ఇదొక పంచాంగ శ్రవణం

18 Mar, 2017 03:01 IST|Sakshi
ఇదొక పంచాంగ శ్రవణం

అక్షర తూణీరం
మన రైతు గొప్ప నష్ట జాతకుడు. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్‌. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశాలలో చూడాల్సిందే.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వార్షిక బడ్జెట్‌ సమర్పించే మహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అసలీ బడ్జెట్‌ సమర్పణకి ఇంత దృశ్యం ఎందుకు క్రియేట్‌ చేస్తారో తెలియదు. ఆర్థికమంత్రి ఆరోజు అభ్యంగన స్నానం చేసి, లెఖ్ఖా జమల బుల్లిపెట్టెతో సభకి రావడం ఒక ఆచారం. ఏదో పరమ రహస్యాలు ఆ ‘కవిలెకట్టలో’ ఉన్నట్టు దృశ్య నిర్మాణం జరుగుతుంది. అప్పుడప్పుడు బడ్జెట్‌ లీక్‌ అయ్యిందని గొడవ పడుతుంటారు కూడా!

అసలందులో లీకవడానికి ఏమి రహస్యం ఉందని? ‘‘గడచిన యాభై ఏళ్ల బడ్జెట్‌ పద్దులో చూస్తే, వచ్చే ఏడాదికి మనం కూడా ఆ మాత్రం లెక్కలు సమర్పించగలం’’ అన్నాడొక యువ పాత్రికేయుడు. పైగా చెప్పిన పద్దుల ప్రకారం పనులు జరుగుతా యని నమ్మకం లేదు. చాలాసార్లు కేటాయించిన నిధులు ఖర్చుకాక మురిగిపోతూ ఉంటాయి. ప్రత్యేక శాఖలు, వాటికి మంత్రులు, బోలెడుమంది సెక్రటరీలు, కింది సెక్రటరీలు, కార్యాలయాలు– ఇవన్నీ ప్రజాధనంతో నడుస్తూ ఉంటాయి. నిధులు సద్వినియోగం చేయడానికి ప్రభుత్వానికి ఏమి అడ్డుపడతాయో తెలియదు.

బడ్జెట్‌ రాగానే, పరమాద్భుతం.. ఇది పేదల బడ్జెట్, స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్ప బడ్జెట్‌ రాలేదని ముఖ్యమంత్రి తెగ మురిసిపోతూ స్టేట్‌మెంట్‌ ఇస్తారు. బడ్జెట్‌ పద్దులు వినిపించేవేళ, ముఖ్యమంత్రి ఏమీ ఎరగ నట్టు, కొత్తగా వింటున్నట్టూ నటిస్తూ ఆర్థికమంత్రి పనిత నానికి ఆశ్చర్యపోవడం చూడముచ్చటగా ఉంటుంది. నిజానికి అందరూ కలిసే కదా ఈ అంకెల గారడీని చేసేది. అపోజీషన్‌ బెంచీలు అనాదిగా వినిపిస్తున్న పాత పాటే వినిపిస్తాయి. అసలు అందుకే తలపండిన వారేమంటారంటే– ఉగాది పంచాంగ శ్రవణానికి దీనికీ ఏం తేడా లేదు. పంచాంగంలో సంవత్సర ఫలితాలు ఉన్నట్టుగా జరగాలని ఎక్కడా లేదు. కందాయ ఫలాలు చీకట్లో రాళ్ల వంటివి. గురితప్పి ఒకటో అరో తగిల్తే, అది గణికుని దివ్యదృష్టిగా భావిస్తారు.

ఈ మధ్యనే మన అత్యున్నత న్యాయస్థానం రైతుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించింది. వ్యవసాయ రంగంపై ఏ ప్రభుత్వాలకూ శ్రద్ధ లేదు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అంటూ స్లో–గన్స్‌ పేల్చే మోదీ సైతం గడచిన మూడు ఏరువాకల్లో రైతుకి చేసిందేమీ లేదు. చంద్రబాబుకి మొదట్నుంచీ వ్యవసాయంపై నిశ్చితాభిప్రా యాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమి స్తోంది భూసేకరణ కోసమే. క్యాపిటల్‌కి అరలక్ష ఎకరాలను ఎడారిగా మార్చారు. సముద్ర తీరాలన్నింటినీ కైంకర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కొన్ని లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకోనున్నాయి. ప్రభుత్వా నికి హుటాహుటి ఫలించే పథకాలు కావాలి. సద్యోగర్భాలు మాత్రమే కావాలి. మన రైతు గొప్ప నష్ట జాతకుడు. పండితే ధర ఉండదు. లేదా ప్రకృతి తిరగబడు తుంది. నకిలీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్‌. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశా లలో చూడాల్సిందే. గతంలో చంద్రబాబు ఏలికలో, రైతుల ఆత్మహత్యలని ‘మాస్‌ హిస్టీరియా’గా అభివర్ణించి అభాసుపాలైనారు. రైతు రుణమాఫీ వాగ్దానం ఎండ మావిలా చిక్కకుండా పరుగులు పెడుతోంది. సేద్యం చేస్తే ఏడాదికిగానీ ఫలితం తెలియదు. అసలు తెలుగుదేశం పుటకే కిలో రెండు రూపాయల బ్రహ్మాస్త్రంతో పుట్టింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం సారాయి అంగళ్ల మీద బతుకుతోంది.


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు