కొట్టవచ్చినట్టు కనిపించింది. రాజకీయ నాయకులను దగ్గరికి రానీయ లేదు. సినీ తారలనూ దూరంగానే పెట్టారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తు న్నామంటూ యువతీయువకులు ఎవ్వరి నుంచీ సహాయం స్వీకరించలేదు. మదురై నుంచీ, కోయంబత్తూరు నుంచీ, ఇతర దూరప్రాంతాలనుంచీ వచ్చిన వారి కోసం భోజన ఏర్పాట్లు చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. ఆత్మ గౌరవం ఉద్యమం చేస్తున్నవాళ్ళం ఇతరుల సాయం స్వీకరించలేమంటూ వారు తేల్చి చెప్పారు. ఇది సోషల్‌ మీడియా శక్తిని చాటిన ఉద్యమం. కేవలం సోషల్‌ మీడియా సందేశాలతో, పురమాయింపులతో ప్రేరణ పొంది చదువు లకూ, వ్యాపారాలకూ విరామం ప్రకటించి, ఉద్యోగాలకు సెలవు పెట్టి వేలాది మంది ఉద్యమంలో చేరారు. శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. ఇది కేవలం జల్లికట్టు ఆటమీద మోజుతోనో, సంస్కృతీ సంప్రదాయాలపట్ల మక్కువతోనో జరిగిన పోరాటం మాత్రమే కాదు. తమ సంస్కృతినీ, సంప్ర దాయాలనూ, ప్రయోజనాలనూ, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసే చర్యలను సహించేది లేదంటూ తమిళులు మరోసారి తెగేసి చెప్పిన సందర్భం. 1930ల నుంచి 1960ల వరకూ సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో దీన్ని పోల్చవచ్చు. తమి ళులు హిందీ భాషకి వ్యతిరేకం కాదు.

హిందీని తమపైన రుద్దడానికి వ్యతిరేకం. దక్షిణ భారత హిందీ ప్రచారసభ కేంద్ర కార్యాలయం చైన్నైలోనే ఉంది. చాలా మంది తమిళులు హిందీ నేర్చుకున్నారు. హిందీని విధిగా నేర్చుకోవాలని 1940 లలో రాజగోపాలాచారి నిర్ణయించినప్పుడూ, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడూ ప్రజలు వ్యతిరేకిం చారు. 1964లో హిందీని అధికార భాషగా ప్రకటించినప్పుడు తిరుగుబాటు తారస్థాయికి చేరింది. హిందీని రుద్దడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ అత్యంత ఉధృతంగా, హింసాత్మకంగా ఉద్యమం జరిగింది మద్రాసు రాష్ట్రం లోనే. ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటే చలించిన నాటి ప్రధాని లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమిళ రాజ కీయాలలో తిరుగుబాటు స్వభావం ఆద్యంతం కనిపిస్తుంది. నాయకులకు పాద నమస్కారాలు చేసే దృశ్యాలూ ఆ రాష్ట్రంలోనే కనిపిస్తాయి. ఇది విచిత్రం. జస్టిస్‌ పార్టీ పుట్టుక, ఆత్మగౌరవ, అస్తిత్వ ఉద్యమాలు, ద్రవిడ ఉద్యమం, హిందీ పట్ల వ్యతిరేకత, ఉత్తరాది పట్ల అసమ్మతి, కేంద్రం ఆధిపత్యాన్ని సహించని నైజం, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం–అన్నీ ఉద్వేగభరితంగా, ఉధృతంగా సాగినవే.

గుండెల్లో గుబులు
ఇప్పుడు తమిళనాడులో ఒకటిన్నర శతాబ్దంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని కరవు కరాళనృత్యం చేస్తోంది. కావేరీ జలాలు విడుదల చేయడానికి కర్ణాటక పేచీ పెట్టడం, ముళ్ళపెరియార్‌ డ్యాంను నియంత్రిస్తామంటూ కేరళ ప్రభుత్వం హెచ్చరించడం, శ్రీలంకలో తమిళులు వేల సంఖ్యలో బలైన అనంతరం కూడా వివక్షకు గురి అవుతుంటే సింహళీయుల పార్టీతో కేంద్ర ప్రభుత్వాలు స్నేహం చేయడం తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినట్టు తమిళులు భావిస్తున్నారు. 1991లో రాజీవ్‌ హంతకులకు తమిళనాడులో మద్దతు లభించడానికి కారణం కూడా ఈ భావనే. తమిళ ప్రయోజనాల విషయంలో, స్వయం నిర్ణయాధికారాల విషయంలో ఏ మాత్రం రాజీపడని జయలలిత మరణించడం, కరుణానిధి వయోభారంతో పగ్గాలు కుమారుడు స్టాలిన్‌కు అప్పగించడంతో తమిళులలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడినట్టుంది. గుండెల్లో గుబులు పుట్టింది.  తమిళుల ఆవేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. మతం పేరుతో జాతీయతాభావాన్ని ఉద్దీపింపజేయడంలో సిద్ధహస్తులైనవారికి సాంస్కృతిక ఉద్యమస్ఫూర్తి అత్యంత శక్తిమంతమైనదని తెలుసు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వినతిని మోదీ వెంటనే ఆమోదించారు.

తీర్పును పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును  కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు సైతం భేషజాలకి పోకుండా వారం రోజులు గడువు మంజూరు చేసింది. జల్లికట్టు క్రీడను కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం ఏకీభవించింది. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అన్ని ఆమోదాలూ, అనుమతులూ చకచకా రావడానికి కారణం తమిళ పౌరుషంపైన బాధ్యులందరిలోనూ ఉన్న అవగాహన. స్వయంనిర్ణయాధికారాల కోసం సాగిన ద్రవిడ ఉద్యమం సమసిపోయినప్పటికీ సాంస్కృతిక అస్తిత్వ భావనలు బలం గానే ఉన్నాయి. తమిళ ప్రజలు దేశంపట్ల జాతీయభావన కంటే తమ ప్రాంతం పట్ల నిబద్ధతను ఎక్కువగా ప్రదర్శిస్తారని ఆదం జీగ్‌ఫెల్డ్‌ 2004 సార్వత్రిక ఎన్ని కల తీరుతెన్నులను పరిశోధించి రాసిన ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌’ తీర్మానించింది. ఈ రచయిత నిర్వహించిన సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తమిళులలో 90 శాతంమంది దేశం కంటే తమిళనాడు పట్లనే ప్రథమ విధేయత కలిగి ఉంటామని స్పష్టం చేశారు.

తమ ప్రాంతం తర్వాతనే దేశం అన్నది వారి వాదన. అమెరికా ఫస్ట్‌ అంటూ శుక్రవారం 45వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకరించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ అమెరికా కంటే కాలి ఫోర్నియా ప్రధానం అనే ప్రజలు ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధం కాదు. 1950 దశకం ఆరంభంలో అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవా లంటూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం తెలుగువారు చేసిన ఉద్యమం ఉధృతికి జవహర్‌లాల్‌ నెహ్రూ దిగివచ్చారు. ప్రాంతీయభావన ఎంత బలీయమైనదో ఇటీవల ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమం నిరూపించింది. తమిళులు కానీ ఆంధ్రులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశాన్ని వ్యతిరేకించడం లేదు. తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటారు. కానీ వారి ప్రాంతీయ అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ ప్రాంతాన్ని పరాయి పాలకులు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా అయిదు వేల సంవత్సరాలుగా వారి సంస్కృతీసంప్రదాయాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చాయని తమిళులు గర్వంగా చెప్పుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని జాతుల, అన్ని భాషల సంగతీ అంతే. అదే భారతీయత.

హింసాత్మక క్రీడ
ప్రతి ఏటా జనవరి మాసంలో నాలుగు రోజులు జరుపుకునే సంక్రాంతి వేడుక లలో భాగం జల్లికట్టు. ఇది ప్రధానంగా మదురై, కోయంబత్తూరులో జరుపుకునే క్రీడ. ముందు వ్యవసాయం ఫలప్రదం కావడానికి దోహదం చేసిన ఎడ్లకు కృత జ్ఞతలు చెబుతూ వాటిని ఆలింగనం చేసుకునే వేడుకగా మొదలై, ఎడ్ల మధ్య పోటీగా మారి, అనంతరం పశువుకీ, మనిషికీ మధ్య పోటీగా రూపాంతరం చెందింది. పాత రోజులలో ఎద్దు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి ఎద్దును ధైర్యంగా ఎదిరించి కొమ్ములు వంచి వాటిని తీసుకున్నవారిని ధీరులుగా గుర్తించేవారు. ఎద్దును ఓడించి ఆధిక్యం చాటుకోవడంగా మారింది. 1960లలో శివాజీగణేశన్‌ ఎద్దును లొంగదీసుకునే గ్రామీణ యువకుడుగా నటించిన సినిమా ఈ క్రీడపైన మోజు పెంచింది. ఎద్దును రెచ్చగొట్టడం, హింసించడం ఎక్కువైంది.

జంతువులనూ, పశువులనూ ప్రేమించేవారు హింసాత్మకమైన ఈ క్రీడను నిషేధించాలంటూ కోర్టుకు వెళ్ళారు. 2014 మే 7న జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లు కొన్ని మార్పులతో జల్లికట్టు వంటి క్రీడను అనుమతిస్తూ కేంద్ర అడవులూ, పర్యావరణ శాఖలు ప్రకటన జారీ చేశాయి. దీన్ని పశుసంక్షేమ మండలి, పశువులనూ, జంతువులనూ మానవీ యంగా చూసుకోవాలని కోరుకునే సంస్థ–పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) వ్యతిరేకించాయి. 2016 జనవరి 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రకటనపైన ‘స్టే' ఇచ్చింది. ‘కావాలంటే కంప్యూటర్‌లో ఎద్దు లతో కుస్తీ పట్టే ఆటలు ఆడుకోండి. ఎద్దులను హింసించడం ఎందుకు?’ అంటూ కేసు విచారణ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు.

కేంద్రంపై పోరాటం
సుప్రీంకోర్టు వైఖరికి నిరసనగా విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. కళాశా లల నుంచి నేరుగా మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. జల్లికట్టును అనుమతించాల న్నది ఒక్కటే వారి డిమాండ్‌. భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఐదుసార్లు జారీ చేయిం చిన ప్రధాని మోదీకి జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఒక రోజు పోలీసులు హడావిడి చేశారు. స్టాలిన్‌ నాయకత్వంలో డిఎంకె కార్యకర్తలు వీధులలో ప్రదర్శనలు నిర్వహిం  చారు. రైల్‌రోకో చేశారు. బంద్‌ పాటించారు. కాంగ్రెస్‌ సైతం సంఘీభావం ప్రక టించింది. కమల్‌హాసన్, రజనీకాంత్, ధనుష్, రెహ్మాన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం ప్రకటించడంతో ఉద్యమం ఊపందుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు క్లాసులకు ఎగనామం పెట్టి మెరీనా బీచ్‌కు వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వ్యతిరేకులు ఈ ఉద్యమం వెనక ఉన్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మోదీని వ్యతిరేకించేవారి మద్దతు ఉన్న దని చెప్పేవారు కొందరు.

జల్లికట్టుకు దళితులు దూరం
ఈ క్రీడలో పాల్గొనడానికి దళితులు ప్రయత్నించిన ప్రాంతాలలో ఆటనే ఆపి వేసిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. దళితులు పెంచిన ఎద్దులను ఈ క్రీడలో పాల్గొనడానికి సంపన్న, ఆధిక్య కులాలు అనుమతించవు. ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లలోనూ దళిత వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జల్లికట్టు కావా లని కోరుకునేవారికి సంఖ్యాబలం ఉంది. ప్రజలను సమీకరించే వ్యవస్థ ఉంది. జల్లికట్టు వ్యవహారంలో లబ్ధిపొందాలని కోరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. పన్నీర్‌సెల్వం సమయజ్ఞత ప్రదర్శించి ఢిల్లీ వెళ్ళి పరిస్థితి వివరించి ప్రధాని మద్దతు సంపాదించగలిగారు. శశికళ ముఖ్యమంత్రి కావడం మోదీకి ఇష్టం లేదనే అభిప్రాయం ఉంది. పన్నీర్‌సెల్వం బలహీనపడకుండా ప్రధాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతిని, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేత ఆర్డినెన్స్‌ జారీ చేయించడానికి రంగం సిద్ధం చేశారు.

ఇందులో న్యాయస్థానాలను తప్పుపట్టడానికి లేదు. చట్టం ప్రకారం నిర్ణ యాలు ప్రకటించడం వాటి వి«ధ్యుక్తధర్మం. సవ్యంగా అమలు కానీ వరకట్న నిషేధం చట్టాన్నీ, అవినీతి నిరోధక చట్టాన్నీ అమలు చేయాలని కోరినట్టే తమిళ నాడులో జల్లికట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ళపందాలూ, మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాలూ నిషేధించడం నాగరిక సమాజంలో అవసరమని కోర్టు భావించింది. జల్లికట్టు ఆడాలనుకునేవారు ఎడ్లను హింసించకుండా, దేశవాళీ పశుసంపద వృద్ధి కావడానికి వీలుగా ఈ క్రీడను మలచుకోవాలి. ఇందులోని పాశవికతను పరిహరించాలి. పశువులను హింసించడం అమానవీయమంటూ ప్రచారం చేయడం ద్వారా ఇటువంటి క్రీడలను సంస్కరించే ప్రయత్నం  జంతు పేమికులు చేయాలి. సంప్రదాయలనూ, ఆచారాలనూ రక్షించుకుంటూనే మారుతున్న నాగ రికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. దేశంలో వర్థిల్లుతున్న వైవి ధ్యాన్ని గౌరవించడం దేశ సమైక్యతకీ, సమగ్రతకీ దోహదం చేస్తుంది. ఎవరు తెగే వరకూ లాగినా అందరూ నష్టపోతారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారు ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించడం అభినందనీయం.

కె. రామచంద్రమూర్తి
 

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా