సంగీత సుధార్ణవం

26 Nov, 2016 00:49 IST|Sakshi
సంగీత సుధార్ణవం
అక్షర తూణీరం
గమకాలు గుండెలవిసేలా లోతుగా.. ఉండాలన్న అతి పాత ధర్మాన్ని సంస్కరించారు. గమకాలు కలువ రేకులు కదిలి నంతసున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు.
 
ఒక సుమధుర సంగీత ఝరి ఆగిపోయింది. ఆయన గళంలో ఒక ఠీవి ఉంది. శ్రుతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగ తులు, గమకాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయన్న ధైర్యం ఆయనకుండేది. ‘బాలమురళి’ అంటే నవ శాస్త్రీయ చరిత్ర. ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం. త్యాగరాజ స్వామి గురు పరంపరలో అయిదో తరం వారసుడు. సంగీత సార్వ భౌమ పారుపల్లి రామకృష్ణయ్య శుశ్రూషలో సంగీత పాఠాలు నేర్చిన విద్యార్థి మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
 
అరవై ఏళ్ల క్రితం బాలమురళి వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించాడు. సంప్రదాయమంటే - ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడకట్టి తర్వాతి తరా నికి అందించడమేకానీ, తుచలు పోకుండా అందివ్వడం కాదని ఈ ‘ఛైల్డ్ ప్రాడిజీ’ నమ్మారు. అదే ఆచరించి చూపారు. అందుకే ఆయన వెయ్యిమందిలో ఒక్క రుగా కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపం చాన్నేలారు. సామాన్య జనులందరినీ సంగీతమాస్వాదించి ఆనందించగల రసి కులుగా ‘కన్వర్ట్’ చేసేస్తున్నాడని బాలముర ళిపై ఆనాటి ఛాందసులు అభియోగం మోపారు. దాన్నొక గొప్ప అభినందనగా, ఆశీర్వాదంగా బాలమురళి స్వీకరించారు. వస్తూనే ‘స్వరార్ణవం’ చంకనపెట్టుకు తెచ్చుకున్నాడని ప్రతీతి. ‘‘నేను వానికి నేర్పిందేమీ లేదు. వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు’’ అంటూ గురువు పారుపల్లి రామకృష్ణయ్య తరచూ చెబుతుండేవారట. ఆరవ ఏట పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన అసాధారణ ప్రతిభామూర్తి బాలమురళి.
 
సంగీత లోకంలో ఆయనొక సాహసి. విద్యుత్తుతోబాటు తగుమాత్రం ధిషణాహం కారం కూడా బాలమురళి వినూత్న శైలిని తీర్చిదిద్దింది. గమకాలు గుండెలవిసేలా లోతుగా, గొడ్డలి గంట్లులా ఉండాలన్న అతిపాత ధర్మాన్ని సంస్కరించుకుని ఆపాత మధురంగా మలచుకున్నారు. గమకాలు కలువరేకులు కదిలినంత సున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. మెప్పించి, ఔననిపించారు. వయోలాని గిటార్‌లా, వయొలిన్‌ని ఏక్‌తారలా, వీణని వయొలిన్‌లా పలికించగల చతుర్థ సమర్థుడు. అనేక వాద్యాల మీద అధికారం సంపాయించారు. బాలమురళీ ‘పుట్టు విద్వాంసుడు’ అవడం వల్ల, సంగీత జ్ఞానిగా సాహిత్యకారునిగా సాధించాల్సినదంతా పాతికేళ్లకే పూర్తి చేసు కున్నారు. ఇక మిగిలిన తీరికలో కావల్సినన్ని సాము గరిడీలు చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధించారు. బాలమురళి కారణ జన్ముడు.
 
స్కూలు చదువులెరుగని బాలమురళి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం గడిం చారు. కొత్త రాగాలను నిర్మించారు. అనేక కృతులు రచించారు. ఆయన తిల్లానాలను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాలకు పాటలు పాడినా బాలమురళి ముద్ర ఉంటుంది. గొప్ప చమత్కారి. ‘నేను కచ్చేరీల్లోనే సాధన కూడా చేస్తాను. ముఖ్యంగా పెళ్లిళ్లలో నా గోష్ఠి ఏర్పాటు చేసినపుడు. ఎందుకంటే అక్కడ నన్నెవరూ వినరు. అందు కని నా ప్రయోగాలు నేను చేసుకుంటాను’ అని చెప్పేవారు. సంగీతానికి బాల మురళి చేసిన గొప్ప సేవ ఆయన రికార్డింగ్స్. కొన్ని వందల గంటలు రికార్డ్స్‌లో, టేపుల్లో, సీడీల్లో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. త్యాగరాజ కృతుల్లోని సాహిత్యాన్ని సుమధుర గాత్రంతో విశదపరిచారు. శాస్త్రీయ సంగీతానికి, ఆ విద్వాంసులకు బాలమురళి గ్లామర్ తెచ్చి పెట్టారు. ఆయన ‘షోకిలా’గా జీవించారు. ఆయన అందుకోని బిరుదులు, గౌర వాలు ఏవీ లేవు. అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామదాసు కీర్తనలు ఆయన నోట అమృతధారలైనాయి. బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్ర్క మణతో సరిగమల బృందావనం సద్దుమణిగింది. వారికి అక్షర నివాళి.
 
 
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు