కాటేసిన జాత్యహంకారం

28 Feb, 2017 00:33 IST|Sakshi
కాటేసిన జాత్యహంకారం

అమెరికాలో గత కొన్నేళ్లుగా నెలకొని ఉన్న విద్వేషపూరిత వాతావరణం చివరకు ఒక యువ ఇంజనీర్‌ ప్రాణాలను బలిగొంది. మెరుగైన అవకాశాల కోసం ఖండాం తరాలు వలసపోయిన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేషం తలకెక్కించుకున్న దుండగుడు అడమ్‌ పూరింటన్‌ మొన్న శుక్రవారం పొట్టనబెట్టుకు న్నాడు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకోవడానికి రెండేళ్లక్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగుతూ ఈ రకమైన ఉన్మాదానికి నారూ నీరూ పోశారు. అది రోజులు గడుస్తున్నకొద్దీ పెరిగిందే తప్ప తగ్గలేదు. పొరుగునున్న మెక్సికన్లతో మొద లుబెట్టి ముస్లింల వరకూ డోనాల్డ్‌ ట్రంప్‌ ఎవరినీ వదల్లేదు. భారతీయులు, చైనీ యులు కూడా మినహాయింపు కాదు.

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం చేసిన ఆయన చేసిన ప్రసంగాలన్నీ విద్వేషాన్ని వెదజల్లాయి. భయపెట్టడం, బెదర గొట్టడం, రెచ్చగొట్టడం, పూనకం వచ్చినట్టు మాట్లాడటం ఆయనొక కళగా అభి వృద్ధి చేసుకున్నాడు. ఆ ప్రసంగాల్లో మంచీ మర్యాదా మచ్చుకైనా కనబడవు. సంస్కారం జాడే ఉండదు. మహిళలన్నా, నల్లజాతీయులన్నా, వికలాంగులన్నా ట్రంప్‌కు కంపరం. ఎంత తోస్తే అంతా మాట్లాడటం... అసాధ్యమైనవాటిని అవ లీలగా చేయగలనని నమ్మించడంలో దిట్ట. ‘మీ ఉద్యోగాలు మరొకరు కొల్లగొడు తున్నారు... మీ బతుకుల్ని బయటి దేశాలనుంచి వచ్చినవారు నాశనం చేస్తు న్నారు... మీ భవిష్యత్తునంతటినీ ఛిద్రం చేస్తున్నారు’ అంటూ ఆయన అమెరికన్‌ పౌరులనుద్దేశించి మాట్లాడిన మాటలు సమాజాన్ని భయకంపితం చేశాయి. దాన్ని నిట్టనిలువునా చీల్చి పరస్పర అవిశ్వాసాన్ని పెంచాయి. ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేద్దామ’ంటూ ట్రంప్‌ ఇచ్చిన మతిమాలిన పిలుపు ఉన్మాదుల పాలిట ఆక్సిజన్‌ అయింది. అది తొలుత ట్రంప్‌కు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని, ఆ తర్వాత అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కానీ అక్కడికి ఉపాధి కోసం దేశదేశాలనుంచి వలస పోయిన సాధారణ పౌరులకు క్షణక్షణం భయంగా బతికే దుస్థితిని కల్పించింది.

నిజానికి ట్రంప్‌కు ముందు నుంచీ అమెరికాలో ఇలాంటి ధోరణులున్నాయి. ట్రంప్‌ చేసిందల్లా వాటిని ఉన్మాద స్థాయికి తీసుకెళ్లడం. ఉన్మాది తుపాకి గుళ్లకు బలైన శ్రీనివాస్‌ భార్య సునయన ఆవేదనంతా అదే. కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఉదంతాలు గమనిస్తుంటే తాము ఇక్కడి వారమా... కాదా అన్న అనుమానం కలుగుతోందని ఆమె చెప్పడంలో వాస్తవం ఉంది. అంతకు ముందు సైతం జాత్యహంకారం రెచ్చగొట్టే వ్యక్తులు, గ్రూపుల ఉనికి లేకపోలేదు. ప్రపం చంలో అమెరికా పాలకులు సాగిస్తున్న దుష్కృత్యాలను సమర్ధించడం... దేశంలో నల్ల జాతీయులపైనా, ముస్లింలపైనా, యూదులపైనా, ఇతర మైనారిటీలపైనా దౌర్జన్యం చలాయించడం వంటివి ఆ గ్రూపులు ఎప్పటినుంచో సాగిస్తున్నాయి. వీరి ఉన్మాదానికి అనేకమంది బలయ్యారు. ఇలాంటి ఉన్మాదుల గుంపు ట్రంప్‌ ప్రవేశ పెట్టిన ద్వేషపూరిత ధోరణులతో మరింత బరితెగించింది.

వలసలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకూ, ఈ ఉదంతానికీ సంబంధం లేదంటూ శ్వేత సౌధం చేస్తున్న తర్కం నిలబడేది కాదు. ఇది జరిగిన దుర్మార్గం తీవ్రతనూ, విస్తృతినీ దాచే యత్నం. అసలు దోషిని మరుగుపరచడానికి చేసే వృథా ప్రయాస. తమ బాధ్యతేమీ లేదని తప్పించుకోవడానికి చేసే పని. శ్రీనివాస్‌పై గుళ్ల వర్షం కురిపించే ముందు ఉన్మాది పూరింటన్‌ అన్న మాటలేమిటి? ఆ మాటలకూ, ట్రంప్‌ రెండేళ్లుగా అడ్డూ ఆపూ లేకుండా సాగిస్తున్న ప్రసంగాల్లోని మాటలకూ తేడా ఏమైనా ఉందా? ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక వేలాదిమందిని రంగంలోకి దించి చెక్‌పోస్టులు పెట్టి విదేశీయు లన్న అనుమానం కలిగినవారిని ఆపి అడుగుతున్న ప్రశ్నలకూ, పూరింటన్‌ కాల్పు లకు తెగబడే ముందు వేసిన ప్రశ్నలకూ పోలిక లేదా? అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని, స్థానికుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని పూరింటన్‌ మద్యం మత్తులోనో, మాదకద్రవ్యాల మత్తులోనో అన్నాడని చెబుతున్నారుగానీ... వాటి ప్రమేయం లేకుండానే వలసవచ్చినవారితో అతిగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న గుంపులు చాలా ఉన్నాయి. అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన నవంబర్‌ 9 తర్వాత తొలి పది రోజుల్లోనే దేశం లోని వేర్వేరు రాష్ట్రాల్లో జాత్యహంకార ఉదంతాలు 867 జరిగాయని సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ చెబుతోంది. 37 శాతం ఉదంతాల్లో ఉన్మాదులు ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో చేసిన నినాదాలను వల్లించారని ఆ సంస్థ అంటున్నది. తమకు తారస పడుతున్న వారిని వీసా వివరాలు అడుగుతుండటం, దేశం వదిలి పొమ్మనడం, దొంగలు దోపిడీదారులంటూ వారి నివాసాలపై దాడులు చేయడం వంటివి ఈ మధ్యే ఎందుకు పెరిగాయో శ్వేత సౌధం సంజాయిషీ ఇవ్వగలదా? ఇది యథాలా పంగా జరిగిన ఉదంతంగా తేల్చడానికి ట్రంప్‌ బృందం చేసిన ప్రయత్నాలన్నీ సున యన ప్రకటన ముందు తేలిపోయాయి. నా భర్త మరణానికి సమాధానం చెప్పా లన్న ఆమె డిమాండుకు జవాబివ్వడం తెలియక ఆ బృందం నీళ్లు నములుతోంది.

తమకు నచ్చని అభిప్రాయాలున్నా, తమకు పొసగని సిద్ధాంతాలు ఆచరిస్తున్నా ద్వేషించడం, దౌర్జన్యం చేయడం ఇటీవలికాలంలో పెరిగిపోయింది. రూపం వేరు కావొచ్చుగానీ అమెరికాలోనైనా, యూరప్‌ దేశాల్లోనైనా, మన దేశంలోనైనా ఇలాంటి అసహనం రాను రాను మితిమీరుతోంది. ఈ అసహన వాతావరణం సామాన్యుల్లో కూడా అకారణ ద్వేష భావనను రగులుస్తుంది. హింసను ప్రేరే పిస్తుంది. చుట్టూ జరుగుతున్న ఉదంతాలపై ఉదాసీనతను ఏర్పరుస్తుంది. ఉన్మాదు లకు కావాల్సింది ఇదే. మైనారిటీలుగా ఉన్న పౌరులను అనిశ్చితిలో, అభద్రతలో పడేసే ఇలాంటి పోకడలు అంతిమంగా మెజారిటీగా ఉన్న పౌరులను కూడా తాకక మానవు. శ్రీనివాస్‌పై దాడి జరిగిన క్షణంలో అడ్డుకోవడానికి ప్రయత్నించి గాయ పడిన అమెరిన్‌ యువకుడు గ్రిలట్‌... ‘సాటి మనిషి కోసం ఏం చేయాలో నేను అది చేశాన’ని చెప్పాడు. మానవత్వాన్ని చాటాడు. ఇలాంటివారే ట్రంప్‌ బారి నుంచి, ఆయన విద్వేష భావాలనుంచి అంతిమంగా అమెరికాను రక్షించుకోగలుగుతారు. అది అక్కడి సమాజ తక్షణావసరం.

మరిన్ని వార్తలు