స్వర్ణరథం సాగాలంటే..?

4 Mar, 2017 04:02 IST|Sakshi
స్వర్ణరథం సాగాలంటే..?

అక్షర తూణీరం
ఆపత్కర, విపత్కర పరిస్థితులలో సభ లోపలి వీడియో కెమెరాల కళ్లని, చెవుల్ని లిప్తపాటులో మూసెయ్యగల బిసలు ఏర్పాటు చేసే ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌కి నూతన శాసనసభా ప్రాంగణం సిద్ధ మైంది. చక్కని సభాభవనం ఉంది. రకరకాలుగా పండిన శాసన సభ్యులున్నారు. ఇక వారంతా విడివిడిగా, కలి విడిగా కొత్త బెంచీల్లో కూర్చుని ఆలోచనలు, చర్చలు, తీర్మానాలు చేయడమే తరువాయి. తాత్కాలికమైందే కావచ్చు గానీ అద్భుతంగా నిర్మించారు. మయసభలా ఉందని ఒక పెద్దాయన మురిసిపోయాడు కూడా. రాష్ట్ర అభ్యున్నతి గురించి పెద్దలు, సభ్యులు ఒకే కప్పు కింద తీవ్రంగా ఆలోచించేవేళ మైకుల్ని విరిచి విసిరి అసహనాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇప్పుడు లేదు. స్పీకర్‌ పోడియమ్‌ని శత్రుదుర్భేద్యంగా కట్టుదిట్టం చేశారు. ఇంకా కానరాని సౌలభ్యాలు, సౌకర్యాలు ఏమి కల్పించారో వాడకంలోకి వస్తేగాని తెలి యదు. ఆపత్కర, విపత్కర పరిస్థితులలో సభ లోపలి వీడియో కెమెరాల కళ్లని, చెవుల్ని లిప్తపాటులో మూసెయ్యగల బిసలు ఏర్పాటు చేసే ఉంటారు.

ఒక అనుభవజ్ఞుడేమన్నాడంటే–ఇదేమన్నా మన సొంత ఇల్లా? రేప్పొద్దున్న బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అయితే, జనహితం కోరి స్పీకర్‌పై దండెత్తాల్సి వస్తే అప్పుడు చాలా ఇబ్బంది కదా, ఇది మన గొయ్యి మనమే తవ్వుకోవడం కాదా? స్పీకర్‌కి రక్షణ కల్పించాలనుకుంటే శరీరానికి ఉక్కు కవచాలు, శిరస్త్రాణం ఏర్పాటు చెయ్యాలన్నది సూచన. అంతేగాని సభా పతికి, సభికులకు నడుమ అడ్డుగోడ ఉండరాదన్నది కొందరి అభిమతం.

కొందరు బొత్తిగా సానుకూల ఆలోచనలు లేని వారుంటారు. వాళ్లని నెగ టివ్‌ థింకర్స్‌ అంటారు. వాళ్లు చంద్రబాబుని, ఆయన తలపెట్టిన అద్భుతా లను అస్సలు అర్థం చేసు కోరు. రాళ్లు, సిమెంట్, కుర్చీలు, కుషన్లు, ఆధునిక యంత్రాలు బిగించి నిర్మిం చారు. బావుంది. అయితే అక్కడ కొలువు తీరేవారి ఆలోచనా సరళిని మార్చ గలరా? అరుపుల్ని, అబద్ధాలని అరికట్టే టెక్నాలజీని తీసుకొచ్చారా? వేసవి వేళ హాయిగా చల్లగా నిద్రకు ఒడిగట్టే మన ప్రజా ప్రతినిధులను జాగృతం చేసే మెకానిజం సభలో ఉందా? చిత్తశుద్ధి, సేవాభావం, నిజాయితీ ఉండాలే గానీ సభని పచ్చని చెట్ల నీడన నడిపినా ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. పాలకులు పచ్చల సింహాసనాలపై కాదు. పచ్చికబీళ్లపై కూచుని కూడా ప్రజాహితానికి పాటుపడవచ్చు. ఇవన్నీ ప్రతికూల ఆలోచనలు.

ఒకరోజు సుయోధనుడు, కూరిమి చెలికాడు కర్ణుడు కలసి సరికొత్త స్వర్ణ రథంలో కొలువుకి వచ్చారు. రథయాత్ర అంత సుఖంగా, సౌమ్యంగా లేదని రారాజు ఆరోపించాడు. రథశిల్పి వినయంగా చేతులు కట్టుకుని, ‘‘సార్వభౌమా! రథ నిర్మాణంలో నా లోపం లేదు. శాస్త్ర ప్రకారమే ప్రతి భాగాన్ని కూర్చాను. వాహనం సుఖంగా ముందుకు వెళ్లాలంటే, కుదురైన వీధులు కావాలి. వడి కలిగి, సారథిని గమనించుకోగల అశ్వాలుండాలి. రథాన్ని తమరికి అప్పగించే ముందు రథంలో నాలుగు దీపాలను ఉంచి నడిపించాను. ప్రమిదల్లో తైలాలు చిందలేదని మీ అధికారులు నిర్ధారించాకే రథాన్నిచ్చాను.’’ అన్నాడు. రాజు మారు మాట్లాడలేదు. అదీ కథ. ఇప్పుడు అమరావతికి కావలసింది స్వర్ణరథంతో బాటు మిగిలిన విశేషాంశాలు. అంతేగాని పొద్దస్తమానం స్తోత్రపాఠాలు వల్లించే సాఫ్ట్‌వేర్‌ కాదు.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు