చిన్నచిన్న నిజాలైనా చెప్పరా?

15 Oct, 2016 01:12 IST|Sakshi
చిన్నచిన్న నిజాలైనా చెప్పరా?

అక్షర తూణీరం
ప్రజకు నిజాలు ఎలా తెలుస్తాయ్? ఎవరు చెబుతారన్నది పెద్ద ప్రశ్న. స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఏ మేరకు వచ్చిందో కచ్చితంగా చెప్పేదెవరు? తెలుగు రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ జరిగిందా, జరుగు తోందా, జరగనుందా? జరిగితే ఏ మేరకు? అనే సత్యాన్ని అంకెలతో చెప్పే హరిశ్చంద్రుడెవరు? ప్రజలకు అందుతున్న రకరకాల పింఛన్లు ముట్టచెబుతున్నది కేంద్రమా? లేక చంద్రన్నలా? స్పష్టంగా విశదపరిచేదెవరు? శరన్నవరాత్రి ఉత్సవాలలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ మొక్కులు, ముడుపులు చెల్లించారు. ఆయన మోయలేనంత బరువు బంగారు నగలు. ‘‘మొక్కిన మొక్కులు చల్లంగుండి తెలంగాణ నా చేతికి వస్తే- బంగారు తొడుగేయించెదనమ్మా అని ఆనాడాయన మొక్కారు. ఈనాడు తీర్చారు.’’

ఒక పెద్దావిడ ఆ నగల సమర్పణ దృశ్యం చూసి ఆనందబాష్పాలు రాల్చి, ఇవన్నీ ఎవరి పైసలతో చెల్లిస్తున్నాడని అడిగింది. ‘‘ఎవరివైతేనేమి అవ్వా’’ అంటిని. అది సరేలే, మా దొరకి మీ, మా వెత్తాసం లేదు గాని, పున్యంలో నాకు వాటా వస్తదో లేదో తేలాలి గదా అన్నది. అది పబ్లిక్ మనీతో చేయించారా, సొంత సొమ్ముతో కావించారా అనేది అవ్వ ధర్మసందేహం. అది సొంత మొక్కు కాబట్టి, జేబు డబ్బుల్లోంచే కైంకర్యం చేసి ఉంటారని కొందరం టున్నారు. ‘‘అసలీ చిన్న వ్యవహారానికి ఇంతగా జనం తర్జనభర్జన పడాలా, తేల్చి చెప్పవచ్చు గదా’’ అనేది అవ్వల నిశ్చితాభిప్రాయం. ‘‘ఇదిగో, తల్లీ! భద్రకాళీ ప్రజల అభీష్టం మేరకు నేకోరిన వరం ఇచ్చినందుకు ప్రజాధనంతో నీకు సొమ్ములు సమర్పిస్తున్నా’’ అని స్పష్టంగా చెప్పచ్చునేమో అని మరికొందరు నోళ్లు నొక్కు కుంటున్నారు.
 
ఈమధ్య మనదేశంలో ప్రతిదీ సస్పెన్స్‌గానే ఉంటోంది. ఎందుకో తెలియదు. జయలలిత ఒంట్లో బాగాలేదన్నది మాత్రమే మనకి తెలుసు. ఎంత బాగాలేదో, ఎట్లా బాగాలేదో ఎవ్వరూ చెప్పరు. ఎందరో వస్తారు. ఆసుపత్రికి వెళ్లొస్తుంటారు. పరామర్శించా మంటారు. వైద్య నిపుణులను కలసి ట్రీట్‌మెంట్ వివరాలు చర్చించామంటారు. దాదాపు నాలుగు వారా లుగా ఇదే దృశ్యం నడుస్తోంది. కాకపోతే పాత్రలు మారుతున్నాయి. వైద్య నిపుణుల నుంచి కూడా అంద రికీ అర్థమయ్యే రీతిలో బులెటిన్ రానేలేదు, చిదంబర రహస్యంలా. వీఐపీలంతా వస్తున్నారు, తిలకించి వెళు తున్నారు.

కొన్ని గోప్యంగా ఉంచడం మంచిదేగానీ వాటికి హద్దులుండాలి. సమాచార వ్యవస్థలు, వందలాది శాటిలైట్లు చిన్న గోడ వెనుక సత్యాన్ని చెప్ప లేకపోతున్నాయి. ప్రజా క్షేమం దృష్ట్యా, దేశ ఆరోగ్యం దృష్ట్యా కొన్ని సార్లు పారదర్శక సూత్రా లను పక్కన పెట్టాల్సిందే. ఇట్లాంటప్పుడు అన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నా సమాచార వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యాలి. కొన్ని నిజాలను ప్రజకు చెప్పి, ఫోర్త్ ఎస్టేట్‌లో నిజాయితీ ఉందని నిరూపించుకోవాలి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు