ధిక్కారం మానవ స్వభావం

23 Feb, 2016 09:40 IST|Sakshi
ధిక్కారం మానవ స్వభావం

అభిప్రాయం

దాదాపు 2400 ఏళ్ల క్రితం సోఫోక్లీస్ వ్రాసిన నాటకం ‘‘యాంటిగొని’’. ఈడి పస్ కుమారులిద్దరూ రాజ్యాధికారం కోసం పరస్పరం చేసుకొన్న యుద్ధంలో మరణించాక సింహాసనాన్ని అధి రోహించిన రాజు క్రియాన్, ఆ సోదరులలో ఒకరైన పోలినైసిస్ శవానికి ‘‘ఖననం చేయకూడదని, కాకులకు, గద్దలకు, పురుగులకు వదిలివేయాలనే’’ శిక్షను విధిస్తాడు. తన సోదరునికి విధించిన మరణానంతర శిక్షను పోలినైసిస్ సోదరి యాన్టిగోని తీవ్రంగా గర్హిస్తుంది. ఖనన సంస్కారం చేద్దాం రమ్మని తన సోదరి ‘‘ఇస్మీని’’ని పిలుస్తుంది, అందుకు ఇస్మీని సమ్మతించక పర్యవసానాన్ని వివరించి హెచ్చరిస్తుంది. అప్పుడు యాన్టిగొని అంటుంది ""if i have to die for this pure crime/i am content, for i shall rest beside him'' అంటుంది. ""the city is the king''s అంటూ రాజద్రోహ నేరానికి గాను గృహంలో బంధించి చనిపోయేలా చేయాలని క్రీయాన్ శిక్ష విధిస్తే దాన్ని కూడా ధిక్కరిస్తూ ఉరి వేసుకొని చచ్చిపోతుంది.

క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన సోక్రటీస్‌ను ‘‘దైవ ధిక్కారము, యువతను కలుషిత పరచడం’’ అనే నేరాలను ఆరోపించి ఖైదు చేసినపుడు పారిపోయే అవకాశముండీ, తను ఏమయితే చెప్పేడో వాటి మీదే నిలబడుతున్నానని చెపుతూ విషాపానం చేసి మరణ శిక్షను స్వీకరించాడు.

"my kingdom is not of this world''అని క్రీస్తు అన్నప్పటికీ ‘‘నా రాజ్యము’’ అన్న మాటే రాజధిక్కారంగా పరిగణించి సిలువనెక్కిస్తే, క్రీస్తు ‘‘బిడ్డలారా నాకోసం ఏడవకండి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి’’ అన్నాడే కానీ దేవుని రాజ్యము మిధ్య అని సిలువ శిక్షను తప్పించుకోలేదు. అన్ని వేల ఏళ్ళ క్రితం కూడా మనిషి రాజ ధిక్కార లేదా దేశ ధిక్కార నేరం విధిస్తే శిక్షను అనుభవించాడే కానీ తన భావాన్ని వ్యక్తపరచకుండా వెనుకకు తగ్గలేదు ఎందుకని? ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేది మానవ హక్కులకు పునాది వంటిది. అది మనిషి స్వభావంలో ఒక భాగం, ఆ హక్కును కాపాడు కోవడానికి మనిషి ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అది లేని నాడు జార్జ్ వాషింగ్టన్ చెప్పినట్లు ‘‘వధ్యసిల మీదకు వెళుతున్న గొర్రెల’’లాగే మనిషి తనను భావించుకుంటాడు.

కన్హయ్య కుమార్ మరియు జేఎన్‌యూ విద్యార్థులు చేసింది భావ ప్రకటన మాత్రమే. ‘‘ప్రతి మనిషికి తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హోదా కల్పించినప్పుడే అది న్యాయమంటాం, మేం మీ దోపిడీ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నాం’’ అని వాళ్లు అన్నారు. అలా అనడానికి కన్హయ్యకే కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కు వుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, చర్చించుకునే హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది. భావప్రకటన ఎన్నటికీ దేశ ద్రోహం కాదు. ‘‘ఆలోచనల మీద ఆంక్షల ఆమ్ల వర్షం కురిపించే’’ రాజ్యాలు, ప్రభుత్వాలు కుప్పకూలిన దాఖలాలే చరిత్ర నిండా.

అయినా అసలు దేశభక్తి అంటే ఏమిటి? పార్లమెంటులో ఇంత పెద్ద రవీంద్రుని విగ్రహం పెట్టుకున్నారు కదా. ఆయన ‘‘జాతీయత అనేది ఒక పెద్ద విపత్తు.. భారతదేశపు అన్ని సమస్యలకి ఇదే మూల కారణం అయి ఉన్నది. నా దేశ వాసులు మానవీయత కంటే దేశం గొప్పదనే భావనకు వ్యతిరేకంగా పోరాడి నిజమయిన దేశాన్ని పొందుతారని ఆశ పడుతున్నా’’ అని విశ్వ మానవతను గురించి అన్న మాట వీరికి తెలి యదా? ప్రశ్న మొలకెత్తినపుడు, నిరసన స్వరం జ్వలించినపుడు కారణాలు తెలుసుకొని పరిష్కా రం వెదకడం సముచితం కదా? అణచిన స్వరం అలాగే ఉండిపోదు. అలా ఉండిపోక పోవడానికి నాగరికత అని పేరు. ప్రశ్న లేకపోతే జ్ఞానం విస్తృతి పొందదు. నాగరికత ముందుకూ పోదు.

చిన్నప్పుడు నేనో కథ విన్నాను, ఒక అడవిలో ఒక యేరు వుంది ఒకరోజు ఒక మేక పిల్ల అక్కడికి నీరు తాగడానికి వచ్చింది. అంతలోకి ఒక పులి కూడా అక్కడికి వచ్చింది. ఏటికి పైన పులి నీరు తాగుతుంది. క్రింద మేకపిల్ల తాగుతుంది. కాసేపటికి పులి ‘ఓ మేకా నిన్ను తినేస్తా’ అన్నది. మేక ఆశ్చర్యపడి ‘నేనేం తప్పు చేసానని తినేస్తావు’ అన్నది. అందుకు పులి ‘నువ్వు నా నీళ్ళు ఎంగిలి చేసావుకదా’ అని బదులిచ్చింది. ‘పులీ నువ్వు పైన తాగుతున్నావ్. నేను క్రింద తాగుతున్నా. ఎంగిలెలా చేయగలను’ అన్నది మేక పిల్ల. అప్పుడు పులి ‘ఇప్పుడు కాదు, నువ్వు కడుపులో వున్నప్పుడు మీ అమ్మ ఎంగిలి చేసింది’ అని ఆ చిన్ని మేక పిల్లను తినేస్తుంది.

మొన్నటి వరకు నాకో సందేహం వుండేది ఈ కథ గురించి. పులి కదా శుభ్రంగా తినేయక సాకులు ఎందుకు వెదికింది అని. కన్హయ్య సంఘటనతో సందేహం తీరిపోయింది. ఏమంటే అప్పుడు ఆ పులి ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న ఒకానొక అడవికి ‘నాయకుడి’గా ఉండింది.     

- సామాన్య
వ్యాసకర్త రచయిత్రి 
మొబైల్: 80196 00900  
 
 
 

>
మరిన్ని వార్తలు